Previous Page Next Page 
ఆదివిష్ణు కథలు పేజి 11


    "ఆర్డరేం ఖర్మ? అటు చూడు. ఆ టేబిల్ మీద అన్నీ సిద్దంగా వున్నాయి. కుమ్మేద్దాం కమాన్" అంటూ గోపాలాన్ని ఆ టేబిల్ దగ్గరికి తోసేడు పార్ధసారధి.
    ఇద్దరూ బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు. మధ్యలో అడిగేడు గోపాలం -"అవునూ - ఇంత సడెన్ గా ఖబురూ కాకరకాయా లేకుండా ఊడిపడ్డావేమిటి విశేషం?"
    "బిజినెస్ పనిమీద -సడన్ గానే - న్యూయార్క్ వెళ్ళాల్సి వచ్చింది!" సమాధానమిచ్చాడు పార్ధసారధి.
    "ఎప్పుడు?" అడిగాడు గోపాలం.
    "ఎప్పుడో అయితే నిన్నెందుకు తక్షణం రమ్మంటాను! ఈ సాయంత్రం ఇక్కడే విమానం ఎక్కాలి!"
    "ఈ సాయంత్రమా?" నొక్కి అడిగాడు గోపాలం.
    "అవును!" అన్నాడు పార్ధసారధి.
    "అయితే ఎల్లుండి నువ్వు విశాఖపట్నంలో వుండవు. అంతేగా!" పార్ధసారథిని అడిగేడు గోపాలం.
    'అఫ్ కోర్స్!.... లెక్కప్రకారం చెప్పాలంటే అంతేగా మరి?" అన్నాడు పార్ధసారథి గోపాలంతో.
    గోపాలం మౌనంగా ఉండిపోయాడు. అతని వరస గమనించి నవ్వుతూ అడిగేడు పార్ధసారధి.
    "సైలెంటైపోయావే?" అని
    "ఏముంది? సింపుల్! ఇవాళ మార్నింగ్ సడన్ గా వచ్చి నువ్వు నన్ను సర్ ప్రైజ్ చేసినట్టు - ఎల్లుండి మార్నింగ్ నీ ఫ్లాట్ లో సడన్ గా ప్రత్యక్షమై నేను నిన్ను థ్రిల్చేద్దామానుకున్నాను. వదిలేయ్! దేనికైనా రాసిపెట్టి ఉండాలంటారు - ఇందుకే!"    
    "విశాఖపట్నంలో ఏం పనో?"
    "ఆఫీసు పని వారం రోజులు విశాఖపట్నంలోనే వుండాలి. అక్కడికి ఎప్పుడు వెళ్ళినా నీ ఫ్లాటులో దిగడం అలవాటైంది గదా? అంచేత హోటల్ రూమ్ అక్కర్లేదని ఆఫీసులో చెప్పేను కూడా!" అన్నాడు గోపాలం నీరసంగా ముఖంపెట్టి.
    "విషయం చెప్పేవు గదా! వెరీగుడ్! నిక్షేపంగా నా ఫ్లాటులోనే వుండు. ఎందుకైనా మంచిది. ఈ డూప్లికేట్ కీ నీ దగ్గిరే వుంచుకో" అని తాళంచెవి గోపాలం ముందుంచాడు పార్ధసారధి.
    గోపాలం తాళంచెవిని తాకకుండానే నసిగేడు-
    "అయినా ... నువ్వు లేకుండా..."
    పార్ధసారధి తాళం చెవిని తీసుకుని - దాన్ని చొరవగా గోపాలం చొక్కా జేబులో వేసి అన్నాడు.
    "ఇక నుంచి ఇది నీ దగ్గిరే ఉంటుంది. పర్మినెంటుగా వుంటుందన్నమాట. నీమీదొట్టు - ఎల్లుండి విశాఖ వెళ్ళినప్పుడు  నువ్వు నా ఫ్లాటులోనే దిగుతున్నావు. సరేనా?"
    "సరే!" అన్నాడు గోపాలం నవ్వుతూ.
    "మనం ఇప్పటివరకు బ్రహ్మచారులం. ఈ దశలో మాత్రమే మనం మన  ఇష్టప్రకారం బతుకుతాం. అడిగే వాళ్ళు వుండరు. రేపు మనకి పెళ్ళిళ్ళయితే -మన ఇష్టాలూ, సరదాలూ- ఇల్లాళ్ళ చేతుల్లో వుంటాయి. అంచేత వాళ్ళ ఇష్ట ప్రకారం మనం బతకాలి. అన్నట్టొరే గోపాలం -" అని క్షణంసేపు ఆగి ఊరిస్తూ చెబుతున్నా ఏదో రహస్యం చెబుతున్న టైపులో అంటున్నాడు పార్ధుడు.
    "అద్భుతమైన సౌకర్యాలు సమస్తం నా ఫ్లాటులో బోలెడున్నాయి. ఆ విషయం నీక్కూడా తెలుసు. అయినా బోరుకొడితే చేతులు కట్టుకుని కూచోవద్దు. నా పక్క ఫ్లాటుని మొన్నీ మధ్యనే ఒక 'అప్సరస' కొనుక్కుంది. పేరు నీలవేణి. తన పేరు అందరికీ చెప్పదు. తాను ఇష్టపడ్డవాళ్ళు -అడక్కపోయినా చెబుతుంది. ఆమె కూడా తన ఫ్లాటులో ఒంటరిగానే వుంటోంది పాపం! ఏమిటర్ధమవుతోందా?" చెబుతున్న మేటరుకి కావాలని బ్రేకేసి అడిగేడు పార్ధసారధి.
    "ఎందుకర్ధం కాదు? తెలుగులోనే చెబుతున్నావుగా!" అన్నాడు.
    "ఇలాంటి సందర్భాల్లో భాష ముఖ్యం కాదు బాబూ! భావం -భావాన్ని బహుబాగా అర్ధం చేసుకుంటేనే గాని సుఖముండదు. అర్ధమయ్యిందా? నీకు తోచనప్పుడు... తోడెవరైనా కావాలనుకున్నప్పుడు...."
    "సారీ పార్ధూ! నాకు ఆ రంగంలో అనుభవం గానీ ఆసక్తిగానీ బొత్తిగా లేవు. ఆ రొంపిలో నన్నుదించే ప్రయత్నం చేయకు!" అన్నాడు గోపాలం.
    అంచేత ఆ టాపిక్కుకి అక్కడ్తో చుక్కపడిపోయింది.
    సరిగ్గా అదే సమయంలో...
    అక్కడ విశాఖపట్నంలో నీలవేణి ఫ్లాటులోకి సూటుకేసుతో వచ్చిన తన స్నేహితురాలిని ఎంతో ఆనందంగానూ, ఆత్మీయంగానూ పలకరించింది నీలవేణి.
    "వండ్రఫుల్! ఇదేనా రావడం?"
    "చూస్తూ అడుగుతావే?" అన్నది అన్నపూర్ణ - తన చేతిలోని సూటుకేసు నేలమీద పెడుతూ-
    "నిజంగా నమ్మలేకపోతున్నానే పూర్ణా!" అంది.
    "చాల్లే ఊరుకో బడాయిపోతున్నావు. మా డిపార్టుమెంటు వాళ్ళు ఈ ఊళ్ళో మాకు శిక్షనా తరగతులు నిర్వహిస్తున్నారు!" అన్నది అన్నపూర్ణ.
    "శిక్షణా తరగతులా?" అడిగింది నీలవేణి.
    "ఇంగ్లీషులో ట్రయినింగ్ క్లాసులంటార్లే!"
    "దాదాపు ఉద్యోగంలో చేరి సంవత్సరం గడిచినా.... ఇంకా ట్రైనింగేమిటే నా మొహం?" అంది నీలవేణి.
    "అదంతేనే- నీ మొహం! ఈ క్లాసులు పదిరోరోజుల పాటు వుంటాయి. ఈ పదిరోజులూ ఎంచక్కా నీ ఫ్లాటులోనే తిష్టవేద్దామని కొండంత ఆశతో వచ్చాను. తెల్సా?"
    "అది కాదే పూర్ణా!"
    "నసగొద్దు. అభ్యంతరమైతే ఇప్పుడే చెప్పు. మరో ఏర్పాటు చూసుకుంటా! వెతుక్కునే ఓర్పూ, నేర్పులుండాలే గానీ - ఇంత పెద్ద సిటీలో ధర్మసత్రాలకే కరువా?" వ్యంగ్యంగా అన్నది అన్నపూర్ణ.
    అన్నపూర్ణ ధోరణికి బాధపడుతూ అంది నీలవేణి-
    "ఇవాళ నేను సింగపూరు వెళుతున్నాను!" అంది.
    "ఏమిటేమిటి? సింగపూరా? చింతగుంటపాలెం వెళుతున్నట్లు -సింగపూరని ఎంత సింపులుగా చెప్పేవే నీలూ! నువ్వెక్కడికివెళితే నాకేంటి గానీ - నా పట్ల గౌరవ, మర్యాదలు బొత్తిగా లేకుండా -నా ఒక్కర్తినీ నీ ఫ్లాటులో బంధించి -నువ్వు చింతగుంటపాలెం - అయ్ మీన్ -సింగపూరు చెక్కేస్తావా? స్నేహమంటే ఇదేనా?" నాటక ఫక్కీలో కోప్పడింది అన్నపూర్ణ. నీలవేణి దిగులుగా అన్నది-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS