Previous Page Next Page 
అదివిష్ణు నవలు -2 పేజి 12

 

                                                          4

    దశమి శుక్రవారం సాయంత్రం అఫీసైన వెంటనే తిన్నగా ఇంటికి వెళ్ళేడు శీనివసరావు నడుచుకుంటూ. ఇంట్లో జనం హడావుడిగా ఉండటం గమనించి మనసు ఆందోళన చెందగా గబగబా ఇంట్లోకి పరిగెత్తాడు శ్రీనివాసరావు అమ్మ చుట్టూ పిల్లలూ, సీతా ఉన్నారు. ఆవిడేమో "అబ్బా , అయ్యా "అంటూ మూలుగుతుంది.
    "ఏమైంది ?" అన్నాడతను జనాంతికంగా.
    "బామ్మ పడిపోయింది నాన్నా!" అన్నాడు బుజ్జి. నాన్నకి ఆ మంచం మీద చోటిచ్చి తానక్కడ్నించి తప్పుకుంటూ.
    "పడిందా? ఎప్పుడు సీతా? ఎక్కడ పడ్డావే అమ్మా?"
    సీత శ్రీనివాసరావుని రుస రుసలాడుతూ చూచి ఊరుకుంది.
    "అసలెం జరిగిందే బాబూ!" విసుక్కున్నాడు.
    "మరేం ఫరవాలేదురా అబ్బీ! చంటాడు వీధిలోకి వెళ్ళిపోతున్నాడని ....వాడిని పట్టుకునెందుకు .....గుమ్మం దిగబోతూ .....అబ్బ....ఒళ్ళు తూలి కింద పడ్డానంతే ....మరేం కంగారుపడకు!"
    "ఒళ్ళు తూలిందా?" అన్నాడతను.
    "ఎందుకు తూలదు? మీరు తెచ్చే మందులు తాగి నిలబడే నమ్మకాన్ని అవిడేప్పుడో వదులుకున్నారు. మీకేం - మహారాజులా ఆఫీసుకెళ్ళి మళ్ళా సాయంత్రానికి గాని తిరిగి రాదు. పొద్దస్తమానం అవిడెంత అవస్థ పడుతున్నారో నాకు తెలుసు. మందుకోసం మిమ్మల్ని అడిగి అడిగి నోరు నేప్పిపట్టి ఊరుకున్నారావిడ. ఎవర్నని ఏం లాభం లెండి."
    "నువ్వూరుకోవే అమ్మడూ! వాడసలే బండెడు చాకిరి చేసి సతమతమై ఇంటికి వస్తే వాడినెందుకు విసుక్కుంటావ్ చెప్పు? నాన్నా , నాకొచ్చిన భయం లేదు గాని, ముందు కొంచెం కాఫీ తాగు, తీసుకురా అమ్మడూ!"
    సీత వంటగదిలోకి వెళ్ళిపోయింది. శ్రీనివాసరావు వాళ్ళమ్మ పక్కన వచ్చి కూర్చుని అడిగేడు.
    "దెబ్బ బాగా తగిలిందా అమ్మా?"
    "నువ్వుత్త పిచ్చి మాలోకానివిరా నాన్నా! నా వయస్సేమో కాటికి దారితీస్తుంది గదా. ఈ వయసులో కాలిగోటికి చిన్న దెబ్బ తగిలినా ప్రాణం పోయినట్టే ఉంటుందాయే."
    "నీకు మందు తెస్తానే అమ్మా! ఈ నెల్లో తప్పకుండా కొంటాను."
    "నువ్వు కొనవని అన్నానుట్రా నేను?"
    "సీతకి నేనేంటే కోపంగా ఉందమ్మా! నేనేం చేసేది చెప్పు? నాకొచ్చే జీతమూ అంతంతమాత్రం. పోనీ -- నేనేక్కడ్ని నా సరదాల కోసం ఖర్చు పెట్టుకునే మనిషినా? అదీ లేదాయే. పైగా -- నా సరదాలన్నీ చచ్చిపోయి ఏడేళ్ళయిపోయింది. మానులా బతుకుతున్నాను. నీకు జ్ఞాపకం ఉందామ్మా - నాన్న ...."
    తల్లి కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. గబుక్కున శ్రీనివాసరావు చేతిని తీసుకుని లాలనగా అన్నది.
    "పిచ్చి తండ్రి ! నువ్వు దుర్మర్గుడివని నేనననురా! వెనుకటి రోజులేందుకు జ్ఞాపకం తెస్తావు బాబూ? అవన్నీ గతించెయిగా. నన్ను చూడు నేనెంత నిబ్బరంగా బతుకుతున్నానో? - అవన్నీ మరిచిపోనాన్నా....వెళ్ళు వెళ్ళి కాఫీ తాగు."
    శ్రీనివాసరావు అక్కణ్ణించి కదలనూ లేదు. ఆ తల్లి అతని చేతిని వదలనూ లేదు.'
    అతని మనసు వికలమైపోయింది. ఆ మంచం మీద అమ్మ ప్రక్కన అలాగే కూర్చుండిపోయాడు.
    సీత కాఫీ తీసుకొచ్చింది. ఆమెని పట్టించుకునే స్థితిలో లేడు శ్రీనివాసరావు. సీత విసుక్కుంది.
    "సరిపోయింది. మళ్ళా ఆలోచనలే మేస్తున్నారా? కర్మ తెప్పరిల్లండి . ఇదిగో - ఈ కాఫీ పుచ్చుకోండి.
    శ్రీనివాసరావు సీత వేపు చిత్రంగా చూస్తూ అన్నాడు -
    "నాకు కాఫీ వద్దు, ఏమి వద్దు , నన్ను మటాడించకు సీతా!"
    "ఇది మరీ బాగుంది " అన్నది సీత.
    "అవును. అన్నీ బాగుంటాయి నీకు. మీరంతా మనుషులు కాదు సీతా! మీరు నన్ను మించి బతుకుతున్నారు. మీకు ఆలోచనలు రావు. మీకు గతం గుర్తుండదు. మీకు కావలసిందల్లా ప్రస్తుతం. ఏ రోజుకారోజు బతికేస్తే చాలు మీకు. నేనొక్కడనే అల్పుడ్ని , బతకడం తెలీని దౌర్భాగ్యుడ్ని."
    ఆ నాలుగుముక్కలూ అనేసి చివాలున లేచి బయటికి నడిచేడతను.
    "నాయనా? అని పిలిచిన అమ్మ గానీ, "ఏమండీ ' అంటున్న సీత గానీ , "నాన్నా" అని ఒక్కసారి అరిచిన పిల్లలు గానీ .... అతన్ని ఆపలేకపోయారు.
    అతను రోడ్డు మీదకి వచ్చి గబగబా నడవడం ప్రారంభించేడు. అతని కళ్ళు నీటితో నిండిపోవడం మూలంగా దారి అంతా గజిబిజిగా కనిపిస్తుంది. చేతి గుడ్డతో కళ్ళు తుడుచుకుంటున్న వాడు కాస్తా వెనగ్గా వినిపించిన కారు హారను మోతకి ఉలిక్కిపడి ఆగి తిరిగి చూసేడు.
    ఆ కారులో ఉన్న ఆఫీసరు కారు తలుపు తెరిచి "గేటిన్" అన్నాడు.
    శ్రీనివాసరావు తటపటాయించాడు.
    "రండి. మా ఇంటికేగా మీరు వెళ్ళేది."
    అతను బెరుకుగా కారు ఎక్కెడు. కారు కదిలింది.
    "ఏమిటంత పరాగ్గా నడుస్తున్నారు?"
    "మీ ఇంటికే వస్తున్నాసార్? యివాళ అమ్మాయికి ట్యూషన్ ప్రారంభించే రోజు గదా!"
    "అవుతే మాత్రం, అంత పరాగ్గా నడుస్తున్నారే?"
    "మరేం లేదండి."
    "అమ్మాయిని గురించి మీకు కొంచెం చెప్పాలి రావుగారూ! పాఠాల మీదకన్నా సినిమాలు, కధలూ , కాకరకాయాలంటే దానికి చెడ్డ మోజు. అంత బ్రిలియంట్ స్టూడెంట్ పరీక్షలో ఫెయిలయిందంటే కారణం ఈ సరదాలేనని నా అనుమానం. కనక మీరు శ్రద్ధ పుచ్చుకుని పాఠాలు చదివించడమే కాకుండా , ఆ వ్యామోహాన్ని దూరం చేసే విధానం కూడా ఆలోచించండి."
    "అలాగేనండి"
    "థేంక్స్ . రండిక . ఇంటికి వచ్చేసేం."
    ఆయనతో పాటు మెల్లిగా చూస్తూ ఇంట్లోకి వెళ్ళేడు శ్రీనివాసరావు.
    'అమ్మాయ్ ఇందూ! మేస్టారొచ్చారు " అన్నారాయన.
    పక్క గదిలోంచి కర్టెన్ తొలగించి ఇందిర వచ్చి శ్రీనివాసరావుకి నమస్కారం చేసి నించుంది.
    "ఇవాళ నుండి వీరు నీకు మేష్టారు! బుద్దిగా చదువుకుని బాగుపడు. వెళ్ళండి."
    ఇందిర తన గదిలోకి వెళ్ళింది. శ్రీనివాసరావు ఆమెని యాంత్రికంగా అనుసరించేడు. ఆ గదిలో అతని ముందు ఇందిర బొమ్మలా కూచుని , తన క్లాసు పుస్తకాలన్నీ ముందు పెట్టుకుంది. శ్రీనివాసరావు పుస్తకాల వేపూ, ఇందిర వేపూ చూచి అన్నాడు.
    "నా పేరు శ్రీనివాసరావు. బి.ఏ. పాసయ్యేను. నాన్నగారి ఆఫీసులు గుమాస్తాని."
    "డాడీ అన్నీ చెప్పేరు మాస్టారు."
    "మరి మీ గురించి చెప్పండి.
    "నా పేరు ఇందిర. పి.యు.సి తప్పాను. నాన్నగారి ఏకైక పుత్రికను " అన్నది.
    శ్రీనివాసరావు అబ్బుర పడ్డాడు. ఈ పిల్ల కొంచెం గడుసుదనీ గమనించేడు. అంచేత పి.యు.సి   తప్పి కుర్చున్నదని అనుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS