Previous Page Next Page 
గూడు చేరిన పక్షులు పేజి 12

 

                                        6
    నా విచారానికి అంతులేదు. చక్కని చంద్రబింబం లాంటి రేఖాదేవి ముఖం యిప్పుడు ఎంతో అందవికారంగా తయారైంది. రేఖాదేవి బాధను చూడలేక పోయాను. ఎంతో చలాకీగా తను నవ్వుతూ ఇతరులను నవ్వించే ఆమె యిప్పుడు తన ముఖాన్ని యితరులకు చూపించడానికి ఎంతగానో బిడియ పడుతూ ఉంది. తన గది ఒదిలిపెట్టి బయటికి రావడమే లేదు.
    ఒకరోజు నేనే వారి గదికి వెళ్లాను. నన్ను చూడగానే ఆమె తన చేతులు ముఖానికి అడ్డు పెట్టుకొని వెక్కి, వెక్కి ఏడవనారంభించింది. ఆమెను ఆ పరిస్థితిలో చూసిన నా మనసు కరికి నీరై పోయింది.
    'ఆ.......మ్మా.....యి.....గా......రూ......!' నెమ్మదిగా పిలిచాను.
    'ప్రసాద్ నీకు నా ముఖం చూపించలేను. ఇక్కడి కెందుకు వచ్చావ్? వెళ్ళిపో... ఈ కురూపి నీకు ఎటువంటి సుఖ సంతోషాలనూ ప్రసాదించలేదు.' దీనంగా నా కళ్ళల్లోకి చూస్తూ కన్నీరు కార్చింది.
    'ఈ విధంగా దుఃఖించడం ఏ మాత్రం బాగాలేదు. నాకు కావలసింది మీ చల్లని మనసు గాని మీ రూపం కాదు. మీరు ఎప్పటి కైనా , ఎలా ఉన్నా నా జీవన జ్యోతే!' కన్నీరు కొలకుల నుండి జారుతూ ఉండగా అన్నాను.
    'ప్రసాద్! ఏమిటి నీవంటున్నది? నాయీ వికృతరూపాన్ని చూస్తూ కూడా యింకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నానా? నీవు నన్ను యింకా ప్రేమిస్తూనే ఉన్నా నేను మాత్రం నీ జీవితంలో ప్రవేశించి నీకు తీరని అన్యాయం చేయతలచు కోలేదు. నలుగురిలో నీకు నగుబాటౌతుంది. ఏ జన్మ లోనో చేసుకున్న పాపానికి నేను ఈ జన్మ లో శిక్షను అనుభవిస్తున్నాను. నాకు రక్తదానం చేసి ఎందుకు బ్రతికించావ్...? ఆ ప్రమాదం లో చనిపోయినా బాగుండేది; ఇప్పుడు చూడు...నాకోసం ఎంతమంది బాధపడుతున్నారు? నీవు, నాన్నగారు, సీతమ్మ మిగతా వారంతా -- ఈ కొద్ది రోజులలోనే నాన్నగారు చిక్కి సగమయ్యారు. సీతమ్మ నన్ను చూస్తూ దుఃఖ పడని రోజంటూ లేదు. నేనెవరిని సంతోష పెట్టడానికి జీవించాలి ప్రసాద్...? మరణిస్తే ఒకసారి ఏడ్చి ఊరుకుంటారు. నేను జీవించి జీవితాంతం మిమ్ములను బాధపెట్టడం నాకిష్టం లేదు' కన్నీటి చారలతో , ఉబ్బిన కళ్ళతో ఆమె ముఖం చూడడానికి ఎంతో దీనంగా కనుపించింది.
    'అమ్మాయి గారూ....! మీరు అంత కఠినమైన మాటలు మాట్లాడి నా హృదయాన్ని రంపపు కోత కోస్తారా....? ఈ శరీరాలు అశాశ్వతమైనవి. మనసులే ప్రధానం . రేపు నాకు మాత్రం ఏదైనా జరగకూడదని....'
    నా మాటలు పూర్తీ కానివ్వకుండా సున్నితంగా నా నోరు మూస్తూ 'ప్రసాద్! నీ ఈ మాటలు నీ మంచి తనానికి నిదర్శనాలు. అటువంటి మాటలను కొని నన్ను మరింత దుఃఖ పెట్టకు. నీకు తగిన అందాల రాశిని, చక్కని చుక్కను పెండ్లాడి కలకాలం సుఖ సంతోషాలతో కాపురం చెయ్యి. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది.... స్వార్ధాన్ని కాదు...నా మాట వినవూ' కన్నీరు జాలువారుతున్న ఆ కండ్ల లోని ఆవేదనను గుర్తించాను.
    'మీరు ధైర్యం తెచ్చుకొని ఊరట చెందాలి. రాత్రి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తాను. మళ్ళీ మీ ముఖంలో చంద్రుని తలదన్నే కళా, కాంతులను చూడలేని నా ఈ జీవితమే వృధా....! ప్లాస్టిక్ సర్జరీ గురించిన దీయరీ అంతా స్టడీ చేశాను. కొంతకాలం ప్రాక్టికల్ గా కూడా పని చేసి ఆ తర్వాత మీకు ప్లాస్టిక్ సర్జరీ జరుపుతాను. మీరు ధైర్యంగా ఉంటె నాకు వేయి ఏనుగుల బలం వస్తుంది. మీ సంతోషాన్ని చూస్తూ నేను ఏదైనా చేయగలుగుతాను మీరిలా దిగులుపడుతూ ఉంటె నాలో పెల్లుబుకుతూన్న ఉత్సాహమంతా నీరు కారిపోతుంది. మీ మాటలు నాకు భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఎటువంటి అఘాయిత్యమూ తలపెట్టనని మీరు నాకు మాట యివ్వాలి. మీ ముఖంలో సంతోష రేఖలు చూడడానికి నే చేయబోయే ప్రయత్నం లో నేనేమైనా ఫర్వాలేదు.' చేయి ఆమె ముందుకు చాస్తూ అన్నాను.
    'ప్రసాద్! నీదెంత మంచి హృదయం?' నా ఒడిలో తల ఉంచి వెక్కి వెక్కి ఏడ్చింది.
    'మీరిక నిశ్చింతగా ఉండండి, ఈ క్షణం నుండి తిరిగి మీకు మీ పూర్వ రూపాన్ని ప్రసాదించే ప్రయత్నం లోనే ఉంటాను. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. పట్టుదలతో పనిచేస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. మీరు మాత్రం ధైర్యం చెడవద్దు .' లాలిస్తున్నట్లుగా అన్నాను.
    'ప్రసాద్! నీ మాటలు నిజమేనా....? మళ్ళీ నా మాములు రూపం నాకు తేగలవా?' అని ఒక్క క్షణం సంతోషించి మళ్ళీ "వద్దు ప్రసాద్....! నాకోసం నీవు అంత బాధ పడవద్దు. ఒకవేళ నీ కృషి ఫలించి నాకు మళ్ళీ మామూలు రూపం వస్తే నాన్నగారు నన్ను సుధాకర్ కిచ్చి వివాహం జరిపిస్తారో ఏమో? నాకు ఎంతో భయంగా ఉంది.' అనుమానపడుతూ అంది ఆమె.
    ఆమె మాటలు అంటూ ఉండగానే పెదబాబు గారు గది లోపలికి వచ్చారు --
    'లేదు తల్లీ! అలా ఎప్పటికీ జరగనివ్వను. మీ సంభాషణంతా విన్నాను. నా కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. త్వరపడి నిర్ణయం చేశాను. మీ యిద్దరినీ యిక నా బొంది లో ప్రాణ ముండగా విడతీయను.' అని నా వైపు తిరిగి 'నాయనా ప్రసాద్! నీ ఋణం ఎలా తీర్చుకో గలనయ్యా? ప్లాస్టిక్ సర్జరీ గురించి ప్రాక్టికల్స్ స్టడీస్ చేయడానికి నీవు ఈరోజే నాగ్ పూర్ కు వెళ్ళు. అక్కడ ప్లాస్టిక్ సర్జరీ యిన్ స్టిట్యూట్ లో నాకు బాగా తెలిసిన చీఫ్ సర్జను ఒకతను ఉన్నాడు. అతనికి లెటరు యిస్తాను.' అన్నారు పెదబాబు గారు.
    'అలాగే నండి....!' అని ఆరోజే నాగ్ పూరుకు ప్రయాణమయ్యాను. నా సర్వేంద్రియాలనూ ప్లాస్టిక్ సర్జరీ పై కేంద్రీకరించి కృషి జరిపాను. అక్కడ రెండు మాసాలు ఉండి ప్లాస్టిక్ సర్జరీ లో మంచి నేర్పు సంపాదించుకోగలిగి పెదబాబు గారి మిత్రులైన డాక్టర్ భట్ గారి ప్రశంసల నందుకొని వారి నుండి మళ్ళీ పెదబాబు గారికి ఉత్తరాన్ని తీసుకొని యింటికి బయలుదేరాను.
    హైదరాబాదు చేరగానే రేఖాదేవి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేశాను. నా కృషి ఫలించింది. ముఖం పై గల మచ్చలన్నీ మచ్చుకు లేకుండా మాయమయ్యాయి. పెదబాబు గారు ఆనందానికి , రేఖాదేవి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆవిధంగా సంతోషంగా నెలరోజులు దొర్లిపోయాయి.

                              
    ఈ సందర్భంగా పెదబాబు గారు విందోకటి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఏర్పాట్లన్నీ చురుకుగా జరిగిపోయాయి. ఆ విందుకు అతి ముఖ్యమైన బంధువులు స్నేహితులు మాత్రమే పిలువ బడ్డారు. అందులో రవి, వాణి కూడా ఉన్నారు. విందు  చక్కగా ముగిసింది.
    పెదబాబు గారు విందుకు వచ్చిన అతిధుల నుద్దేశించి 'ఈరోజు నాకు పండుగ. అమ్మాయి రేఖకు పునర్జన్మ, ఆమె కోల్పోయిన రూపం ఈ రెండూ తిరిగి ఆమెకు లభించాయి. జన్మదాత , రూప ప్రదాత మరెవరో కాదు. మన ప్రసాదే! ప్రసాద్ రత్నం లాంటి వాడు.... ఆ విషయం ఎంతో కాలం నుండీ నే నెరుగుదును. ఆన్ని రంగాలలో ఆరితేరిన వాడు. ఇతని నడవడిని గురించి శీలాన్ని గురించి ఎప్పటి కప్పుడు నా క్లాసు మేట్సు అతని ప్రోఫేసర్సు తెలియపరుస్తూ ఉండేవారు. వారి నుండి ఆ విషయాలు తెలుసుకుంటూ ఎంతగానో పొంగిపోతూ ఉండేవాడిని. అతనిని ఒక చక్కని డాక్టరుగా.... నా నర్శింగ్ హోం కు భావి నేతగా మాత్రమే ఊహించగలిగాను. అంతకుమించి మరొక దృష్టి తో చూడలేక పోయాను. అదొక్కటే నావల్ల జరిగిన పొరపాటు. ఆ పొరపాటుకు కారణం కూడా ఉంది. నన్నశ్రయించి బ్రతికుతున్నాడు కదా అనే ధీమా ....! నా అంతస్తు కు తూగలేడనే స్వార్ధ చింతన ఈ రెండూ నా కళ్ళకు పొరలుగా ఏర్పడ్డాయి... ఈ పొరలలో నుండి నా అంతస్తు కు సరితూగగల యువకులు. తప్ప వేరే ఇంకేవ్వడూ కనుపించ లేదు. అందుకు భగవంతుడు నాకు ఆ విధంగా తగిన శాస్తి జరిపించాడు. నా పొరలను తొలగించాడు.... మరొక ముఖ్యమైన విషయం... మా అమ్మాయి రేఖ.... ప్రసాదు అంతకు ముందే యిద్దరూ ఒకరిని మరొకరు గాడంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి కూడా వచ్చారు. అయినా ప్రసాద్ గాని, రేఖ గాని నా అభిప్రాయాన్ని ఖండించలేదు. ఇద్దరూ వారిలో వారే కుమిలిపోయారు.. బాధ పడ్డారు. చివరకు సుధాకర్ తో వివాహ నిర్ణయం జరిగిన తర్వాత కూడా ఒకరి కోసం మరొకరు ఆత్మత్యాగం చేసుకునేందుకు సిద్దపడ్డారే కాని ఆ విషయాన్ని నావరకు రానివ్వలేదు. వారిద్దరూ ఆ విధంగా నా నిర్ణయాన్ని గౌరవించారు. నా మాటకు విలువ ఇచ్చారు. ఈ రోజులలో చదువు కుంటున్న అమ్మాయిలతో పోలిస్తే....మా అమ్మాయి అలా నా నిర్ణయాన్ని ఖండించక పోవడం నాకు గర్వకారణమే! ఇక ప్రసాదు.... అవును.... ఆ పొరలు కమ్మిన సమయంలో నేనేమైనా మాట జారితే జీవితాంతం బాధపడవలసి వస్తుందని ఊహించి ఉంటాడు. అతడు అంతకు దూరాలోచన గలవాడే! రేఖ తనకు దక్కబోవడం లేదని తెలిసినప్పటి , తనకు ప్రాణాపాయం జరుగుతుందని కూడా సందేహించక ముందంజ వేశాడు...రక్తదానం చేశాడు.... రేఖను రక్షించాడు. ప్లాస్టిక్ సర్జరీ నేర్చుకొని ఆమె ముఖంలోని వికార రూపాన్ని దూరం చేశాడు...నిజంగా ప్రసాద్ లాంటి యువకులు చాలా అరుదుగా ఉంటారు. నిస్వార్ధ త్యాగానికి ఉదాహరణ ప్రసాద్! మా అమ్మాయి రేఖను ప్రసాద్ కిచ్చి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నాను.' అని ఒక్క క్షణం విశ్రాంతి గా కూర్చున్నారు.
    'పెదబాబుగారు నన్ను చాలా, చాలా పొగిడారు. అందుకు నేను అనర్హుడిని. నేను ఏది చేసినా నా స్వార్ధం కోసమే చేశాను. ఇందులో నన్ను గొప్పగా పొగడవలసినదేమీ లేదు. వారి కష్టాలలో భాగం పంచుకోవడం నా కనీస ధర్మం. దానినే వారు చిలవలు పలవలుగా అల్లి ఎంతో గొప్పగా పొగిడారు. నా ఈ తనువూ వారి ఉప్పు తిని పెరిగినది. నా ఈ ఉన్నతికి కారకులు వారు.... అటు వంటప్పుడు వారు నాకు చేసిన దానిలో నేను వారికి చేసింది చాలా చిన్న సాయం. వారి అమ్మాయి రేఖను నేను హృదయ పూర్వకంగా, సంతోషంగా స్వీకరిస్తాను.' అని కూర్చున్నాడు.
    'నీ మాటలు నీ మంచితనానికి నిదర్శనం... ఇంకా ఆలస్యం చేయకు. ఈ ఉంగరాన్ని వీరందరి ఎదుట అమ్మాయికి తొడుగు. ఈ శుభ ఘడియ కోసం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నాను. త్వరగా కానివ్వు బాబూ!' అన్నారు పెదబాబు గారు ఉంగరాన్ని నా చేతిలో ఉంచుతూ.
    ఆనందంతో వణుకుతున్న చేతులతో ఉంగరాన్ని రేఖాదేవి వ్రేలికి ఉంచాను. చప్పట్ల తో ఆ ప్రదేశమంతా ఒక్క క్షణం మారుమ్రోగింది. రేఖాదేవి, నేను పెదబాబు గారికి నమస్కారాలు చేశాం. వారు మమ్ముల నిద్దరినీ నిండు మనస్సుతో ఆశీర్వదించారు. ఆ విధంగా మా వివాహ నిర్ణయం జరిగిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS