మాస్టారి టేబిల్ పక్కన బ్లాక్ బోర్డు ముందు నిండుగా వ్రాసుకున్న కాగితం చేతిలో పట్టుకుని నిలబడింది పద్మజ. పద్మజ మాట్లాడటానికి వెళ్ళుతుంటేనే సంతోషంగా చప్పట్లు కొట్టారు పిల్లలంతా. పదిమంది లో నిలబడి మాట్లాడట మంటే సిగ్గు భయం లాంటివేమీ లేవు పద్మజకు. క్లాసులో అందరి తోనూ చనువుగా మాట్లాడుతూనే ఉంటుంది. మాస్టార్లను సాధించి మరీ కావలసిన విషయాలు తెలుసు కుంటుంది. మాస్టార్ల కూ, తోటి విద్యార్ధులకూ అందరికీ పద్మజ పట్ల ప్రత్యేకాభిమానం. ప్రతి విద్యార్ధి పద్మజలా చూడాలని ఉవ్విళ్ళూరుతుంటాడు. ప్రతి మాస్టారూ పద్మజ తెలివి తేటల్ని ఉదహరిస్తూ ఉంటాడు.
.jpg)
సగర్వంగా, నిర్భయంగా నవ్వుతూ తిరిగే పద్మజ అంటే అందరికీ ప్రేమే!
"స్త్రీకి విద్య అవసరమా? అనవసరమా? అన్న ప్రశ్నకు ,ముందు-- అసలు మనిషికి విద్య అవసరమా? కాదా? అన్న ప్రశ్న వేసుకోవాలి మనం. మనిషికి విద్య అవసరమే అని మనిషైన ప్రతివాడూ అంగేకరిస్తాడనుకుంటాను. ఇక స్త్రీ మనిషేనా? కాదా? అన్న విషయాన్ని కూడా ప్రతివాడూ అంగీకారిస్తాడనుకుంటాను.ఇక స్త్రీ మనిషేనా? కాదా? అన్నవిషయాన్ని కూడా ముందే తేల్చాలి. స్త్రీ మనిషనే నేను వాదిస్తున్నాను. స్త్రీకి విద్య ఉండి తీరాలని చెప్పబోతున్నాను" అంటూ ప్రారంభించింది పద్మజ. తరగతి లో పిల్లలంతా నిశ్శబ్దాన్ని భోజనం చేస్తూ కుతూహలంగా చూస్తూ కూర్చున్నారు. వరండా లోంచి వెళ్ళబోతున్న హెడ్మాస్టరు శంఖారావం లాంటి పద్మజ కంఠస్వరం వింటూ క్లాసు ముందే నిలబడిపోయారు. పదిహేను నిమిషాల సేపు తన భావాలన్నీ విపులంగా, క్షుణ్ణంగా వెల్లడించింది పద్మజ. మాట్లాడటం లో ఆ కంఠం ఆవేశంతో చిందులు తొక్కింది. తను ఒంటరిగా సంఘంతో దెబ్బలాడుతూన్నట్టూ కోట్లాది ఆడవాళ్ళను అన్యాయం నుంచి రక్షిస్తూన్నట్టూ గుప్పిళ్ళు బిగించి మరీ వాదించింది. స్త్రీ అంటూ సృష్టి నుంచి ఓ జాతిని విడదీయటమే మూర్ఖత్వమంది. పురుషుడి కీ, స్త్రీకి మానసికంగా భేదం లేనేలేదంది. స్త్రీ సుఖం, స్త్రీ దుఃఖం , స్త్రీ సమస్య, స్త్రీ జీవితం -- స్త్రీ సర్వస్వం పురుషుడితో ఏకీభవించి ఉంటుందంది. స్త్రీ ని విడిగా కాకుండా ఒకే సృష్టి గా చూసి తీరాలని వాదించి ముగించింది.
పిల్లలతో పాటు మాష్టారు కూడా చప్పట్లు కొట్టారు. హెడ్మాస్టరు నవ్వుతూ అన్నారు: "నిన్ను నేను అభినందిస్తున్నానమ్మాయ్! నువ్వు తప్పకుండా లాయర్ వి అవుతావు."
పద్మజ సిగ్గుపడుతూనే అంది: "ఆడవాళ్ళు అలాంటి ఉద్యోగాలు చెయ్యవచ్చునా మాస్టారూ?"
"నీవంటి వాళ్ళు ఎలాంటి పనులైనా చెయ్యవచ్చునమ్మా! సంఘాన్ని కూలదోసి కొత్తగా నిర్మించే శక్తి నీలాంటి వాళ్ళ కుంటుంది."
ఆ క్షణంలోనే అనుకుంది పద్మజ -- "ఏది ఏమైనా తను అన్యాయంగా, అక్రమంగా అధికారం చలాయించే సంఘానికి తలవంచదు. తన బ్రతుకు బాట తను వెతుక్కుంటూ వెళ్ళగలదు. ఆ ధైర్యం ఉంది తనకు'-- అని.
హెడ్మాస్టరు వెళ్ళిపోయాక ఇంకా ఇద్దరు ముగ్గురు విద్యార్ధులు వ్రాసుకు వచ్చిన వ్యాసాలు పురాణ పఠనం లా చదివి ముగించేశారు. రఘుబాబు పేరు పిలిస్తే తను మాట్లాడనే మాట్లాడనన్నాడు. 'అలా భయపడకు. నీకు వచ్చినంత వరకూ చెప్పు . ఏం ఫర్వాలేదు" అంటూ మాస్టారూ బుజ్జగిస్తే ఓసారి పార్వతి కేసి , మరోసారి పద్మజ కేసి చూసి నెమ్మదిగా నడిచి వెళ్ళాడు టేబుల్ దగ్గరికి. డిబేట్లో మాట్లాడాలని ప్రయత్నించింది అదే మొదటి సారి రఘుకు. అక్కడ నిలబడి క్లాసంతా కలియ జూస్తే కాళ్ళు గజగజ లాడాయి. ముచ్చేమట్లు పోశాయి. ఉచ్చ్వాస విశ్వాసాలు అధికమయ్యాయి. దీనంగా చూశాడు మాస్టారి కేసి. మాష్టారు లేచి నిలబడి గట్టిగా అన్నారు :" రఘుపతి ఒంట్లో బాగాలేదు. ఈసారికి విరమించుకుని మరో డిబేట్లో మాట్లాడుతాడు."
రఘు తల దించేసుకుని కాళ్ళీడ్చుకుంటూ పోయి కూర్చున్నాడు. చొక్కాతో మొహం మీద చెమట తుడుచుకుంటూ కళ్ళు కూడా ఒత్తుకున్నాడు.
"అదేమిటి, రఘుబాబూ , అంత భయపడ్డావ్ క్లాస్ లో?' అంది ఆశ్చర్యంగా పద్మజ తర్వాత.
ఎప్పటిలా సిగ్గుతో తల తిప్పేసుకున్నాడు రఘుబాబు. ఆ ప్రసక్తి ఎవ్వరూ ఎత్తకుండా ఉంటేనే బావుండుననుకున్నా పద్మజను వారించలేకపోయింది పార్వతి.
పద్మజ ఏదో కాస్సేపు మాట్లాడి చివరికి హాస్యంగా అననే అంది: "రఘుబాబు పెద్ద వాడైనా పిరికివాడే!"
చురుగ్గా చూసింది పార్వతి. "బాధపడకు రఘు బాబూ!' అన్నట్టు ఓదార్పు గా చూసింది రఘూ మొహంలోకి. రఘు కళ్ళలో ఏవిధమైన వేదనా కన్పించలేదు.
* * * *
స్కూల్ ఫైనల్ పరీక్ష లో పార్వతి కన్నా రఘుబాబు కన్న చాలా మంచి మార్కులు తెచ్చుకుంది పద్మజ. హెడ్మాస్టరు స్వయంగా పద్మజను ప్రశంసిస్తుంటే గర్వంతో ఏరుపెక్కింది ఈశ్వర సోమయాజి ముఖం.
కూతురి ఘనత విన్న కామేశ్వరమ్మ కూడా కనీ కంపించకుండా ముసిముసిగా నవ్వుకుంది. తమ వంశంలో ఒక్క ఆడపిల్లయినా ఇంగ్లీషు చదువు చదివిందీ? రామయణాలేమో భారతాలేమో తప్పితే మరో ముక్క ఎవరికేనా తెలుసూ? 'అక్కయ్య చూడవే, సుజా! చక్కగా పరీక్ష పాసు అయ్యిందట" అంటూ చిన్న కూతుర్ని ముద్దు పెట్టుకుని సంతోషం తీర్చుకుంది.
"నిన్ను చూసి నేను సిగ్గు పడుతున్నానే పద్మా" అన్నాడు విజయశాస్త్రి నవ్వుతూ. శాస్త్రి స్కూల్ ఫైనల్ మొదటి సంవత్సరం తప్పి రెండవ సంవత్సరం అత్తెసరు మార్కులతో పాసయ్యాడు మరి.
ఆడపిల్లల స్వేచ్చ విషయంలో అన్నగారి వైఖరి ఏనాడో కనిపెట్టగలిగిన పద్మజ నవ్వుతూనే అంది: "మనస్పూర్తిగా నిన్ను అభినందిస్తున్నానన్నయ్యా! నిజాయితీ గా సిగ్గుపడటం నేర్చుకున్నావు."
ఆరోజు ఇంట్లో అందరికీ సంతోషంగా ఉంది. గర్వంగా ఉంది. అందరూ అక్కయ్యను మెచ్చుకొంటుంటే పన్నెండేళ్ళ సుజా కూడా అమాయకంగా సంతోషించింది. పద్మజ వెనక వెనకే తిరిగింది. అక్కయ్య లాగే తనూ కావాలని అమాయకంగానే కొరుకొంది.
"నాన్నా! కాలేజీ కి అప్లికేషన్ పెట్టేస్తాను. లేకపోతె సీట్లు దొరకటం కష్టం" అంది పద్మజ మర్నాడు. పరధ్యానంగా విన్న సోమయాజి అర్ధం కానట్టు చూశాడు. చూస్తున్న కాగితాలు దూరంగా నెట్టి అన్నాడు : "ఏమిటమ్మా అంటున్నావు?"
"కాలేజీ సీటు కోసం తొందరగా అప్లికేషన్ పెట్టాలి నాన్నా! లేకపోతె తర్వాత ఇబ్బంది కదూ?"
కూతురి మొహంలోకి విస్మయంగా చూశాడు సోమయాజి. ఆ ప్రయత్నంగానే అన్నాడు : "ఇంకా చదువు కుంటావా అమ్మా?"
కూతుర్ని చదివించాలనే ఉద్దేశ్యమైతే ఆయనకు లేదు. అప్పటికే చాలా సాహసం చేసి , ఇంట్లో భార్య పోరుకు తట్టుకుని, బయట బంధు బలగం హెచ్చరికలు ఎదుర్కొని ఆడపిల్లను హైస్కూలో చేర్పించాడు. చేసిన సాహసానికి ఫలితం కన్పించింది. పద్మజ స్కూల్ ఫైనల్ పాసైంది. ఇక చదువు ప్రసక్తి ముగిసిందనుకున్నాడాయన. అఖండమైన కూతురి తెలివి తేటలకు ఓ హద్దు గీస్తున్నానన్న సంగతి ఆయనకు అర్ధం కాలేదు. "స్త్రీ విద్య గురించి బాగా మాట్లాడానని నాకు బహుమతి ఇచ్చారు, నాన్నా!" అని కూతురు ఫోర్త్ ఫారం చదివే రోజుల్లో తను సంపాదించుకున్న బహుమతి పుస్తకం తెచ్చి చూపించినప్పుడు తను చాలా మంచి పని చేస్తున్నానని ఆత్మ విమర్శ చేసుకున్న అయన తొందర లోనే ఆ సంగతి మరిచి పోయాడు. "కాలేజీ కి అప్లికేషన్ పెడతాను , నాన్నా!" అన్న కూతురి మాటలు, పరోక్షంగా కూతురి అభిప్రాయం అయన అంతరంగాన్ని ఒక్కసారి కంపింపజేశాయి. అందుకే అప్రయత్నంగా భయం భయంగా అన్నాడు: "ఇంకా చదువు కుంటావా , అమ్మా?"
