Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 11

                       
                                      5
    మర్నాడు వుదయం కళ్యాణి ఆఫీసు గేటులో అడుగు పెడుతుంటే , అప్పుడే ఆగిన రిక్షా లోంచి కమల దిగింది. ఇద్దరూ చిరునవ్వు తోనే పలకరించుకున్నారు.
    రిక్షా అతనికి డబ్బు లిచ్చి పంపించేసి, ప్రక్కనే నడుస్తూ "నీకో మాట చెప్పాలి,' అంది కమల.
    'ఏమిటది?' అంది కళ్యాణి అదేమిటయి వుంటుందా అనే కుతూహలంతో కళ్ళు వెడల్పు చేసుకుని.
    'లోపలికి వెళ్లి కూర్చుని తాపీగా చెప్పుకుందాం.' అంది కమల చెకచేక చీడీలు ఎక్కేస్తూ.
    'ఇప్పుడు చెప్పు అంది .' కమల సీటు దగ్గరి మరో కుర్చీ లాక్కుని తను కూడా కూర్చుంటూ.'    
    'రవీంద్ర భారతి లో ఇవాళ సాయంకాలం సుబ్బులక్ష్మీ ప్రోగ్రాం వుంది.' అంది కమల పర్సు టేబిలు మీద పడేసి కర్చీఫ్ తో నుదురు , మెడ తుడుచుకుంటూ.
    ఏదో పెద్ద విశేషం , ముఖ్యంగా తనకి బాగా ఆసక్తి కలిగించే విషయం చెప్తుంది అని చెవులు దొరగించుకుని, అవ్యక్తమైన ఉద్వేగంతో గుండె దడదడ లాడుతుండగా , కమల మొహం వంకే చూస్తూ కూర్చున్న కళ్యాణి ఆ మాటలు వినగానే ఒక్కసారి తెల్లబోయినట్లయింది. అయితే ఆ ఆశా భంగాన్ని తన నిరుత్సాహాన్నీ పైకి కనబడనీయ కుందా.
    'బావ వారం క్రిందటే మా ఇద్దరికీ రెండు టిక్కెట్లు కొన్నాడు. కాని అనుకోకుండా తను నిన్న 'కెంపు' కి  వెళ్ళాల్సి వచ్చింది--'
    'వోహో అందుకా ఇవాళ నువ్వు రిక్షాలో వచ్చావు.' అనుకుంది కళ్యాణి. అతను వూళ్ళో లేని సందర్భాలలో తప్ప మిగతా రోజులలో కమలని తన స్కూటరు మీద తీసుకొచ్చి ఆఫీసు దగ్గర దిగవిడిచి తన అఫేసుకి వెళ్ళిపోతాడు. మళ్లీ సాయంకాలం ఆఫీసు అయిపోయే వేల్టికి వచ్చి ఇంటికి తీసుకు వెళ్తాడు.
    'ఎమ్మెస్ సుబ్బులక్ష్మీ పాట వినాలని ఎంతో సరదా పడ్డావు, రేపు ఒక్కరోజు అగు బావా అని చెప్పాను కూడా....తల అమ్ముకున్నాక పై అధికారి అజ్ఞలకి కట్టుబడి వుండాల్సిందే. పాట కచ్చేరీలూ నాటకాలూ అన్నీ అయిందాకా వుండి ఆ తరువాత ఎప్పుడో మనం ఇష్టం వచ్చినప్పుడు వెళ్తామంటే ఎలా కుదురుతుంది-- అర్జెంటు వ్యవహారం . నేను ఉన్న పళంగా బయలుదేరి వెళ్ళక పొతే అక్కడ కొంపలంటుకుంటాయి అని చెప్పి వెళ్ళిపోయాడు-- తన టిక్కెట్టు వుంది. నువ్వు వస్తావేమో అని......'
    ఒక్కక్షణం ఆలోచించింది కళ్యాణి 'తనకి ఇలాంటి సంగీతం అంటే సరదా వుంది-- పైగా ఈ పరిస్థితి లో కాస్సేపైనా మనస్సుకి ఆ వాతావరణం లో కాస్త రిలీఫ్ దొరకవచ్చు-- రవీంద్ర భారతి కూడా తన ఇంటికి దగ్గరే-- రాత్రి పొద్దు పోయినా ఏం భయం వుండదు. అయినా ఆ చుట్టూ ప్రక్కల వాళ్ళెవరూ ఈ ప్రోగ్రాం కి రాకుండా వుంటారా?' అనుకుని.
    'సరే ఆ టిక్కెట్టు నేను తీసుకుంటాను-- ఇప్పుడు నా పర్సు లో అట్టే లేదు-- నీకు డబ్బు రేపు తెచ్చి ఇస్తాను.' అంది.
    'భలేదానివే -- ఆ టిక్కెట్టు అమ్మేసేయాలి అనే వుద్దేశ్యంతో అడగలేదు నేను-- సరదాగా నీ కంపెనీ కోసం అడిగాను. అసలు నీకు ఈ క్లాసికల్ మ్యూజిక్ లో ఇంటరెస్టు వుందో లేదో వస్తా నంటావో లేదో అనుకున్నాను-- ముందు మా ప్రక్కింటి వాళ్ళమ్మాయి ని అడిగాను, అయ్యా బాబోయ్ ఈ సుబ్బులక్ష్మీ వి వినే వోపిక నాకు లేదు బాబూ హాయిగా రేడియో లో సినీమా పాటలు వింటాను . అంది ఆ అమ్మాయి-- అమ్మకి నాలుగు రోజుల నుంచీ ఆయాసం మరీ ఎక్కువగా వుంది. మూడు నాలుగు గంటలు కూర్చోటం తనవల్ల కాదు-- లేకపోతె తనకి ఎంతో సరదా.....

                                         
    'నాకూ సరదాయే, నేను తప్పకుండా వస్తాను. నాకయితే ఇల్లు దగ్గరే అనుకో నువ్వు ఒక్కదానివీ వెళ్ళాలి...' అంది కళ్యాణి.
    'అదో ప్రాబ్లం కాదులే -- అయినా మా కజినూ తన మిస్సేస్సూ కూడా వస్తున్నారు-- ఏ టాక్సీ లోనో వెళ్లి పోతాం. నన్ను మా యింటి దగ్గర డ్రాప్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మా ప్రక్క వీదేగా.'
    'సరే, అలాగే ' అని కళ్యాణి తన సీటులోకి వెళ్ళిపోయింది.
    కాస్త ముందుగా వెళ్లి పోటానికి పర్మిషన్ తీసుకుని ఇద్దరూ నాలుగు గంటలకే ఆఫీసు వదిలి బైటకి వచ్చారు.
    'మీరు అయిదున్నర కల్లా రవీంద్ర భారతి కి వచ్చేసేయండి-- నేనూ నా ఫ్రెండూ కూడా త్వరగానే వచ్చేస్తాం-- మీరు వచ్చేటప్పుడు అమ్మ నడిగి మా రెండు టిక్కట్లూ తెచ్చి పెట్టండి -- తనకి తెలుసు అవెక్కడున్నాయో ,' అని కమల మధ్యాహ్నమే వాళ్ళ కజిన్ ఆఫీసుకి ఫోన్ చేసి అతనితో చెప్పింది. ఆ సాయంత్రం తనతో తన యింటికి వచ్చి ఫలహారం అదీ చేసి ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్దాం అని కళ్యాణి అడిగిన దానిని కాదనలేక --
    అలాగే  ముందు తిన్నగా కళ్యాణి యింటికి వెళ్లి, అక్కడ నుంచి రవీంద్ర భారతి కి వెళ్ళారు.

                            *    *    *    *
    పది రోజులు గడిచి పోయాయి---
    ఆఫీసు నుండి వచ్చి కాస్త కాఫీ పెట్టుకుని త్రాగి ఆ చేత్తో నే రాత్రి వంట కూడా ముగించుకుని , స్నానం చేసి వచ్చింది కళ్యాణి.
    అద్దంలో చూసుకుంటూ తిలకం దిద్దుకుంటుంటే తన కళ్ళల్లో అగాధాలు కొట్టవచ్చినట్లుగా కనిపించాయి-- తన మొహం తనకే ఎలాగో అనిపిస్తోంది.
    పదిరోజుల క్రిందట తనకి ఇవాళ్టి తనకి అసలు పోలికే లేదేమో ననిపిస్తోంది -- అందుకే ఉదయం కమల అననే అంది.
    'చక్కనమ్మ చిక్కినా అందమే అన్న మాటలో నిజం వుందో లేదో స్వయంగా పరీక్షించి తెలుసు కో దలుచు కున్నావా ఏమిటి డియర్.' అంటూ.
    'నేనా? చిక్కిపోయానా? ఏమో నాకలా ఏమీ అనిపించటం లేదు.'
    'సరే-- అయితే ఎవరినయినా అడుగు చెప్తారు. నామాట అబద్దమేమో రెట్టించింది కమల.
    'అబద్దం చెప్పావన్ననా- చూస్తున్నావు గా ఎండలు ఎలా మండి పోతున్నాయో -- రోజూ ఈ బస్సులలో పడి వచ్చి వెళ్ళే సరికే సగం ప్రాణం పోతోంది.'
    'ఈ ఎండలు నీ ఒక్కదాని పరమే అవుతున్నట్లు, మాకెవ్వరికీ లేనట్లూ మాట్లాడుతున్నావు.' విడిచి పెట్టలేదు కమల.
    'ఈ మధ్య కాస్త వంట్లో కూడా బాగుండటం లేదులే!' ఏదో వో కారణం చెప్పి తప్పించుకోవాలని చూసింది కళ్యాణి.
    'వంట్లోనేనా, మనస్సులో కూడానా......' అర్దోక్తి లోనే అపెసి కిసుక్కున నవ్వింది కమల.
    ఇంతలో ఆఫీసరు రావడంతో కబుర్లు మాని ఎవరి పని వాళ్ళు చేసుకోటంలో మునిగిపోయారు.......
    అదంతా తలుచుకుంటూ ఒక్కసారి నిట్టూర్చింది కళ్యాణి.
    'జరిగిందేదో జరిగిపోయింది. ' అని మనస్సుకి నచ్చ చెప్పుకోవాలి కాని అదే దిగులుతో ఇలా రోజు రోజుకి కృంగి పోతూ నలుగురి దృష్టి లో పడటం వివేకం అని పించుకోదు -- ఇవాళ కాకపొతే -- మరోనాడు, మురళీ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కయినా వాళ్ళంతా ఇవాళ్టి నా పరిస్థితి ని తలుచుకుని నవ్వుకోరా -- నాలుగు రోజుల ఎడబాటు నే భరించలేక విరహంతో మగ్గిపోయింది అనుకున్నాం, పాపం ఆశలు మొదలంటా కూలి పోయాయే-- అని వాళ్ళంతా చాటుగా నయినా అనుకోరా? ఛ-- ఏమిటంత పిచ్చిదాన్ని అయిపోయాను! ఇంక ఈ క్షణం నుంచీ గతం అంతా మరిచిపోయి ఎప్పటిలా వుండటానికే ప్రయత్నిస్తాను .' కుంకుమ భరిణి అలమారు లో పెట్టి ప్రక్కకి తిరిగేసరికి టేబిలు మీద మల్లె దండ కంట పడింది -- ఇంతకూ మునుపే ఇంటి వారి పాప ఇచ్చి వెళ్ళింది-- మొన్నక నాడు ఇలాగే పెరట్లో పూసిన పువ్వులు దండ గుచ్చి తెచ్చి ఇచ్చినా కళ్యాణి దాన్ని అలమారు లోనే పడేసింది. అన్యమనస్కంగా వుండి , మర్నాడు ఆ దండనీ అక్కడ చూసిన పాప ఇల్లు పీకి పందిరి వేసినంత పని చేసింది. తను కష్టపడి కట్టించిన మాలని నిర్లక్ష్యం చేసి నందుకు--' మొన్నటి లా మరిచి పోకండెం' అంటూ చెప్పి మరీ ఇచ్చింది ఇవాళ -- కళ్యాణి నవ్వుకుంటూ ఆప్యాయంగా దండ చేతిలోకి తీసుకుని తలలో ముడుచుకుంది.
    గేటు తెరిచినా చప్పుడు తరువాత, 'పాపా, ఇలా రామ్మా,' అన్న మాటలు వినిపించాయి. కళ్యాణి ఒక్కసారి గా వులిక్కి పడింది. 'ఆ గొంతు -- అది -- తను గుర్తుపట్టకలదు-- సందేహం లేదు మురళీ యే -- ఒకసారేప్పుడో తను దూరం నుంచి ఇల్లు చూపించింది. ఇప్పుడు బహుశా కళ్యాణి ఈ ఇంట్లో ఎక్కడ వుంటుంది అని ఇంటి వారి పాపని అడుగుతాడేమో--
    'ప్రత్యేకం తనని వెతుక్కుంటూ అతను ఎందుకు వచ్చినట్లు,' కళ్యాణి తలలో ఆలోచనలు గిర్రున తిరిగి పోతున్నాయి.
    'ఆవాళ నావల్ల పొరపాటు జరిగిపోయింది కళ్యాణి-- అదేం మనస్సులో పెట్టుకోకు-- మనం ఇద్దరికీ ఎప్పటికీ ఒక్కటిగానే బ్రతుకుదాం అంటాడా.' అని వూహించు కుంటూ పరవశించ బోయిన మనస్సుని అదిమి పట్టుకుని, 'ఛ-- ఈ మనస్సు కి అసలు బుద్ది అనేది లేదు-- ఒక అనుభవం అయినా గుణ పాఠం నేర్చుకోలేదు-- ఆవాళ రెండు మాటలైనా చెప్పకుండా అలా తల వంచుకుని వెళ్లి పోయాడే, అతని సంగతి తెలిసి కూడా మళ్లీ వ్యామోహం లో పడిపోతోంది -- అతను మళ్లీ ఎందుకు వచ్చాడో వూహించు కోటం కష్టం కాదు-- ఆతని పెళ్లి నిశ్చయం అయిపోయి వుంటుంది-- ఆఫీసులో అందరితో పాటు నాకూ వో ఇన్విటేష ను ఇవ్వటానికి వచ్చి వుంటాడు.' అని మనస్సుని స్వాధీనం లోకి తెచ్చుకోటానికి , తామిద్దరి మధ్యా అసలు ఏమీ జరగనట్టే అతన్ని ఆహ్వానించటానికి తనని తను సిద్దం చేసుకుంటోంది.
    ఇంతలో మురళీ గది ముందుకీ రానే వచ్చాడు.
    'కళ్యాణీ' అని అభిమానంగా చనువుగా పిలవబోయిన అతని గొంతు బిడియంగా సంకోచంగా బిగుసుకు పోయి నట్లయింది. ఓసారి గొంతు సవరించుకుని చివరికి మెల్లిగా పిలిచాడు.
    ఆ వచ్చినదీ పిలిచినదీ ఎవరో తెలిసినా 'ఎవరూ?' అంటూ తలుపు తెరిచింది కళ్యాణి. ఒక్క క్షణం ఇద్దరూ ఒకరినొకరు అపరిచితుల్లా చూసుకున్నారు. అంతే ఆ తరువాత ఇద్దరూ కళ్ళు వాల్చేసు కున్నారు.
    'లోపలికి రండి ' అనాలనుకున్న కళ్యాణి మాట్లాలాడటం  చేతకాని దానిలా మౌనంగా నిలబడిపోయింది.
    చొరవగా లోపలికి వెళ్లి కూర్చోవాలి, కళ్యాణికి ఎన్నో సంగతులు చెప్పాలి అనుకున్న మురళీ ఎవరో అడ్డు వచ్చినట్లే ఆగిపోయాడు.
    'ఆవాళ నా ప్రవర్తన చాలా రూడ్ గా వుంది కదూ -- దానికి నేను ఇవాళ మన స్పూర్తిగా క్షమార్పణ చెప్పు కుంటున్నాను కళ్యాణి-- నీతో కొంచెం మాట్లాడాలి-- అలా పార్కు లోకి వెళ్దాం .' మాటలు కూడబలుక్కుంటున్నట్లు ఆగి ఆగి అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS