కృష్ణ నవ్వుతూ, "నీవు చాలా బాగా పాఠాలు చెబుతావక్కా! నేను నీ స్టూడెంట్ నయి ఉంటే బాగుండేది!" అన్నాడు.
"ధన్యుడివి! నా తిట్లు తప్పించుకొన్నావు!" అంది సీరియస్ గా పారిజాతం. పిల్లలూం టీచర్లూ కృష్ణ వైపు చూచి నవ్వారు. ఒక్క అనంతలక్ష్మి మాత్రమే దిగులు ముఖంతో ఉంది.
ఫాక్టరీ మానేజర్ పిల్లలకు తలా ఒక చిన్న చెరుకు ముక్క ఇప్పించాడు. పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతూ తమ టూరిస్ట్ బస్సు ఎక్కారు.
ఒంటిగంట కంతా వారు తిరిగి బంగళా చేరారు, పోర్టికోలో రామనాథం కారు ఆగి ఉంది.
పారిజాతం- "మీ సీమదొర అన్నయ్య వచ్చిన ట్లుందే!" అని అంది నవ్వుతూ సత్యతో.
* * *
బస్సు ఆగిన చప్పుడు, పిల్లలంతా గలగల మాట్లాడుతూ దిగుతున్న చప్పుడు విని రామనాథం బయటి కొచ్చాడు. చేతిలో సిగరెట్.
"హలో, సత్యా! హలో, మిస్ పారిజాతం! గుడ్ మార్నింగ్!" అన్నాడు.
పారిజాతం, సత్యవతి-ఇద్దరూ జరీ అంచు నేత చీరలు ఒకే రంగువి కట్టారు. సత్యవతి జడ ఊరికే అల్లి వదిలేసింది. పారిజాతం సిగ చుట్టింది. కాటుక పెట్టిన పెద్ద కండ్లు. సభ్య వస్త్ర ధారణకు రూపకల్పనగా ఉంది పారిజాతం! ఆమె కే విధానా తీసిపోవడం లేదు సత్యవతి.
అందగత్తె అయిన పారిజాతాన్ని చూచేటప్పటికి రామనాథానికి కళ్ళు చెదిరినాయి!
ఇంతలో లోపల నుండి లలిత కూడా బయటికి వచ్చింది. పలచటి సిల్కు చీర. పలచని చేతులు లేని జాకెట్. లోపల బ్రేసియర్ స్పష్టంగా కనుపించుతున్నది. గోపురం లాగా ఎత్తైన సిగ చుట్టి, పూలు సిగనుండి ఒక పక్కగా జారవిడిచింది. పెదవులకు లిప్ స్టిక్. కనుబొమలు పెన్సిల్ దిద్దినట్లు స్పష్టంగా కనుపించుతున్నది. కంటి కొసలలో పొడుగ్గా గీతలు గీచింది. అధునాతన యువతి అలంకారమంతా ఆమెలో ద్యోతకమయింది.
రామనాథం లలితవంకా, పారిజాతం వంకా పరీక్షగా చూసి, వచ్చే నిట్టూర్పు వణుచుకొన్నాడు. అది లలిత కంట పడకపోలేదు. సత్య, పారిజాతం కూడా దీన్ని గమనించారు. పారిజాతం నవ్వుకొని, "ఏమండీ, వదినెగారూ! మీ భోజనా లయిపోయాయా?" అని అడిగింది.
"వదినెగారూ!" అన్న పిలుపుకి లలిత ముఖం విప్పారితే, రామనాథం ముఖం నల్లగా మాడింది!
ఈ సందడిలో రామనాథం అనంతలక్ష్మి ని చూచి కండ్లెగరేయడం, అనంతలక్ష్మి తల వంచుకొని మేడ మీదికి పోవడం ఎవరూ గమనించలేదు. లలిత చూపంతా పారిజాతం మీదే ఉంది కాబట్టి, ఆవిడ అసలే గమనించలేదు.
"తినలేదండీ! సతీదేవికి ఏమీ బాగాలేదనీ, ఆమెను నర్సింగ్ హోమ్ లో చేర్పించాలనీ, మా ఇద్దరినీ మీకు ఆతిథ్యమివ్వమనీ భద్రీ ప్రసాద్ గారు ఫోన్ చేశారు. మీ రెంత త్వరగా కాళ్ళు కడుగుకొని వస్తే, అంత తొందరగా భోజనం చేద్దాము. నాకు చాలా ఆకలిగా ఉంది!" అంది లలిత పారిజాతంతో.
తరవాత సత్యవతితో - "ఏం, సత్యవతీ! నువ్వో రెండు రోజులు ఉండి పోరాదూ? పనిమీద వచ్చావు కాని, లేకపోతే అన్నావదినెలు నీ కంటికి ఆనుతారా! ఉద్యోగస్థురాలినిగా! అవునులే! మొత్తానికి ఆడబిడ్డ అనిపించుకున్నావు! అని అంది.
'ఉద్యోగస్థురాలివి', 'అన్నావదినెలు నీ కంటికి ఆనుతారా!' అన్న మాటలకు సత్య మనసు బాధ పడింది. నలుగురి ముందూ తన కేదో అహంకార మున్నట్లు, అన్నావదినె లంటే సరిగా పడదన్నట్లు దెప్పుడూ మాట్లాడుతున్నది! తప్పు తన మీదికి తోస్తున్నది.
"ఏమండీ, లలితక్కగారూ! అసలు మీ కంటికి మే మంతా ప్రస్తుతం ఆనుతున్నామా?" అన్న కృష్ణ కంఠం వినిపించి సత్య వెనుదిరిగి చూసింది. తన వెనకగా కొద్ది దూరంలో ఉన్న కుర్చీలో కూర్చొని ఉన్నాడు కృష్ణ!
లలిత నవ్వుతూ, "నీవు ఆనకపోవట మేమిటయ్యా! పెద్ద ఆఫీసర్ వి. రేపు లక్షరూపాయల కట్నమిచ్చి మరీ ఎగరేసుకుపోతుంది ఏ పిల్లో! నాకే ఓ కూతురుంటే, నిన్ను పోగొట్టుకొనేదాన్నా?" అని అంది.
"మీకే ఒక కూతురుంటే, ఆవిడ మీ లాగే గడుసయ్యేది! నే నప్పుడు సంసారం త్యజించి సన్యాసివై దేశాంతరం పోయేవాడివి!" అని అంటూ, "లలితక్కా! నేను కట్నం తీసుకోను. నేను వివాహం చేసుకోబోయే అమ్మాయి వ్యక్తిత్వం కలదిగా ఉండాలి. అదే నాకు కట్నం. డబ్బు కట్నమిచ్చే పిల్లకు భర్త లోకువౌతాడు. కట్నమిచ్చి కొనుక్కున్నాననే అహం అంతరాంతరాలలో మెదులుతుంది! నాకు సంపద కేం తక్కువని నేను కట్నం తీసుకోవాలి! లేదు! నేను కట్నం తీసుకొనే అధముడివి కాలేను!" అని అన్నాడు.
'అహం మెదులుతుంది' అన్న మాట లలితకు సూటిగా తగిలింది. ఒక క్షణం ఊరుకొని, "బాబూ! నీవు కట్నం తీసుకొంటే నా కేమిటి, తీసుకోకపోతే నాకేమిటి! త్వరగా అన్నానికి రా! ఆకలితో ప్రాణం పోతున్నది!' అని అంది.
పారిజాతం ఊరుకోక- "కృష్ణా! ఆ మాటే నిజమైతే, నిజం గా నీ లాంటి యువకుడిని తమ్ముడిగా పొందటం నా అదృష్టమనే భావిస్తాను. కట్నాలు తీసుకొనేవారు నా దృష్టిలో నీచులు! అధములు! పశువుల కన్నా హీనులు! ఒక్క మాటలో చెప్పాలంటే, కట్నం ఇచ్చేవారూ, పుచ్చుకొనేవారూకూడా సిగ్గులేని వెధవలే! వారంతా జీవస్మృతుల కింద లెక్క! నీ లాంటి యువకులు నడుము కట్టి ఈ కట్నపిశాచిని మళ్ళీ తలఎత్తకుండా తరిమి, తరిమి చంపితేనే ఈ దేశం లోని కన్యల స్థితి బాగుపడుతుంది! వివాహం ఒక సమస్యగా కాక, వేడుకగా మారుతుంది!" అని ఉద్రేకంగా అంది.
లలిత- "సరిసరి! నా కాకలౌతున్నదంటే ఒకరూ వినిపించుకోరేం! త్వరగా రండి, బాబూ!" అని విసుగు కొన్నది.
సత్య పైకి పోబోతూ ఆగి, "వదినా! సతీదేవిగారి కెట్లా ఉంది?" అని అడిగింది, ఇంతవరకూ ఆ సంగతి విచారించనందుకు సిగ్గుపడి.
"చెప్పానుగా,ఆమెను నర్సింగ్ హోమ్ లో చేర్పించడానికి తీసుకెళ్ళారని! ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని డాక్టర్ గా రన్నారట. బహుశా సాయంత్రం దాకా ఆమే, భద్రీ ప్రసాద్ గారూ రాకపోవచ్చు" అని జవాబిచ్సింది.
విన్నవారంతా "అయ్యో!" అని బాధపడ్డారు. హెడ్ మిస్ట్రెస్-"పాపం! ఎంతో మంచివారు! కొత్త వాళ్ళమైనా మమ్ములను చుట్టాలలా? చూసుకొంటున్నారు! పొద్దున ఇట్లా ఉందని నాకు విమర్శగా తెలియలేదు సుమండీ!" అని నొచ్చుకొన్నది.
పిల్లలంతా నౌకరు వెంట హోటలుకు పోయారు. మిగతావారంతా మరో పది నిమిషాలకి కిందికి దిగి వచ్చి భోజనానికి ఉపక్రమించారు.
రామనాథం పారిజాతం పక్కన సీటు సంపాదించడానికి చూశాడు కాని, పారిజాతానికి అటు సత్యవతీ, ఇటు కృష్ణా కూర్చోవడంతో నిరాశతో ఇంకో చోటు చూసుకొన్నాడు.
ఆ ఇంటి యజమాని కొడుకుకు పారిజాతం అంత సన్నిహితురాలు కావటం హెడ్ మిస్ట్రెస్ కి చాలా అక్కసుగా ఉంది! ఏవో పోలికలు ఉన్నాయని నోరు జారడం పొరపాటయింది! అప్పటినుంచీ ప్రతి వారూ పోలికలు ఉన్నాయని ఆవిడను అందలం ఎక్కిస్తున్నారు.
పాపం, ఆమె పైకి పొక్కలేక, లోనికి మింగలేక సతమతమౌతున్నది.
భోజనం మధ్యలో లలిత-"సత్యా! మీ రంతా మా లేడీస్ క్లబ్ కు ఓ సారి రాకూడదూ! చాలా బాగా ఉంటుంది. బహుశా మీ రెప్పుడూ చూసి ఉండరేమో!" అని అంది.
సత్య జవాబిచ్చే లోపునే పారిజాతం అందుకొని, "వదినెగారూ! మీ క్లబ్బులో మీ రంతా ఏం చేస్తారు? కార్యక్రమాలేమిటి?"అని అడిగింది.
లలిత నవ్వి, "నేను చెప్పలేదూ, మీ రెప్పుడూ లేడీస్ క్లబ్ చూసి ఉండరనీ! కార్యక్రమా లేముంటాయి? ప్రతి రోజూ తీరుబాటయినప్పుడంతా సింగ్ సాంగ్, బాడ్మింటన్, టెన్నిస్ మొదలయినవి ఆడుతాము. కార్డ్స్ కూడా ఆడుతాము. నెల కో మారు డిన్నర్ అరేంజ్ చేసుకొంటాము. అందులో ప్రతి మెంబరూ ఏదో ఒక పిండివంట తేవాలి. చాలా సరదాగా ఉంటుంది లెండి!" అని వివరించింది.
పారిజాతం సత్యవైపు చూసింది. సత్య 'ఊరుకో' అన్నట్లు సైగ చేసింది. ఆ సైగను కృష్ణ కూడా గమనించి, చిరునవ్వు నవ్వుకొన్నాడు. కాని పారిజాతం ఊరుకోలేదు.
"వదినెగారూ! అన్యధా భావించకుండా ఉంటే, నా దో మాట. చాలా మంది లేడీస్ క్లబ్బులను ఎగతాళి చేస్తారు. చాలా సినిమాల్లోకూడా వాటిని గురించి చాలా హీనంగా చిత్రించడం చూశాను. ఈ దినం మీ మాటలు వింటుంటే, అట్లా ఎగతాళి చెయ్యటం సహజమే ననిపిస్తున్నది! మగవాళ్ళ క్లబ్బులకూ, మీ క్లబ్బులకూ భేదమేమిటి? బహుశా మీరు ఎనిమిది గంటలకే ఇల్లు చేరుకోవచ్చు. మగవాళ్ళు తెల్లవార్లూ రాకపోవచ్చు! అంతే తేడా. కాని, క్లబ్బుల మూలంగా మీరు సాధించిన దేమిటి?" అని అడిగింది.
లలితకు కోపం వచ్చిందన్న సంగతి స్పష్టంగా తేలిపోయింది. "అసలు క్లబ్బంటే ఏమిటో తెలిసి ఏడుస్తేగా, మిగతావన్నీ తెలియటానికి!" అని గట్టి గానే అంది.
అయితే పరిజాతానికి కోపం రాలేదు. నవ్వు వచ్చింది.
"అలా అనకండి, వదినెగారూ! మాకూ ఒక క్లబ్ ఉంది. దాని పేరు కస్తూరీ మహిళా మండలి. క్లబ్బంటే మా కున్నది ఒక చిన్న రూము. అందులో ప్రతి రోజూ కలుసుకోము. ఏదైనా ప్రత్యేక కార్యక్రమముంటే తప్పక అంతా కలుస్తాము. ఆ క్లబ్బుకు నేను సెక్రటరీని. మీ సత్య జాయింట్ సెక్రటరీ. మరి మా కార్యక్రమాలు వినండి. ఒక కుట్టు టీచర్ ని పెట్టాము. ఆమె వారానికి మూడు మార్లు నేర్చుకోదలచిన వారికి కుట్లు నేర్పుతుంది. నేర్చుకొనేవా రామెకు నెలకు ఎనిమిది రూపాయ లిస్తారు. తరవాత ఒక నాట్య మండలిని పెట్టాము. దాని పేరు 'కలహంసి'. పట్నం నుంచి ఒక డాన్స్ మాస్టరుగారు శని, ఆదివారాలు పిల్లలకు నృత్యం నేర్పిస్తారు. ఇంకో కార్యక్రమ మేమిటంటే, మహిళామండలిలోని ప్రతి మెంబర్ ఇంటా ఒక 'సర్వోదయపాత్ర' ఉంటుంది. అందులో ప్రతి దినం వారు బియ్యమో, జొన్నలో-ఏదో వారి శక్తి కొద్దీ వేస్తారు. జాతీయోత్సవ సమయాలలో మేము వాటితో బీదలకు అన్నదానం చేస్తాము. కొన్నిమార్లు వస్త్రదానంకూడా చేస్తాము. పని తప్ప వేరే కార్యక్రమం లేదనుకొనేరు! మేముకూడా తమాషాగా ఆటలపోటీలు పెట్టుకొంటాము. ముగ్గులపోటీ, వాసన చూసి వస్తువేదో చెప్పడం లాంటివి పెట్టుకొంటాము. చాలా తమాషాగా ఉంటాయి లెండి అవి! ఈ మధ్యనే పంచాయతీ సమితి ప్రోత్సాహంమీద స్వంత భవన నిర్మాణానికి కృషి చేస్తున్నాము. ఏదైనా పనికివచ్చే కార్యక్రమమంటూ ఉంటే లాభంకాని, కాస్సేపు ఉబుసుపోకకు ఆడుకొని వస్తే లాభమేమిటి?" అని సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చింది.
లలిత ఏమీ పలకకుండా తల వంచుకొని, మూతి మూడు వంకరలు తిప్పింది. అది గమనించిన సత్య నవ్వింది. సత్య నవ్వుకు తలఎత్తి చూసిన అలితకు ఒళ్ళు మండింది. "ఆఁ! అవన్నీ పల్లెటూరి కథలు! ఏదో లైఫ్ కోసం క్లబ్బుకు వెడతాం. ఈ చాకిరీలన్నీ ఎవరు దేకుతారు!" అని అంది ఈసడింపుగా.
సత్య ఏదో చెప్పబోతుండగా, పారిజాతం-"ఊరుకో సత్యా! పల్లెటూరి గబ్బిడాయిని! నీకేం తెలుస్తుంది!" అని అంది.
వేడి పడబోతున్న వాతావరణాన్ని ఊహించి కృష్ణ, "మీ క్లబ్బు సంగతుల కేమిటి గాని, తుంగభద్ర డామ్ సైట్ దగ్గర ఫోటోలు తీసుకోవటానికి ఎంతో బాగుంటుంది! మీరు కెమెరా తెచ్చారా? లేక నేను తేనా?" అని అడిగాడు.
"అరెరే! సత్యా! అన్నీ తెచ్చి కెమేరా మరిచి పోయామే! ఛీ! నిన్న హంపీ శిథిలాల్లో మన పిల్లల్ని ఫోటోలు తీస్తే ఎంత బాగుండేది! ఎంత పొరబాటయింది!" అని నొచ్చుకొంది పారిజాతం. సందు చిక్కినదే చాలనుకొని హెడ్ మిస్ట్రెస్-"అవునమ్మా! మీ రసలు ఏదీ సరిగ్గా చెయ్యరు. చేసే ప్రతి పనీ సిన్సియర్ గా చెయ్యాలి. నవ్వుకొంటూ తిరగడం తప్ప, చేసే పని ఏముంది? మీతో కలిసి సత్యవతమ్మకూడా అలాగే తయారవుతున్నది! నా దగ్గర కాబట్టి మీరు గెటాన్ అవుతున్నారు! స్ట్రిక్ట్ గా ఉండే హెడ్ మిస్ట్రెస్ అయితే, మీకు బాగా తెలిసొచ్చేది!" అని ఒక చిన్న విసురు విసిరింది.
సత్య కోసం ముఖాన్నే కనుపించింది. లలితకు మాత్రం హెడ్ మిస్ట్రెస్ అట్లా అన్నందుకు చాలా సంతోషమైంది. పారిజాతం ఊరుకోలేదు. పరిహాసంగా నవ్వుతూ, "మే మిద్దరం గత జన్మలో ఊసరవెల్లుల మండీ! అందుకనే కొంత సేపు బాగా పనిచేసేవాళ్ళుగా, కొంతసేపు అశ్రద్ధ మనుషులుగా చలామణీ అవుతున్నాము!" అని అంది.
"ఏమిటీ! మీ కంతా పెద్ధకదా ఆవిడ! ఆవిడని అట్లా ఎదిరించటమే! బాగానే ఉన్నాయి మానర్స్!" అని గట్టిగా అంది లలిత.
"మరేనండీ! మీరే చూస్తున్నారుగా! ఆ తెలివి వాళ్ళ కుంటేగా!" చురచురా చూస్తూ అంది హెడ్ మిస్ట్రెస్.
హఠాత్తుగా సత్య-"తెలివి లేకనేకదండీ,ఉద్యోగాలు మీ లాంటి వాళ్ళకింద చెయ్యటం! గతి లేకనేగా ఈ ఉద్యోగాలూ అవీ! లేకపోతే, మేముకూడా హైక్లాస్ లేడీస్ మని చెప్పుకొంటూ తిరిగేవాళ్ళం!" అని అంది. మనసులోని బాధ, కోపం స్వరంలో స్పష్టంగా కనుపించుతున్నది.
కృష్ణ ఆశ్చర్యంగా చూశాడు సత్యవంక.
