Previous Page Next Page 
గూడు చేరిన పక్షులు పేజి 13

 

    ఆరోజు రేఖాదేవి నా గదికి వచ్చింది.  'ప్రసాద్ మీరు నన్ను రక్షించి మీదాన్నిగా చేసుకున్నారు... ధన్యు రాలనయ్యాను.... నా ఈ జీవితాన్ని మీకర్పించి నిశ్చింతగా గడుపుతాను. నాకు పునర్జన్మ ప్రసాదించిన మిమ్ములను ఆజన్మాంతం సేవిస్తాను.' అంటూ వంగి నా పాదాలకు నమస్కరించ బోయింది.
    'రేఖా.... నీ స్థానం...అది కాదు.' అని లేవనెత్తి 'ఇది' అని కౌగిలి లో చేర్చుకున్నాను. చిరునవ్వుతో నా హృదయం పై ఒదిగి పోయింది ఆమె.
    ఇద్దరమూ కలిసి నర్శింగ్ హోం బాధ్యత పూర్తిగా స్వీకరించాము. రెండు మూడు మాసాలు ప్రశాంతంగా గడిచి పోయాయి. ఆ రెండు మూడు మాసాలలో ఇరువురమూ ఎంతో సన్నిహితము గా గడిపాము.
    మా వివాహ ముహుర్తం నిర్ణయించబోతున్న సమయంలో పాక్ సైనికులు చిన్న చిన్న దాడులు మన దేశం పై జరిపారు. ఆ దాడులు పెరిగి పెద్దవై భయంకర రణంగా పరిణమించాయి.
    ప్రభుత్వం అత్వ్యైక పరిస్థితిని ప్రకటించింది. డాక్టర్ల ను....ఇంజనీర్ల ను ...యువకులను సిపాయి ల రూపంలో యుద్ద ప్రాంతాలకు ఆహ్వానించింది.
    సరిహద్దులను కాపాడుతున్న సైనికులకు డాక్టరు గా వెళ్ళడం నా విద్యుక్త ధర్మంగా భావించి, ఆ బాధ్యత స్వీకరించాను. ఆనాడు అమ్మను...నాన్నను ఈనాడు రేఖను.... పేద బాబుగారిని వదిలి పెట్టవలసి వచ్చింది....నా ఆత్మీయుల నుండి నాకు వియోగమే వ్రాసి పెట్టి ఉందేమో...? సరిహద్దు ప్రాంతాలకు వచ్చాను.
    పై ఆలోచనలతో సతమతమవుతున్న నాకు హాస్పిటల్ నుండి "మెసేజ్' వచ్చింది. 'అర్జంటు కేసు...వెంటనే రావాలి' మెసేజ్ అందుకున్న మరుక్షణం లో బయలుదేరాను.... కర్తవ్య నిర్వహణ. నిమిత్తం....భరతమాత వీరపుత్రుల సేవ కోసం.....
                                                                                                    సూర్యం
    'అబ్బ....బాధ....డాక్టర్....ఈ చిత్రహింస భరించలేను. నాకు విషమిప్పించండి....'
    బాధతో విలవిలలాడుతూ , మెలికలు తిరుగుతూ కేకలు వేయసాగాను-- ఒక్క నా అరుపులు తప్ప వార్డంతా నిశ్శబ్దంగా ఉంది. బయటి వాతావరణం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది... కాని ఆ నిశ్శబ్ధత ....ప్రశాంతత ఎవరికి? నాకు మాత్రం కాదు. అబ్బ.... శరీరమంతా తెలియని నరక బాధ అనుభవిస్తూ ఉంది. ఏదో ఆవేదన.... ఆరాటం....నాకంతా అయోమయంగా ఉంది. ఎన్ని జన్మల పాపఫాలమో ? ఉహు....కాదు....ఈ జన్మ పాప ఫలమే.
    'నర్స్....డాక్టర్....భరించలేను.... ఈ బాధ భరించలేను.'
    'ఛ..ఛ..వెధవ రోగులు...ఒక్క క్షణం విశ్రాంతి గా ఉండనివ్వరు...ఏమైంది?'
    రుసరుసలాడుతూ వచ్చింది; ఒక నర్సు ముఖం చిట్లించుతూ--
    'నర్స్ ..నీకు యిబ్బంది కలిగిస్తున్నా నని తెలుసు. కాని ఏం చెయ్యను? బాధ....అబ్బా! భరించలేని బాధ. దయచేసి ఈ విషయం డాక్టరు గారికి తెలియ జేస్తావూ....?'
    'నీ ముఖానికి తోడూ డాక్టర్ కావాలా? ఒక్క క్షణం అరవకుండా ఉండు....మందు తెస్తాను...'
    ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది. క్షణం లో ఒక ఔన్సు గ్లాసు లో ఏదో మందు తీసుకు వచ్చింది.
    'ఊ...నోరు తెరువు.'
    నా నోటిలో పోసిందా మందు. విషం ... కటిక చేదు.... ఊరుకోలేక ఆమాటే పైకన్నాను.
    'ఛీ...సిగ్గులేదూ....? నీ ఈ రోగానికి తోడూ తియ్యటి మందులు కావాలేం?'
    తెల్లని యిస్త్రీ మడతలను శబ్దం చేసుకుంటూ, వయ్యారం పలికిస్తూ వెళ్ళింది. డ్యూటీ డాక్టరు గదిలోపలికి.
    ఒక నిముషం తర్వాత పకపకలు, వికవికలు వినుపించాయి; డాక్టరు గారి గది నుండి -- అప్పుడూహించాను. నా ఈ మూల్గులు... వారిద్దరి ఏకాంతాన్ని ఏవిధంగా భంగ పరచాయో? ఛీ....ఏ విధంగా తయారయ్యాయి ఈ ప్రభుత్వ ఆస్పత్రులు! నీతి నిజాయితీ మచ్చుకు కూడా లేకుండా పోయింది. తోటి మానవుడు బాధపడుతూ.... ఆ బాధలో కేకలు వేస్తూ ఉంటె... సరసాలూ, సల్లాపాలూ... హు....ఎవరి ఆనందం వారిది. ఎవరు కాదనగలరు...? కాదన్నా ఫలితం.....?
    ఒకరిని ఆక్షేపించడానికి నాకే మధికారముంది? నేను మాత్రం...క్రూరంగా, అతి క్రూరంగా ప్రవర్తించ లేదూ? నా ప్రవర్తనతో ఎంతమంది నిరాశ్రయులయ్యారు? అప్పటి నా పైశిచిక ప్రవర్తన కు బలమైన అ సహృదయుల ఆక్రందన....ఆవేదన బహుశా నన్నిలా చిత్రహింస పెడుతూ ఉండవచ్చు. అబ్బ! బాధ తగ్గడం లేదు. కాని ఏదో తెలియని మత్తు నన్ను అవరిస్తూ ఉంది. కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. బహుశా ఆ నర్సు నాకు మత్తు మందు యిచ్చి ఉంటుంది. నిద్ర వస్తూ ఉంది....

                              *    *    *    *
    కళ్ళు తెరిపిళ్ళు పడడం  లేదు...నిద్ర లాగా లేదు.. పూర్తిగా మెలుకువ రావడం లేదు. మళ్ళీ శరీరంలోని బాధలు రెచ్చిపోతున్నాయి.. నా ఈ బాధలకు  అంత మెప్పుడు? నరాలన్నీ ఉంచుట్టుకు పోతున్నాయి.
    'మిస్టర్....'
    'ఊ....'
    'ఈ మాత్ర వేసుకొని , మందు త్రాగు. చూడు ఎంత పొద్దు పోయిందో? ఎండకిటికీ నుండి ఎలా చొచ్చుకు వస్తూ ఉందొ? ఇంతవరకు లేవనే లేదు. దొరలు....బేవార్స్ రకమంతా చేరేది యిక్కడేగా....! అత్తవారింటో లాగా ఏ వేళ కది అమరుతూ ఉంటుంది....'
    పూర్తిగా మెలుకువ వచ్చింది ...నా హృదయాన్ని శూలాలు గ్రుచ్చినట్లయింది ...అవును....ఎటువంటి అవమానానైనా భరించాలి....తప్పదు మరి! చివరకు ఈ పరిస్థితి దిగజారాను.
    'సిస్టర్ ...నా ముఖం చూస్తె ప్రతి వారికీ అలాగే అనాలని ఆనిపిస్తూ ఉంటుందా....? నీవూ నాపై కాఠిన్యం చూపిస్తున్నావు. మీ వృత్తి ధర్మాని కిది విరుద్దం కదూ....? నిస్సహాయస్థితిలో.... మనః స్థిమితం లేక ....శరీరం లోని అణువణువూ నరక యాతన ఆనుభవిస్తూ , అనుక్షణం విపరీతంగా బాధపడుతూ ఉండే నాలాంటి అభాగ్యులకు అవసరమనిపించే వోదార్పు చేకూర్చడం న్యాయంగా మీ ధర్మం కదూ....? రాత్రి యిలాగే బాధపడుతున్న సమయంలో ....విసుగు పడుతూ ..రుస రుస లాడుతూ ఒక నర్సు మత్తు మందు యిచ్చి వెళ్ళింది; నా గోల భరించలేక ఆ మత్తు ఒదిలి మళ్ళీ ఈ లోకంలో పడేసరికి పాత బాధలన్నీ ఆవరించాయి. సిస్టర్! మీరిస్తున్న ఈ మందులు రోగాన్ని అణిచిపెట్టడానికా లేక నయం చేయడానికా?.... ' రాత్రి యిప్పటి సంఘటన లకు విసిగిపోయి ఆవేశంతో వెనుక ముందులు ఆలోచించ కుండా అనేశాను.
    'మిస్టర్....! నా పదేళ్ళ సర్వీసు లో నీలాంటి వారి నెందరినో చూశాను. నీతులు చెప్పడం తేలికే! ఆచరించడమే కష్టం....!' నీమట్టుకు నీవు ఒక్కడివే కావచ్చు. నీలా బద్జపడుతున్నవారు మాకెంత మంది? ఊ....త్వరగా కానీ...వాష్ బేసిన్ లో ముఖం కడుక్కొని ఈ మందు త్రాగి గోలీ వేసుకో....!'
    'ఒక్కడితో యింత ఆలస్యమౌతే మిగతా వారి కిక పొద్దు చాలినట్లే ' నసుగుతూ కాళ్ళు చేతులూ తిప్పుకుంటూ అందరినీ తనే ఉద్దరిస్తున్నట్లు వెళ్ళిపోయింది.
    ముఖం కడుక్కొని, మందులు తీసుకునున్నాను; నిస్పృహ తో . ఆ విధంగా పది రాత్రులు పది పగళ్ళు గడిచి పోయాయి; ఎటువంటి మార్పులు లేకుండా. విచిత్రమేమిటంటే....నా శరీర పరిస్థితి లో కూడా ఎటు వంటి మార్పూ రాలేదు. విసుగెత్తి పోయాను బాధలు భరించలేక.... కాని వినేదెవ్వరు? ఆదుకొనే దెవ్వరు? మొండి కేత్తాను. అటో యిటో తేల్చు కోవాలను కున్నాను. ఎలాగూ జీవితం పై నాకిక ఆశ లేదు. ఇదే పరిస్థితిలో ఉంటె మరొక పది రోజులు జీవించడం కూడా సాధ్యపడదు. అయినా ఎవరి కోసం జీవించాలి? అమాయకుడైన అన్నను దూరం చేసుకున్నాను; అమ్మ చెప్పిన చెడు మాటలు విని. అమ్మను, నాన్నను క్రూరంగా హింసించాను. అన్నిటిని మించిన ఘోరం మరొకటి చేశాను... ఎవరు క్షమించినా ఆమె క్షమించదు. ఎలా క్షమించగలరు? క్షమించరానటువంటి ఘోరం.... ఇప్పుడు తలుచుకుంటే భయంతో ఒళ్ళు జలదరించి పోతూ ఉంది. ఆ ఘోరాలు ఎలా చేయగలిగానో..? అబ్బ....! అప్పటి నా ప్రవర్తన ...యిప్పుడు యిలా చింతించి ఏం లాభంగా...? నావల్ల -- జరగకూడని అనర్ధాలన్నీ జరిగిపోయాయి.
    'డ్యూటీ డాక్టర్ వస్తున్నారు. నెమ్మదిగా మాట్లాడండి.' గట్టిగా మాట్లాడుతున్న యిద్దరు పేషెంట్ల ను హెచ్చరిస్తూ మళ్ళీ డాక్టరు గారిని అనుసరించేందుకు వెళ్ళింది సిస్టర్.
    'మిస్టర్ ..నీకెలా ఉంది?'
    చార్ట్ ను పరిశీలిస్తూ 'ఈపాటికి నీ రోగం తగ్గి ఉండాలే....!' అనే భావం స్పురించేలా నా ముఖం లోకి చూస్తూ అన్నాడు డాక్టర్. ఆ ప్రశ్న ప్రతి రోజూ వేస్తూనే ఉన్నాడు...' అలాగే ఉంది' అని నా సమాధాన్ని అందుకుంటూనే ఉన్నాడు. మందులలో మార్పు లేదు... ఆహారంలో మార్పు లేదు. ఏవిధమైన మార్పు లేకుండా నా ఆరోగ్య పరిస్థితి మారుతుందని ఎలా ఊహిస్తారో ఈ డాక్టర్లు....? నేను ఆవేశంతో ....కోపంతో వణికి పోయాను. పైగా శరీరంలో వోపిక లేక యిక ఆగలేక పోయాను.
    'నా శ్రాద్ధం లా ఉంది... అవే నీళ్ళ మందులు... అదేమిటంటే స్టాకు అయి పోయిందంటారు. ఈ వార్డు లో ఎంతమంది పేషెంట్లున్నారు...? ఇందులో ఎంత మందికి మీరు ఇంజక్షన్లు యిస్తున్నారు డాక్టర్....? ఒక్కరికీ యివ్వడం లేదు... పైగా ఈ 'ఎలా ఉంది' అనే ప్రశ్న ప్రతి రోజూ రెండు సార్లు వింటున్నాం . ఏం సమాధానం చెప్పమంటారు? మమ్ముల్ని చూస్తె తెలియడం లా....? మా కేలా ఉందొ....? ఈ రంగు నీళ్ళతో మమ్ముల నెంతకాలం మోసగిస్తారు డాక్టర్....' ఆయాసం వల్ల యిక మాట్లాడలేక పోయాను. అలసట...ఆవేదన డాక్టర్ ముఖం చిన్నబోయింది. ఒక్కసారి గుడ్లురిమి చూశాను నన్ను! అమాంతం మ్రింగేసే విధంగా 'కమాన్ సిస్టర్ ' అని వెనుదిరిగి చూడకుండా వేగంగా వెళ్ళిపోయాడు ఏమేమో గొణుగుతూ. డాక్టరు వెళ్ళిన వైపే చూస్తూ ఆలోచనలో పడ్డాను. ఇక లాభం లేదు. అటు డాక్టర్ల తో యిటు నర్సు లతో పోట్లాడుతూ ఎంతకాలం యిక్కడ ఉండగలను? రెండు వారాలు గడుస్తున్నా నా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇకముందు అటువంటి మార్పు వచ్చే ఆశ కూడా కనుపించడం లేదు. అవును ...ఏవిధమైన ఆకర్షణ లేని నా గురించి ఎవరా లోచిస్తారు? చిరునవ్వు చిందించ లేను...ఉల్లాసమైన కబుర్లు చెబుతూ ఎవరినీ లోబరుచు కోలేను... పోనీ వీటన్నింటిని మించిన ఆయుధం డబ్బు కుమ్మరించడం....అదీ ఈ పరిస్థితిలో సాధ్యం కాదు. ఒకరిని నిందించి ఏమీ ప్రయోజనం లేదు. నిలదించే వోపిక కూడా లేదు. ఆవేశంతో ఆ డాక్టరు ముందు అలా పరుషంగా మాట్లాడాను... పరిస్థితి అటువంటిది... నిజం ఆలోచిస్తే ...అతని స్థానంలో నేనే ఉన్నట్లయితే అంతకన్న హీనంగా ప్రవర్తించి ఉండేవాడినేమో....? అనుమానం అక్కర్లేదు....అలా ప్రవర్తించే ఈస్తితికి వచ్చాను. ఇక యిక్కడ ఉండలేను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS