Previous Page Next Page 
మన్నుతిన్న మనిషి పేజి 12


    "అడివిలో సీతమ్మ వారిలా వుండు."
    "ఏ రావణాబ్రహ్మో వస్తే..."
    "నా బాణం వున్నాదికదా..." అంటూ మీసాలు నులిపాడు.
    ఇద్దరూ గుట్టదిగారు. గుట్టఒడ్డులో మేసుకుంటున్న గాడిద వెంట వచ్చింది. కాలవదాటి నదిఒడ్డు చేరుకున్నారు. పాక వేసుకునేసరికి యింకో పొద్దుంది. రకరకాల పిట్టలు పాకచుట్టూ చేరాయి. పైనకొన్ని యెగురుతున్నాయ్, నది ఒడ్డుకు వెళ్ళి కడవతో కోటమ్మ నీరుతెచ్చింది. చేపలు మిల మిల్లాడుతున్నాయ్. నీరు తక్కువున్నా ఒక కోవలో వడిగా ప్రవహిస్తోంది.
    రాముడు గబగబ ఊళ్ళోకి వెళ్ళాడు. బియ్యం తెచ్చాడు. తిరిగివచ్చి యిక్కడ బతికిపోతాం అన్నాడు. అన్నీ చౌక, మాటంటే నమ్మిక వున్న మనుషులు. అదృష్టం చెప్పకుండా వచ్చిందన్నాడు రాముడు.
    చీకటి పడగానే తిని బయటమంచం వేసుకుని యిద్దరూ కూర్చున్నారు. రాముడు తను జబ్బు మనిషికానని అనుకోడానికి గుంపులో యెవరూ ఆస్కారం యిచ్చారు కాదు. "రాముడు జబ్బులో" డన్న మాట వూతపదమైపోయింది. తనే జబ్బు మనిషైతే యింతదూరం నడవగలడా? రాముడు మంచం మీద దొర్లగానే కోటమ్మ వాడి కాలుపడ్తూ చల్లని కబుర్లు చెప్తోంది.
    "నీ కాలు పట్టేసేదా?" అన్నాడు.
    "తప్పు..." అన్నది. రాముడి కెంతో యీ మాట గర్వా నిచ్చింది. అలా పడుకుండిపోయాడు. మధ్యమ తెలివొచ్చేసరికి కాలదగ్గరే తలబెట్టుకుని క్రింద కూర్చొనే కోటమ్మ కునుకుతోంది. గబ గబ లేచాడు. కోటమ్మను లేపాడు. మంచం పాకలోనికి తోసాడు. లోపలనించి తలుపేసుకున్నాడు. ఇద్దరూ యెంచక్కా తగిలి తగిలి పడుకున్నారేగానీ యెంతసేపటి వరకూ నిద్దర రాలేదు. రాముడికి మంచి బలం వచ్చినట్లుంది. ఆ చిట్టిరాజు లాగా పదుగురి డబ్బునూ దోచుకో కుండా కష్టపడి తనూ బుస్ కోటు యేసుకుంటా ననుకున్నాడు. "అవి సాలా సౌక. ఒకరోజు యేట అమ్మితే వచ్చేస్తాది" అనుకున్నాడు. "నా కంటికి కోటమ్మ యెంత యింపతంగా కనిపిస్తందో దాని కంటికి నేను అలాగ కనిపించొద్దా" అనుకున్నాడు. పెళ్ళం తెచ్చిన అదృష్టం పెళ్ళయాక యిన్నాళ్ళకు తృప్తిగా అనుభవించాడు. మొగాళ్ళ అదృష్టంకొద్దీ ఆడది అమురుతుంది. మగాడు ఆలివల్ల అంధుడేనా అవుతాడు - అదృష్టవంతుడైనా అవుతాడు. అందితే ఆమె మధువు నిండిన పువ్వే అందకపోతే పుల్లని ద్రాక్షపండు. ఆడదాని సర్వస్వం అతని పరం చేసుకున్నవాడు అంతః పురంలో బ్రతికిన తృప్తితో బ్రతుకుతాడు.
    రాముడు అందంగా లేకపోయినా అదృష్టం వుండబట్టి యిలాంటి పెళ్ళాన్ని పొందానని తృప్తితో నున్నాడు.
    తిరిగివచ్చిన వాళ్ళపై పళ్ళు పటపట లాడించాడు చిట్టిరాజు. దానికితోడు రాముడుపై యింకో అభాండం వేసాడు. పోలీసులతో యీ గుట్టంతా చెప్పి పోయాడని అందుకేవాళ్ళు గుంపుపై నిఘా వుంచారని చెప్పాడు. రాత్రిమీద ఆ తుపాకీ, తూటాలు దూరంగా యేటి ఒడ్డుకు తీసుకుపోయి నిలువు గొయ్యితీసి పాతిపెట్టించాడు. ఈ పోలీసుల గొడవ నలుగురిలో ప్రాకిపోయింది. ఎవరికి దక్కింది. వాళ్ళు దక్కించుకోవాలని మొదట మొగమాటంగా అడిగినా తరవాత గట్టిగా చిట్టిరాజు నడిగాడు. బస ఖర్చు చెప్పాడు. పోలీసులకెంత మూతికట్టాడో వివరించాడు. పదుగురు చుట్టు ముట్టగానే కొంత పారేసి, మరికాస్త తాగించాడు. తన ప్రక్కనున్న వాళ్ళల్లోనే ఒకరి నొకరు నోరుచేసుకున్నారు. పైసా ప్రాణంవంటి మిత్రులనైనా పగజేస్తుందన్న సామెత వీళ్ళ విషయంలో నిజం అయ్యేటట్లుంది.
    పోలీసుల మిషపెట్టి, వున్న పళంగా గుంపును కదిల్చాడు. అప్పటికే వాడికి కోటమ్మ యెక్కడుందో సమాచారం అందిపోయింది. తల్లి అబద్దం చెప్పినందుకు అటువేపే చూడలేదు. తన పాక సామాను వేసుకోడానికి గాడిదైనా యిచ్చాడుకాదు. మంచం యింకొకరి గాడిదమీధవేసి, బుట్ట, పాక సామాను తలపై ఎత్తుకుంది.
    ఎన్నో జాగాలు కనిపిస్తున్నాయ్. ఇక్కడెక్కడా వద్దంటున్నాడు. ఈ జిల్లా పొలిమేర్లే దాటిపోదామంటున్నాడు.
    "రండి-మాంచిజాగా....అక్కడ పాక వేసుకున్నరాత్రే నాపెళ్ళి.....మీ కడుపు పట్టినంత తినండి.."
    "బోడమ్మ! నీ కొడుకు పెళ్ళట!!....పెళ్ళికూతురెవరమ్మా?" అంటూ గచ్చపొదలాంటి గయ్యాళి అంకమ్మ. గుంపుకు వెనకబడి వంటిగా వస్తున్న బోడమ్మని ప్రశ్నించింది. ఆ మాట పట్టించుకోకండా బోడమ్మ" ఉత్తరవురుము కురవక మానదు"
    "ఈ తాచు తరుముతోంది-కరవక మానుతుందా!"
    "ఎవరే తాచు?"
    "మరెవరు? నీ కొడుకు..."
    బోడమ్మ మాటాడకుండా నడుస్తూనే వుంది. వాళ్ళ ముందు నూట యెనభై పందులు, అరవై గాడిదలు, పాతిక మేకలు, వందపైగా జనం కదులుతున్నారు. అంకమ్మ వేళాకోళంగా...
    "తెలుసునా? నీకు మనవడు పుట్తున్నాడు..."
    బోడమ్మ ఆశ్చర్యంగా ఆగిపోయింది.
    "అందుకేనా.....యిన్నాళ్ళూ పెళ్ళికిలేని తొందర యిప్పుడొచ్చింది?"
    అంకమ్మ పకపక నవ్వింది. ఎందుకు నవ్విందో చెప్పదు.
    "నీ కొడుకు తక్కువోడు కాడు బోడమ్మా! శకునం పలికిన బల్లి - కుడితి కుండలో యేనాడో పడదా?"
    "పాపం పండిపోనాది - యీ భూమి మనల్ని యింక మొయ్యనేదే.....బూకంపం వచ్చి పగిలిపోతాది.....ముసలం యేదో పుట్తాది..."
    "అసలు సంగతి చెప్తాను....విను..." అంటూ మెల్లగా గుసగుసలు మొదలు పెట్టింది.
    "మా తమ్ముడు పొట్టయ్య - పెళ్ళానికీ ఆడికీ పడక అది కన్నోరింటి కెళ్ళింది కదా?"
    "మధ్యను నివ్వుండి యేరుపాటు చేశావు కాదే..."
    "లోకం అలా అంటాది. దాని గుణం ఆడికి నచ్చనేదు. ఆడికీ యీ రాతిరి పెళ్ళి....సెప్పుకో పెళ్ళికూతురెవరో?"
    "మనగుంపులో యే గుంట మీద కన్నేసాడు?"
    "అయ్యో! యెర్రి మాలోకమా! అసలు సంగతి యిను. నీ కొడుకు నా తమ్ముడికి ఆడి బరువు మొయ్యమంటున్నాడు. చుక్కమ్మ చిట్టిరాజు పెళ్ళాడతాడని మురిసిపోతన్నాది. దాన్ని పెళ్ళి పీటలమీద నా తమ్ముడు పొట్టయ్యకు కట్టేస్తున్నాడు."
    "మరి ఆడో?"
    "కోటమ్మ ఆచూకీ తెలిసిపోనాది. ఆ రాముడితో మంచిగా వుండే ఆ రాత్రిమీద నీ కొడుకు కోటమ్మకు పుస్తె కట్టేస్తాడు."
    "హాఁ! నీ కెలాగ తెలిసిందే?"
    "నా తమ్ముడికి తొలినించి కోటమ్మ మీద కన్నుండేది. నాతో యెన్నిసాల్లో సెప్పి ఆ మణువు తెంపి తనకి కట్టేసునోడు. అలాంటోడు యీ మోసంతో అట్టుడికిపోతున్నాడు."
    "ఎందుకొప్పుకున్నాడైతే..."
    "ఒప్పుకోకపోతే ఆ పొట్ట సీరుస్తామన్నాడు. పేణంమీద తీపిమరి.....ఎవరితో అనక - అల్ల కల్లోలం అయిపోతాది."
    బోడమ్మకు కాళ్ళు వణుకుతున్నా యెలాగో నడిచింది. నడుస్తూ ఒకసారి బుట్టలోనున్న మందులన్నీ చూచుకుంది. "ఎలాగైనా కోటమ్మని రచ్చించడానికి బలం యియ్యి తండ్రీ!" అని మొగుడ్ని మొక్కుకుంది.

                                   12

    కోటమ్మ పాకదగ్గర నిల్చొని కొంతసేపు యేటి వేపు చూసింది. ఇదివరకటికన్నా నీరు హెచ్చుగా వుంది. కొత్తనీరు కలవటంవల్ల ప్రవాహం పడి హెచ్చింది. ఏటి అవతల పచ్చదనం, మధ్యలో నున్న యిల్ల సమూహంనించి పొగ పైకెగసి పోతోంది. ఇటు తిరిగి కొండమీద గుడివేపు చూసింది. రోజూ ఉదయం సాయంత్రం అటు వేపు తిరిగి ఒక మొక్కు మొక్కడం అలవాటే-కొండమీద మేఘాలు కోపంహో పేరుకుంటున్నాయ్. వేటకు వెళ్ళిన రాముడింకా రాలేదు. ఇంతలో దూరం నించి ఒక పశువుల మందలా వస్తున్న జనంవేపు చూసింది. అలా సంశయంతో చూస్తుండగానే గాడిదలు, పందులూ కనిపించాయి. కొంపతీసి తాము వదిలిన గుంపు కాదుగదా!? వాళ్ళు యిటువేపే వస్తున్నారు. అల్లంతదూరంలో వుండగా పెద్ద పొట్టతోనున్న పొట్టయ్యను పోల్చేసింది. ఆ క్షణంలో యెక్కడికైనా పారిపోదామనుకుంటే రాముడు యింటిదగ్గర లేడు.
    ఆమె ఆవేదన అలసటై కూర్చుంది. ఏదేదో చేసేద్దామనుకున్నా యేమీ చెయ్యలేకపోయింది. పొలో మని అంతా యీ యేటి ఒడ్డుకు చేరారు. ముందుకు సాగడానికి యేరు అడ్డమని చిట్టిరాజు విసుక్కున్నాడు.
    "నాలుగు పూటలు యిక్కడ బస యేద్దాం" అన్నాడు చిట్టిరాజు. రాముడు పాకను చూడనట్లేమెసలాడు. రాముడు వచ్చేసరికి యింకా చీకటి పడలేదు. పాకలన్నీ అప్పటికే సర్దుకున్నారు. వెనువెంటనే చిట్టిరాజు పెళ్ళి ప్రయత్నాలు చెయ్య మన్నాడు. చీకటి పడేసరికి పొయ్యిలు వెలుగుతున్నాయి. గుంపంతా చాలా హడావుడి గా వుంది. ఒకప్రక్క బానతో పులుసు మరుగుతోంది. ఇంకోప్రక్క అన్నం వంట, బూర్లపెనందగ్గర కొందరాడంగులు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS