Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 11


    సుమతి కళ్ళెత్తి, సూటిగా సీతాపతిని చూసింది. సీతాపతి సిగ్గునభినయించాడు. చిరంజీవి హుందాగా నవ్వగలిగేడు. సుమతి ఏమి చెప్పేదోగాని- మరో గదిలోవున్న సుమతి వాళ్ళమ్మ స్వగతంలాటి ప్రకట నొకటి చేసింది.
    "ఏమిటీ! మన రామదాసుగారబ్బాయి నించున్నాడా? చెప్పేరు గాదె!"
    "అవునండి. నిలబడ్డ తర్వాత చెప్పవచ్చని మేము ఆలస్యం చేస్తే మీ సత్యమేమో-అవతల వాడెవడో వాడికి వోటివ్వమని చెప్పేట్ట. అందుకొచ్చేం," అన్నాడు "సీతాపతి.
    "ఇప్పుడు మాత్రం ముంచుకు పోయిందేముందిలే బాబూ! అల్లాగే. అమ్మాయి వోటుతోపాటు అమ్మాయి స్నేహితురాళ్ళ వోట్లన్నీ మన రామదాసుగా రబ్బాయికే వేయిస్తుంది."
    అన్నారావిడ సీనులోకి రాకుండానే- తలుపుచాటుగా.
    "థేంక్సండి!" అన్నాడు చిరంజీవి.
    "అవుననుకోండి! ఆ మాటేదో సుమతిద్వారావిని వెళ్ళిపోతాం. ఏమంటారు సుమతీ?" అన్నాడు సీతాపతి.
    సుమతి కాసేపు దిక్కులు చూసి అన్నది.
    "ఇంకా నయం. నేను మా వాళ్ళకి చెప్పేనుగాదు. మంచి టైముకే వచ్చారు. అల్లాగే.....అమ్మకూడా అన్నది గదా!"
    "చాలా చాలా థేంక్సండి! ఇంక వెళ్ళొస్తాం," అన్నాడు చిరంజీవి లేచి నించుని.
    అతన్ని మింగేటట్టు చూస్తూ, కళ్ళద్వారా కూచోమని హెచ్చరించేడు సీతాపతి.
    "అయ్యో!......రాక రాక వచ్చి అప్పుడే వెళ్ళిపోతారా? కాసేపు కూచోండి.అమ్మాయ్ సుమతీ నువ్విలా రాతల్లీ!" అన్నదా తల్లి.
    "ఇప్పుడే వస్తాను," అని చెప్పి సుమతి తల్లి దగ్గిరికి పరుగేత్తింది.
    ఆ ఇంటి మనుషులెవ్వరూ దగ్గిర్లేకపోడం గ్రహించి సీతాపతి చిరంజీవి మీద మండిపడ్డాడు.
    "వెధవ తొందరా నువ్వూనూ. ఇంటికొచ్చీ రావడంతోటే వెళ్ళి పోదామని సోది."
    "పనై పోయిందిగదా!" అన్నాడు చిరంజీవి నీళ్ళు నముల్తూ.
    "చూశావురా సత్యం! మనవాడి పనైపోయిందట. అందుకని చేతులు దులుపుకు పోతాట్ట," విసుక్కున్నాడు సీతాపతి.
    "అవున్రా జీవీ! నివ్వింకా చాలా నేర్చుకోవాలిరా అబ్బాయ్!" సలహా యిచ్చేడు సత్యం.
    చిరంజీవి మరింక మాట్లాడ లేకపోయేడు.
    సుమతి మూడు కాఫీల్తో తిరిగి ప్రత్యక్షమయ్యింది.
    "ఇప్పుడివన్నీ ఎందుకు చెప్పండి.....!" అనబోయేడు చిరంజీవి. కానీ, సీతాపతి మళ్ళీ ఏమనేస్తాడోనని నోరెత్తలేదు.
    కాఫీలు ముగించిన తర్వాత- మొట్టమొదట సీతాపతి లేచి నించున్నాడు. అతన్తోపాటు చిరంజీవి, సత్యవూఁలేచి నుంచున్నారు. వెళ్ళొస్తా మనిచెప్పి కారెక్కారు ముగ్గురూ.
    ఆ కారు హోటల్ రత్నావైపు కదిలింది.
    సుమతివాళ్ళమ్మ సుమతితో చిరంజీవి గురించి రెండు ముక్కలు చెప్పింది-
    "ఎప్పుడో......వాళ్ళమ్మ బతికున్న రోజుల్లో చూశాను. కుర్రాడు బాగా ఎదిగేడు సుమీ. జామపండులా తయారయ్యేడు.
    "డబ్బమ్మా డబ్బు అది ఎంత పనైనా చేస్తుంది. రామదాసు గారింట్లో జామపళ్ళే వుంటాయి. అవును గానమ్మా......ఇదే మరో నాదైతే, ఈ చిరంజీవి మనగడప తొక్కేవాడేనా? మన కాఫీ తాగే వాడేనా? ఇది వాళ్ళవసరం మరి!"
    సుమతి మాటల్ని తల్లి పట్టించుకోలేదు. తన ధోరణి మార్చనూ లేదు.
    "ఈ చిరంజీవి తల్లి మనక్కావల్సిన బంధువు. మీనాన్నగారికి మనదగ్గిర బంధువు. మహాతల్లి సుఖాలన్నీ అనుభవించి హాయిగా  కన్నుమూసింది. మీ నాన్నగారుండే రోజుల్లో ఆవిడ అప్పుడప్పుడూ మనింటికి వస్తూండేది తెలుసా? బంధుత్వం కాస్తా ఆ యిద్దర్తోనే పోయింది. ఏవిఁటో కాలమంతా ఒకే లాగుండదు చూడు."
    "అవునమ్మా! నువ్వు చెప్పిందే నిజం," అన్నది సుమతి పరాకుగా.
    
                                                                *    *    *
    
    గదికొచ్చిన వరప్రసాదం తలుపు తెరిచి లోపలికెళ్ళేడు.
    రవి మంచమ్మీద ఒక చీటీపడి వుంది.
    "ఎలక్షన్ల హడావిడిలో వున్నాను. హోటల్ రత్నాలో సీతాపతి గారు డిన్నరు ఏర్పాటు చేసేరు. నువ్వు నాకోసం వెయిట్ చేయకు. నువ్వొక్కడివే మెస్సుకెళ్ళి భోంచేసిరా. నాకోసం ఎదురుచూడకు."
    
                                                                                                                     -రవి
    
    వరప్రసాదం పడక్కుర్చీలో నడుంవాల్చి సుమతి యిచ్చిన నోట్సు తెరిచేడు. దాన్లోంచి, నీలంకాగితం కిందపడింది. కాగితం తీసుకుని చూశాడు. సుమతి రాసింది. ఆమె సంతకంగానీ, దాన్ని ఎవర్ని ఉద్దేశించి రాసిందోగానీ లేకుండా తెలివిగా ఒక "ప్రేమలేఖ"ని వ్రాయగలిగింది సుమతి.
    "చాలా చెప్పాలనుకున్నాను. భయపడి ఏమీ చెప్పలేక పోతున్నాను. చెప్పాలనుకుంటున్నది చదువు గురించి మాత్రంకాదు. అది మీరే నాకు చెబుతున్నారు. నేను మన మనసులుగురించి చెబుదామనుకుంటున్నాను. అభ్యంతరం లేకపోతే మీరూ చెప్పేందుకు ప్రయత్నించండి. మగవారు మీరు, అర్ధం చేసుకుంటే ధన్యురాలిని,
    
                                                                                                                   -నేను
    
    వరప్రసాదం దిగ్గునలేచి నించున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS