Previous Page Next Page 
గూడు చేరిన పక్షులు పేజి 11


    వారు వెళ్ళిపోయారు --
    'విన్నారుగా మీరు ఎంత పెద్ద డాక్టరు గారైనా ప్రస్తుతం నర్సు చెప్పినట్లు వినాలి....ఏమనుకున్నారు..?" చిరునవ్వు చిందిస్తూ అంది రాధ.
    'అలాగే .....నర్సు గారూ మీఅజ్ఞ పాటిస్తాను.' అని కళ్ళు మూసుకొని పడుకొన్నాను. పగలంతా హాయిగా విశ్రాంతి గా నిద్రపోయాను. సాయంత్రం నాలుగు గంటలకు మేలుకు వచ్చింది. పళ్ళ రసం.... బ్రెడ్ ..బటర్ అన్నీ సిద్దం చేసింది రాధ. అవన్నీ తీసుకున్నాను. మరొక గ్లాసు పండ్ల రసం యివ్వబోతుంటే వారించాను. బాగా పళ్ళరసం, పుష్టికరమైన ఆహారం యివ్వవలసిందిగా పెదబాబు గారు చెప్పారట! వారికి నాపై గల వాత్సల్యానికి నా మనస్సు వారిపట్ల పూజ్య భావంతో నిండిపోయింది.
    ఐదు గంటలకు రవి , వాణి వచ్చారు . రవి వస్తూనే 'పేషెంటు గా మారిన డాక్టరు గారూ ఎలా ఉందండీ మీకు? రేఖా దేవిని పరామర్శించి యిటు వస్తూ ఉన్నాం. మీ యిద్దరినీ ఈ విధంగా చూడడం ఒక్క పక్క బాధగానే ఉంది. ఏం చేయమంటారు? తప్పడం లేదు.' పరిహాసంగా అన్నాడు రవి. ఆ పరిహాసం వెనుక బాధ కూడా వ్యక్తమైంది.
    'థాంక్సు రవీ....! సమయానికి వచ్చి నన్ను రేఖాదేవిని రక్షించావ్...! వాణి .... ఆ థాంక్స్ నీకు కూడా...!'
    'చెప్పిన థ్యాంక్స్ చాలు గానీ యిక మేము వెడుతున్నాం. తమరికి చాలా నీరసంగా ఉంది. ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఒకవారం రోజుల తర్వాత వచ్చి ఆ రోజంతా యిక్కడే గడుపుతాము.
    'అలాగే!
    ఇద్దరూ వెళ్ళిపోయారు.  ఆ విధంగా నాలుగు రోజులు గడిచిపోయాయి. రాధ రాత్రింబవళ్ళు చేసిన సేవకు కొద్దిగా తేరుకున్నాను. బెడ్ పై లేచి కూర్చోగలుగుతున్నాను. పెదబాబు గారు నా ఆరోగ్యం నిమిత్తం ... బలం చేకూరే నిమిత్తం యింజక్షన్లు , టానిక్కు లు, పుష్టి కరమైన ఆహారం తాము స్వయంగా ఉండి యిప్పిస్తున్నారు.
    ఒకరోజు రాత్రి ఆహారం తీసుకున్నాను. రాధ కూడా తన భోజనం పూర్తీ చేసుకొని గది లోపలికి వచ్చింది. పగలంతా నిద్రపోవడం ...పనేమీ లేకపోవడం ...కనీసం మెదడుకు కూడా ఎటువంటి అలసట లేక పోవడంతో ఆ రోజు నాకు అసలు నిద్ర రాలేదు. ఏమైనా చదువుకోవాలని పించింది.
    'రాధా! నా షెల్ఫు నుండి ఏదైనా నవల తెచ్చిస్తావూ....?'
    'వీల్లేదు ...అంతగా కావాలంటే నేనే ఏదైనా తెలుగు నవల చదువుతాను. వినండి. మీరు మాత్రం చదవడానికి వీలులేదు.... అలసట కలుగుతుంది...'
    'మంచిది ....చదవను. రాధా. కొంతకాలంగా నన్నొక సందేహం బాధిస్తుంది. నీవేమీ అనుకోనంటే అడుగుతాను. నీవు ఒంటరిగా ఉన్న సమయాలలో ఏవో విషయాలను స్పురణకు తెచ్చుకొని బాధపడుతూ ఉండడం ఒకటికి నాలుగుసార్లు గమనించాను. అవకాశం లేక ఎప్పుడూ అడగలేదు. పోనీ నీ విషయాలే చెప్పకూడదూ? ఒక కధగా వింటాను....'
    '................'
    'ఏం రాధా.........! నాకు చెప్ప కూడనటు వంటి విషయాలా......?'
    'అదేమీ లేదు..తప్పకుండా చెబుతాను. మీతో కాక మరేవ్వరితో చెప్పుకోగలను? నా పరిస్థితి కూడా మీ పరిస్థితి లాంటిదే! ఇంతవరకు నా గత జీవిత విశేషాలను అమ్మాయి గారికి గాని, పెదబాబు గారికి గాని, ఎవరితోనూ చెప్పలేదు. ఒకటి రెండు సార్లు అమ్మాయి గారు అడిగితె మాట తప్పించాను. మరెప్పుడూ వారు అడగలేదు. ఇక్కడికి దగ్గరలో ఉన్నా ఒక పల్లెటూరు మాది. కలిగిన కుటుంబం లో జన్మించాను. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమార్తెను ఆ ఊరిలో గల స్కూలుకు వెడుతూ ధర్డు ఫారం వరకు చదువుకున్నాను. ఒక రోజు జరిగిన సంఘటన నా జీవితాన్నే మార్చి వేసింది... స్కూలు కు శలవు కావడం వల్ల ఆరోజు మా తోటకు వెళ్ళి పూలు తెచ్చుకుందామనే ఉద్దేశంతో బయలుదేరాను. అప్పటికి నేను యుక్త వయస్కు రాలనై రెండు మసాలైంది. అమ్మ....నాన్న ఆ సంవత్సరం తో చదువు మాన్పించాలని ఆలోచించారు. నాకేమో చదువుకోవాలని ఉంది. మా ఊరిలో హైస్కూలు లేనందు వల్ల నేను పట్టుబట్టే అవకాశం లేకుండా పోయింది. ఈ ఆలోచనలతో తోటకు దగ్గరయ్యాను. తలవంచుకొని నడుస్తున్న నాకు ముందుకు అడుగు పడలేదు. నాకు రెండు గజాల దూరంలో ఒక నల్ల త్రాచు పడగ విప్పి ఆడుతూ కనుపించింది. భయంతో వణికిపోయాను. సవ్వడి విని ఆటమాని నన్ను చూసి ముందుకు రాసాగింది. భయపడుతూ పరుగెత్తసాగాను. అది నన్ను వెంబడించింది. శక్తి కొద్ది పరుగెత్తాను. 'భయపడకు రాధా....! ఆ పామును నేను చంపేశాను.' చిరునవ్వుతో నన్ను వెనకకు పిలిచాడు సూర్యం. చచ్చిన పాము కనుపించింది. ఆ సంఘటనతో నాకూ, సూర్యానికి పరిచయం పెరిగింది....ఆ పరిచయం ప్రేమగా మారింది.'
    'అపావెం రాధా?......సూర్యం అని అంటున్నావు... నాకు కూడా సూర్యం పేరు గల తమ్ముడోకడున్నాడు , సూర్యం అంటే రమణయ్యగారి రెండవ అబ్బాయేనా?'
    'అవును! వారబ్బాయే....! అవుతే మీరు....?'
    'నేను ఆ ప్రసాదునే....! నీవు చేబుతూన్న ఆ సూర్యం అన్నను....ఇంతకూ మావాళ్ళంతా కులాసాగా ఉన్నారా....? ఈ మధ్య నీవేప్పుడైనా వెళ్ళావా?'
    'మీరు...మీరు ...రమణయ్య గారి మొదటి సంబంధం కుమారులు ప్రసాద్....మిమ్ములను గురించి వినడమే కాని ఎప్పుడూ చూడలేదు. అయినా మీరు ఊరు వదిలేసరికి నేను చాలా చిన్నదాన్ని. మీ నాన్న గారు మిమ్ములను చిన్నప్పుడు యింటి నుండి వెళ్ళగొట్టారనుకుంటాను.... దొంగతనం నేరం మోపి. మిమ్ములను అన్యాయం చేసి నందుకు ఆ సూర్యకాంతమ్మ గారికి తగిన శాస్తే జరిగింది.'
    'ఏం జరిగింది ....? నీవు చెప్పిన సూర్యం మా తమ్ముడు సూర్యమేనా? ఆ ఊరు విడిచి పది పన్నెండు సంవత్సరాలైంది . నేను ఆ ఊరు విడిచిన తర్వాత జరిగిన సంగతులు క్లుప్తంగా చెప్పు. వినాలని అడుర్హాగా ఉంది.'
    'ఏం చెప్పమంటారు? అన్నీ విచారకరమైన సంగతులే! సూర్యంతో పరిచయాన్ని పెంచుకున్న నేను కాలు జారాను. ఫలితంగా నెల తప్పింది. ఆ సమయం లోనే జలజ అనే నాటకాల అమ్మాయి మోజులో పడి సూర్యం నన్ను పూర్తిగా తిరస్కరించాడు సూర్యం. ఆ అమ్మాయితో పరిచయం ఏర్పడక ముందు నన్ను ఎంతో ప్రేమతో చూసేవాడు. మీ నాన్నగారు, మా నాన్నగారు మా వివాహానికి సమ్మతించారు. జలజ తో పరిచయం సూర్యం లో ఎన్నో మార్పులను తెచ్చి పెట్టింది. త్రాగుడు,....జూదం.... మనిషి నానాటికీ దిగజార నారంభించాడు. తల్లి, తండ్రి మంచీ చెడూ ఏమీ లేకుండా పోయింది. ఆ జలజ ను కొంతకాలం వేరే ఉంచాడు. ఆ తర్వాత నేరుగా యింటికే తీసుకు వచ్చాడు. సూర్యాన్ని కోపంలో కొట్టబోయిన మీ నాన్నగారు జారిపడి మంచ మెక్కారు. చివరకు మీ అమ్మ, నాన్న ఊరు విడిచి వెళ్ళిపోయారు.....ఎటు పోయారో....? ఒకరోజు నావిషయం తేల్చుకోవాలనే ఉద్దేశ్యంతో మీ యింటికి వెళ్లాను. జలజ, సూర్యం ఇద్దరూ త్రాగిన మైకంలో ఉన్నారు, సూర్యం నా గోడు ఏమాత్రం వినిపించుకోలేదు. నాకు ఈ ప్రపంచమే శూన్యంలా తోచింది. ఆలస్యం జరుగుతే ఊరంతా పోక్కుతుందనీ, మా కుటుంబ పరువు ప్రతిష్టలు నాశనమై పోతాయని ఊహించి ఆరోజు రాత్రే యిల్లు విడిచి హైదరాబాదు చేరాను... ఇక్కడ నాకు పరిచయస్తు లేవరున్నారు? ఎంతో మంది గృహస్తులను ఆశ్రయించాను యింటి చాకిరీ పని నిమిత్తం ఎవ్వరూ ఆ పని యివ్వలేదు. ఆ పరిస్థితిలో రెండు రోజులు తిరిగాను... ఆహారం లేదు.. ఒంట్లో వోపిక అంతకన్నా లేదు. కళ్ళు తిరగడం ప్రారంభించాయి.... నిలద్రోక్కు కున్నాను. లేని వోపిక తెచ్చుకొని మరొక ఫర్లాంగు నడిచాను. ఎదురుగా 'రేఖా నర్శింగ్ హోం ' అన్న బోర్డు కనుపించింది. ఎలాగో నర్శింగ్ హోం గేటు వరకు వెళ్ళ గలిగాను. ఇక ఆగలేక పడిపోయాను.కళ్ళు తెరిచి చూసేసరికి పెదబాబు గారు చిరునవ్వుతో పలకరించారు. వారి ముఖంలో కనుపించిన  ఆప్యాయత ఆదరణ నాకు ధైర్యాన్నిచ్చింది. వారి ప్రశ్నలలో ఒకే ఒక ప్రశ్నకు నా పేరు చెప్పాను....మిగతా ప్రశ్నలకు  సమాధానం యివ్వలేదు నేను... తరచి, తరచి ప్రశ్నించలేదు వారు. మానసికంగా, శారీరకంగా దెబ్బ తినడం వల్ల నాకు గర్భ స్రావం జరిగింది.... ఈ విషయంలో మాత్రం భగవంతుడు నాకు ఎంతో మేలు చేశాడు. నేను కోలుకోనేసరికి నెలరోజులు పట్టింది. ఆస్పత్రిలోనే ఉండి రోగులకు సేవచేస్తూ జీవితం శేషం వెళ్ళబుచ్చ తలచుకున్నట్లుగా పెదబాబుగారికి చెప్పాను... వారు సరే నన్నారు. అప్పటి నుండి యిక్కడే ఉంటున్నాను...క్లుప్తంగా యిదీ...నా చరిత్ర ...'
    'మా నాన్నగారు ...అమ్మ ఎక్కడి కెళ్ళారో నీకేమైనా తెలుసా రాధా....? ఎక్కడ....ఏ పరిస్థితిలో ఉన్నారో....?'
    'మీదెంత సులమైన హృదయం డాక్టర్? మిమ్ములను నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టారు మీ నాన్నగారు. దొంగతనాన్ని మీకు అంటగట్టారు సూర్యకాంతమ్మ గారు...సూర్యం ...వారి విషయంలో మీరు ఎంతో కాటిన్యం వహిస్తారనుకున్నాను. వారు మీకు చేసిన అన్యాయాన్ని బొత్తిగా మరిచి పోయినట్లున్నారు... పైగా వారిని గురించి బెంగ పడుతున్నారు.'
    'అదేమిటి రాధా...ఎంతైనా వారు నా కన్నతండ్రి.. దండించే అధికారం...దండించబడే బాధ్యత మా యిద్దరికీ ఉన్నాయి. అ విషయాల నింకా నేను మనసులో ఉంచుకున్నానా? ఇక సూర్యం వాడొట్టి అమాయకుడు. నేనంటే ఎంతో అపేక్ష వాడికి. తల్లి మాటలు విని చేదిపోయాడు. తన వ్రేలితో తన కన్నె పొడుచుకున్నటైంది ఆమె పరిస్థితి. ఆమె కూడా ఈపాటికి పశ్చాత్తాప పడుతూనే ఉండి ఉండాలి....'
    'మీర్తెన్నైనా చెప్పండి. మంచితనం...వోర్పు....శాంత భావం....తోటి మనుష్యుల పై సానుభూతి యివన్నీ మీరలవరచుకున్న ఉత్తమ లక్షణాలు. మీ నుండి నేను కూడా ఎంతో నేర్చుకున్నాను. ప్రధమం లో సూర్యాన్ని నేను విపరీతంగా ద్వేషించేదాన్ని....క్రమంగా ఆ ద్వేషం జాలిగా మారిపోయింది. అందులో అతని తప్పేముంది? నాతొ తోలి పరిచయం జరిగినప్పుడు మీ మంచితనాన్ని గురించి ఏంతో చెప్పేవాడు.... కాని చిన్నతనం కావడం వల్ల తల్లిని ఎదిరించలేక మీకు దూరమయ్యానని ఎంతగానో వాపోయేవాడు. మీరు గుర్తుకు వచ్చినప్పుడల్లా మీలాంటి వారెవ్వరైనా అతనికి తోడుగా ఉన్నట్లయితే ఆ విధంగా మారిపోయి ఉండేవాడు కాదని యిప్పుడనిపిస్తూ ఉంది. ఆ కుటుంబానికి మీరు దూరమయ్యాక అతను ఒక్కడే కావడం  వల్ల ఎంతో గారాభంగా చూశారు. ఆడింది అట....పాడింది పాట గా సాగింది అతనికి....'
    'ఎక్కడున్నా అంతా సుఖంగా ఉండడమే కావాలి నాకు. నాన్నగారి కింకా నా పై ద్వేషం ఉందేమోనన్న అనుమానం యింకా నన్ను పీడిస్తూనే ఉంది. ఏం చెయ్యను? తల్లిదండ్రుల ప్రేమను పంచుకోవడానికి నోచుకోలేని దురదృష్ట వంతుణ్ణి. ఒక విధంగా అది అదృష్టం కూడా కావచ్చు. వారివద్దనే ఉన్నట్లయితే యింత పట్టుదలతో చదివే వాడిని కాదేమో?...విధి నెవరు తప్పించగలరు....?'
    'చాలా ప్రొద్దు పోయింది...ఇక నిద్ర పొండి. మీ ఆరోగ్యం చెడుతుంది. పెదబాబు గారికీ విషయం తెలుస్తే నన్ను కోప్పడుతారు.'
    రాధ చేసిన హెచ్చరికతో నిద్ర కుపక్రమించాను. ఆ విధంగా బెడ్ పై పది రోజులు గడిపాను. రాధ చరిత్ర తెలిసిన తర్వాత ఆమెను మా కుటుంబంలోని ఒక వ్యక్తిగా తలచాను. మరొక వారం రోజులలో నాకు పూర్తీ ఆరోగ్యం చేకూరింది. క్రమంగా నా పనులు నేను చూసుకోవడమారంభించాను. పెదబాబు గారు నన్ను మరొక రెండు వారాలు విశ్రాంతి తీసుకోవలసింది గా హెచ్చరించారు. నాకు ఆరోగ్యంగా ఉండడం వల్ల ఊరికే పని లేకుండా కూర్చోవడం యిష్టం లేకపోయింది.
    రేఖాదేవికి కూడా పూర్తిగా ఆరోగ్యం కలిగింది. యాక్సిడెంటు లో ముఖానికి బలమైన గాయాలు తగలడం వల్ల ముఖం నిండా మచ్చలు ఏర్పడ్డాయి. పెదబాబు గారికి ఈ విషయం ఎంతో బాధను కలిగించింది. సుధాకర్ గారు యాక్సిడెంటు జరిగిన తర్వాత ఒక్కసారి మాత్రమే వచ్చి చూసి వెళ్ళారు రేఖాదేవిని; అదీ స్పృహ కోల్పోయి ఉన్నప్పుడు. ఆ తర్వాత మళ్ళీ రాలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS