"ఏం, రవీ?" సూర్యనారాయణగారి గొంతు తిరిగి హెచ్చరిక చేయడంతో పరధ్యానం కాస్తా వదిలిపోయింది.
"అడగండి, మాస్టారూ" అన్నాడు.
"మీ దే ఊరో నాకు తెలియదు. అమ్మా, నాన్నా ఉన్నారా?" సూర్యనారాయణ గారి గొంతులో వణుకు ప్రారంభం అయింది.
క్షణం ఆలోచించి, "ఉన్నారండి" అన్నాడు రవి.
"తోబుట్టువులు ఎందరు?"
"ఒక్కడే అన్నయ్యండి. మద్రాసులో మెడిసిన్ ఫైనలియరు చదువుతున్నాడు." రవి కాస్సేపు ఆగాడు.
"అసలు మీదే ఊరో తెలుసా?" ప్రశ్నలవర్షం కురిపిస్తూనే ఉన్నాడు ముసలాయన.
రవికి విసుగనిపించింది. అయినా ఓపిగ్గా సమాధానం చెబుతూనే ఉన్నాడు. "ధవళేశ్వరం అండి."
"నేను పెద్దవాడినైపోయాను. చిన్నతనంలో ఆడపిల్లల్ని బాధపెడితే ఆ ఉసురు ఊరికే పోదు...." చిన్నగా దగ్గి తిరిగి ప్రారంభించాడు:
"నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉండేవారు. పడుచు తనం కొత్త పెళ్ళాం మోజులో వాళ్ళని లెక్కజేసే వాడినికాదు. పెద్ద చెల్లెలు ఏడ్చి ఏడ్చి అత్తవారింటికి వెళ్ళిపోయింది."
రామకృష్ణ అందుకొన్నాడు: "ఇప్పుడెందుకు, నాన్నా, అవన్నీ?"
"నీకు తెలియదురా. ఇప్పుడు చూడు. అక్క హఠాత్తుగా పోవడానికి కారణం వాళ్ళని పెట్టిన ఉసురే అంటాను. భారతి చూడు ఎంత అందమైన పిల్లో. ఇంకా పెళ్ళీ పెడాకులూ కాలేదంటే దీనికీ అదే కారణం అంటాను. నీకు చదువు అబ్బకపోవడం కూడా అందుకే."
"చెప్పండి, మాస్టారూ. నేను వింటున్నానుగా."
"మా పిన్ని పెట్టే బాధలు భరించలేక రెండో చెల్లెలు కూడా రాత్రికి రాత్రే వెళ్ళిపోయింది. అన్ననై వాళ్ళని ఆదరించలేకపోయాను. అందుకే ఇన్ని అవస్థలతో సతమతమైపోతున్నాను. వాళ్ళకి నామీద కోపం ఈ జన్మకి తీరేది కాదు. నేనింత బాధ పడుతున్నానని కానీ, పశ్చాత్తాపంలో ఉన్నానని కానీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది?"
"వాళ్ళు ఎక్కడుంటారో కూడా తెలియదా, మాస్టారూ?"
"లాభంలేదు. ఇప్పుడెవరూ లేరక్కడ. నా రెండో చెల్లెలి పేరే దీనికీ పెట్టాను." పక్కనే ఉన్న భారతి తలమీద చేయి వేశారు.
రవి ఉలిక్కిపడ్డాడు. 'రెండు రెళ్ళు నాలుగెందుకు కావూ?' అవును, అమ్మ. అమ్మే! ఏదో గుర్తు వచ్చి నట్టు అడిగాడు. "చూడండి. మాస్టారూ. మీ పెద్ద చెల్లెలి పేరు రాజ్యలక్ష్మా?"
సూర్యనారాయణగారు తలెత్తారు. కనుబొమలు ముడిపడిపోయాయి. నిండు వెన్నెల్లో అతని మొహం చక్కగా కనిపిస్తూంది. "అవును, బాబూ. నీకెలా తెలుసు?"
"అయితే, అయితే అవధానిగారు తెలుసన్నమాట?"
"ఇవన్నీ నీకెలా తెలుసు, బాబూ?" సూర్యనారాయణగారి ముడతలుపడ్డ కళ్ళలో నీళ్ళు ఎంతోసేపు నిలవలేదు.
"మా అమ్మా, నాన్నా వాళ్ళేనండి."
"ఏమన్నావు? ఇంతవరకూ ఏదో అన్నావు!" ఖంగారుగా అన్నారు. ఆయాసంతో రొప్పుతున్నారు.
"మీరు ఆవేశపడకండి, మాస్టారూ. అన్ని సంగతులూ నేను చెబుతానుగా?"
రామకృష్ణ, భారతిల ఆనందానికి అంతులేదు.
* * *
"ఆదా, బాబూ, సంగతి! నేను కట్టుకొన్న మేడలు ణ ఆక్ల ఎదుటే కూలిపోయాయి ఒక విధంగా. నిన్నేదీ ఇక కోర నవసరంలేదు. మీ అమ్మకు నన్ను కలిసిన సంగతి కూడా చెప్పకు. అది నన్ను క్షమించదు."
"లేదు. మీరు పొరబడుతున్నారు. అమ్మ సంగతి తెలుస్తే మీరు అలా అనరు."
"నీకు తెలియదు, రవీ. నువ్వు ఎవరివో తెలియని క్రితం నీమీద ఆశలు పెంచుకొన్నాను. కానీ..."
"చెప్పండి, మామయ్యా!"
"నా మనసు నాకు చెబుతూనే ఉంది, నువ్వు మళ్ళీ కనిపిస్తావని. అలాగే జరిగిందికూడా. నువ్వంటూ కనిపిస్తే ఈసారి వదిలిపెట్టకూడదనుకొన్నాను. భారతి నా బిడ్డ అన్యాయమైపోతుంది. నేను పోతే రామకృష్ణ సంపాదన ఎంతో, దానితో వరుణ్ణి కొనగలడో లేడో నీకు తెలుస్తుందనీ....ఏమేమో అనుకొన్నాను. దాని కేంలే గానీ పడుకో, బాబూ, చాలా పొద్దుపోయింది."
ఆ రాత్రి రవి నిద్ర పోలేదు. కొబ్బరి చెట్ల మధ్య మంచి ఆకాశంలోకి చూస్తూంటే చంద్రుడి లోంచి మేఘాల మీదుగా చూస్తున్న వైదేహి కళ్ళలో భారతీదేవి, రామకృష్ణా దైన్యవదనాలతో ప్రేమగా రవిలోకి జారిపోతున్నారు. 'వైదేహి' మాటి మాటికీ కనిపించి మాయమౌతూంది. రామకృష్ణ పాపం, ఎంత మారిపోయాడు, బ్రతుకుని భగ్నం చేసుకొని!
ఆనాటి రామకృష్ణ, భారతి భారమై పోగా, అక్క పోయిందని వైరాగ్యం వెంటవేసుకుని తిరుగు తున్నాడు. భారతీదేవి......ఆలోచనలు అలా సాగిస్తూనే ఉన్నాడు రవి.
* * *
"నీళ్ళు తోడాను. స్నానం చెయ్యండి, బావా."భారతీదేవి మెల్లిగా గది గుమ్మందగ్గర నిలబడింది.
స్నానం చేస్తూ అన్నాడు రవి; "నేను ఇవాళ వెళ్ళిపోతున్నాను, భారతీదేవీ."
దూరంగా నిలబడి ఆకాశంవైపు చూస్తూంది. భారతీదేవి అనవసరంగా, ఆవేశంగా మాట్లాడదు. భారతీదేవి స్వభావమే వేరు.
"మిమ్మల్నే, భారతీదేవి! నేను ఇవాళ వెళ్ళిపోతున్నాను."
చిన్నగా నవ్వింది భారతీదేవి. "ప్రతి రోజూ స్నానం చేసేటప్పుడు గుర్తుంచుకోండి."
ఆఖరి చెంబు నెత్తిన పోసుకొని తువ్వాలు అంచుకొన్నాడు.
గదిలోకి వెళ్ళి రకరకాలుగా ఆలోచిస్తున్నాడు, అద్దం ముందు క్రాపు దువ్వుకొంటూ ఎప్పుడు వచ్చాడో రామకృష్ణ రవి వెనక నిలబడి చిన్నగా దగ్గాడు.
అద్ధంలోంచే రామకృష్ణ వైపు చూశాడు రవి, "ఏమిటి, బావా, విశేషం?" అంటూ.
"చూడండి, బావగారూ, నిన్న ఈవేళప్పుడు కలుసుకొన్నాం. అప్పుడు మీ రెవరో నాకు తెలుసు. కానీ ఇప్పుడు మరింత సన్నిహితులం అయ్యాం. రెండు రోజులు ఉండి మరీ వెళ్ళండి."
"నన్ను మన్నించనవసరం లేదు, బావా."
రామకృష్ణ గంభీరంగా అన్నాడు: "మీరు ఆశ్చర్యవంతులు. చదువుకొన్నవారు. మీకూ మాకూ మధ్య ఉన్న బంధం ఎలాంటిదైనా వీటి రెండింటివల్లా దూరం కావలసిందే.
"అదో రూలా?"
"రూల్స్, రెగ్యులేషన్స్ మాటా కాదు, బావా. మీ కివ్వవలసిన గౌరవం వీటి రెంటివల్ల పెరిగింది. మిమ్మల్ని మేము చేసుకొనేవరకూ అవి అంతే."
"ఈ విషయం వైదేహికీ తెలియదనుకొంటాను." రవి మొహం విచారాన్ని పులుముకొంది.
"ఆ రోజుల్లో మేమూ ఉన్నవాళ్ళమే. కానీ నాన్న గారి అప్పులు మమ్మల్ని ముంచేశాయి. అక్కే ఉంటే మిమ్మల్ని....." రామకృష్ణ కళ్ళలో నీళ్ళు నిలిచాయి.
"వైదేహి ఉంటే నువ్వు నాకు దగ్గర అయ్యేవాడివి. మించిపోయిందేమీ లేదు. భారతీదేవిని నేను పెళ్ళి చేసుకొంటాను." రవి దృఢనిశ్చయంతో అన్నాడు.
రామకృష్ణ మాట్లాడకుండా రవిని పరీక్షిస్తూ క్షణం తరువాత అన్నాడు: "పరిహాసం చేస్తున్నారా?"
"లేదు. నిజమే అంటున్నాను."
సంభాషణ వింటున్న సూర్యనారాయణగారి మొహాలలో సంతోషం తాండవించింది. కర్రను శబ్దం చేస్త్జూ కదిలి వెళ్ళారు.
* * *
"చెప్పండి, భారతీదేవీ, నేనంటే మీకు ఇష్టమేనా?" సూటిగా అడిగాడు రవి.
భారతీదేవి కళ్ళు రెండూ పైకెత్తి సూటిగా చూసింది రవి కళ్ళలోకి. "వెనక అక్కని ఇలాగే అడిగారా?"
"లేదు. అసలా అవకాశమే లేదు. తను నన్ను ఇష్టపడినట్లు ఆవిడ ఉండగా నాకు తెలియదు."
"మరి అక్క?"
"అవును. అంతా క్షణంలో జరిగిపోయింది. వైదేహిని మరిచిపోవడం కష్టం. అందుకే ఆ బంధాన్ని శాశ్వతం చేసుకోవాలనుకొంటున్నాను. అదీకాక మీరు నాకు మేనమామ కూతురు గదా!"
"బీదలపట్ల చూపే జాలితో త్యాగం చేయద్దు, బావా. నేను కావాలి అనుకొంటే నాకేమీ అభ్యంతరం లేదు."
"అదేం లేదు. ఒక విధంగా నేనూ ఒకప్పుడు పేదవాడినే."
"ఈ విషయం అత్తకి చెప్పి వస్తే మంచిది అనుకొంటాను."
విరక్తిగా నవ్వాడు. "ఇలా ఒకసారి ఇంటికి వెళ్ళి వచ్చేలోగా సర్వం నాశనమై పోయింది. వైదేహి మరి కనిపించలేదు. ఇప్పుడలా చేయను."
"మరి?" ప్రశ్నించింది భారతీదేవి.
"నా స్వంత అభిప్రాయం తో మిమ్మల్ని వివాహం చేసుకొని, ఇద్దరం కలిసే వెడదాం. అమ్మ సంతోషిస్తుంది."
భారతీదేవి ఇక అక్కడ ఉండలేదు.
* * *
పొద్దుటినుంచీ భారతి భర్తకు కనిపించలేదు. అసలు మొహం తప్పిస్తూనే ఉంది. కంటినుంచి ధారావాహినిగా కారే నీటిని భర్త చూడరాదని ఎంతో ప్రయత్నించింది. కానీ వేణుగోపాల్ రానే వచ్చాడు.
"చూశావా, భారతీ! నేను చెప్పిన మాటలు తోసి పారేస్తూంటావు. వాడేం చేశాడో చూడు. ఇష్టమైన పిల్లని చేసుకొన్నాడు." చాలా నిదానంగా అన్నాడు వేణుగోపాల్.
అప్పటికే భారతి కళ్ళు ఎర్రబడిపోయి, మొహమంతా వాచిపోయింది. భర్తవైపు చూడలేదు. భారతికి దగ్గరగా వచ్చి రెండు చేతులలో మొహాన్ని పైకెత్తి చూసి నిర్ఘాంతపోయాడు.
భారతికి దుఃఖం ఆగలేదు. భర్త గుండెల్లో తలదూర్చి పెద్దగా ఏడ్వసాగింది.
"నీకేం పిచ్చా, భారతీ! వాడిప్పుడు తప్పేం చేశాడు? ఒక పిల్లని ప్రేమించడం ఈ రోజుల్లో సామన్యం అయిపోయింది. నయమే, ఇంకా మంచిపని చేశాడు. జులాయి వెధవలా అనుభవించి వదిలివేయలేదు."
"మీరు....మీరింత మంచివారు కనకనే వాళ్ళలా తయారయారు. ప్రపంచం ఏమనుకొంటుంది? స్వంత తల్లీ తండ్రీ అయితే ఇలా జరిగేదా? ఏదో చేరదీశారని గాలికి వదిలేశారు అని అనుకోదూ?"
నవ్వాడు వేణుగోపాల్. "ప్రపంచం ఎప్పుడూ ఏదో విధంగా అనుకొంటూనే ఉంటుంది, భారతీ, ప్రపంచానికి నేను భయపడను. మనకి కావలసింది వాళ్ళ సుఖం."
"సుఖం. వాళ్ళు ఇప్పుడే మిమ్మల్ని లెక్కజేయడం లేదు. నేనుపోతే మిమ్మల్ని......"
"హుఁ!" నిస్పృహగా అన్నాడు. "నువ్వెలా పోతావు. భారతీ! నన్ను ఒంటరివాడిని చేసి నువ్వు ఎక్కడికీ పోలేవు." కొంచెం సేపాగి తిరిగి ప్రారంభించాడు: "రేపు వాడు భార్యతో తిరిగి వస్తాడు. చీపురు కట్టా, చాటా లాంటివి ఎదురుగా ఉంచకు. నవ్వుతూ దిష్టితీసి లోపలికి తీసుకురా. వాళ్ళ తల్లీ తండ్రీ ఉంటే ఇలాగే చేసేవాళ్ళు."
"మీరు నన్నెంత బాధ పెడుతున్నారు! ఆ వెధవ ముందర ఒక ఉత్తరమైనా రాశాడా? మనం చచ్చిపోయాం అనుకొన్నాడా? పెద్దవాడు రామును వదిలేసి తగుదునమ్మా అని తను ముందు చేసుకోవడం ఏమిటి? ఇంజనీర్ ట ఇంజనీర్. ఎందుకు కాల్చనా!"
"ఛ! ఏం మాటలు, భారతీ, అవి శుభమా అని భార్యతో వస్తూంటే! నన్ను అనుమానంపాలు చేయకు." భారతి వీపు నిమురుతూ ఉండిపోయాడు.
"రాము ఏమనుకొంటారు?" భారతి తిరిగి ప్రశ్నించింది.
"వాడంత తెలివితక్కువవాడు కాదు. కాలంమారింది. మనుషులూ మారారు. వాళ్ళతో మనమూ మారాలి." దూరంగా కదిలి వెళ్ళిపోయాడు, వేణు గోపాల్.
* * *
"అమ్మా, నాన్నగారూ భారతీదేవీ." భార్యకు పరిచయం చేస్తూ లోపలికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించాడు రవి.
భుజంమీదుగా కొంగు తీసుకొని వంగి నమస్కరించింది భారతీదేవి.
"రవి భార్యను 'భారతీదేవి' అంటున్నాడేమిటండీ?" భర్తను అనుమానంగా రహస్యంగా అడిగింది భారతి.
హాల్లోకి వచ్చి కూర్చుంటూ అన్నాడు వేణుగోపాల్! "చూడమ్మా! ఈ ఇల్లు నీదని రవి చెప్పేఉంటాడు. ఒక వేళ వాడు మరిచిపోయి ఉంటే నేను చెబుతున్నాను, విను. ఈ ఇల్లు నీది. నువ్వు అనవసరంగా సిగ్గుపడ నవసరంలేదు. అత్తగారనీ, బావగారనీ, మామగారనీ రోజంతా లేచి కూర్చుంటూ కుస్తీలు తీయ నవసరం లేదు. మీ అమ్మా, నాన్నా ఎంతో మేమూ అంతే అనుకొంటే నీకు తృప్తి, మాకు ఆనందం." తలెత్తి చూసింది భారతీదేవి. మామగారి మాటల్లో ఎక్కడా అబద్ధం కనబడటం లేదు.
రవి మెల్లగా అన్నాడు: "మీకు చెప్పకుండా ఈ పని చేశాను. నన్ను క్షమించండి, నాన్నగారూ! అనుకోకుండా ఇలా జరిగిపోయింది."
"అదెలా జరిగిపోతుందోయ్, నీ ప్రమేయం లేకుండా? 'క్షమించండి' అంటే సరిపోతుందా? ఎవర్ని అడిగి చేసుకొన్నావు?" వేణుగోపాల్ మోహంలో ఎంత దాచుకొన్నా చిరునవ్వు దాగటం లేదు.
"..........."
"మాట్లాడవేంరా? ఏదో క్షమించమంటే సరిపోదురా. అసలు క్షమించవలసింది నేను కాద, మీ అమ్మరా." విసురుగా సోఫాలోంచి లేచి పచార్లు చేయసాగాడు.
అప్పటికే రవి తల్లి గుండెల్లో తల దాచుకొని నిశ్శబ్ధంగా ఉండిపోయాడు. భారతీదేవి లేచి వెళ్ళి సోఫా వెనక నిలబడి అత్తగారి మెడచుట్టూ చేతులు వేసింది.
క్షణం విస్తుపోయింది భారతి. కోడళ్ళు ఇలా ప్రవర్తిస్తారని ఆవిడ జీవితంలో ఎరగదు.
* * *
జడ పూర్తిచేసి విషయాలన్నీ పూర్తిగా అర్ధం చేసుకొంది భారతి. కోడలి నుదుటి మీద ముద్దు పెట్టుకొంటూ "అదా సంగతి!" అంది.
"ఏమిటోయ్, భారతీ! కోడలు రానంతసేపూ ఏమిటేమిటో అన్నావు. తీర వచ్చాక ఇదేమిటోయ్!" వేణుగోపాల్ పరిహాసం చేశాడు.
"రవీ, ఇదీ ప్రేమించుకోనూలేదు పాడూ లేదు. ఇది స్వయంగా మా అన్నయ్య కూతురండి. వైదేహి అని దీని అక్కపోతే మనవాడు దీన్ని చేసుకొన్నాడు." టూకీగా చెప్పేసింది నిండు హృదయంతో నవ్వుతూ.
"నాకు తెలుసు, భారతీ. నా పిల్లలు మణిపూసలు." తృప్తిగా నిట్టూర్చి వెళ్ళిపోయాడు వేణుగోపాల్.
