Previous Page Next Page 
మరుపులో మెరుపులు పేజి 11

 

    అతని ముఖంలో కి చూచి కళ్ళు దించుకుంది . కుర్చీలోంచి కుసుమ. మంచం మీద కూర్చున్నాడు ఎదురుగా.... కళ్ళెత్తి ఆశ్చర్యంగా చూచింది అతని వంక.
    "రాత్రి ఎందుకంత పని చేశావు?"
    "........."
    "అలాంటి పని చేయడం నీకు సమంజసమే అనిపించిందా?"
    "........"
    "ఏ సమాధానం యివ్వని ఆమెను చూస్తూ "నామీద నమ్మకం పోయిందా? నేను చేసిన పనికి ఎంత సిగ్గు పడుతున్నానో తెలుసా?...కాని ఆ ఒక్క క్షణం మూలంగా నువ్వింత సాహసం చేస్తావన్న అనుమానం కూడా రాలేదు నాకు. మెలకువ వచ్చి నిన్ను చూడకపోతే నన్ను నేను జన్మలో క్షమించుకునే వాడిని కాదు.... నీకిష్టం లేదని తెలిసి అంత బలహీనతకు ఎలా లొంగి పోయానో నాకే తెలియదు. నన్ను క్షమించు.... యింక్కెప్పుడు యిలాంటి పరిస్థితి రానివ్వను.... నన్ను నమ్ము...."
    "నేను కాదు.... మీరే నన్ను క్షమించాలి" అందిమెల్లిగా నూతి లోంచి మాట్లాడుతున్నట్లు.
    "కుసుమా . నువ్వు మాత్రం నాకు ప్రమాణం చెయ్యాలి. యింకేప్పుడు యిలాంటి ఆలోచనకు కూడా తావివ్వనని.... యిప్పటికే నీతో పాటు నేనూ నేరస్థుడినయ్యాను. నువ్వు ఇదివరకు చేసిన పనులు కూడా తెలిసి కూడా నిన్ను పట్టివ్వ కుండా వుండటం తో నేనూ శిక్షార్హుడినే. అందుకు నేనేం నెరవడం లేదు. కాని యిలాటి పనులతో మనం బయటపడితే పరిస్థితులు ఎంత దారుణంగా వుండేవో తెలుసా"
    "నిజమే! నేనెంత ఆలోచించలేక పోయాను.... నా మూలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడేటట్లు మాత్రం చెయ్యను" అంది నిశ్చయంగా. ఒక్క క్షణం భయం కలిగించేటట్లు చేసింది.
    "హైదరాబాద్ వెళ్ళం గానే మనం ఒక్క గదిలో కూడా పడుకునే అవసరం లేకుండా చేస్తాను. అంత వరకు ఓపిక పట్టు. సరే!.... ముందు నాకు నీ దగ్గర నుంచి కొన్ని సమాధానాలు కావాలి." అన్నాడు ప్రభాకర్.
    "మీరడగబోయే ప్రశ్నలకు వేటికి నాకు జవాబు తెలియదు. నన్ను దయచేసి మీరేమీ అడగవద్దు. అంది మొహం పక్కకు తిప్పుకుంటూ.
    "అలాకాదు. నాముఖం వంక చూసి సమాధానం చెప్పు. మీ అమ్మ ఎక్కడుంది?"
    "నాకు ఎవ్వరూ లేరు. ఆ విషం మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను." అంది కుసుమ. అవును తనెలా చెప్తుంది. అమ్మకి యీ విషయాలన్నీ చెప్తే..... తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మకు తను చేసిన పనులన్నీ తెలిసిపోతే...... " కుసుమ ఆలోచనలు పూర్తవకుండానే ప్రభాకర్ అడ్డు తగిలాడు. "అది నిజం కాదని నాకు తెలుసు. నువ్వు నిద్దర లో ఎన్నోసార్లు కలవరించడం విన్నాను."
    ".........."
    "సరే! నిన్ను రెట్టించి నీ చేత అబద్దం చెప్పించడం నాకు యిష్టం లేదు. కాని నీకు నువ్వే సహాయం చేసుకోకపోతే, యింకేవరు చెయ్యగలరు చెప్పు.
    "నాకు ఒకళ్ళు చెయ్య గలిగేది ఏమీ లేదు. నేను చేసుకోవలసినది యిదివరకే ప్రయత్నం చేశాను."
    "కుసుమా!...."    
    నిండుగ సుళ్ళు తిరుగుతున్న కళ్ళతో అతని వంక చూచి కళ్ళు దించుకుంది. టపటపా కన్నీటి చుక్కలు బుగ్గల మీంచి రాలసాగాయి. ఆమెను ఓదార్చేందుకు మాటలు దొరకలేదు ప్రభాకర్ కు. ఒకసారి దగ్గరకు తీసుకుని ఆమెకు ధైర్యం చెప్పగలిగితే .... ఆమె భయాలు పోగొట్టేందుకు తనే పనయినా చేయడానికి సిద్దమని ఆమెను నమ్మించ గలిగితే...." బరువుగా నిట్టుర్చకుండా వుండలేక పోయాడు. "ఏం నమ్మిస్తాడు? తనమీదే నమ్మకం సడలి ప్రాణానికే ముప్పు తెచ్చుకో సిద్దపడ్డ కుసుమను తనేం నమ్మిస్తాడు?
    తనను ఎందుకింత దూరంగా వుంచాలను కుంటుంది? తన సాంగత్యంలో ఆమె భయాలన్నీ పోగొట్టగలడని ఆశించాడు.... ఆ సాంగత్యానికి భయపడితే .....తనింకేం చేయగలడు?
    అసలు ఆమె మాట వినకుండా తనెందు కింత పట్టుదలగా పెళ్ళి చేసుకున్నాడు. తను పెళ్ళి చేసుకున్నందుకు తనకేం పశ్చాత్తాపం లేదు..... కాని ముందే తెలిసి వుంటే ఆమె యిష్ట ప్రకారం చేసి వుండేవాడు.....
    నిజానికి యీ పెళ్ళే జరక్కపోతే తన దగ్గర నుండి ఏనాడో పారిపోయేది.... మళ్ళీ ఎక్కడో..... ఎవరి దగ్గరో.... ఏ పోలీసు చేతుల్లోనో పట్టుబడి, బ్రతుకంతా....." ఒక్కసారి ప్రభాకర్ శరీరమంతా గగుర్పోడిచింది.
    "ఎంత అదృష్టం. ఆరోజు తను తిరిగి రావడం, బంగారం లాంటి బ్రతుకంతా మట్టి పాలయ్యేది. పాతికేళ్ళు దాటని జీవితం పోలీసుల దాకా పొతే .......
    యింక ఆలోచించేందుకు మనస్కరించ లేదు ప్రభాకర్ కు....'తను ఆశిస్తున్నట్లు ఆమెకు ఆరోగ్యం చేకూరకపోతే..... తను....కుసుమా? రైలు పట్టాల్లా.... సమానాంతర రేఖల్లా ....జీవితమంతా.....
    చెల్లా చేడురవుతున్న ఆలోచనలకు ఆనకట్ట లేస్తూ కుసుమ చేతి మీద చెయ్యి వేసి మృదువుగా తట్టాడు.
    "ఏడవకు. అసలే వంట్లో బాగాలేదు. అయినా యిప్పుడెం జరగలేడుగా. కాసేపు పడుకుంటారా?" అన్నాడు.
    కుసుమ మనసులో పర్వతాలు పగులుతున్నాయి. గుండె ఎవరో పిసికి పట్టుకున్నట్టుగా వుంది. తనెందుకంత పని చేసింది? నిజమే, ప్రభాకర్ అన్నట్లు యివాళ తను పోలీసులకు సంజాయిషీ యివ్వాల్సివస్తే....తనని గురించి తనకు భయం లేదు. ఏనాడో పట్టుబడాల్సింది. ఏదో అదృష్టం యింతవరకూ నెట్టుకు వచ్చింది. యింక ఏమనుకుంటే మాత్రం ఏముంది? తను సుఖపడలేదు. ఒకరిని సుఖ పెట్టలేదు. తను మాత్రం ఎన్ని ప్రయత్నాలు చెయ్యలేదు? ఏం డాక్టర్లో. ఏవో గుర్తుకు తెచ్చుకోవాలంటారు. ప్రతి చిన్న సంఘటన చెప్పమంటారు. ఏం చెప్తుంది తను? తను తీసుకున్న డబ్బును గురించి? గుర్తు తెచ్చుకునేందుకు మాత్రం ఏముంటాయి. యింకా ఏవైనా మరుగుపడి పోయిన బాధలు తప్ప. తనకు వూహ తెలిసినప్పటి నుండి గుర్తు తెచ్చుకొని సంతోషించతగ్గ ఒక సంఘటయినా వుందా?..... యింక తను చేయగలిగింది ఏమీ లేదు. అయినా యీ ప్రభాకర్ తన జీవితంలోకి ఎలా ప్రవేశించాడు? అసలు తనెలా ఒప్పుకుంది. హాయిగా కొండల్లో వాగుల్లా వున్న తన జీవితానికి, అడ్డుగా నిలచాడు. అతడే అడ్డులేకపోతే తన దారిన తను పోయేది. తనే పొరపాటు చేసింది. నిన్న చేయబోయిన పని పెళ్ళికి ముందే చేస్తే ఏ గొడవా వుండేది కాదు. అయినా తను అంత ఆలోచించలేక పోయింది ఏమిటి? తనకోసం నేరస్తుడిగా అవడానికి కూడా సందేహించకుండా తన బాగు కోసం తాపత్రయ పడే వ్యక్తికీ తనిచ్చే ప్రతిఫలం ఏమిటి? ఒకవేళ తను చచ్చిపోయి వుంటే...... ఎంతో పేరు ప్రతిష్టలు వున్న ప్రభాకర్ పేరు పేపర్లో లోహెడ్ లైన్ తో.....బ్రతుకంతా తల ఎత్తుకోకుండా చేసేది." పశ్చాత్తాపంతో కుసుమ మనసు కుళ్ళి పోసాగింది.
    అయినా ఈ ప్రభాకర్ కు ఎందుకింత పట్టుదల? ఈ బలవంతపు జీవితంతో ఏం అనిభవించాలని ? తను కోరిన విధంగా తన దారిన పోనిస్తే..... తనకు హాయిగా వుండేది... తన సంగతేలా వున్నా మరెవరి తోనయినా అతను సుఖపడేవాడు.
    ప్చ్... అంతా జరిగిపోయాక విచారించటం తప్ప చేసేందుకు కేమీ లేదు. అతనికి తను యివ్వగలిగింది ఏమీ లేదు. కనీసం అతని పరువు ప్రతిష్టల కయినా భంగం లేకుండా వుండగలిగితే ? అంతే చాలు! తెగిన గాలి పటంలా వున్న తన జీవితం ప్రభాకర్ తో చిక్కుపడి పోయింది . అతను విడదేస్తే తప్ప తను విడిపోలేదు....
    ఆలోచనలు అలలా లేచి పడుతున్నాయి. హృదయంలో ఆవేదన శిరో భారంగా మారింది. రెండు చేతులతో గట్టిగా తలను పట్టుకుంది. పట్టు విడిస్తే పగిలేటట్లున్న భారాన్ని తట్టుకోలేక పోయింది. కాసేపయినా ఈ ఆలోచనలు తనని విడిచి పొతే బాగుండును." అనుకుంది. ముఖం దిండులోకి దూర్చుకుంటూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS