Previous Page Next Page 
గాజు బొమ్మ పేజి 12


    నీ నయనాల వెలుగు కాంతి నాది!
    నా భావాల కదులు ఆశా దీపికల్లో ప్రాణం నీవు!
    నీవు నాకు తోడుగా నడిస్తే ఈ భావి ఎంత సుందరమో! ఆనందం జాలువారే నీ చిరునవ్వు నా హృదయాన ఇంద్ర ధనుస్సై విరిసింది. అనురాగం నిండిన నీ మనస్సే నా జీవితాన విలువైన కానుక!
    ఏమని అన్నావు, బిందూ?--
    'నీ జీవితాన వెన్నె'లనా? మరి నీదో?"
    పేజీలు  తిరుగుతున్నాయి , శ్యామ్ మరో చోట నిశితంగా చూశాడు.
                                                                              "అక్టోబర్ 10.
    డాక్టర్ రమేష్ అన్నది నిజమేనేమో? ఈ కడుపులో నొప్పి నన్ను వదలడం లేదే? ఎందుకిలా పాడయింది నా ఆరోగ్యం? బిండుకి చెప్పకూడదు. ఊరికే గాభరా పడుతుంది.
    రేపు డాక్టర్ రంగాని చూడాలి. నాకూ అనుమానంగా ఉంది.
    ఇది...ఇది....ఆ ....జబ్బు కాదు గదా!"
                                                                                  "అక్టోబర్ 11.    
    నేను డాక్టర్నే! కానీ, నాలో నేను ధైర్యం నింపుకోలేక పోతున్నాను, బిందూ! నీ సుఖాన్ని చెరిపి వేస్తానేమో?    
    నీ కలల్లో అంధకారం నిండితే? అమ్మో! వద్దు! వద్దు! కానీ, ఎలా? అమ్మకి చెప్పాను. కంట తడి పెట్టింది. లోలోన ఎంత కుమిలి పోతుందో? ఆపరేషన్ చేయించు కుంటాను అని బిండుతో ఎలా చెప్పాలి? ఎందుకని అడుగుతుంది? ఏమని చెప్పను? చెబితే! ఉహూ! తట్టుకోలేదు!"
                                                                                     "అక్టోబర్ 22.    
    బిందూ! దీపం ఎన్నాళ్ళో వెలగదు. ఆరిపోతుంది! ఎందుకలా ఎడ్చావు? నేను....చావగూడదా?...మరి ....నాకూ బ్రతకాలనే ఉంది! నీకోసం....కానీ , ఆపరేషన్ వల్ల రవ్వంతైనా లాభం లేదు. నిజం మాత్రం బయటపడింది.
    నిజమే, బిందూ! ఈ నీ వేణుకి 'కాన్సర్!' నవ్వుతూ గడిపి వేయాలి జీవితాంతం అనుకున్నాను. నీ ప్రేమతో నూరేళ్ళ జీవితాన్ని బృందావనంలా అలంకరించుదామని ఆశ పడ్డాను.
    కానీ....ఇప్పుడే....నా బ్రతుకు.....చీకటి లో తెలిసి పోతుంది! ఏం చేయను , బిందూ!"
    
                                                                                         "అక్టోబర్ 26,
    భగవాన్! బిందు దుఃఖాన్ని భరించలేను! ఈ జీవితంలో ఇంత నరకం ఉంటుందని ఏనాడూ ఊహించలేదే? క్షణం కూడా బ్రతకాలని లేదు! రాత్రి ఎలా ఏడ్చిందో! నా గుండెలు పగిలి పోతున్నాయి.
    తను వేళకి అన్నం తినడం లేదు. నవ్వు మెరిసి ఎన్నాళ్ళ యిందో ఆ ముఖంలో! తనని ఏడ్పించడానికేనా నేను బ్రతుకుతున్నది?
    బిందూ! ఆఖరి క్షణం లో వ్రాయలేనేమో? మాట కూడా రాదేమో? అందుకే మనస్సు విప్పి వ్రాస్తున్నాను.
    డాక్టర్ని గనుక చెబుతున్నాను.
    నాలుగైదు రోజుల్లో నీ ఈ వేణు మరణించక తప్పదు! ఇదే నా చివరి ఘడియలని భావిస్తూ --------నీతో సుఖాన్ని పంచుకున్నాను. కానీ, దుఃఖాన్ని పంచుకోలేక పోయాను సరిగదా నీ బ్రతుకునే శోక మయం చేసి పారిపోతున్నాను.
    మన బంధం ఓ కలగా మిగిలి పోనీ నీ ఎడద లో! ఓ పీడ కలలా! నా స్మృతులతో జీవితాన్ని మరింత భారం చేసుకోకు .
    నన్ను మరిచిపో! జీవితం ఇంకా ఎంతో ఉంది నీకు! ముందుకు సాగిపో! నాకోసం కుమిలి పోవద్దు! మరల నీ బ్రతుకు నందన వనం కావాలి; వసంతం రావాలి.
    ఇంకా ఏం ఉంది చెప్పడాని కి మాత్రం?
    సెలవు, బిందూ! ఏ జన్మలో కలుసు కుంటానని చెప్పను?"
    అర్ధరాత్రి దాటిపోయింది అప్పటికే! అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఆ వాక్యాలు చదువు తుంటే.
    ఆ పేజీలోనే క్రింద వ్రాసి ఉంది --
    "అక్టోబర్ 28. బావ ఒక లేడు నాకు!" అని.
    బిందు మాటలవి. శ్యామ్ నిట్టూర్చాడు భారంగా.
    అతని మనస్సు వికలమై పోయింది. ఊహలు వేనకు వేలుగా విరుచుకు పడుతున్నాయి.
    'అనురాగంతో, ఆనందంతో మొదలైంది కధ! కానీ, దుఃఖంతో ఆఖరైందే అతని జీవితం ? బిందూ! అయితే ....నీవు ...ఉహూ! ఆ మాట అనలేను నా బిందూని! నీకింత అన్యాయం ఎందుకు జరిగింది?! నీ హృదయం చితికిపోయింది, బిందూ , చితికి పోయింది. ఎలా తేరుకున్నావు ఆ శోకాన్నుంచి?
    ఏం చెప్పాలి నీకు? నా మనస్సు నా మీద తిరగబడిందంటే నవ్వుతావు నువ్వు! నీ అపరాధం అణుమాత్రం కూడా లేదు. నేనే నీ ఊహల్ని నా వైపుకి తిప్పుకున్నాను. నీ మనస్సున నిలిచి పోవాలని సన్నిహితంగా వచ్చాను.
    దూరంగా ఉండాలని అనుకున్నావు! ఉన్నావు! కానీ, నేను ఉండనివ్వ లేదు.
    నీ ప్రేమలో భాగం ఉండ కూడదేవరికీ! కానీ....వేణుగోపాల్ నీ జీవిత సర్వస్వం!
    ఎలా నచ్చ చెప్పాలి ఈ మనస్సుకి!'
    క్షణమైనా కనులు మూతలు పడలేదతానికి. ఎంత సేపు గది అంతా కలయ తిరిగాడు. కొంచెం సేపు పడుకున్నాడు. మరికొన్ని క్షణాలు బయటికి వెళ్లి నిలబడ్డాడు. మళ్ళీ లోనికి వెళ్ళాడు.
    డైరీ తిరగవేశాడు. మనస్సుని మరింత మందించింది . కానీ, ఆ మంటే హాయి అనిపించిందతనికి.
    తలుపు తట్టిన చప్పుడు కి ఉలిక్కిపడ్డాడు. డైరీ మూసేసి దుప్పటి కప్పుకుని పడుకున్నాడు వెంటనే.
    తెల్లవారింది .బిందు లేచిందని తెలిసిపోయింది. కిచెన్ లో పాత్రలు కడుగుతున్న చప్పుడు వినిపించుతుంది.
    "బిందుతో మాట్లాడ లేనిప్పుడు! ఆమెని చూడలేనేమో! మనసుకి దాచిన రహస్యం తెలిసిపోయిన తరవాత ఆ దృష్టి తోనే చూస్తుంది . బిందూ! నీకు పెళ్లి అయింది. మనసారా ప్రేమించావు వేణుగోపాల్ ని! అతనితో సుఖాన్ని పంచుకున్నావు! నా హృదయాన్ని అది పురుగులా తొలిచి వేస్తున్నది. నీవు ఊహించినట్లు జాలి పడటం లేదు లేదంతగా నా మనస్సు. అసూయతో వేగిపోతుంది. ఎలా మళ్ళీ నీ శ్యామ్ ని కాగలను?'
    హిమబిందు కాలేజీ కి వెళ్లి పోయిందని తెలిశాక అతడు లేచాడు. వెంటనే సూట్ కేస్ లో రెండు జతల బట్టలు సర్దుకుని గుంటూరు ప్రయాణమై వెళ్ళిపోయాడు.
    సాయంత్రం చీకట్లు అలుము కుంటున్నాయి. అప్పుడే వచ్చింది హిమబిందు.
    శ్యామ్ ఉన్నట్లు చిన్న శబ్దం కూడా రాలేదు. ఆవలి వైపుకి వెళ్లి చూసింది. తాళం వేలాడుతుంది.  
    బజారు కి వేళ్ళాడేమో అనుకుంది. రాత్రి తొమ్మిది , పది దాటింది. అతడు ఎక్కడికో వెళ్లి పోయాడని గ్రహించి నవ్వుకుంది విరక్తిగా.
    "శ్యామ్! నిజం నిప్పు వంటిది! నిన్నది భయపెట్టింది. నాకు తెలుసు -- నువ్వు నన్ను చూడలేవిక. నా ముందు నిలబడలేవు. ప్రేమకి మొదట అంతా అందంగానే కనిపిస్తుంది. ఆ భావన దూరంగా ఉన్నంత వరకే! చేరువైన కొలదీ లోపాలు విషం లా చేదుగా ఉంటాయి. ఆ చెదు మింగడం మనవంటి మామూలు మనుషులకి సాధ్యం కాదు, శ్యామ్ సాధ్యం కాదు. ఈ నాటకం ఇంతటితో ముగిసి పోనివ్వు! విషాదం నా గుండెల్లో నే ఇమిడి పోనివ్వు! నీ మనస్సు భరించ లే దీ సత్యాన్ని అని నాకు తెలిసి, నీకు సన్నిహితంగా వచ్చానేమిటి? ఈ మనస్సు నిజంగా ఇంద్రజాలం నేర్చుకుని ఉంటుంది.'
    ఆ రాత్రి ఎంతో నిరుత్సాహం ఆవరించింది. ఏదో పోగొట్టుకున్నట్లు హృదయం మాటిమాటికీ నిట్టురుస్తున్నది.
    నిరాశ నలువైపుల నుంచీ చుట్టూ ముట్టి హృదయాన్ని చిన్నాభిన్నం చేసి వేస్తున్నది.
    రెండు , మూడు, నాలుగు , అయిదు రోజు లలాగే గడిచిపోయాయి.
    మనస్సే ఓదార్చు కుంటి ఓసారి. మరికొన్ని క్షణా;లా మనస్సే ఏడుస్తుంది.
    ఆ నిశ్శబ్దం తనని మింగేసేట్టుంది. ఆ బాధ హృదయాన్ని ముక్కలు ముక్కలుగా కోసేస్తున్నది. ఒంటరితనం భూతంలా విరుచుకు పడుతున్నది ఇల్లు చేరుకోగానే.
    ఆ రోజున మనస్సు మరింత ముడుచుకు పోయింది. కాలేజీ లో ఉండలేక మధ్యాహ్నం కాగానే వచ్చింది ఇంటికి.
    కళ్ళు మూసుకుని ఏదో ఆలోచనలో తేలిపోతున్న బిందు పక్క గదిలో నుంచి వినిపించిన చప్పుడు కి లేచి కూర్చుంది.
    "వచ్చడనుకుంటాను! శ్యామ్! నీతో మాట్లాడను నేనిక ! నీ మనస్సులో పిరికితనం ఉంది!' గట్టిగా నిశ్చయించు కుంది.
    ఓ గంట సేపటికి అతడే వచ్చాడు -- "బిందూ!" అంటూ.
    తల ఎత్తి చూడబోయి ఆగిపోయిందామె.
    'ఈ మనస్సు కింత ఉద్వేగం ఎందుకో అతడ్ని చూడగానే!' కళ్ళు చూడ్డం లేదు గానీ, అతణ్ణి మనసు చూస్తూనే ఉంది.
    "బిందూ! డైరీ చదివాను! ఆ తరవాత నువ్వెలా తెరుకున్నది నాకు చెప్పాలి!" కుర్చీలో కూర్చున్నాడతడు.
    తాను ఎక్కడికి, ఎందుకు వెళ్ళినదీ చెప్పుతాడని ఊహించిందామె. కానీ, వస్తూనే తన గురించీ ప్రశ్నించే సరికి ఆమె విస్తుపోయింది. అతని ఉద్దేశ్యం అర్ధం గాలేదు.
    చెప్పానని అనలేకపోయింది.
    "చెప్పు, బిందూ! నీ వా క్షణాల్లో ఎంత దుఃఖం తో వేగిపోయావో వినాలి నేను!"
    'ఎందుకు? ఏం కలిసి వస్తుందిప్పుడు?"
    "అంత దుఃఖాన్ని నువ్వెలా భరించావో తెలుసుకోవాలి! నీ మనస్సింత సున్నితంగా ఎలా అయిందో చెప్పు!"
    "నిజమే! మీరన్నట్టు నా మనస్సు ఎంతో కోమలంగా తయారైంది. దూరాన ఉన్న నేను బావ గురించి తెలిసిన తరవాత ఏదో ఆకర్శాన తో ఊగిపోయాను. బావ వాళ్ళ నాన్న కూడా ఫారిన్ రిటర్న్ డాక్టరే! అందుకే మొదటి నుంచీ వాళ్ళ కుటుంబం మద్రాసు లోనే ఉండిపోయింది.
    పెళ్లి అయింది. కానీ, మనస్సుల్లో ఇంకా ఆ వివాహం తాలుకూ ఊహలు కొత్తదనం కోల్పోలేదు. అంతలోనే బావ కాన్సర్ తో నాకు దుఃఖాన్ని మిగిల్చి చనిపోయాడు. అది నాకు పెద్ద షాక్ అయింది! ఎన్నాళ్ళో హాస్పిటల్లోనే ఉండిపోయాను."
    "మెంటల్ షాక్ అయి ఉంటుంది!" అన్నాడతడు.
    "ఆ అంతే! ఒంటరిగా ఉన్నానో బావ గుర్తుకు వచ్చేవాడు. ఆఖరి క్షణాల్లో తన చూపులు నన్ను నిలువెల్లా వణికించేవి మళ్ళీ జ్ఞప్తి లో కదిలి, పెద్దగా ఏడ్చేదాన్ని! అరిచేదాన్ని. బావ ఉన్నట్టే మాట్లాడే దాన్ని! రాను రాను కొన్ని నెలలకి ఆ షాక్ కొంచెం తగ్గింది. కానీ ,డాక్టర్లు నన్ను ఒంటరిగా ఉండవద్దన్నారు. ఎప్పుడూ నలుగురితో ఉంటూ హడావిడిగా ఉంటె, ఆ జ్ఞాపకాలు నన్నింత బాధ పెట్టవని చెప్పారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS