"నీకెలా చెప్పాలో తెలీకుండా వుందే పూర్ణా! అతను సింగపూర్లోనే ఉన్నాడు. నన్ను రమ్మని ఫోన్ చేస్తేనూ"
"అతనా? ఎవరే అతను?" అడిగింది అన్నపూర్ణ.
"నాక్కాబోయే శ్రీవారు!" చెప్పింది నీలవేణి.
ఆ మాట విని అన్నపూర్ణ అమితానందం పొందింది.
నీలవేణి చేతులు పట్టుకుని సంతోషంగా అన్నది-
"నిన్ను ఆటపట్టించాలనే ఉద్దేశంతో - నా ఇష్టమొచ్చినట్లు ఏదేదో వాగేసాను. క్షమించవే నీలూ! పొరుగూర్ల నుంచి వచ్చే లేడీస్ కోసం - మా డిపార్టుమెంటువాళ్ళు ప్రత్యేకంగా వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. నిజానికి నిన్ను పలకరించి వెళదామని వచ్చేనేగాని - ఇక్కడ ఉండటానిక్కాదు!" అంది.
"వద్దొద్దు! నువ్విక్కడే ఉండు. అతనికి వరసగా మూడు రోజులు సెలవలొచ్చాయట. నన్ను సింగపూరు రమ్మని రిక్వెస్టు చేసేడు-ఫోన్లో! ఒ.కె. అనేశాను. నీ విజిట్టు నాకు ముందరే తెలిస్తే వస్తానని అతనికి ప్రామిస్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు మాత్రం మించిపోయిందేముందిలే? ఒక్క మూడురోజులే గదా! అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. నువ్వు మాత్రం ఈ పదిరోజులూ ఇక్కడే వుండాలి. ఉంటున్నావు, సరేనా" అన్నది నీలవేణి ఆర్ద్రంగా. నీలవేణి ధోరణికి అన్నపూర్ణ కరిగిపోయింది. నీలవేణిని కౌగలించుకుని - "ఎంత మంచి దానివే నీలూ" - అన్నది ప్రేమగా.
* * *
ఆ ఉదయం గోపాలం విశాఖలో రైలు దిగేడు.
తిన్నగా పార్ధుడి ఫ్లాటుకి ఆటోలో వచ్చాడు. ఆటోని పంపించి - పార్ధుడు చెప్పిన సీతాకోకచిలుక ఫ్లాటు మీద ఒక కన్నేసి నడుస్తున్నాడు. ఆ వేళ -నీలవేణి ఫ్లాటులో నుండి బయటకొచ్చిన అన్నపూర్ణ అకస్మాత్తుగా గోపాలం కంటబడింది. గోపాలం ఆమెను నీలవేణిగా భావించాడు.
ఆమె పట్టువస్త్రాలు కట్టుకుని ముద్దబంతి పూవు మాదిరి ముద్దుగా వుంది. "స్టన్నింగ్ బ్యూటీ" అనుకున్నాడు. గోపాలం ఆమెను చూస్తూ అలా అనుకోవడం 'తప్పు' అని భావించి తనని తాను మందలించుకున్నాడు.
అంతేగాకుండా తక్షణం చూపు మార్చుకునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ఫలించలేదు. అలా చూస్తూనే వున్నాడు. ఆ వేళకి ముద్దబంతి పువ్వు సూర్యనమస్కారం చేస్తోంది. ఆ దృశ్యం చూసి గోపాలం పరవశించాడు.
ఎంతో అందమైన ఈ భక్తురాలికి తను చేస్తున్న వృత్తి ఒక శాపం కాబోలు. బాధపడ్డాడు పాపమని, తాళం తీసి ఫ్లాటులోకి అడుగుపెడుతూ మరోసారి ఆ దివ్య రూపాన్ని తనివితీరా చూడాలనుకున్నాడు.
నిలకడ తప్పిన మనస్సుతో ఆబగా ఆమెను కన్నార్పకుండా చూస్తూనే వున్నాడు. అంతలో అపార్టుమెంట్సు తాలూకు వాచ్ మెన్ కాబోలు -లాఠీ ఊపుకుంటూ రావడం గమనించి అకస్మాత్తుగా తలుపు మూసేశాడు.
* * *
ఆ రాత్రి గోపాలం అస్సలు నిద్రపోనే లేదు. అతనికి దేవుడి మీద అపారమైన భయభక్తులుండడం వల్ల ఎన్నో ఏళ్ళుగా అతని మనసూ, హృదయం రెండూ మడికట్టుక్కూచున్నాయి. బుద్ధిగా వుంటున్నాయి.
అలాంటిది - ఈ ముద్దబంతి పువ్వు కనిపించడంతో ఎంతో పవిత్రంగా నిర్వహించవలసిన నియమ, నిబంధనలన్నీ గాలిక్కొట్టుకుపోయాయి. 'గాన విత్ ది విండ్'.
అందమయిన యువతులూ, భక్తురాళ్ళూ ఇంతకు మునుపు అనేకమంది గోపాలం దృష్టికి వచ్చేరు. కాకపోతే వాళ్ళంతా సామాజికపరమయిన కట్టుబాట్లతో - హద్దుల్లో సంసారపక్షంగా బతుకుతున్నారు గనుక - వాళ్ళ పట్ల గోపాలానికి అపారమైన గురీ, గౌరవాలు వున్నాయి.
ఈ ముద్దబంతి పూవుది డిఫరెంటు కేసు. పాపం మూట గట్టుకుని పాపంలోనే బతుకుతున్న ఆడమనిషి పాపం. ఆమె మీద కోరిక కలగడం 'తప్పు కానే కాదు' అని గోపాలం సరిపెట్టుకున్నాడు.
అంతలోనే -సదరు ఆర్గ్యుమెంటు కరెక్టు కాదేమోనని బెంగపడ్డాడు. ఈ తప్పొప్పుల చిట్టాని అనుక్షణం విశ్లేషించుకుంటూ అలిసిపోవడం వల్ల ఒంట్లో బాగోలేదనే వంకతో వారం రోజుల క్యాంపుని మూడురోజులకే కుదించి - తిరుగుప్రయాణం కోసం విశాఖపట్నం లో రైలెక్కి - పెద్ద ఊబి నుంచి బయటపడ్డట్టు గట్టిగా నిట్టూర్చాడు.
హైదరాబాదు వచ్చి పక్షంరోజులు గడిచినా... విశాఖ పట్నంలో తానుఅనుభవించిన అశాంతీ, అలజడీ ఇంకా మరచిపోలేకపోతున్నాడు గోపాలం. నిన్నో, నేడో, గొప్ప అపచారం జరిగినట్టు విలవిల్లాడిపోతున్నాడు.
దేవుడున్నాడనే నమ్మకంతో బతికే మనిషి - దైవచింతనకి అధిక ప్రాముఖ్యతనిచ్చి బతకాలి. అదిరూలు.
అంతేగాని - దేవుడ్ని పూర్తిగా మరిచిపోయి -'తప్పుడు జ్ఞాపకాలు' నేమరేసుకోవడం మహాపాపమని గోపాలనిక్కూడా తెలుసు. దీనికి పరిష్కారమేమిటో దైవజ్ఞులను సంప్రదించి తెలుసుకోవాలనుకున్నాడు. సరిగ్గా ఆ క్షణమే ఫోన్ రింగైంది. తండ్రిగారు లైన్లో వున్నారు.
"చెప్పేది జాగ్రత్తగా విను. విజయవాడలో నీకో దివ్యమైన సంబంధం చూశాం. మీ అమ్మకీ, నాకూ ఈ సంబంధం వచ్చింది. నీక్కూడా నచ్చితే ముహూర్తాలు పెట్టుకోవచ్చు. శనివారం రోజున ఇంటికిరా. ఆదివారం ఉదయం తిధీ, నక్షత్రాలు బావున్నాయి. తర్వాత నీ ఇష్టం!" అని కుమారుడి సమాధానం వినకుండానే ఆ లెక్కల మాస్టారు ఫోన్ పెట్టేసేరు.
పాప పరిహారం కోసం గోపాలం దైవజ్ఞులను సంప్రదించాలని - క్షణం క్రితం అనుకుంటే - దానికి 'పెళ్ళి' అనే కార్యక్రమం అనువైనదని సాక్షాత్తు ఆ భగవంతుడే చెప్పినట్టు భావించాడు.
పెళ్ళికుమార్తె తండ్రిగారు విజయవాడలో రిటైరైన సైన్సు మాస్టారు. పెళ్ళికొడుకు తండ్రిగారు గుడివాడలో రిటైరైన లెక్కల మాస్టారు. ఆ మాట కొస్తే ఈ సంబంధం కుదిర్చిన పెద్దమనిషి బందర్లో రిటైరైన డ్రిల్లు మాష్టారు.
ఏతావాతా - ఇది రిటైర్డు మాస్టార్ల ఇళ్ళల్లో జరగబోతున్న పెళ్ళిసందడి అని సరదా పడ్డారు యావన్మందీ బంధువులు. ఆ ఇంటి హాల్లో ముఖ్యమైన వాళ్ళందరూ సమావేశమయ్యారు. పెళ్ళి కుమార్తెను ముస్తాబుచేసి పెళ్ళివారి ముందు కూచోబెట్టారు. పెళ్ళికూతుర్ని చూసి గోపాలం షాకు తిన్నాడు.
