Previous Page Next Page 
గాజు బొమ్మ పేజి 11


    అయిదో నాడు మధ్యాహ్నం వాకిట్లో రిక్షా ఆగింది .
    హిమబిందు దిగింది నవ్వుతూ.
    లోనికి వస్తూన్న అతనితో అన్నది నవ్వుతూనే :
    "మీకు కోపం వచ్చిందను కుంటాను! ఎందుకో వెళ్లాలని పించిందా మధ్యాహ్నం. వెళ్ళిపోయాను."
    అతడు మాట్లాడకుండా ఉండిపోయాడు కావాలనే.
    "కోపం ఎప్పుడో కరిగిపోయింది, బిందూ! కానీ, నీవు లేని ఈ ఇంట్లో క్షణం ఒక యుగంలా గడిచింది' అనాలను కున్నాడు. కానీ, ఇంకా ఆమె ఏం చెబుతుందో వినాలని ఆగిపోయాడలా.
    "మాట్లాడరేమిటి? ఈ బిందుని మరిచి పోయారేమో లెండి!"
    "ఎలా మరిచి పోతాను, బిందూ! నీకు నేను దూరంగా ఉన్నానేమో! కానీ, నువ్వు నాకు మరింత చేరువయ్యావు , తెలుసా? నవ్వకు మరి? శ్రీరామ చంద్రుడిలా అన్నాడు :--"
    "ప్రాపాదే సాపది పధిచ సాస్పష్ట తప్పా పురస్సా
    పర్యంకే సాదిష దిశిచ సాతద్వియోగా తురస్య,'    
    హంహో! చేతః ప్రకృతి రసరా నాస్తితే కాసి సాసా
    సాసాసాసా జగతి సకలే కోయ మద్వైత భావః'"
    "అంటే అర్ధం?"
    "సీత నాచెంత లేదు, కానీ, మేడల పైన సీతయే! వెనక, ముందు, పాన్పు పైన , ప్రతి దిక్కున సీత కనిపించుతుంది. జగమంతటా సీతే! ఆ అద్వైతాన్ని ఎలా చెప్పను అన్నాట్ట. నా మనస్సూ ఇలాగే ఊగి పోతుంది."
    హిమబిందు నిలువెల్లా పులకించి పోయిందా భావం వినగానే. కనులలో తీయని అనురాగం తళుక్కు మంది. పరిహాసానికి తాను ప్రశ్నిస్తే మనస్సునే మధురాతి మధురంగా వినిపించాడతడు . సిగ్గుతో నిండిపోయిందామె హృదయం.
    'శ్యామ్! అయిష్టంగానే నేను ఒక్క అడుగు దూరంగా జరుగుతున్నాను. కానీ, నువ్వు వేయి అడుగుల్ని మించి చేరువై పోతున్నావు! ఎలా పారిపోగల నింక! ఇంత గాడమైనది నీ అనురాగం! అబ్బ! నా మనస్సు పరవశతతో తూలిపోతుంది, శ్యామ్! ఎందుకలా చూస్తున్నావు నా కళ్ళలో కంత సూటిగా? ఇంకా ఏం ఉంది నా దగ్గర? ! మనస్సు నిండుగా నీ ఊహలేగా! నీ స్నేహం మధురమైనది. విలువైనది. దాన్ని కాదని తిరస్కరించలే నిక. ఎంత అందంగా చెప్పావు నీ మనసు నాదని! నేను నీ మనస్సులో ఉన్నానని!'
    పెల్లుబుకుతున్న భావోద్వేగాన్ని కొంతవరకు అణుచుకుని అన్నది:
    "ఊ! ఇంకా చెప్పండి! ఎంతో బాగుంది భావం! నిజంగా సీత అదృష్ట వంతురాలు!"
    ఆ కంఠనా వినదించిన పులకింత అతనికి స్పష్టంగా వినిపించింది. ఆ విశాల నయనాలలో మెరుస్తున్న కాంతులతని హృదయాన్ని పరవశింప జేశాయి.
    "అదంతా నాటకం! లోలోన ఇంతకూ రెట్టింపు అనురాగం ఉందోయ్, శ్యామ్!' అన్నట్లుందా కంఠం.
    "మీ ఆడవాళ్ళ మనస్సులు నిజంగా వేయి దీపాలతో వెదికినా అసలు రూపాన్ని కనిపించకుండా దాచుకుంటాయి! మీ హృదయం కంచుకోట! మాదేమో మంచు కొండ!"
    "కానివ్వండి! ఇంకా ఏమేమి దీవించుతారో! వినాలని కుతూహలంగా ఉంది."
    "నేనేం చెప్పను? నీకింత నిగ్రహం ఉన్నప్పుడు నేనెందుకు వాగాలి?' కోపం నటించాడు.
    "పోనివ్వండి. నేనే చేబుతానిక! ముందు కాస్త వంట ప్రయత్నం చేస్తాను. ఆత్మారాముడు అరుస్తున్నాడు" అంటూ కిచెన్ లోకి వెళ్ళిందామె.
    ఆ రాత్రి పడుకోబోయే ముందు తలుపు తట్టింది.
    "ఈ హిమబిందు మీకు సర్వస్వం అంటున్నారు . కానీ, నేనందుకు తగనేమో అని నా భయం. మీరూ అలాగే అంటారిది చదివిన తరవాత! నా సుఖానికీ, దుఃఖానికి ఇదే జీవం" అంటూ నల్లని కవరున్న పుస్తకం అతని చేతి కిచ్చి వెంటనే తలుపులు మూసి వెళ్ళిపోయింది.
    ఆ పుస్తకాన్నే అతడెన్నో సార్లు హిమబిందు చేతిలో చూశాడు. కుతూహలంతో తెరిచాడు. డైరీ అది. మొదటి పేజీలో అందంగా ఉన్నాయి అక్షరాలు. పేరు మరింత అందంగా వ్రాసి ఉంది.
    "వేణుగోపాల్!" 'ఎవరితను? ఇతనితో బిందు కేవిధమైన అనుబంధం ఉందొ? సుఖానికి, దుఃఖానికి జీవం అన్నది! అంత ప్రాణ ప్రధమా ఈ డైరీ ఆమెకి! ఆసక్తితో డైరీ పేజీలు  తిప్పసాగాడు.
    "మద్రాసు ,                 జనవరి 15,
    హిమబిందు! అందమైన పేరు! అమృతం కురిపించుతుంది ఆ ఎర్రని పెదవుల మీద మెరిసిన తెల్లని నవ్వు నా కలల్లో!
    బిందూ! మనం ఇంత సన్నిహితులమా? ఈ 'వేణు' నీవు 'బావ!' ఎంత ఆనందం విరుస్తుందో నా ఊహల్లో ఈ మాట తలుచు కుంటుంటే! అమ్మ ఎప్పుడో అన్నది -- 'మామయ్య గారి హిమబిందు పెద్దదై ఉంటుంది! నువ్వు అమెరికా నుంచి తిరిగి వచ్చేటప్పటికి పెళ్లి కూతుర్ని చేసి ఉంచుతాను. చక్కని బొమ్మ! ఈడూ జోడూ బాగుంటుంది!' అని.
    కానీ, ఆ హడావిడి నన్నావైపుకి ఆసక్తిని చూపించకుండా ఆపివేసింది.
    తిరిగి వచ్చాను! బిందూ! ఎలా వర్ణించను నా మనస్సున పొంగిన ఆనందాన్ని!
    మెట్ల మీద నిలబడి ఉన్నావు నవ్వుతూ! అమ్మ అన్నది -- 'హిమబిందు' అని. కొన్ని క్షణాలు నీ అందాన్నే చూస్తూ పరవశించిన మనస్సు చుట్టరికాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంది తరవాత.
    ఊహ వర్ణార్ణనాల పై విరిసిన అందాల సుమబాలవి నీవు! మధురానురాగ విపంచివి! మనసున మధురోహలు జలజల మని కురిశాయి. నీ చేయి నా చేతిలో ఇమిడి పోయిన క్షణంలో.
    ఆ రాత్రి "హిమ స్నాత మాలతీ లత' లా అలంకరించు కున్నావు!
    ఇన్నాళ్ళూ నాకింత దూరాన ఎందుకున్నావు, బిందూ? అమ్మతో చెప్పానుగా నిన్ను వెళ్ళనీయవద్దని!
    నిడురతో తూలిపోతున్నాను! నా నిదురలో నీవు తీయని కలవై జోల పాడగూడదూ!"
                                                                          "జనవరి 16.
    అమ్మకి ఆనందంగా ఉంది లోలోన కొడుకు ఫారిన్ నుండి డాక్టర్ అయి వచ్చాడని! ఎంతమంది అతిధుల్ని పిలిచింది!!
    ఎందుకంత సిగ్గు మందారమై విరిసింది నీ కనుల నిండుగా! అమ్మ మాటకే గదూ! నిజమే, బిందూ! ఈ వేణుగోపాల్ కి ఆరాధ్య దేవతవి నీవు! ఈ బంధం ఎన్ని జన్మలదో!
    పార్టీలో అందరి కళ్ళూ బిందూ పైనే! నీ పక్కనే కూర్చోగానే ఏమనుకున్నావు బిందూ?
    ఎందుకో అంతమంది లో 'నీవు నా ప్రియ సఖివి' అని చెప్పుకోవాలని పించింది . అందుకు నీ వేమనుకున్నావో మరి?
    బిందూ! కొన్నాళ్ళే ఈ ఎడబాటు! ఆపైన మనం ఆజన్మాంతం కలిసే ఉందాం! అమ్మ నీకు చెప్పింది గదూ మన పెళ్లి అని!
    బిందూ! నా మనస్సింత తూలిపోతున్నది నీ ఊహలతో ! నీ హృదయానా ఈ సందడింత మధురంగా ఉందా? ఇదంతా నా ఊహ జగత్తు కాదు గదా? చుట్టరికం ఒక్కటి చాలదు మనసుల్ని ముడి వేయడానికి. తీయని అనురాగం ఉండాలి!
    రేపు బిందు ని అడగాలి! నాకై తన మనస్సున ఏ ఊహలు విరుస్తున్నాయో! ఏమంటుందో? సిగ్గుతో పెదవులు కదల్చదేమో!"
                                                                                  "జనవరి 17.    
    జాబ్ దొరికింది ! ఆ హడావిడిలో హిమబిందు ని కలుసుకోలేక పోయాను ఒంటరిగా ఉన్నప్పుడు!
    రేపు సాయంత్రం అమ్మ బజారుకు వెళతానన్నది! అప్పుడు అడిగితె! బిందూ! సిగ్గుతో మనస్సుని దాచుకోకు. ఉత్త వివాహ బంధం జీవితాల్లో ఆనందాన్ని నింపదు. హాయిని పంచదు.
    మళ్ళీ వెళ్లి పోతుంది! ఆలస్యం చేయగూడదు. ఒకవేళ తనకి నాపైన ఏ భావమూ లేదంటే! అసలు ఇష్టమే లేడనదు గదా!
    ముహూర్తాలంటుంది అమ్మ! ముందు హిమబిందు మనస్సు తెలుసుకోకపోతే ఎలా?"
                                                                                   "జనవరి 18,
    సంధ్యా సుందరి అందమైన రంగుల్ని అద్దుతుంది అవనికీ, ఆకసానికీ! హిమబిందు పైన నిలబడి ఉంది!
    ఆసంజే వన్నె లో అందాల బాలలా ఒయ్యారంగా గోడ నానుకున్నది! ఎలా చూడాలి ఆమె హృదయం లో ! వంగి?
    నవ్వింది నన్ను చూడగానే! ఆ నవ్వు నాలో ఉత్సాహాన్ని మెల్కొల్పింది. ఆశల్ని దీవించింది. ఊహల్ని పులకింప జేసింది.
    అడిగాను -- 'బిందూ! నీ మనస్సు ఏమంటుంది నా గురించి ' అని. సిగ్గుతో తలెత్తదే! దగ్గరగా వెళ్ళాను. క్షణం లో మెట్ల వైపుకి పరుగెత్తింది.

                        
    అందుకున్నాను చేతిని! ఆపి మళ్ళీ అడిగాను. సిగ్గుతో వాలిపోయాయి కనులు. ఆ హృదయాన నాకోసం అనురాగం ఉందని తెలిసిపోయింది. ఆ గుండె అందుకే అంతగా స్పందించాయి. నా కౌగిలి ఆమెలో పులకింతని రేపింది. కళ్ళలో ఎంత పరవశం!
    'బావా!' ఎంత తీయగా ఉంది తన అనురాగం! ఆ పిలుపు చాలు తన మనసు నాదని చెప్పడానికి.
    కళ్ళతోనే అంగీకారం తెలిపి సిగ్గుతో క్రిందికి పారిపోయింది. ఈ సంధ్య నా జీవితాన మరువరాని మధుర స్వప్నం! ఆ మధుర స్వప్నం నిజమై మైమరపించు తుంది."
    
                                                                                       "జనవరి 19.
    అమ్మతో చెప్పాను-- బిందు ని అడిగినట్లు! పెద్దగా నవ్వుతూ అన్నది: 'ఎంత సాహసం చేశావురా! నువ్వు బిందుని ఇప్పుడు చూశావేమో గాని, నిన్నది ప్రతి క్షణం చూస్తూనే ఉండి ఉంటుంది , వేణూ! నువ్వు నాకు పంపిన  ప్రతి ఫోటో బిందుకే పంపించాను. నువ్వు అమెరికా నుంచి వచ్చేముందు వ్రాయమన్నది. రాస్తూ రమ్మని వ్రాశాను. వెంటనే వచ్చింది . ముందుగా బిందె నిన్ను ఇష్టపడింది, బాబూ!'
    ఆ మాటలు నా మనస్సున తీయని ఊహల్ని పులకింప జేశాయి. బిందూ! తేర వెనక ఉండి నాటకం ఆడుతున్నావా? మరి నాకో లెటరు వ్రాయలేక పోయావా?
    మరింత సుందరంగా కనుపించుతుంది ఆమె హృదయం అది విన్న క్షణం నుంచి.
    కళ్ళతోనే చెబుతుంది ఎన్ని జావాబులైనా ! మాటల్లో ముత్యాలు రాలతాయని భయమేమో!"
    ప్రతి పేజీలో హిమబిందు గురించే! శ్యామ్ మనస్సున నిరుత్సాహం జరజరా పాకిపోతున్నది. ఆప్రయత్నం గానే తిప్పుతున్నాడు పేజీల్ని. ఆ పేజీ దృష్టి నిలిచి పోయింది.

                                                                                       "మార్చి 15.
    హిమబిందూ! ఈ వెణుగోపాల్ ఈ క్షణం నుంచి నీ ప్రియ సఖుడు!
    వేద మంత్రాలు వల్లించుతూ నీ మెడలో మంగళ సూత్రం కట్టాను. ఆ క్షణం విలువైనది. మధుర మైనది. నీలోని తీయని ఊహల్ని ఈ నీ నేస్తానికి వినిపించుతావు గదూ?
    నీ సుఖం నాది! నీ దుఃఖానా నాకు భాగం కావాలి! నా సర్వస్వం నీదే!
    మన అనురాగం ఆర్ణవమై ఆనందపు టంచుల్ని చుంబించాలి! బిందూ! నీతో ఏడడుగులు నడిచాను! నా హృదయాన రాణి వై నిలిచిపోవాలి నీవు!"

                                                                                      "మార్చి 16.
    బిందూ! నా మనస్సు పురి విప్పిన మయూర మై ఆడింది ఈ రేయి! ఎంత తీయనిది నీ అనురాగం!
    సుగంధం లా నా మనస్సుని చుట్టుకు పోయావు! లతలా పెనవేసుకున్న నీ కౌగిలి లో నా ఊహలన్నీ పరవశత తో ఝల్లుమన్నాయి. జలజలా పొంగింది అనురాగమృతం!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS