Previous Page Next Page 
మేఘమాల పేజి 11


    త్యాగరాజు నవ్వి 'మరెలాంటిదానివి?' కవ్వించాడు.
    'మీకు తెలియదా?' ఉక్రోషంగా చూస్తూ అన్నది.
    'నాకు తెలియవల్సిన అవసరమేం వున్నది? ...... మనమిద్దరం ఒకచోట పెరిగామా? ఆప్తులమా? ఆత్మీయులమా?'
    ఒక్కక్షణం మౌనం తరువాత, 'మీ దగ్గర కత్తి లేదా?' అన్నది కళ్ళను కత్తుల్లా పెట్టు చూస్తూ.
    'కాని, దాన్ని ఉపయోగించే గుండెమాత్రం నాకు లేదు!' అన్నాడు చాలా తేలిగ్గా నవ్వి 'మొత్తానికి ఆడదాన్ననిపించుకున్నావ్ శకుంతలా నీవు!'
    అప్పుడే లోపలికి వచ్చిన రాజేశ్వరి నవ్వుతూ, 'అయితే శకుంతల ఆడది గాదా?' అన్నది.
    త్యాగరాజు శృతి కలుపుతూ, 'నాకు ఇన్నాళ్ళబట్టీ అలా అనిపించలేదు!' అన్నాడు.
    శకుంతల మొఖం ఆ క్షణంలో తెల్లగా పాలిపోయి వున్నది.
    వరండాలోకి వచ్చేసింది.
    అక్కడ రాణి నిలబడి వున్నది.
    భయంగా రాణి చేయి పట్టుకున్నది. 'మీ అన్నయ్య నామీద కసి తీర్చుకున్నారు!' అన్నది గొణుగుతున్నట్లుగా.
    ఆమె కంఠం జీరబోయింది.
    రాణి మాట్లాడలేదు.
    'నాకెందుకు నీమీద కసి?.....ఎవరూ తెలియని నాకు రెండునెలలపాటు సుష్టుగా భోజనం పెట్టావనా?'
    'మీతో నేను మాట్లాడలేదు.....మీరు ఆ త్యాగరాజుగారు గాదు, ఇప్పుడు!' న్నది రెండు చేతులూ జోడించి.
    రాజేశ్వరి కల్పించుకుంటూ, 'ఆడవాళ్ళను ఏడ్పించటం ఎప్పటి బట్టి నేర్చుకున్నారు?' అన్నది ఎగతాళిగా.
    త్యాగరాజు అంతటితో శకుంతలను వదల దలుచుకోలేదు -వారింటిలో ఆమె వలన ఆక్రోశించిన తన హృదయం ఈరోజున మొట్టమొదటిసారిగా కోరలు జాచింది.
    వీలయినంత వరకూ శకుంతల మనస్సును గాయపరచాలనే అనుకున్నాడు.
    అందుకే శకుంతల వైపుకు తిరిగి, 'శకుంతలను చూచిన నాటినుండి!' అన్నాడు.
    శకుంతల ఏదో చెప్పబోయింది.
    కాని, ఇంతలోనే అక్కడకు స్వామి వచ్చి 'సార్!' అన్నాడు.
    త్యాగరాజుకు అతడిని చూస్తూనే కోపం తలకెక్కింది.
    'ఎంత సేపయింది నిన్ను పిలిచి ... ఎక్కడికి వెళ్ళావ్?.....మీ మేనేజర్ని పిలు!' అన్నాడు గయ్ న లేస్తూ.
    అసలు అతడి కోపానికి కారణం అది కానే కాదు-మధ్యలో పానకంలో పుడకలా వచ్చి అంతా రసాభాసం చేశాడని!
    -ఇక ఆ వేడి వుండదు!
    'క్షమించండి సార్!'
    'వెళ్ళు .... వెళ్ళిపో ... అయిదారు స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా!' పెద్దగా అరిచాడు.
    మరుక్షణంలో స్వామి అక్కడలేడు.
    రాజేశ్వరి త్యాగరాజు చేయిపట్టుకొని 'ఎఁవిటది .... లోపలికి రండి!' అని మెల్లగా లోపలికి తీసుకువెళ్ళింది.
    ఇంకా త్యాగరాజు పొగలు కక్కుతూనే వున్నాడు.
    అతడిలోని ఆవిర్లు తేలుతున్న కోపానికి కారణం వీటన్నిటితో పాటు - అనాహూతంగా వచ్చిన రాణి గూడా!
    అది గమనించనట్లుగానే తరువాత పదినిముషాలకు రాణి రాజేశ్వరిని బయటకు పిలిచి 'అన్నయ్యని నేనెప్పుడూ ఇలా చూడలేదు....బహుశః నారాకవలనే నేమో ఇదంతా......నేను వెడతాను!' అన్నది చిన్నగా-కంట్లో నీరు గిర్రున తిరుగుతుండగా.
    'అక్కర్లేదు....నీవు సత్యవతి గదిలో కూర్చో!' లోపలికి వెళ్ళి పోయింది రాజేశ్వరి.
    త్యాగరాజు ఆయాసపడుతున్నట్లుగా కుర్చీలో కూర్చొని, తలను బల్లమీద పెట్టుకొని చేతులతో చుట్టివేశాడు.
    రాజేశ్వరి వెనగ్గా వచ్చి అనునయంగా అతడి బుజం మీద చేయి వేసింది.
    'వెళ్ళు...వెళ్ళి తలుపు వేసిరా!' అన్నాడు చికాగ్గా.
    రాజేశ్వరి కదల్లేదు.
    'ఊఁ...నీకే చెప్పేది!'
    ఒక్కక్షణ మాగి, 'తప్పదా?' అన్నది -చాలా చిన్నగా.
    'ఉఁహూఁ...'
    'నలుగురిలో నన్ను అవమానించ టానికే నిశ్చయించుకున్నారా?' అన్నది దీనంగా.
    విచిత్రంగా తలయెత్తి రాజేశ్వరి మొఖం లోకి చూచాడు.
    'చెప్పండీ!'
    'వద్దు....వద్దు రాజేశ్వరీ .... నీవు వెళ్ళిపో! కాసేపు నన్న్హు కళ్ళు మూసుకు పడుకోనీయ్!....నా తల బ్రద్దలవుతోంది!'
    'నేను ఎదురుగ్గా వుండటం వలనా?' అన్నది నుదురు ముడివేసి.
    'రాజేశ్వరీ!'
    'లేకపోతే ఏవిటా మాటలు.... నేను ఇక్కడనుండి వెళ్ళిపోతే మీ తలనొప్పి తగ్గుతుందనా మీ ఉద్దేశ్యం? ఉఁహూఁ...' తల అటూ యిటూ ఊగిస్తూ, 'నాకు చెప్పకండి ఈ ఖబుర్లన్నీ....మీ బుడిబుడి మాటలకు నేనేం మోసపోను!' అన్నది.
    అలా అన్నతరువాత కావాలని ఒక్క సారి నవ్వింది.
    ఆ క్షణంలో-తలుపులు బంధించి రాజేశ్వరి ఒడిలో తలపెట్టుకొని భోరున ఏడవాలనిపించింది త్యాగరాజుకు!
    'నీవూ నన్ను అర్ధం చేసుకోలేవా రాజేశ్వరీ!'
    
                                 *    *    *

    'ఇక్కడికెలా వచ్చావ్?'
    'రైల్లో!'
    త్యాగరాజు పేలవంగా నవ్వాడు.    
    'అది నాకు తెలుసు.....నేనిక్కడున్నానని నీకెలా తెలుసు?'
    రాజేశ్వరి నవ్వింది.
    ఆమె కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లినయి.
    -త్యాగరాజు మంచంమీద పడుకొని వున్నాడు.
    రాజేశ్వరి అతని తలగడ పక్కగా కుర్చీ లాక్కొని అతడికళ్ళల్లోకి చూస్తూ కూర్చొని వున్నది,
    అంతకు గంటక్రితం శకుంతలా, రాణి వెళ్ళిపోయిన తరువాత వాళ్ళు భోజనాలు చేశారు.
    అప్పటికి కొద్దినిముషాల క్రితం వరకూ సత్యవతీ అక్కడే కూర్చొని వున్నది. కాని, ఆవులింతలు పరామర్శించగా, నిద్రపోయేటందుకుగానూ తన గదిలోని తన పక్కమీదకు జేరింది.
    త్వరలోనే ఏదైనా ఇల్లు వకటి, నాంపల్లి లో చూచుకొని వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు.
    రాజేశ్వరిగూడా తన శలవును పొడిగించి ఇక్కడే కొన్నాళ్ళు ఉండటానికి సంసిద్ధత వ్యక్తపరిచింది.
    -అప్పుడు సరిగ్గా రాత్రి పదిగంటలయింది!
    'నన్ను మీరు మర్చిపోయారు - అవునా?' అన్నది భయంగా అతడి మొఖం లోకి చూస్తూ.
    'లేదు రాజేశ్వరీ లేదు......మర్చిపోలేదు. .....నేను నిన్ను మర్చిపోగలనా?'
    'మరి ఒక్క ఉత్తరంముక్కకయినా నోచుకోలేదా, నేను?'
    'క్షమించు రాజేశ్వరీ!.....ఎప్పటి కప్పుడు రాద్దామనుకోవటం....ఏదో అవాంతరం!'
    'అంత ఇబ్బందులలో పడిపోయారా మీరు, ఇక్కడ?' జాలిగా చూస్తూ అన్నది.
    త్యాగరాజు కొన్నిక్షణాలు మాట్లాడలేదు.
    'ఇన్నిరోజులూ మరో ప్రపంచంలో గడిపాను.....సర్వం మరచి.....అంతదాకా ఎందుకు-నన్ను నేను మరచి!....' అన్నాడు నిట్టూర్పు విడుస్తూ.
    రాజేశ్వరి మాట్లాడకుండా మౌనంగా అతడి మొఖంలోకి చూస్తూ కూర్చుండిపోయింది.
    'ఇంతకీ చెప్పనేలేదు.....నా ఉనికి నీకెలా తెలిసింది?'
    'రాణి ఫోను చేసింది!'
    'రాణా?!'
    'అవును!'
    'దేనికి?'
    'నీ గురించి భయంతో!'
    'నేను చంపుతాననుకున్నదా?'
    'కాదు...నీవేఁవౌతావోనని!'
    అతడికి ప్రపంచమంతా అంధకార బంధుర మయినట్లనిపించింది. ఆ చీకట్లోకి కళ్ళు చించుకు-భయం భయంగా-చూస్తూ మౌనంగా చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు.
    రాజేశ్వరికీ అతడిని మాట్లాడించే ధైర్యం లేకపోయింది.
    తరువాత పావుగంటకు, కొత్త ప్రపంచంలో కాలు పెడుతున్నట్లుగా మాట మారుస్తూ, 'మీరు చిక్కిపోయారు!' అన్నది.
    'నేనా?' త్యాగరాజు ఆశ్చర్యంగా అడిగాడు.
    'అవును!' ఒత్తి పలికింది.
    'చూపుల కేఁవైనా తగ్గానేమో-అంత పట్టించుకోలేదు!' అని నవ్వి, అయినా, హైదరాబాద్ వచ్చినవాళ్ళంతా లావెక్కుతారంటారు - నేను తగ్గటమేఁవిటి?'
    'ఉఁహూఁ....' తల అటూ యిటూ ఊపింది. 'మీరు చిక్కిపోయారు.....రేపు ముందుగా డాక్టర్ దగ్గరకు వెళ్దాం పదండి!'
    త్యాగరాజు చివాలున లేచి కూర్చున్నాడు.
    'ఏఁవిటి.....నీకేవైనా పిచ్చా రాజేశ్వరీ!' అన్నాడు వింతగా.
    రాజేశ్వరి మాట్లాడలేదు.
    ఆమెకు దుఃఖం ఎంతగా ఆపుకుందామనుకున్నా ఆగలేదు.
    'ఏడుస్తున్నావు గూడానా?' విచలితుడవుతూ అన్నాడు.
    'నేను మొట్టమొదటిసారిగా నా జీవితంలో ఈ రెండు నెలల్లోనే ఆ విషయం తెలుసుకున్నాను!'
    'ఏఁపని?' ఆశ్చర్యంగా అడిగాడు.
    'మీకు దూరంగా బ్రతకలేనని!'
    త్యాగరాజు మాట్లాడలేదు.
    అతడి కళ్ళలోనూ నీరు గిర్రున తిరిగింది.
    రాజేశ్వరి కళ్ళను ప్రయత్నపూర్వకంగా తుడుచుకున్నది.
    'అలా మమతలు పెంచుకోవటం అంత మంచిదిగాదు రాజేశ్వరీ!' అన్నాడు దీనంగా ఆమె మొఖంలోకి చూస్తూ.
    రాజేశ్వరి మాట్లాడలేదు.
    తరువాత ఓ రెండునిముషాలకు నోరు పెగల్చుకొని, 'నాకోమాట యిస్తారా?' అడిగింది కళకు ఆశను పులుముకుంటూ.
    'చెప్పు!'
    'చేతిలో చేయి వేయండి!'
    త్యాగరాజు మంచందిగి చల్లటిగాలి కొడుతున్న కిటికీ దగ్గరగా నిలబడి,- ఆ రాత్ర్హిపూట, అంత పొద్దుబోయిన తరువాత గూడా, హడావుడిగా పోతున్న కార్లను, రిక్షాలను, గుంపులు గుంపులుగా పోతున్న మనుష్యులను చూస్తూ తడబడ్డాడు.
    'అదేవిటో చెప్పు!'
    'చెప్పందే మాట యివ్వలేరా?'
    'నిన్ను మోసం చేయటం నా కిష్టం లేదు రాజేశ్వరీ!'
    'నేను మీరు మోసం చేస్తారని అనుకోను-అది మీ నైజంకాదు గూడా!'
    'అయితే మాట తీసుకోవటం వలన లాభం ఏవిటి?....'
    'నా తృప్తి!'
    'మాట యివ్వకుండా వుండటమే నా తృప్తి - మరి ఇంతటితో ఆ విషయాన్ని ఆపేస్తావా?'
    ఆమె ఒక్కక్షణం సంశయిస్తున్న ట్లుగా ఆగి,
    'సరే....మీ యిష్టం!' అన్నది తప్పక మానసిక అశాంతితో కొట్టుకుంటున్న అతడిని ఆ సమయంలో ఒత్తిడి చేయటం ఇష్టంలేక!
    త్యాగరాజు నిట్టూర్పు విడిచాడు.
    చిన్నగా వెనుదిరిగి వచ్చాడు.
    అతడు - తొడుక్కున్న వదులైన లాల్చీలో, మరింత చిక్కి నీరసించి పోయినట్లుగా కనబడ్డాడు రాజేశ్వరి కళ్ళకి!
    ఆమె బుజంమీద చేయివేసి, ఆమె కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ 'నీ వడగబోయే విషయం నాకు తెలుసు రాజేశ్వరీ! జీవితంలో మరెన్నడూ నిన్ను విడిచి దూరంగా వెళ్ళ వద్దంటావ్-అవునా?' అన్నాడు.
    ఆమెకళ్ళు కాంతివంతమయినయి.
    'కని, నాకు భగవంతుడిమీద నమ్మకమున్నది రాజేశ్వరీ! అంతేగాదు.....విధి మీదా నమ్మకమున్నది.....అందుకనే ఏదీ నా చేతిలో లేదు అన్నట్లుగా నీకు మాటివ్వలేకపోయాను....అయితే కావాలని నేనెప్పుడూ నీకు దూరం కావాలని ప్రయత్నించను.....అలా నీకు మాట యిస్తాను.....నన్ను నమ్ము!' ఎంతో దృఢంగా , గంభీరంగా అన్నాడు.
    రాజేశ్వరి, 'నాకదే చాలు....నాకదే చాలు!' అన్నది గుండెల్ని ఆనందంతో నింపుకుంటూ.
    త్యాగరాజు ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా బెల్ నొక్కాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS