Previous Page Next Page 
సంపెంగ పొదలు పేజి 11


    
                                         12
    చాలా రోజుల తర్వాత ప్రసాద్ దగ్గరి నుంచి వచ్చిన ఆ ఉత్తరాన్ని మళ్ళీ ఒకసారి చదువు కుంది. దుర్గ.
    "డియర్ దుర్గా!
    నేను కొన్ని స్వంత పనుల మీద బొంబాయి రావలసి వచ్చినందుకు సంతోషిస్తున్నాను. జానకి కూడా అక్కడే ఉంది. మొన్న హరి కనబడి నీకు వివాహామయిన సంగతి చెప్పాడు. చాలా సంతోషమయింది. దొంగా! మాకెవరికి తెలియపరచ లేదు కదూ? బొంబాయి రాంగానే, నిన్నూ, శంకర్ నూ కలుస్తాను. మీ వైవాహిక జీవితం సుఖప్రదం కావాలని కోరుకుంటున్నాను. వెంటనే సమాధానం రాయి.
                        ప్రసాద్....."
    ఈ ఉత్తరం దుర్గకు ఏంతో ఆనందాన్ని కలుగ జేసింది. ప్రసాద్ జానకి అన్న -- జానకి కుటుంబం చిన్నతనం లో దుర్గా వాళ్ళ పొరుగున ఉండేవారు. జానకి దుర్గ క్లాస్ మేట్స్. ఇద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు. ప్రసాద్ చిన్నతనం లో  చాలా బలహీనంగా ఉండేవాడు. తోటి మొగ పిల్లలతో ఆడకుండా, జానకి తోనూ, దుర్గ తోనూ కలిసి అచ్చన గాయలు, వామన గుంటలూ, కళ్ళ గంతలూ ఆడేవాడు-- ఆ కారణం వల్లనే అతనితో కూడా బాగా చనువయింది దుర్గకు. తరువాత జానకి తండ్రి కి ట్రాన్స్ ఫర్ కావటం వలన వాళ్ళు విడిపోయారు. జానకి కూడా అక్కడే ఉన్నందుకు చాలా సంతోషించింది దుర్గ-- చిన్ననాటి జ్ఞాపకాలతో ఆమె మనసు పొంగిపోయింది. వెంటనే కాగితం, కలం తీసుకొని సమాధానం వ్రాసింది.
    "డియర్ ప్రసాద్,
    నీ ఉత్తరం అందింది. నీ ఉత్తరం చదువుతుంటే నిన్ను చూసినట్లే ఉంది నీ ఎడ్రస్ తెలియక, నా పెళ్లి సంగతి నీకు తెలియ పరచలేదు. జానకి, ఇక్కడుందని వ్రాసిన వాడవు జానకి ఎడ్రస్ వ్రాయలేదేం? తొందరగారా! నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాము.
                    దుర్గ...."
    ఈవార్త శంకర్ కెప్పుడు చెప్దామా అని ఎదురుచూసిన దుర్గ శంకర్ షాపు నుంచి వచ్చి టిఫిన్, కాఫీ పూర్తీ చేసి విశ్రాంతి గా కూర్చోగానే "ఇవాళ ప్రసాద్ దగ్గిర నుండి ఉత్తరం వచ్చిందండీ!' అంది ఉత్సాహంగా.
    "ప్రసాద్ ఎవరూ?" అన్నాడు శంకర్ ఆశ్చర్యంగా-----
    "నా చిన్నప్పటి స్నేహితుడు. అతని చెల్లెలూ, నేనూ చాలా స్నేహంగా ఉండేవాళ్ళం."
    శంకర్ కనుబొమలు విచిత్రంగా ముడి పడ్డాయి. తన ఉత్సాహంలో అది గమనించలేదు దుర్గ.
    "జానకి, అంటే ప్రసాద్ చెల్లెలు. తను కూడా ఇక్కడే ఉందట -- ఇక్కడికి వస్తున్నామని, రాంగానే, మన ఇంటికి వస్తామనీ వ్రాసాడు. తప్పక రమ్మని సమాధానం వ్రాసాను."
    "సమాధానం వ్రాసావా? ఎవరి నడిగి వ్రాసావూ?" గర్జించాడు శంకర్. ఆశించని ఈ పిడుగుకు దుర్గ బిత్తర పోయింది.
    "ఉత్తరానికి సమాధానం వ్రాయడానికి ఎవరి నడగాలి?" అంది వణుకుతున్న గొంతుకతో ----
    శంకర్ మండి పడ్డాడు.
    "అంటే, అడ్డూ, అదుపూ లేకుండా , అడ్డమైన వాళ్ళకీ ఉత్తరాలూ వ్రాస్తూ కూర్చుంటావన్న మాట."
    "అడ్డమైన వాళ్ళ కేం కాదు -- నా స్నేహితులకి వ్రాస్తాను."
    శంకర్ మండి పడ్డాడు.
    శంకర్ పళ్ళు పటపట నూరాడు.
    "స్నేహితులు , బహువచనం కూడాను! సిగ్గు లేకపోతె సరి! నీకు మొగ స్నేహితులు ఎంతమంది ఉన్నారేం?" చీదరింపు గా , వెటకారం గా అన్నాడు.
    ఆ చీదరింపు కు దుర్గ మనసు చివుక్కు మంది. ఆమె మనసులో భయం స్థానే రోషం ప్రవేశించింది.
    "ఏమో, లెక్క పెట్టలేదు."
    ఈ సమాధానం దుర్గ పూర్తి చెయ్యటమూ, దుర్గ చెంప చెళ్ళు మనటమూ , దుర్గ కళ్ళు చీకట్లు కమ్మి క్రింద కూల బడటమూ, అన్నీ ఏది ముందో ఏది వెనుకో తెలియకుండా జరిగిపోయాయి.
    "ఇప్పుడు లెక్క పెట్టు -- అంతేకాదు. విను ఇక ముందు నీకే ఉత్తరం వచ్చినా, నాకు చూపించాలి. నన్నడగకుండా ఎవ్వరికీ, సమాధానం వ్రాయటానికి వీలులేదు. తెలిసిందా? నేను మీ అంత చదువుకున్న వాణ్ని కాను. కానీ, నా సంసారం లో నా మాట ఎలా నిలబెట్టు కోవాలో నాకు తెలుసు."
    విసురుగా వెళ్ళిపోయాడు శంకర్. దుర్గ చెంప మండసాగింది. అంతకంటే వెయ్యి రెట్లు ఎక్కువగా మనసు మండసాగింది. తాను ఎవరిని దేవతలాగా ఆరాధిస్తుందో, ఎవరి అడుగు జాడలె తన జీవిత మార్గమని నిర్ణయించు కుందో, ఆ వ్యక్తీ తనను అవమాన పరచడానికి సంకోచించలేదు. పైపెచ్చు అట్లా అవమానించటం , తన హక్కున్నట్లు, భావిస్తున్నాడు. ఒకవేళ ఆ విధంగా ఉత్తరం వ్రాయడం ఆయనకు ఇష్టం లేకపోవచ్చు. ఆ విషయం సౌమ్యంగా చెప్ప వచ్చు కదా! ఇందులో తాను నీచంగా,  భావించడమా, లేకపో బట్టే కదా, తానుగా ఆయనకు చెప్పింది? మధ్యలో తన చదువు ప్రసక్తి ఎందుకూ? చదువుకూ దీనికి సంబంధమేమిటి? తనను బలవంత పెట్టి, అజ్నాపించీ పనులు చేయించాలనా, తన భర్త ఉద్దేశ్యం? దుర్గ కుమిలి, కుమిలీ ఏడ్చింది. అట్లా ఎంతసేపు పడి ఉందొ, వంటింట్లోంచి గట్టిగా మాటలు విన్పిస్తుంటే, కళ్ళు తుడుచుకుని గబగబా అక్కడికి వెళ్ళింది. దుర్గను చూడగానే శంకర్ క్రోధంతో మండి పడుతూ , "ఏం, మా అమ్మ మనకు వంట మనిషినుకున్నావా. దర్జాగా నువ్వు గదిలో పడుకుని అమ్మతో పచ్చడి రుబ్బిస్తున్నావా?' అన్నాడు. దుర్గ సమాధానం చెప్పేలో గానే కామేశ్వరమ్మ అందుకుంది.
    "ఎందుకురా, పసిదాని మీద అలా విరుచుకు పడ్తావ్! కలవారింట్లో   గారాబంగా పెరిగిందా? దానికి తోడు మొదటి నుంచీ చదువు లొకటి -- పాపం చదువులే చదువుతారా, పనులే చేస్తారా? నేనున్నానుగా, నేను మాత్రం ఏం చెయ్యాలి? నాకు ఓపిక లేకపొతే, అప్పుడే దాన్ని పిలుస్తాను. నాకు మొహమాటమా?"
    దుర్గ నిలబడలేక, తూలీ గోడకు జేరగిల బడింది. తనకు పని అలవాటు లేదా? రోజూ, ఇంట్లో పనులన్నీ చేస్తున్నదేవరు? అది చెయ్యమంటావా? ఇది చెయ్యమంటావా? అంటుంది కామేశ్వరమ్మ పీట మీద కూర్చుని-- సహజం గానే "వద్దులెండి" అంటుంది దుర్గ -- ఆ తర్వాత మెల్లిగా, 'ఆ ముక్కలు ఇంకాస్త సన్నగా తరుగుతే బాగుండేది. ఆ పోపు మరీ మాడిపోయింది.' లాంటి రిమార్కులు పాసు చేస్తూ. ఏదోలే ఇంకా చేస్తున్నావు. "హహహ" అని కృత్రిమంగా మురిసిపోతూ కూచుంటుంది. ఆవిడా రోజూ -- ఇప్పుడెలా మాట్లాడుతుందో? చాణక్యుడి నీతి, ఎందుకు పనికి వస్తుంది ఈవిడ నీతి ముందు?
    "నువ్వే మరీ అలుసిచ్చీ, దాన్ని నెత్తి కెక్కించు కుంటున్నావు. ఈ పెద్ద వయసులో , కృష్ణా, రామా, అంటూ కూర్చోక ఈ పనులన్నీ ఏమిటీ?" బాధగా అన్నాడు శంకర్. రుచ్చిన పచ్చడి పైకి తీస్తూ "పోనీయ్ రా! పరాయి వాళ్ళకి చేస్తున్నానా?" అంది కామేశ్వరమ్మ.
    అసలు విషయం శంకర్ కు ఎలా తెలియజెప్పాలో అర్ధం కాలేదు దుర్గకు-- అసలు చెప్పడాని కైనా అవకాశ మేది? పోనీ, అత్తగారి కైనా, తానెమని సమాధానం చెప్తుందీ? ఆవిడ తననేమైనా అంటేగా సమాధానం చెప్పడానికి? నాలుగు మాటలని కొట్టినా బాగుండును. హాయిగా పైకి ఏడవచ్చు. ఇలా లోలోపల కుమల లేక తన మనసు కృంగి పోతుంది.
    తనను కొట్టినందుకు శంకర్ బాధపడి అనునయిస్తాడేమోనని నాలుగు రోజులేదురు చూసింది దుర్గ. శంకర్ అదేమీ లేదు సరికదా, ఇంకా దుర్గదే తప్పయినట్టూ. ఆమె తనను క్షమార్పణ కోరుకోవాలన్నట్టు, ప్రవర్తించాడు శంకర్. ఒక ప్రక్కన కామేశ్వరమ్మతో వేగిపోతుంది దుర్గ. ఏదో వెలితి ఆమె హృదయాన్ని ఆవరించుకుంటోంది. ఆ శూన్యాన్ని భరించలేక, తానె శంకర్ దగ్గరకు వెళ్లి "క్షమించండి -- ఇంక మీదట మీ ఇష్టం లేకుండా ఏం చెయ్యను." అంది --  శంకర్ గర్వంగా నవ్వుకున్నాడు. ఆ నవ్వు దుర్గ గుండెలను చీలుస్తున్నా , జాపిన అతని చేతుల్లోకి వాలిపోయింది నిలబడలేని దుర్గ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS