"వచ్చారమ్మా! లోపల పడుకొన్నారు."
అరుంధతి తేలిగ్గా నిట్టూర్చింది.
"నేను వస్తాను.' అని శ్రీధర్ వెళ్ళిపోయాడు.
అతని కారు చప్పుడు వినిపించకుండా ఆగిపోయిన తర్వాత గానీ, అరుంధతి కి ఆనాడు తానసలు లైబ్రరీ లో అడుగు పెట్టనేలేదని గుర్తు రాలేదు.
* * * *
కోపంగా పడకగదిలో కి వెళ్ళిన అరుంధతి కి ప్రకాశరావును చూడగానే పరిస్థితి అర్ధమయింది. తన పర్స్ లోంచి డబ్బు ఖర్చు కాకుండా స్నేహితులెవరో యిప్పించినట్లున్నారు, వెర్రిగా త్రాగి మత్తుగా పడుకొన్నాడు ప్రకాశరావు. నోట్లోంచి గుప్పుగుప్పున కంపు కొడ్తుంది. కసిగా ప్రకాశరావు ను గట్టిగా కుదిపింది. కళ్ళు బలవంతాన తెరచి "వసంతా! రాత్రంతా ఉండను- అరుంధతి నాకోసం చూస్తూ ఉంటుంది." అని మత్తు మత్తుగా అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు ప్రకాశరావు. అదిరిపడింది అరుంధతి. ఒక్కసారిగా స్వర్గ లోకంలోంచి ఘోర నరకంలోకి పడిన దానిలా అనుభూతి పొందింది. పక్కమీదకు వాలి కళ్ళు మూసుకుంది. మళ్ళీ ప్రకాశరావు దగ్గిర నుంచి గుప్పుమని కంపు కొట్టింది. భరించలేక తలగడ తీసికొని హల్లో సోఫాలో పడుకొంది. ఎదురుగా వరండా లో ఎవరో కటిక నేల మీద చెయ్యి తల క్రింద పెట్టుకొని పడుకోన్నట్లు కనుపించింది. సందేహం లేదు. అది వెంకటలక్ష్మీ-- అయితే వెంకట లక్ష్మీ రోజూ ఇక్కడ ఈ కటిక నేలమీద పడుకొంటుందా? ఓహ్! ఇక్కడ పడుకుంటుంది. గనుకనే , ఆనాడు ప్రకాశరావు చలితో బాధపడుతుంటే వెంటనే గుర్తించి రగ్గును కప్పగలిగింది. బహుశ ప్రకాశరావు ఈ స్థితిలో వస్తాడని ఆమె ఊహించి ఉండవచ్చు. తనకంటే ప్రకాశరావు ను బాగా అర్ధం చేసికొంది. అందుకనే ఎంత బలవంతం చేసినా తనతో రాలేదు.
ఈ వెంకట లక్ష్మీ ప్రకాశరావును ప్రేమించిందా? ఎందుకో వెంకట లక్ష్మీని ప్రకాశరావు కు ఉంపుడు కత్తేగా వూహించుకోవటానికి మనసోప్పుకోటం లేదు.
ఛీ! నా మనసును కొంచెం విశాలం చేసికోవాలి. నౌకరుకు యాజమాని పై , ఆ మాత్రం భక్తీ ఉండచ్చు! దానికి నేను తల పగులకొట్టుకోవటం దేనికి?" అనుకోని నిద్రపోవటానికి ప్రయత్నించింది.
అరుంధతి కాఫీ త్రాగుతుండగా లేచాడు ప్రకాశరావు. చిరునవ్వుతో అరుంధతిని సమీపించి "దొంగా! నాకంటే ముందు తాగేస్తున్నావా? నా కంపెనీ కోసం మళ్ళీ తాగాలి" అన్నాడు.
"రాత్రి డాక్టర్ గారింటికి రాలేదేం?' కటువుగా అడిగింది అరుంధతి.
ప్రకాశరావు తడబడ్డాడు.
"నువ్వు వెళ్ళవనుకొన్నాను." చటుక్కునన్నాడు.
అరుంధతికి మండింది.
"మీరు వెళ్ళమన్నారు కదా!"
'అయినా, నువ్వు వెళ్తావో వెళ్ళవో అని అనుమాన మొచ్చింది. ఇంటికొచ్చి చూసి వెళ్దామనుకొన్నాను. ఇంటి కొచ్చేసరికి నిద్ర వచ్చేసింది. నువ్వెలా వచ్చావ్! డాక్టర్ దిగబెట్టి ఉంటారు కదూ! నాకు తెలుసు! అయన చాలా మంచాయన!"
"వసంత మీకెలా తెలుసు?"
"వసంత ఎవరూ?' ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు ప్రకాశరావు.
"రాత్రి మీరు కలవరించిన అమ్మాయి."
నటించి లాభం లేదనుకున్నాడు ప్రకాశరావు.
'అదా! నా స్నేహితులందరూ బలవంతాన లాక్కేళ్ళారు. ఏదో....వెధవ గొడవ. నీకెందుకు లే!"
ప్రకాశరావు అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
అరుంధతి మనసు మండిపోయింది.
ప్రకాశరావు మొహం కడుక్కుని వచ్చేసరికి వెంకట లక్ష్మీ తువ్వాలు అందించింది. ఫలహారం తెచ్చి బల్ల మీద పెట్టింది. వేడిగా పొగలు కక్కుతున్న ఆ టిఫిన్ ప్లేటు ను దీక్షగా చూస్తూ కూర్చుంది అరుంధతి.
"ఆరూ, డార్లింగ్! నన్ను క్షమించి ఇది మరిచిపోవూ? నిజమే? నాది తప్పే! ఒప్పుకోకుండా ఉండవలసింది. వెధవలు! వాళ్ళు లాక్కుపోయారు."
తను తింటున్న ఉప్మా ను స్పూను తో అరుంధతి కి పెట్టబోయాడు ప్రకాశరావు. కూర్చున్న కుర్చీని వెనక్కు తన్ని అరుంధతి విసురుగా లేచి పోయింది.
కోర్టు కెళ్ళడానికి తయారయి ప్రకాశరావు అరుంధతి దగ్గిర కొచ్చి "కమాన్ డార్లింగ్! ఒక ముద్దుతో గుడ్ బై చెప్పవా?" అన్నాడు.
అరుంధతి పలకలేదు.
ప్రకాశరావు బలవంతాన ఆమెను తన కౌగిట్లో ఇముడ్చుకొని పెదవులు సున్నితంగా కొరుకుతూ "నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆరూ? నీమీద ఉన్నంత ప్రేమ నా కింకేవరి మీదా లేదు. నువ్వు అనవసరంగా బాధపడకు.' అని ఆమెను వదిలి వెళ్ళిపోయాడు.
అరుంధతికి ఒక్కసారిగా తన మీద తనకు ఏవగింపు కలిగింది. ఎందుకీ బ్రతుకు? ఎన్నాళ్ళిలా బ్రతకాలి?
ఆలోచనలే లేకుండా బ్రతుకుతున్న తన మనసులో ఒక్కసారిగా ఇంత ప్రళయం జనించిందేమిటి? ఈకృత్రిమ వాతావరణం లోంచి పారిపోతే? ఎందుకనో, ఆమె కొక్కసారి డాక్టర్ శ్రీధర్ పూలతోట, అతని స్వేమ్మింగ్ పూల్ గుర్తుకొచ్చాయి.
చేతి నిండా పనిలేకపోవటం కూడా ఈ అశాంతికి కారణమేమో? తను కూడా ఇంటి ముందొక పూల తోట ఎందుకు తయారు చెయ్యకూడదూ? వెంకట లక్ష్మీ తప్పక సాయం చేస్తుంది.
అడిగిందే తడవుగా వెంకట లక్ష్మీ సాయం చెయ్యటానికి ఒప్పుకుంది. వంట పూర్తీ కాగానే వస్తానంది. పనిమనిషికి ఎక్కువ డబ్బులిస్తానని దానిని కూడా సాయం తీసికొంది. అరుంధతి ఒక క్రమంలో గీతలు గీసింది. వెంకటలక్ష్మీ ఆ ప్రదేశాన్నంతటినీ, నీటితో తడిపింది. అరుంధతి పనిమనిషిని బజారుకు పంపి కావలసిన పూల అంట్లు తెప్పించింది. వెంకటలక్ష్మీ ఇరుగు పొరుగు వారి నడిగి మరికొన్ని సంపాదించింది. అరుంధతి చూపించిన దగ్గిర పనిమనిషి గోతులు తవ్వుతుంది. ఇంతలో వెంకటలక్ష్మీ 'ఇప్పుడే వస్తానమ్మా!" అంటూ లేచింది.
"ఎక్కడికీ?"
"అయ్యగారికి క్యారియర్ సర్ది వస్తాను. వేళ అయింది."
అరుంధతి అలా నిలబడిపోయింది. ఎన్ని వ్యాపకాలలో ఉన్నా, ఎంత పని తొందరలో ఉన్నా ఈమె తన అయ్యగారికి అవసరాలలో ఒక్కటి కూడా మరిచిపోదు. ఇదంతా స్వామి భక్తేనా?
"వెళ్ళు!" అంది.
వెంకటలక్ష్మీ వెళ్ళిపోయింది.
ఈ నిస్వార్ధ ప్రేమాపాసనకు ధ్యేయం ఏమిటో? ఈమె ప్రకాశరావును ప్రేమించినది నిజమే అయితే, అతనెంతో అదృష్టవంతుడు. ఆ అదృష్టాన్ని గుర్తించలేని దురదృష్టవంతుడు.
తాను వచ్చినది కూడా గమనించ కుండా, తోట పనిలో లీనమయిపోయిన అరుంధతి ని విస్తుపోయి చూసింది తార.
"ఎప్పుడూ రోగిష్టి దానిలా మంచం మీద పడుకొనే నువ్వు, ఇవాళ ఇంత హుషారుగా తోటపని చేస్తున్నావేమిటి వదినా?"
నవ్వుతూ అడిగింది తార.
చేతుల నిండా మట్టితో ముఖం మీద కూడా అక్కడక్కడ మట్టి మరకలతో నలిగిపోయిన చీరతో, అరుంధతి తారకు ఎప్పటి కంటే అందంగా కనుపించింది.
"పూలతోట తయారుచేస్తున్నాను తారా! మన ఇంట్లోనే రకారకాల పూలు పూయిస్తే చాలా బాగుండదూ?"
"బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంక చక్కని ఆలోచన నీకు చెప్పిన పుణ్యాత్ములెవరూ?"
"డాక్టర్ గారింట్లో పూల తోట చూశాక, నాకే బుద్ది పుట్టింది."
"నేను నిన్ను చూసి ఒక్క వారమే అయింది కదూ!"
"ఏమో! ఎవరు లెక్క పెట్టారూ ? ఏం?
"ఒక్క వారంలో ఇంత కళ కాంతులు ఏ బజారులో కొనుక్కోచ్చావో చెప్పు!"
"ఇదేం పొడుపు కధ తల్లీ?"
"నాకు నిజంగా పొడుపు కధ లాగే ఉంది! అర్ధంకాక నిన్ను విప్పమంటున్నాను. నిజంగా వదినా. నువ్వింత అందంగా ఉంటావని నాకెన్నడూ తెలియలేదు."
"ఇన్నాళ్ళూ వికారంగా ఉన్నా నంటావా?"
"వికారంగా ఉండాలన్నా నీ తరం కాదు. ఇన్నాళ్ళూ, అందమైన బొమ్మలా గుండెదానివి-- ఇప్పుడు చైతన్యం మూర్తిభవించిన యవ్వనిలా గున్నావు. ఇన్నాళ్ళూ నీ కళ్ళలో ఏ భావమూ కనిపించేది కాదు. అనుభూతులే లేవా? అనిపించేది. ఇప్పుడు క్షణ క్షణానికీ నీ కళ్ళలో ఎన్నిన్ని రకాల భావాలు దోబుచూలాడుతున్నాయో , వర్ణించడానికి నేను కవిని కాను."
"అదృష్టవంతురాలిని. అది సరే కాని, ఇలా వచ్చి మా తోట చూడు! బాగుందా?"
"బాగానే ఉంది కాని, అన్నీ మాములు మొక్కలే! ఏవైనా కొత్తరకాలు విచిత్రమైనవి వెయ్యరాదూ? ఎక్కడమ్ముతారో తెలియదు కాని, రకరకాల మొక్కలు నేను మేగజిన్స్ లో చూస్తుంటాను."
"డాక్టర్ గారి తోట చాలా పెద్దది. పరిశీలనగా చూడలేదు. కాని, వింత రకాలేమైనా ఉండచ్చు. అంట్లు ఇవ్వటానికి వీలవుతుందేమో అడిగి చూస్తాను.
"నువ్వేమైనా అడుగుతే డాక్టరు గారు "ఒబ్లాయిజ్' చేస్తారా?' ఏదో ఆలోచిస్తూ అడిగింది తార.
"ఆ! తప్పక చేస్తారు."
కళ్ళు మెరుస్తుండగా అంది అరుంధతి.
'అయితే వదినా! నాకొక సహాయం చేయగలవా?"
"మనోరంజని గారి మరదలకీ, సుందరరావుగారి చెల్లెలికి నా సహయమా?"
"నీ స్నేహితురాలిగా అడుగుతున్నాను. చేస్తావా?"
"ఏమిటీ?"
"నాకీ మధ్యనే తెలిసింది. డాక్టరు గారు సంవత్సరానికి పదిమంది బీద విద్యార్ధులకు సహాయం చేసి పై చదువులకు ప్రోత్సహిస్తారట! వచ్చే ఎకడమిక్ ఇయర్ లో మన రవికి సహాయం చేస్తారేమో , అడగ్గలవా?"
తార ఇట్లాంటి విషయం అడుగుతుందని ఏమాత్రమూ వూహించని అరుంధతి ఈ మాటలు విని స్థాణువయిపోయింది. తార తల వంచుకొని "ఏం వదినా?' అంది.
"లోపలికి పద! స్థిమితంగా మాట్లాడుకొందాం!"
తార లోపలకు నడిచింది. అరుంధతి కాళ్ళూ చేతులు కడుక్కొని చీర మార్చుకొని వచ్చింది.
వెంకటలక్ష్మీ తెచ్చిన కాఫీ తార కందించి తనూ త్రాగుతూ "రవి పట్ల నీ కెందుకీ ఆసక్తి?' అంది.
తార నిరసనగా నవ్వి "నీ నోటి నుండి గూడా ఇట్లాంటి ప్రశ్న వస్తుందనుకోలేదు" అంది.
అరుంధతి తార వంక ఆశ్చర్యంగా చూసింది.
"క్షమించు తారా! నిజంగా ఇది నాకు అవసరం లేని ప్రశ్నే! కాని, నువ్వు కోరిన సహాయం చెయ్యలేనని చెప్పటానికి విచారిస్తున్నాను."
"ఏం? మీ నమ్మకమైన నౌకరు మీకు కాకుండా పోతాడనా?"
"నీ ఇష్టం! ఎలానైనా అనుకో! నిజం చెప్తున్నాను! నువ్వెలా తీసికొన్నా సరే! మనుష్యుల పరస్పర అనుబంధాలను చాలా దారుణంగా మలిన పరిచేవాటిలో డబ్బు ముఖ్యమైనది. ఆర్ధిక వ్యవహారాలను ఇరికించనంతవరకే ఏ అనుబంధమైనా, హాయిగా ఉంటుంది. డాక్టర్ గారితో నా కేర్పడిన అనుబంధం చాలా సుకుమారమైనది. నా దృష్టిలో అపురూపమైనది. అతిశయోక్తులు చెప్తున్నానని నువ్వు అనుకోకపోతే, అది తేలిక స్థాయిలోది కాదని కూడా అనిపిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలతో ఆ అనుబంధాన్ని మలిన పరచటం నాకెంత మాత్రం ఇష్టం లేదు. అయినా ఈ విషయంలో నువ్వూ నేను ఎందుకూ అడగటం? రవినే అడగమనరాదూ? అయన నిజంగా దయార్ద్రహృదయుడే అయితే, రవికి సహాయం లభిస్తుంది."
తార ఆలోచిస్తూ కూర్చుంది. అరుంధతి మాటల నర్దం చేసికోగలిగే , సంస్కార మామెకుంది. అరుంధతి అన్నట్లు రవి స్వయంగా వెళ్ళి అడగటమే ఉత్తమైమయిన మార్గం!
తార సూచన విని రవి ఎంత సంతోషించాడో అంత భయపడ్డాడు. డాక్టర్ శ్రీధర్ ఎదుట నిలబడాలని తల్చుకొంటేనే. అతనికి కాళ్ళూ, చేతులు గడగడ లాడాయి. ఆయనను సహాయం ఎలా కోరటమో, అర్ధం కాలేదు.
బెదురుగా చూసే రవిని చూసి తార చిరుకోపంతో , "అట్లా బెదురూ చూపులు చూడటం కాదు. వెళ్ళి అడగండి!' అంది.
"అయన ఏమంటారో?"
"ఏమంటారో అడిగితె తెలుస్తుంది."
"మీ మేలు మరిచి పోలేను. తారాదేవీ!"
"దేవి కూడా ఎందుకు కల్పిస్తారు?"
"మిమ్మల్ని దేవిగానే భావిస్తాను గనుక?"
తార చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి.
"కవిత్వం తరువాత! ముందు కర్తవ్యమ్ సంగతి చూడండి!"
"ఏమో! ప్రయత్నిస్తాను. కానీ ఎందుకీ గొడవంతా?"
"అంటే?"
"నేను పై చదువులు చదువి ఎవరి నుద్దరించాలి? నా కెవరున్నారు?"
"ఇప్పుడు లేకపోతె, ఇకముందు రాకూడదా?" తల వంచుకొని అంది తార.
వంచిన ఆమె ముఖంలోకి ఆరాధనతో చూస్తూ "నాకు కావలసిన వాళ్ళు నా జీవితంలోకి ఏనాటి కైనా వస్తారని ఆశ అణు మాత్రమైనా ఉంటె, వారి సుఖ సంతోషాల కోసం, ఎంత తపస్సయినా చేస్తాను" అన్నాడు.
తార చిలిపిగా నవ్వింది.
"ఎవరో మీకు కావలసినవాళ్ళు?"
"మీకు తెలుసు!"
"ఇది బాగుంది. నాకేం తెలుస్తుంది?"
"మీకు తెలియకపోవటం , నిజమే అయితే, ఈ జన్మలో నేను మీకు చెప్పలేను తారాదేవీ!'
రవి కంఠం గద్గదమయింది.
తార మృదువుగా నవ్వింది.
"మీరు నాకేమీ చెప్పక్కర్లేదు. కానీ డాక్టరు గారితో మాత్రం మీ పరిస్థితి జాగ్రత్తగా చెప్పు కొండి!"
తార నవ్వుతూ వెళ్ళిపోయింది.
ఆమె కనుమరుగయ్యేవరకూ ఆమెనే చూసి, తరువాత ఆమె కూర్చొని లేచిన కుర్చీని ఆప్యాయంగా స్పృశించాడు రవి.
