Previous Page Next Page 
అదివిష్ణు నవలు -2 పేజి 11

 

    "రండి రావ్ గారూ! అలా కూచోండి. నాన్నగారు బయటికి వెళ్ళేరు. కాసేపట్లో వస్తారు. కూచోండి' అన్నది పద్మ.
    రావు భయం భయంగా కూచున్నాడు.
    "అప్పన్నా మాకు లైం జ్యూస్ పట్టుకురా" అన్నది పద్మ.
    చాలాసేపటివరకూ వాళ్ళిద్దరి మధ్యా మాటలు లేవు. చివరికి, తెగించి రావే మాటాడేడు నాటకీయంగా.
    "ఇవాళ మీరదోలా ఉన్నారు?"
    పద్మ ఆ మాటలలో ఉలిక్కిపడిపోవటం అతను స్పష్టంగా చూసేడు. అప్పుడూ అతను భయపడ్డాడు.
    "మరేనండి . ఎందుచేతనో ఒంట్లో బాగోలేదు."
    (ఇంకానయం , మనసన్నావుగాదు. పద్మా! ప్రమాదమైపోయేది!)
    "మధ్యాహ్నం క్లాసులో ప్రారంభమయింది ఈ సుస్తీ. ఇప్పుడే మీరు వచ్చేముందే కొంచెం ఉత్సాహంగా ఉన్నాను. ఆఫ్ కోర్స్ దానికి కారణమూ ఉందనుకొండి."
    "ఎమిటండోయ్ కారణం!"
    (ప్లీజ్ పద్మా! ఉత్తరం అంటున్నావు. ఉత్తరం చదివేవు కదూ! నన్ను ప్రేమిస్తున్నమాట నిజమే!)
    "ఉత్తరం  వచ్చింది."
    "ఉత్తరమా?"
    "గుడ్ హెవేన్స్! ఇంకేం రేయ్ సుబ్బిగా. మన పధకం పనిచేసిందిరా! పద్మ ఒప్పుకుంటుంది. నా ప్రేమ గెలిచిందిరోయ్! పద్మ ఒప్పుకుంటుంది. నా  ప్రేమ గెలిచిందిరోయ్! నిన్ను తెగలేట్టా - నువ్వసాధ్యుడివి.)
    "అవునండి.సరిగ్గా కాలేజి నుంచి వచ్చానో లేదో నా కంటబడిన మొట్టమొదటి ఉత్తరమిది. మీకు చెప్పెనో లేదో - ఆఫ్ కోర్స్-"
    (అబ్బబ్బ స్పీక్ పద్మ! నువ్వు చెప్పబోయేది నాకు తెలుసులే ఫర్వాలేదు. తొందరగా చెప్పు.)
    "మా బావ విశాఖపట్నంలో హోస్ సర్జన్ గా ఉన్నాడు లెండి. అతను వస్తున్నాట్ట ఈవేళ. అతను వస్తే , నాకు తోచకపోవడం ఉండదు. మీకు చెప్పలేదనుకుంటాను - వచ్చే సమ్మర్ లోనే మా పెళ్ళి ." ఆ మాట చెప్పి పద్మ సిగ్గుపడిపోయింది.
    "పద్మా ! ఏమిటిది పద్మా! నాకెందుకీ సంగతి చెప్పలేదు. నేను ఫూల్ నైపోయాను. పద్మా. పార్టన్సీ ! మీ బావ ఎవరో గాని అయన పాదాల దగ్గిర నా తల బద్దలు కొట్టుకోవాలి. నువ్వీ సంగతి నాకు మునుపే చెప్పి ఉంటె, నా ప్రేమ సుబ్బిగాడికి గాడు గదా -- ఆ బ్రహ్మకి కూడా తెలిసేది కాదు. ఆ చెత్త ఉత్తరాన్ని నువ్వు చదివేదానివీ కాదు . పద్మా! నేను దుర్మార్గుడిని , దొంగని, మోసగాడ్ని , వెధవని . నీ యిష్టం వచ్చిన శిక్ష విధించు .)
    "....అయన వస్తున్నారన్నమాట!"
    "అవునండి. పేరు విద్యాసాగరం. మీకు పరిచయం చేస్తానుగా. రెండో రోజునే మీకతను అత్మీయుడైపోగలడు. వట్టి భోళాశంకర్లెండి."
    "అవునా పద్మా! అతనంత మంచి మనిషా! రేయ్ రావు గాడిదా? భ్రష్టుడివిరా నువ్వు! గుడ్డి సంనసివిరా వెధవా! నీకీ జన్మలో సుఖముండదు పో. ఒక అడ కూతుర్ని క్షోభ పెట్టేవు గదరా పాపీ! నన్నీ పాపం తినేస్తుంది. నిన్ను రక్షించే దేవుడ్లేడు!)
    "అయితే తప్పనిసరిగా ఆయన్ని కలుసుకుంటాన్నేను." అన్నాడు రావు.
    లైం జ్యూస్ తాగేరిద్దరూ. ఫోను వచ్చిందని అప్పన్న చేసినప్పుడు పద్మ లేచింది. ఈ అవకాశాన్ని రావు తెలివిగా వాడుకుని -
    "అయితే నేను వస్తానండి. రేపు మా సాగరంగార్ని నేను తప్పకుండా కలుసుకుంటాను . సెలవు !" అన్నాడు.
    అక్కడ్నుంచి తిన్నగా సుబ్బారావు గదికి వెళ్ళాడు. అక్కడ, అతని సమక్షంలో జరిగిందంతా చెప్పి గుండెలవిసెలా ఏడ్చేందుకు సిద్దపడి, అతి ప్రయత్నం మీద ఆ దుఃఖాన్ని ఆపుకున్నాడు .
    అతని కళ్ళల్లో నీళ్ళు గమనించిన సుబ్బారావు బాగా కదిలిలిపోయి అన్నాడు.
    "నిజంగా చెప్పేస్తున్నారా రావ్! నీలాటి మంచి సన్నాసి నాకు మిత్రుడని చెప్పుకునేందుకు నే నివాళ  సంతోషిస్తున్నావు. నువ్వు మహానటుడివెకాదు..... మహా మనిషివి. చేతులెత్తి నీకు నమస్కారం చేయాలి. దేవుడున్నాడురా రావ్! వాడు నిన్నెప్పుడూ చల్లగా చూస్తాడు. కంగారుపడకు , ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రేమ రహస్యం నా నోటి నుండి బయట పడదని హామీ ఇస్తున్నాను. నిశ్చింతగా ఉండు."
    

                                                        *    *    *

    విధ్యసాగరంతో రావ్ కి పరిచయం కలిగింది.
    విద్యాసాగరం పోయిన ఏడాది మెడిసిన్ పూర్తీ చేసి ఇప్పుడు విశాఖపట్నంలో హౌస్ సర్జన్  చేస్తున్నాట్ట. అతను తెల్లగా , బొద్దుగా పొడువుగా ఉండి - మూర్తీభవించిన మంచితనంలానూ రావ్ కి కనుపించేడు.
    విద్యాసాగరం పరిచయమైన రెండో రోజు , వాళ్ళిద్దరూ సినిమాకి వెళ్ళి తిరిగి వస్తుండగా - దారిలో నిలబెట్టి అడిగినట్టు ' అడిగేడు సాగరం.
    "మీ గురించి మా పద్మ చాలా గొప్పగా చెప్పింది . నేను మిమ్మల్ని గొప్పగానే ఎంచుకుంటున్నాను. ఒక్కటి అడగాలని ఉంది. ఏమీ దాచకుండా, నిర్భయంగా చెప్పింది. ఆఫ్ కోర్స్ - నేనడగాబోయేది వినేందుకు కష్టంగా ఉన్నా, అడక్క తప్పడం లేదు అడగమంటారా రావ్?"
    "భలేవారు అడగండి. విషయమేలాంటిదైనా ఫరవాలేదు. అడగదలచిందేదో అడగండి. నాకు తెలిస్తే నేను చెబుతాను."
    "మీరు పద్మని ప్రేమించారా?"
    రావ్ అక్కడ చాలా అందంగా , ఉదాత్తంగా నటించేడు. ఈ ప్రేమ నాటకంలో ఇంత గంభీర సన్నివేశాన్ని అతను ఎదుర్కొనే రోజు వస్తుందనే వైనం పసిగట్టిన మరుక్షణం నుంచి అతను ఆ ప్రశ్నకి చాలా సుళువుగా జవాబు చెప్పాడు.
    "ఇంకా నయం మాస్టారూ! ఈ మాట నా దగ్గిరే అన్నారు గనుక సరిపోయింది. మా నాన్న దగ్గిరంటే నా చర్మం ఒల్చేవారాయన. చదువుకోడానికి వచ్చిన వాడివి ప్రేమేమిటిరా సన్నాసీ అని కేకలు వేసేవారు అదీ మా నాన్న. ఇక నేను నేను చదువుకోవాలి . గిరీశం - సారీ - నారాయణస్వామిగారి లాటి మహానటుల దగ్గిర నటన గురించి తెలుసుకోవాలి. ఈ రెండు పనులతోను నేను బిజీగా ఉన్నాను. ఇంకా, వేరే ప్రేమించడానికి టైమేది సార్? పోగా ప్రేమించడానికి పద్మే దొరికిందా? ఆవిడెవరనుకున్నారు? మా గురువు గారి కుమార్తె. ఎక్స్ క్యూజ్ మీ! ఆ వేగంగా మాటాడేనెమో . తప్పలేదు మరి. మీ ప్రశ్న అలాంటిది."
    సాగరం రావ్ చేతిని ఆప్యాయంగా నొక్కేడు.
    "క్షమించేది నన్ను. ఎవడో వెధవ అకాయితనం కొద్ది పద్మకి ఉత్తరం రాసేట్ట. ఆ ఉత్తరాన్ని నాకిచ్చింది. ,మీకీ విషయం చెప్పవద్దని ప్రాధేయపడింది. నేనే తొందరపడ్డాను. క్షమించండి రావ్!"
    రావ్ కి ఏడుపు వచ్చి దానంతటదే ఆగిపోయింది!
    "ఫరవాలేదు. మనం ఈ విషయాన్ని మరిచిపోదాం సార్!' అన్నాడు రావ్.
    ఆనాటి నుంచే రావ్ ప్రేమని మరచిపోయే ప్రయత్నం చేసేడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS