Previous Page
మన్నుతిన్న మనిషి పేజి 13


    బోడమ్మ రాముడు పాకదగ్గరలో రాతి మీద కూర్చుంది. వెలివేసినట్లు ఆ పాక వేరుగా వుంది. ఎవరూ చూడకుండా మెల్లగా పాకలోనికి చేరి కోటమ్మ చెవిలో యేదో చెప్పి యేమీ యెరగనట్లు మళ్ళీ యేటి వడ్డుకు వచ్చింది. అక్కడనించే వంట వండుతున్న వాళ్ళ వేపు చూసింది. మెల్లగా ఆ దగ్గర్లోనే తిరుగుతోంది. ఒక మూల ఆడంగులు పెళ్ళికూతురికి ముస్తాబు చేస్తున్నారు. కిలకిలా నవ్వుతున్నారు. ఆ నవ్వుకు వంటదగ్గర వున్న ఆడాళ్ళలో చాలామంది కదలివెళ్ళి వాళ్ళ నవ్వులో తమ నవ్వు చేర్చారు.
    "కొడుకు పెళ్లవుతుంటే యీమూల కూర్చుంటే ఎలా బోడమ్మా?" అంటూ అంకమ్మ అరచింది.
    "ఏం సెయ్యమంటావే?"
    "ఈ పులుసుకుండ దగ్గర వుండి కాసింత సూడు. పున్ని స్త్రీ దాన్ని కదా....నన్నూ యెల్లి నవ్వనీ..."
    "అలాగేలేయే..." అంటూ బోడమ్మ పులుసు కుండ దగ్గరకు వెళ్ళింది. కొంగులో కట్టిన మత్తుమందు విప్పి పులుసు కుండలో మూడొంతులు వేసింది. మిగతా వంటకాలలో మిగిలినది జల్లేసింది. ఆడాళ్ళు తిరిగి వచ్చేసరికి  యేమీ యెరగనట్లు ఒక మూల కుక్కలను తోలుకుంటూ వుంది.
    గుంపులో సంబరం రాను రాను హెచ్చిపోయింది. మగవాళ్ళు తాగుతున్నారు. తాగవలసిన ఆడవాళ్ళు కొద్దిగా వేసుకున్నారు. కర్రలతో సాములు, డప్పులు వాగాయి, డప్పులతో పాటు వుత్తరాన కొండల్లో మూడు రోజులబట్టే వురుముతున్న వురుములు యీవేళా వూరుకోలేదు. పశ్చిమంనించి తేరిజూచిన చందమామ ఒక్కసారి నల్లని దుప్పటిలాంటి మేఘాన్ని కప్పుకున్నాడు గట్టిగా మూలిగినట్లు ఒకసారి గర్జన వినిపించింది.
    తిల్లకు కూర్చున్నారు. మగవాళ్ళలో కొందరు.
    "ఏంటర్రా పులుసు కూరలు చిరుచేదు."
    "తాగున్నారుకదా! - ఏటి రుచిస్తాదని" అంకమ్మతోపాటు అందరు ఆడంగులు మగాళ్ళని మందలించారు. ఆడవాళ్ళ తిల్ల ముందుగానే పొట్టయ్య రాముడ్ని తిండికి పిల్చాడు. ఒంట్లో బాగాలేదన్నాడు. కోటమ్మను పంపమంటే "అదిగో కడుపునొప్పితో మంచం యెక్కి నాది. జాతోలం కదా రే పొత్తాంలే..."
    "నీ తీపరం యింకా పోలేదురా" అంటూ పొట్టయ్య వెళ్ళిపోయాడు.
    అందరి తిల్లూ అయిపోయాయి. బోడమ్మను తినమంటే "యెలాగ తినమంటావు? తల్లిని పెళ్ళాడినోడి విందుభోజనం తిని కూర్చుంటానా!" అంటూ యేటి ఒడ్డుకే వెళ్ళిపోయింది.
    చీకటి పడ్తున్న కొద్దీ ఒక్కొక్కరు ఆవులింతలు తీసుకుంటూ యెక్కడపట్తే అక్కడ పక్కవేస్తున్నారు. ఏంటీ నిద్దర అని ఒకరంటే "రెండు రాత్రులై నిద్దర లేదుకదర్రా!" అని సమాధాన పరుస్తున్నారు కొందరు. వీళ్ళ ఆవులింతలు చూసి కుక్కలు పారేసినవే కాదు, మిగిలినవి తిన్నాయి. గాడిదలు చేరాయి. గాడిదలు వెనకే పందులు కూడాయి. మొత్తంమీద అంతా కలగాపులగం అయిపోయింది. గుంపులో మనుషులతో పాటు జంతువులకూ విందు భోజనం సుఖనిద్దర అయిపోయింది.
    అర్ధరాత్రి సరికి గుంపుగుంపంతా గాఢనిద్రలో నుంది. ఆకాశం అంతా నల్లని మబ్బులతో పేరుకొని వుంది. నది కొద్ది కొద్దిగా పొంగుతూ వీళ్ళ పాకలవరకూ వచ్చింది. బోడమ్మ మెల్లగా రాముడు పాక దగ్గరకు వచ్చింది. నిశ్శబ్ధంగా రాముడూ, కోటమ్మా కట్టు బట్టలతో కట్టిన గాడిదను విప్పి వెంటబెట్టుకుని గుడివున్న కొండవేపు వడిగా కదిలారు. బోడమ్మ అలా కొంతసేపు చూసి వెనుకకు తిరిగి వచ్చింది. శవాల్లా పడున్న మనుషులకు, చచ్చిన గొడ్లలా పడివున్న గాడిదలూ, పందులూ, కుక్కలూ అన్నీచూసి నల్లమందుతో చేసిన తన మత్తుమందు బాగా పనిచేసి నందుకు తృప్తిపడ్డది. దీన్ని యిది వరకే అమ్మి నాణ్యం తెలుసుకున్నది. పనిచేస్తుందన్న నమ్మికతోనే కోటమ్మకు హామీయిచ్చింది.
    పారుతున్న నది ఒడ్డున నిల్చొని ఒకసారి గుంపు వేపు చూసింది "రెక్కలున్న పచ్చులు వూరికినే యెగరవు కానీ యీలంతావూరికినే యెగిరిపోనారు. నీతిలేకుండా తొడుతిన్న పశువుల్లా బతికారు. చిత్త కార్తి కుక్కలయ్యారు. చిక్కినదంతా అంకించుకుని తైతక్క లాడారు. నేటి విపత్తులను రేపటి చెట్లు కాకుండా పాపంతో వుడకబెట్టేసారు. మీ పాపం యీనాటికి పండిపోయింది." అంటూ సోదెలా రాగంతో చెప్పుకుంటూ నది ఒడ్డునుంచి దిగువకు పోతూ పోతూ...ఒక్కసారి ధబేలుమన్న శబ్దం ఆ శబ్దం వినడానికి ఆమె తప్పించి యింకో ప్రాణి లేదు. బహుశః నీటిలో చేపలుంటే అవి విన్నయేమో మేఘాల గుండెలు గడగడ కొట్టుకుంటున్నాయి- ఈమెకు తెప్పలా తేల్చే బలంలేని నీరు గిరగిర చుట్టి గింజుకుంటోంది.
    కాస్సేపటికి నీటి రోదనం తప్పించి అంతా నిశ్శబ్ధం. మేఘం కంటిరెప్పలు టపటప కొట్టుకుని కన్నీటి బొట్టు రాల్చినయ్. ప్రకృతి భయంతో గజ గజ వణికిపోతోంది. శత్రుసేవ శతఘ్నులు పేల్చుకుంటూ ప్రవాహంలా వచ్చిపడుతున్నట్లు హోరు!
    ముందుకు కడలిన రాముడు. కోటమ్మ కాలవ దగ్గరకు వెళ్ళేసరికి నీరు నిండుగా పారుతోంది. కోటమ్మను గాడిద మీద కూర్చోబెట్టి, తను వెంట బడి మెల్లగా కాలవదాటారు. కాలవదాటిన వెంటనే రాముడు గాడిద మూతిమీద ఒక్క ముద్దు పెట్టి, "మాంచి ఆపద కాసినావు - నా బంగారు బొమ్మా!" అన్నాడు. ఇద్దరూ కొండవేపు వెళ్తుంటే బ్రహ్మాండమైన హోరు. ఏదో ప్రళయం వచ్చిపడుతున్నట్లు వినిపించగానే ముందుకు చూసాడు. మెరుపు వెలుగులో ప్రవాహం హోరు మంటూ ముంచుకొస్తోంది. కోటమ్మ చెయ్యి ఒకచేత్తో. గాడిద చెవి యింకో చేత్తో పట్టుకొని రాముడు కొండవేపు పరుగెత్తాడు. అదేపనిగా అలసి పోయిన గాడిద చెవి వదిలేసి కోటమ్మను పట్టుకుని కొండ యెగబ్రాకాడు. గాడిదను నోటితో "దా! దా!" అని పిలుస్తూనే కొండ యెక్కుతున్నాడు. గాడిద వెంటవస్తోంది. మండపం చేరి చుట్టూ ఒకసారి చూసాడు. మెరుపుల వెలుగులో అంతా ఒక సముద్రం లా వుంది. ప్రవాహం కొండలో కొంతభాగం ముంచేసింది. ఎగువునవున్న మూడు పెద్ద చెరువులగట్లు తెగినీరు ప్రవహించి కొండలనించి పరుగులిడే ప్రవాహంలో కలిసి ఒక్క సారి వుప్పెనలా వచ్చి పడింది.
    గుంపు గుంపంతా - మనుషులు, పశువులు....ఆస్థి - హంగు అంతా - సర్వస్వం - గంగలో కొట్టుక పోయింది. "అయ్యో పాపం!" అన్నాడు రాముడు. వాడి భుజం మీద తలపెట్టిన కోటమ్మ కళ్ళల్లోనించి కన్నీరు రాలింది. వర్షం దబదబ ముంచుకొచ్చింది.

 


                           ----అయిపోయింది----


 Previous Page

WRITERS
PUBLICATIONS