ఇంకే నింద వెయ్యటానికి లేక, పాతిన పాతతగవునే మళ్ళీ బయటకు తీశాడు. విన్న వాళ్ళకు ఆ తగువు అస్థిపంజరంలానే కనిపించింది. కానీ అది బతికిన మనిషని అరచేవాళ్ళు హెచ్చుమంది వున్నారు. కాబట్టి నంది పందయి కూర్చుంది. పదుగురాడు మాటే పాటియై ధర జెల్లు కాబట్టి అందులో రాసినట్లే వుప్పాల రాముడు ఒప్పుకోవాలన్నారు. అల్లుడికినట్టు వుడికి పోయాడు రాముడు. ఆ వేళ డబ్బు యిచ్చిన్నాడు వాళ్ళ మాటలు నమ్మాడుగానీ వాళ్ళ చేతలను శంకించ లేదు. ఖరారు కాగితం చింపేసాం అన్న పెద్ద మనుసులు ఆ కాగితాన్ని అలాగే ఉంచారు.
"ఆనాడే డబ్బు వడ్డీతో యిచ్చేశాను. నాయం కాదు."
"ఎక్కడిచ్చావ్!? వడ్డీ డబ్బులే కట్టావు. ఇన్నాళ్ళాగాం. నీ గాడిద మాకొద్దు. అందులో రాసినట్లు పెళ్ళాన్నొదులు."
"నా లోకువ జూసి నూకలజావ యిస్తారురా. ఎందుకర్రా మీ పెద్దరికాలు - చెప్పుల మోతకి మీరు మనుషులైతే కదా - మీరు కాటేస్తే మందు లేదనుకోడానికీ, ఇన్నాళ్ళూ వూరుకున్నాను. ఇప్పుడూ నాకు మాటొచ్చింది. బ్రతకడానికి చోటే చేసుకోలేనా?"
"సాలేవోయ్! నీతులు దిండు తిరగేస్తే తలనొప్పి పోతాడా? మాటలు రాలిస్తే యీ కాగితం సిరిగి పోతాదా? ఇది చిట్టిరాజు పేరునుంది. పెళ్ళాన్నొదులు" పెండ్ర పొట్టయ్య గద్దించాడు.
"నాను వదల్ను..."
"మేం తెచ్చుకుంటాం"
"అది అగ్గిరా...ఎల్లి మూతి కాల్చుకోకండి" అంటూ అక్కడినించి వెళ్ళిపోయాడు.
కోటమ్మ వెళ్ళి బోడమ్మతో మొరపెట్టుకుంది. కాస్సేపు మాటాడలేదు. తరవాత కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ...
"ఆడికి తండ్రి పోనాక కళ్ళు పోయాయి....నాను తల్లిని....సస్తే ఆ నాలుకా పోతాది - అప్పుడుగానీ ఆడిపాపం పండదమ్మా! పదును యెరిగిన సైధులా పచ్చగా వున్నావు. నిన్ను కొయ్యాలని అంతా చూస్తారు.....కట్టుకున్న మొగుడు మెడలో నగలా కలకాలం మెరిసిపో తల్లీ..."
కోటమ్మకు యీ మాటలు కొండంత దైర్యాన్నిచ్చాయ్. ఆ రాత్రి యిద్దరూ తెలివేసేవున్నారు. బోడమ్మ సాయంత్రం చెప్పిన పని చేసేసింది. అర్ధరాత్రి వరకూ యెవరో ఒకరు పాకబయట దగ్గు తున్నారు. ఉప్పాల రాముడు బోడమ్మ యిచ్చిన గరళంలో ముంచిన బాణాలు రెండు పట్టుకుని కూర్చొనే వున్నాడు. ఎవరూ చొరవ చేసుకుని రాలేదు. దానికి కారణం బోడమ్మే. ఆ పాకకీ తనపాకకీ మధ్యలో మంచం వేసుకుని అర్ధరాత్రి వరకూ కమ్మగా గంగా వివాహం పాడుతోంది. కత్తిగట్టిన వాళ్ళంతా దొంగతనానికి కదలగానే చాలాసేపటి వరకు బోడమ్మ మౌనంగా వుంది. అప్పటికి గుంపు గుంపంతా గాఢనిద్రలో నుంది. ఈ ముగ్గురే నిద్దరపోలేదు. చీకటి రాత్రి. యే మూలనో ఒకటీ తప్పితే రెండు చుక్కలు తప్పించి ఆకాశమంతా నల్లమేఘాల మయమై వుంది. కొండల్లో వర్షం పడిందేమో గాలి చల్లగా వీస్తోంది. బోడమ్మ తలుపుతట్టింది. బయటకు వచ్చేసరికి తమ స్వంత గాడిద లారీలా నిల్చుంది. గబగబ యిద్దరు ఆడవాళ్ళు పాక పీకేసారు. అప్పటికే సామాన్లు గాడిదమీద కట్టేసాడు రాముడు. పాక సామాను తలమీద పెట్టుకుని బోడమ్మ ముందు నడిచింది. కొంతదూరం పోయాక అక్కడ ఆ సామానూ గాడిదమీద వేసారు.
"ఇటు దచ్చినంయేపు యెలిపోండి. రోడ్డెక్క కండి. పొలాల గట్లమీంచి పొండి. ఏ గుంపులో సేరకండి. సేరితే యీలకి వర్తమానం రాగలదు. దూరబారంలో యెక్కడో ఒక దగ్గర ఒంటిగా బతకండి. దిక్కులేనోలకి దేముడే దిక్కు..." అంటూ సాగనంపి బోడమ్మ తిరుగవచ్చి కిక్కురు మనకుండా పడుకుంది.
తెల తెలవారుతుండగా గుంపులో కోలాహలం బయలుదేరింది. ఉప్పాల రాముడే మయ్యాడంటే యేమయ్యాడని అంతా ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. వేకువ ఝామునే దొంగ తనం నించి వచ్చి నిద్దరపోతున్న వాళ్ళూ లేచారు. చిట్టిరాజు తల్లిని గద్దించాడు.
"ఆడు అత్తోరింటికి యెలిపోతానన్నాడు. ఉత్త రాదికి పోవటం చూశాను. పోయేవాడ్ని పోనీయండి.
చిట్టిరాజు అరిచాడు.
"పరుగెత్తండి. ఆడ్నీ ఆ గాడిదనీ, కోటమ్మని జుత్తట్టుక లాక్కురండి."
"ఎందుకురా?" బోడమ్మా ఒకర్తే ప్రశ్నించింది.
"అప్పుయెగేసి చెప్పాచెయ్యక ఎలిపోతాడా?"
ఆనాడే అప్పు తీర్చేశాడట.
"వడ్డీ కట్టాడు - ఎదవ - ఆడిపని పట్టి స్తాను" అంటూ లేని మీసం నులుపుకుంటూ వెళ్ళిపోయాడు.
11
ఆరాత్రి నడచి నడచి వజ్రాలు పొదిగిన ఆకాశం చివరకు వెళ్ళామనుకున్న తృప్తి కలిగింది. యిద్దరికి పొద్దు పొడిచేసరికి ఒక చెరువు ఒడ్డు చేరుకున్నారు. సుకుమారి కోటమ్మ కాళ్ళు పీకెట్తున్నాయి. ఐనా అంత పట్టించుకోకుండా మొగుడు నడగలడో లేదో నని ఆగిపోయింది. గంజి కాసుకుందామనుకున్నా రుగానీ మళ్ళీ ముందుకే పోదామని అనుకున్నారు. పొద్దు నెత్తిమీద కొచ్చేవరకూ నడచినారు. ఒక వూరు బయట వంట చేసుకొని తిన్నారు. కోటమ్మ వంట చేస్తున్నప్పుడే రాముడు గాడిదకు గడ్డి కోసు కొచ్చాడు. పొద్దు తిరిగాక మళ్ళీ ప్రయాణం.
రెండోరోజు సాయంత్రానికి ఒకగుట్ట అగపడింది. గుట్టమీద ఒక గుడి వుంది. ఇద్దరూ ఆగి ఒకసారి పైకి చూసారు.
"దండమెడ్దాంరా!" అంది. ఇద్దరూ యెగబ్రాకారు. గాడిద కొంత దూరంవచ్చి ఆగింది. గుడి పాడుబడలేదు. లోపల విగ్రహాలున్నాయ్. గుడికి ఆనుకుని మండపం వుంది. విశాలంగా వుంది. ఇద్దరూ ఆపదనించి బయట పడినందుకు ఒక మొక్కు మొక్కారు. మండపం మీద కూర్చున్నారు. ఓ క్షణంపోయాక రాముడు ఆవులింత తీసుకుని దొర్లాడు.
"ఈ రాతిర సంగతి యేమిటి?" అంది కోటమ్మ.
"పరమాన్నం వొండే" అన్నాడు.
"గంజి ఒండడానికే బియ్యం నిండుకున్నాయ్."
"సంపోదిద్దాం. ఇప్పుడే బతక్కపోతే మరెప్పుడు బతకలేం" అంటూ లేచాడు. 'అక్కడ నించి బయటకు వచ్చి గుట్టమీద కూర్చొని చుట్టూ చూసాడు. గుట్ట దాటాక ఒక కాలవవుంది. కాలవలో నీరు లేదు. కాలవదాటి కొంత దూరంలో పెద్దనది ప్రవహిస్తోంది. ఈ నది దాటటం వీలుకాదు. నదిలో మధ్యగా నీరు పారుతోంది. నది ఒడ్డులో పచ్చని బయలు. బయలు ప్రక్కనే చెట్లు చేమలూ, ఆ ప్రక్కనే ఎత్తయిన ప్రదేశంలో ఒకచిన్న గ్రామం వుంది. ఎంతసేపైనా అలా చూడాలనే మనసుపుట్తోంది. చప్పున కోటమ్మను పిలిచాడు. ఆమెవచ్చి ప్రక్కన నిల్చుంది.
"అటు సూడే" అన్నాడు.
"ఎంత బాగుందో!" అంది.
"ఆ నదొడ్డున పచ్చికలో పాకేసుకుందాం".
"సుట్లుపట్ట అడివిలాగుంది."
