Previous Page Next Page 
గుళ్ళో వెలిసిన దేవతలు పేజి 11


    దేనికీ చలించలేదు పావని. తన కృషికి తన పుట్టింటి అండదండలుంటాయని పావని ఏనాడూ ఆశపెట్టుకోలేదు...
    ఏడాది నిండని పసివాడిని ఎత్తుకుని సంఘానికి వచ్చింది ఒక అమ్మాయి...ఇరవై ఏళ్ళు కూడా ఉండవనిపిస్తుంది లేతగా ఉన్న ఆ ముఖం చూస్తోంటే...
    "నన్ను మీకు తెలియకపోవచ్చు. కానీ, మీరు నాకు బాగా తెలుసు నేను నళిని అక్కయ్యను..." అంది పావనితో...
    నళిని తన అక్కయ్య గురించి చెప్పినదంతా గుర్తుకొచ్చింది పావనికి....అంత చిన్న వయసులోనే అన్ని అనుభవాలు ఎదుర్కోవలసి వచ్చిన ఆ పసిదాన్ని చూస్తే పావని మనసు కరిగిపోయింది.
    "ఏం కావాలమ్మా?" అంది ఆప్యాయంగా...
    "నా కథ వినే ఉంటారు... నన్ను నాశనంచేసిన ఆ దుర్మార్గున్ని శిక్షించకపోగా ఎదురు నాకే శిక్షగా అతనికే నన్ను కట్టబెట్టారు. దానికి కూడా తల ఒగ్గాను. కానీ, ఆ దుర్మార్గం అంతటితో ఆగలేదు. చీటికీ మాటికీ మా నాన్న నడిగి నన్ను డబ్బు తెమ్మని వేధించటం మొదలయింది. 'నాకు లొంగిన దానివి. ఇంకా ఎంతమందికి లొంగావో?" అని సూటిపోటి విసుర్లు కూడా ప్రారంభమయ్యాయి. చూడండి! ఈ దారుణం! అతనికి నేను లొంగానట! అవును విచక్షణ జ్ఞానంలేకుండా కేవలం పాశవిక సౌఖ్యం కోసం ఒక ఆడదాని బ్రతుకు సర్వనాశనం చెయ్యటానికి సిద్దపడిన పశువులో ఇంతకు మించిన సంస్కారం ఎలా ఉంటుందీ ఇంక ఈ నరకం నేను భరించలేను. మీ సంఘంలో ఉండిపోదామని వచ్చాను. ఏ పాపమూ ఎరుగని నా బాబుని సంఘం పొడిచి పొడిచి చంపుతుందేమో; అభాగ్యురాలే కాని, అపరాధి కాని తన తల్లిని దోషిగా చిత్రించే సంఘం తాకిడికి తట్టుకోలేని నా బాబు తనకు జన్మనిచ్చిన తల్లిని శపించుకోవలసిన దుర్గతి పడుతుందేమోనని ఇన్నాళ్ళూ సందేహించాను...కానీ, తన తల్లి దోషి కాదని నా బాబుకి చెప్పగలిగే సంఘం మరొకటి ఉందనే ధైర్యంతో వచ్చేసాను. నా బాబు పెరిగి పెద్దవాడయ్యాక 'లేచిపోయిన దాని కొడుకు' అని చిన్నచూపు చూడ ప్రయత్నించే మూర్ఖ సమాజాన్ని ఎదుర్కోగలిగే నైతికస్థైర్యం ఈ సంఘం అండదండలవల్ల లభిస్తుందనే ఆశతో వచ్చాను..."        'పురోగామి'సంఘంలో చేరటానికి వచ్చే ప్రతి అభాగ్యురాలిలోనూ తన సరళే కనిపిస్తోంది పావనికి- కన్నీళ్ళతో ఆ బాబును తను అందుకుని "ఉండమ్మా! మా సంఘం ధ్యేయమే అది-" అంది.
    కానీ, కొంచెం రోజుల్లోనే ఆ అమ్మాయికోసం భర్త వచ్చేసాడు.
    అసహాయురాలై తననే ఆశ్రయించినంతకాలం కాల్చుకు తిన్న ఆ పురుష పుంగవుడు... సంఘానికి భయపడి స్త్రీ సహనాన్ని తెచ్చిపెట్టుకోవలసిందే అని ధీమాగా ఉన్న ఆ భర్త...మరొక చిన్న స్మఘం అండదండలతో ఒక ఆశ్రయాన్ని పొంది తనను లక్ష్యపెట్టని స్త్రీ ముందు నిలవలేక పోయాడు....
    "నన్ను క్షమించు. ఇంకెప్పుడూ నిన్ను కష్టపెట్టను. మన ఇంటికిరా" అన్నాడు కాళ్ళ బేరానికి వచ్చి...
    సంసారం వదులుకోవాలని ఏ స్త్రీకీ ఉండదు. తన భర్త ఈ మాత్రం కనీసపు మానవత్వం చూపించినా చాలనుకుని బిడ్డతో వెళ్ళిపోయింది నళిని అక్కయ్య...
    ఈ విజయానికి చాలా ఆనందించింది పావని. వెంటనే శిరీషకి వ్రాసింది...
    "ఆనాడు నువ్వు చెప్పిన ఆలోచన ఎంత మంచిదో, ఈనాడు అనుభవంలోకి వచ్చింది. సంఘమంటే ఏమిటి? మనమంతా కలిసిందే కదా! సాంఘికాచారాలూ మనం ఏర్పరచుకున్నవే గదా! గొర్రెల మందలా ఒక గాడిలో పడి నడవటానికి అలవాటుపడ్డ జనం ఆ గాడి వదిలి మరొక మార్గం .... ఎంత మంచిదయినా సరే .... అనుసరించటానికి భయపడుతారు....మనం కూడా మనదైన సంఘబలం ఏర్పరచుకాబట్టే ఈ మాత్రమైనా చెయ్యగలుగుతున్నాం...
    తన చికాకులన్నీ మరిచిపోవటానికి పావని యంత్రంలాగ పనిచెయ్యసాగింది. శిరీష పావనిని ప్రోత్సహిస్తూ ఆ ఊళ్ళోనే కాక ఆంద్రప్రదేశంలో అన్ని ప్రాంతాలలోనూ సంఘాలు స్తాపింది తమ ఉద్యమం వ్యాపించేలా చూడమని చెప్పింది. ప్రభుత్వం నుండి గ్రాంట్స్ సేంక్షన్ అవటానికి సహకరించింది. పావని వివిధ ప్రాంతాలకువెళ్ళి మీటింగ్స్ ఏర్పాటుచేసి తమ ఆశయాలను వివరిస్తూ ఉపన్యాసాలియ్యసాగింది. మొత్తంమీద ఈ విషయం అందరి దృష్టిలోకి వచ్చింది...కొందరు నవ్వారు. కొందరు భయపడ్డారు. చాలామంది వ్యతిరేక ప్రచారాలు ప్రారంభించారు. కొద్దిమంది మాత్రమే పావని ఆశయాలేమిటో సరిగా అర్ధం చేసుకోగలిగారు. ఆ కొద్దిమందిలో ఇంకా కొద్దిమంది మాత్రమే అనుసరించటానికి సిద్దపడ్డారు... ఈ ఫలితాలకు నిరుత్సాహపడలేదు పావని.
    పద్మావతి దగ్గిరనుండి ఉత్తరం వచ్చింది పావనికి. తనకు చిరపరిచితమయిన ఆ దస్తూరి చూడగానే ఆనందంతో పొంగిపోయింది పావని మనసు.....ఎంతగా తనను తను మభ్యపెట్టుకున్నా, తన మనసు తన సంసారంకోసం ఎంతగా ఆరాటపడుతోందో అర్ధమయి ఉసూరుమంది.
    "చి|| సౌ|| పావనికి.
    ఆశీర్వదించి వ్రాయునది. నువ్వు క్షేమమని తలుస్తాను. నువ్వులేని ఇల్లు ఇల్లు లాగే లేదు.ప్రతిక్షణం నువ్వు గుర్తువస్తూనే ఉన్నావు. అబ్బాయి సంగతి సరే సరి...ముఖంలో ఏ కోశానా కళకాంతులు లేవు...ఇదంతా ఎందుకో, ఏమిటో, నాకేమీ అర్ధంకావటంలేదు.
    ముఖ్యమయిన విషయం. చి|| అనుపమకి ఒక మంచి సంబంధం కుదిరింది. కట్నం మాత్రం చాలా ఎక్కువ అడుగుతున్నారు. యాభైవేలు నువ్వు ఏమైనా సర్దుబాటు చెయ్యగలవా? దానికి పెళ్ళిఅయిపోతే నాకు నిశ్చింత. నిన్ను చూడాలని మనసు కొట్టుకుపోతోంది...
    
                                                                                                      ఆశీర్వచనములతో,
                                                                                                            అత్తయ్య..."
    
    ఆ ఉత్తరం ఒకటికి పదిసార్లు చదువుకుంది పావని...
    అనుపమకి త్వరగా పెళ్ళి కావాలనే పావని కూడా కోరుకుంటోంది...ఒక్కసారి వెళ్ళిపరిస్థితులు తెలుసుకురావాలని అత్తగారు ఇచ్చిన అడ్రస్  ప్రకారం తన ఇంటికి తను చుట్టం చూపుగా వెళ్ళింది...పావనిని చూసి పద్మావతి చాలా సంతోషించింది...
    "నీ సంసారం నువ్వు చూసుకో తల్లీ! ఇదంతా ఈదటం నా వల్లకాదు" అంది గంటలో పదిసార్లు.
    పావని నవ్వి ఊరుకుంది.....అనుపమ పావనిని కౌగలించుకుని కన్నీళ్ళు పెట్టుకుంది.
    "ఇంత చిన్న ట్రావెలింగ్ బేగ్ తో వచ్చావు మళ్ళీ వెంటనే వెళ్ళిపోదామనే కదూ!" అంది నిష్టూరంగా.
    "అక్కడ పనులు లేవా అనూ! అది సరే! నీ పెళ్ళిసంగతులు చెప్పు. పెళ్ళికొడుకు నీకు నచ్చాడా?"
    "ఆ సంగతి సరేలే వదినా! కట్నం సంగతి చూడు! యాభైవేలు కావాలిట! బాగుందా? ఇలా అయితే ఆడపిల్లగతి ఏమయిపోవాలి?"
    "అంత బాధపడేదానివి, కట్నం తీసుకునే వాళ్ళను పెళ్ళి చేసుకోనని చెప్పెయ్యరాదూ?"
    "హమ్మో! ఆడపిల్ల పెళ్ళి కాకుండా ఉండటం కష్టం వదినా! నాకు నీ అంత ధైర్యం లేదు."
    అనుపమ మాత్రమే కాదు, ఆడపిల్లలంతా ఇంతే! అందరి కందరూ "హమ్మో! పెళ్ళిలేకపోతే ఎలా?" అనుకునేవారే! అందుకే ఈ సమస్యలు పరిష్కారం కావు...
    "విఠల్ బేంక్ లో ఇరవైవేలు మాత్రం వేశాడు. ఆ డబ్బు ఏ మూలకి? కట్నం, పెళ్ళిఖర్చులు...పావనీ! నువ్వు ఆ పొలం మూడెకరాలైనా అమ్మి డబ్బు పంపకపోతే లాభంలేదు." అంది పద్మావతి.
    పద్మావతి ఉత్తరం అందుకున్న దగ్గిరనుండీ మనసులో పీడిస్తున్న అనుమానం బయటపెట్టింది పావని...
    "మీ అబ్బాయి నన్ను డబ్బు అడగమన్నారా?"
    ఆప్రశ్న వింటూనే పద్మావతి గుండె బాదుకుంది.
    "అయ్యో! ఇంకా నయం వాడు అడగమంటాడా? తెలిసిందంటే నన్ను తవ్వి పాతేస్తాడు. వాడికి తెలియనియ్యకు. మా అన్నయ్యదగ్గిరో ఎక్కడో, అప్పు తీసుకున్నానని చెపుతాను."
    తన సొంత పొలం అమ్మి తను సహాయం చెయ్యాలి. ఆ విషయం విఠల్ కి తెలియడానికికూడా లేదు. విఠల్ ని బట్టి కాకపోతే, వీళ్ళంతా ఎవరూ తనకి? తను ఈ కుటుంబంకోసం ఎంతగా పాకులాడుతోందో విఠల్ కి తెలిస్తే అవకాశం లేకపోయాక సహయం చెయ్యవలసిన అవసరం తనకేమిటి? విలవిల లాడింది పావని మనసు...
    "ఇంతవరకూ మన అనుపమ పెళ్ళి ఎలా అవుతుందా అని తల్లడిల్లిపోతున్నాను. నువ్వు వచ్చావు. నాకు కొండంత బలంవచ్చింది. ఎలాగైనా ఆ డబ్బు పంపిస్తావు కదూ!"
    "అలాగే" అన్నట్లు తల ఊపింది పావని...
    సాయంత్రం విఠల్ వచ్చాడు. పావనిని చూడగానే అతని ముఖం వికసించింది. ఆ భార్యాభర్తల మధ్య తను ఉండటం ఇష్టంలేక ఏదొపని కల్పించుకుని వెళ్ళిపోయింది పద్మావతి.
    "పావనీ!" అంటూ పట్టరాని ఆనందంతో పావనిని తన చేతులలో ఎత్తుకుని పడకగదిలోకి తీసికెళ్ళాడు విఠల్.
    కిల కిల నవ్వింది పావని. విఠల్ గుండెల్లో తలదాచుకుని జన్మలో ఎప్పటికీ ఆ సౌఖ్యంనుండి దూరం కాకుండా ఉండగలిగితే బాగుండు ననుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS