Previous Page Next Page 
అపశ్రుతులు పేజి 11


    ఆమెనుంచి విడాకులు తీసుకున్న శ్రీనివాసరావు ఆమె క్యారెక్టరు గురించి పరోక్షంగా ఎంక్వయిరీ చేశాడు. "ఆమె ఎంత చొరవగా తిరిగేదో. ఎంత ఫ్రీగా మాట్లాడేదో అంతకు రెండింతలు జాగ్రత్తగా ఉండేది. ఏదన్నా చనువు తీసుకు మాట్లాడ్డానికే మగవాడికీ గుండెలుండేవి కావు" .....ఇదే దొరికిన సారాంశం. ఓరకంగా తృప్తి పడి గర్వించాడు శ్రీనివాసరావు. "తన విడిపోయిన భార్య జా ణికాదు." మనిషిది చిత్రమైన మనస్సు. తఃనది కాని భార్య ఎలాటిదై తేనేం! కాని ఆమె జారిణి అయితే కసి, బాధ.... ఆమె ఎలా బ్రతికినా తిన్నా తినకపోయినా శీలవతి ఐతే చాలు. తృప్తి.
    ఆ కుటుంబంలో ఎవరి వ్యాపకాలు వారివి. ఉదయం సాయంత్రం. రచ్చబండా. పొలం గట్లపైనా కూచొని తన వయస్సు వారితో లోకాభి రామాయణం చర్చించడం రంగనాధంగారి దిన చర్య. ఒక పూట వంటా సాయంత్రం పురాణ శ్రవణం తానూ వియ్యపురాలు కలసి దేవాలయాని కెళ్ళడంతో జానికమ్మ రోజులు దొర్లిస్తూంది. పిల్లలు కలగాలనే తపనతో నోములూ, వ్రతాలూ, దావాలూ, యాత్రలూ, అలసిపోయే శాంతా పార్టీలూ ఓట్లూ. ఎలక్షనూ డిన్నర్లూ సతమత మయి పోయేవాడు శ్రీనివాసరావు.
    ఎమ్. ఏ చదివిన శ్రీనివాసరావు తన తెలివీ చాకచక్యంతో సమితి ప్రెసిడెంటయి. మంచి పేరు తెచ్చుకున్నాడు. డబ్బూ హోదా పెరగడం పిల్లలు లేకపోవటం ఎప్పుడూ బెట్టుగా ఉండే ఆ ఇంటి అల్లుడు. తఃరుచు వచ్చి పోతూ కొడుకును కూడా పంపేవాడు. పచ్చగా అందంగా పదహారేళ్ళ మేనల్లుడు రామకృష్ణను చూస్తూ ముచ్చట పడేవాడు శ్రీనివాసరావు మేనల్లుడి కయే చదువు గురించి ఖర్చు క్రమంగా తానే భరిస్తున్నాడు. అరుదుగా వచ్చే అక్కా చెల్లెలు కామేశ్వరి. తరుచుగా వచ్చి జరీ చీరలు పట్టుకు వెళుతూంది. పదవీ, పలుకుబడీ గౌరవం, బాగా ఆర్జించి శ్రీనివాసరావు ఆ చుట్టుపట్ల గ్రామాలకామందు లందరికీ ఓ తగ్గ మనిషి. అయ్యాడు పెద్దా చిన్న చిన్న తగవులు సునాయాసంగా పరిష్కరించగలిగిన శ్రీనివాసరావుని ఒక న్యాయ మూర్తిగా గౌరవించే వారు.
    కాల గర్భంలో మరొక పన్నెండు సంవత్సరాలు లీనమయ్యే మళ్ళీ ఎలక్షనులు రాబోతున్నాయ్. ఎం.ల్. ఎ. గా పోటీకి నిలబడ బోతున్నాడు శ్రీనివాసరావు పదవీ వ్యామోహంలో ఉన్న ప్రతివారూ తిండీ, నిద్రా ఖాతరు చెయ్యకుండా ఒకటే హడావిడిగా తిరుగుతున్నారు, ప్రచారాలు సాగిస్తున్నారు.

                                           *    *    *

    అదొక పెద్ద పట్నం. కొందరు పెద్దలూ, స్నేహితుల్తో వచ్చిన శ్రీనివారావు అన్ని ఆధునిక సౌకర్యాలు అమర్చగల పెద్ద హోటల్లో బస చేశాడు.
    ఆ పుర వీధులన్నీ ఉత్సాహంగా, వినోదంగా విహరించి అలసిన శ్రీనివారావు హోటలు గది కొచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు.
    మెత్తని గ్లాస్కోపంచ, కట్ బనియనూ నలభై సంవత్సరాలు దాటిపోయిన శ్రీనివాసరవుని పరిశీలనగా చూసిన బోయ్... సార్. అన్నాడు కాస్త బిడియ పడ్తూన్న గొంతుతో.
    తలెత్తి అతనివైపు చూసిన శ్రీనివాసరావు అతను అడుగుతూన్న మాటకు ఊకొట్టాడు అన్యమనస్కంగా.
    ఆ బోయ్ పెదవులెందుకో విచ్చుకున్నాయ్
    రాత్రి పదిగంటలు కావస్తూంది. ఏవేవో తీవ్రంగా ఆలోచిస్తూ నిద్రపట్టని శ్రీనివాసరావు ఏదో మెత్తని అడుగుల సవ్వడికి ఉలిక్కిపడి వత్తిగిలి చూశాడు.
    అందమైన పద్దెనిమిదేళ్ళ అమ్మాయి.
    ఎప్పుడూ ఇలాటి అనుభవాలు చవిచూడని శ్రీనివాసరావు కంగారు పడ్డాడు. చివాలున లేచి కూర్చుని ఏమో అనబోయాడు కాని పెదవులు కదిలి ఊరుకున్నాయి.
    తెల్లని జరీ చీరలో పచ్చని శరీరం. నల్లని త్రాచులాటి జడ. సన్నజాజుల మాల ఏవేవో మత్తుసువాసనలు అందమైన అమ్మాయి రూపం అద్దంలో ప్రతిఫలిస్తూంది. వెనుదిరిగి నిల్చున్న అమ్మాయి వెనుకభాగం చూచిన శ్రీనివాసరావు అద్దంలో ఆమె వదనాన్ని చూసి కలవరంగాలేచి నిల్చున్నాడు.
    పాపం అమ్మాయి ఏడుస్తూంది.....ఆమె శరీరం సన్నగా కంపిస్తూంది.
    ఛ......ఛ..... ఆ బాయ్ ఇదే అడిగుంటాడు నన్ను. నా మతిమాలినతనం కావాలని ఊకొట్టే శాను. అందుకే కాబోలు నా వైపు చూసి వెటకారంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అనుకున్న శ్రీనివాసరావు సిగ్గుపడ్డాడు.
    తన స్నేహితులు ఇలాంటి అనుభవాలున్న వారు అనుకోవడం తాను విన్నాడు. ఆ అమ్మాయిలే చొరవగా సిగరెట్ కి అగ్గిపుల్ల వెలిగించీ పాలగ్లాసు.... తప్పితే మత్తుపానీయాలు నోటి కందించి ఎన్నో చిలిపిచేష్టలు చేసి మగవార్ని మత్తెక్కిస్తారట. కాని....ఈ అమ్మాయికి కొత్తో మరి తానంటే ఇష్టం కాదో, తొలిరాత్రి రమా, శాంత ఎలా బిడియంగా తలుపువారన నిల్చున్నారో అలాగే నిల్చుందీ అమ్మాయి. వారు ఏడవ లేదు, ఈ అమ్మాయి ఏడుస్తూంది నేనేదో బలవంతం చేస్తానని కాబోలు - కణతలు బలంగా నొక్కుకున్నాడు అలా నిల్చునే.

 

                                       
    ఆ అమ్మాయి దుఃఖం ఉధృతమౌతున్నట్టు ఆమె భుజాలు కదులుతున్నాయ్. మొహం చీర చెంగుతో తుడుచుకుంటూంది.
    అవతలి కెళ్ళిపోతావా?..... జాలి ధ్వనించే గొంతుతో నెమ్మదిగా అన్నాడు శ్రీనివాసరావు.
    చివాలున వెనుదిరిగి ఎర్రని వర్షించే కనులు ఉబ్బిన కనురెప్పలు కందిన మొహం ఎత్తి అతనివైపు చూసిన క్షణం అతని పాదాలు స్పృశిస్తూ ఉప్పున కూర్చుని..... "మీరు నాకు తండ్రిలాటివారు. నన్ను రక్షించాలి. మీరు." వెక్కి వెక్కి ఏడుస్తుందా అమ్మాయి.
    దిమ్మెరపోయి. స్థాణువులా. ఊహించని ఇలా ఇవ్వాళ జరుగుతుందని అనుకోని శ్రీనివాసరావు నిల్చుండిపోయాడు కొన్ని క్షణాలు చలనరహితంగా.
    అవతల వాన కురవడానికి సూచనగా, గాలి, ఉరుములూ విన్పిస్తున్నాయి. తలుపు గడియ వేశాడు.
    "దిక్కులేని దాన్ని, నిర్భాగ్యురాలను, దిఅవం నన్ను పరీక్షిస్తూంది నేను అనామకురాలను కావాలని తల్లిని పోగొట్టుకోవాలని ఆత్మీయంగా నన్ను కాపాడే వ్యక్తిని కోల్పోవాలని, శపించాడు. భగవంతుడు శాపోపహతురాలను...అందర్నీ కోల్పోయి.... నేను నమ్మిన వ్యక్తికి దూరం అయి..... ఈనాడు ఇలా.... పతితలా. కులటలా డబ్బుకి శరీరాన్నమ్ముకొని నీచురాలిలా మీ గదికి త్రోయబడ్డాను విశ్వనాధన్.....నీకెంత కసి!.....ఆవేశంగా అని పళ్ళు బిగబట్టి భగవాన్ నన్ను మట్టిలో కలిపెయ్ నా జీవితం ఇంతతో ముగిసిపోనీ.... మీ దగ్గరే దైనా చప్పున ప్రాణం పోయే పాయిజనుందా? అని అడిగింది.
    అవతల దబదబా హోరున వర్షం పడుతుంది. చలించే హృదయంతో. ఆర్ద్రమైన మనస్సుతో. "పాపం ఏదో ఊబిలో చిక్కుకున్నట్టున్నావ్.... నా వల్ల నీకేం భయంలేదమ్మా...నేను కోరలేదు నువ్వు కావాలని... నేను కొందరు వ్యక్తుల్ని కలుసుకోవాలని వచ్చను. ఏవో కొన్ని వ్యవహారాలు ఎదురు తిరిగాయి. నా ఆలోచనల్ల్లో నేను కొట్టుకుపోతూంటే అతనేదో అడిగాడు. సరే అన్నాను. నిన్నీ గదిలోకి నెట్టాడు. ఛీ ఛీ....ఎలాటి హోటల్లో బస చేసినా నాకిలాటి అలవాట్లు లేవమ్మా నేనేమి నిన్ను ముట్టుకోను. భయపడకు. నావల్ల జరిగే ఉపకారమేమన్నా ఉంటే నీకు తప్పకుండా చేస్తాను..... లే సరిగా కూర్చో......ఇందాక ఎవేమిటో అన్నావు. నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు ఎందుకిలాటి సుడిగుండంలో దిగి పోయావమ్మా?" దయా సానుభూతీ ఉట్టిపడే కంఠంతో అడిగాడు శ్రీనివాసరావు.
    గుండెల్లో లావాలా పొంగుతూన్న దుఃఖం పెల్లుబికింది. ఆమెకు మాటలు పెగిలిరాలేదు. కళ్ళనీళ్ళు ఇగిరిపోయేలా ఏడుస్తుందా అమ్మాయి మౌనంగా స్ప్రింగ్ కాట్ మీద కూర్చున్నాడు శ్రీనివాసరావు అస్తమితంగా.
    "నన్ను....నన్ను....ఈ హోటల్ నుంచి, ఈ పరిసరాలనుంచి ఈ బురద నుంచి తప్పించ గలరా?.....మీకు సాధ్యం కాదేమో! కాని ఒక్క ఉపకారం చెయ్యండి..... ఏదన్నా ప్రాణం పోయేమందు తెచ్చిపెట్టండి రేపు సాయంత్రం మరొక గదికి నన్ను పంపెలోగా ఈ జీవితం మలినం కాకుండా ఈ శరీరం ఏ తుచ్చులూ పాడుచేయకుండా ప్రాణం తీసుకుంటాను." జీరబోయి, రుద్ధమయిన గొంతుతో అందా అమ్మాయి.
    ప్చ్...పాపం......అస్సలు నువ్వెవరమ్మా? నీపేరు?"....అన్నాడు శ్రీనివాసరావు.
    "నేనా?....నేనేవర్నని చెప్పుకోను .... నా పేరు రాధ..."
    "నీకు తల్లి తండ్రులు లేరా? ఇప్పుడు లేకున్నా ......ఇది వరకుండేవారు. ఎవరు? నువ్వెందుకిలా చిక్కుల్లోపడ్డావ్? కుతూహలంగా అడిగేడు.....
    "నేనేమీ చెప్పలేదు.....సార్ నేనేమిటో అయి పోతున్నాను. ఎవరన్నా పొంచి నా గొంతు వినవచ్చు..... చావకుండా చచ్చేలా కొడతారు.....ఇదిగో చూడండి".....జాకెట్ కొంచెం పైకితీసి వీపు చూపించింది రాధ.
    ఎర్రని తట్లు.....హబ్బ.....అంటూ నొచ్చుకున్నాడతను.
    "ప్చ్..... నీ ఖర్మ..... నిన్నిక్కన్నించి తప్పించి బైట ప్రపంచంలోకి తీసుకువెళ్ళాలంటే.....ఎంతో తతంగం......పోలీసు రిపోర్టిస్తాను... ఇవ్వమన్నావా?" అన్నాడు శ్రీనివాసరావు.
    "లాభంలేదు నాలాటి ఆడపిల్లలు...చాలా మంది ముందు ఏడ్చి తరువాత అలవాటుపడి పోయారి హోటల్లో, పైగా ఇతనికి పెద్ధమనిషిగా. పెద్ద పెద్ద ఆఫీసర్లతో పరిచయముంది. డి.యస్.పి.... ఇతని బావమరిది."
    "నెమ్మదిగా చెప్పు అస్సలు నీ తల్లి తండ్రులెవరు?..... వర్షంలో ఎవరికీ వినిపించదులే...."    
    "నా తల్లితండ్రులా? నా తండ్రి....నా తండ్రి....నేను అతని బిడ్డను కాదని .... మా అమ్మ అక్రమంగా గర్భవతి అయిందనీ నిందమోసి. నా జీవితం. నయు పుట్టుకతో సంక్రమించే సంఘగౌరవం నాశనం చేసిన రాక్షసుడు.... నా అమ్మ ....అమ్మ ఉద్యోగం చేసేది, నేను నాలుగేళ్ళ పసిదాన్నిగా ఉన్నప్పుడు కారు ప్రమాదానికి గురియే ప్రాణం వదిలింది. హృదయమున్న ప్రతి మనిషీ నాకు తల్లి తండ్రులే అయారు.....బాల్య మంతా హాయిగా, స్వేచ్చగా బ్రతికేను. యౌవన మెంత భయంకరమయినది?..... నేను మరేమీ చెప్పలేను....నాకేదో భయంగా, పులినోట్లో చిక్కుకు గిలగిల తన్నుకుంటూన్నట్టుంది ..... నన్ను కొనుక్కుని విడిపించగలరేమో! .... నా భ్రమ. మీకేం కావాలి? మీ రెందుకు నన్నాదుకుంటారు?"
    "ఏమిటో ఏదీ పూర్తిగా, స్పష్టంగా చెప్పలేకపోతున్నావ్....మీ తల్లి తండ్రుల పేర్లు" .....ఆమె మాటలు విని కొంచెం గాబరాపడ్డ శ్రీనివాసరావు ఆమెను పరిశీలనగా చూస్తూ అడిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS