"ఈ రామారావు మాట ఏదో తెలనివ్వండి రామయ్య గారూ! ఇది తప్పితే మరి సంబంధాలు దొరకవను కోవడం ఉత్త పిచ్చి!" అన్నాడు కమలాకరం "నిబ్బరాన్ని " ప్రకాశింప జేస్తూ.
"ఎమోనయ్యా! అయోమయంగానే వుంది నాకు" అన్నాడు అనంతరామయ్య.
"నా మాట వినండి. మీరు ప్రయత్నాలు చేయడమే తరువాయి గాని, ఇంతకంటే మంచి సంబంధమే వస్తుందని వేయినోళ్ళ చెప్పగలను" అన్నాడు కమలాకరం. అనంతరామయ్య అయోమయ పరిస్థితి చెదిరిపోయే టంత ఖచ్చితంగా.
మాటల్లో వాల్తేరు స్టేషను ఎప్పుడు వచ్చిందో గమనించలేదు కమలాకరం. ఆగుతూ ఆగుతూ వున్న బండి లోంచి అవతలకు చూస్తూనే తుళ్ళి పడ్డాడు. కొట్టిన పిండి అయిన పరిసరాలు కళ్ళకు కట్టాయి.
నిద్ర వస్తున్న "డని ఒక అబద్దపు మాట చెప్పి పై బెర్తు అధిరోహించబోయిన అతన్ని ఆపేశాడు అనంతరామయ్య.
"బండి అగుతుంటే నిద్ర పోతావేమిటోయ్?-- ఆ పేపరు లా వుంచి పద ....మనం ఏమన్నా తిని అమ్మాయి కోసం పట్టుకోద్దాం...."
కమలాకరం జంకుతూ జంకుతూ గుబులుగా చూశాడు అవతలకు.
"వాల్తేరు స్టేషన్లో పెద్ద రాక్షసుడున్నాడు గాబోలు -- భయంగా వుంది బాబాయ్ కి .........." అని నవ్వింది రజని.
"కాదు -- దేవత వుంది . మాతృదేవత వుంది" మనసులోనే సమాధాన మిచ్చాడు.
యాంత్రికంగా అనంతరామయ్య ను అనుసరించి నేల మీద కాలు మోపిన కమలాకరం తనువూ చిత్రంగా పులకరించింది. తల్లి ప్రేమ ఈ ఊరంతా ఆవరించుకుని వుందా? ఇక్కడి ఆకాశాన్నంతా అలుముకుని వున్నదా/ నేలమీది ప్రతి ఇసుక రేణువు కూ హత్తుకుపోయి వుందా?
జనయిత్రీ జన్మభూమి అంత గొప్పవి! అతని నల్ల కళ్ళద్దాల వెనక కన్నీటి తేరా కదలడం అతనికి మాత్రమె తెలుసు.
కమలాకరం కూజా లోకి మంచి నీళ్ళు పడుతూ వుండగా , అకస్మాత్తుగా అనంతరామయ్య నెవరో పలుకరించాడు.
అటు చూశాడు కమలాకరం. "ఇంతసేపు ఒకే రైల్లో ప్రయాణం చేశామన్న మాట ?- అంటున్నాడతను.
"మీరు ఇక్కడ దిగకుండా వెళ్ళిపోతే ఒట్టే పెదనాన్న గారూ"
కమలాకరం గుండెలు పిచు పిచు మన్నాయి.
"ఇప్పుడెక్కడ -- ఇంకోసారి వీలు చూసుకుని --"
అనంతరామయ్య మాటని సాగనివ్వలేదు భార్య సమేతుడై వున్న అతగాడు.
ఈనాడు కూడా, ఇంత నొక్కి పిలిచే వారున్నందుకు ఒక్కింత అచ్చెరు పొందాడు కమలాకరం.
"రజని కూడా వెంట వుంది -- అందుచేత వీలు కాదు --"
"ఏవిటీ?-- రజని కూడా వచ్చిందా ? అయితే -- తప్పక దిగాలి పేద నాన్నగారూ -- లేకుంటే మేము కూడా ఇక మీద వచ్చేది లేదు."
రైల్లో ఎక్కి మరీ పేచీ మొదలు పెట్టాడు.
"ఒక ఒప్పందం మీద నయితే దిగుతాను" అన్నాడు అనంత రామయ్య గారు చివరికి.
"ఏవిటది?"
"ఒక్కరోజు మాత్రమె ఉండడానికి--"
"ఓ-- ,మీ యిష్టం?"
అనంతరామయ్య కమలాకరం వైపు చూడగానే అతని కలవర పాటును పాదాల కిందకి అణగ దొక్కాడు.
"చూడు కమలాకరం -- ఇంతదూరం కలిసే వచ్చాం , ఇప్పుడు విడిపోవడం ఏం బాగుంటుంది? మా రామం ఎలా ప్రాణాలు కోరికేస్తున్నాడో కళ్ళారా చూస్తూనే వున్నావు . నా తరపున మా రామం యింట్లో ఒక్కరోజు ఆతిధ్యం స్వీకరించ గలవా?"
"నన్ను వెళ్ళ నివ్వండి బ్రదర్! చాలా పనులున్నాయి..." తన గొంతుకలోని మాటను ఏదో మహత్తర కాంక్ష అణిచి వేస్తుండడం కమలాకరం కి తెలుస్తూనే వుంది.
"నీ పనులు నాకు తెలీవనా కమలాకరం ! నాకోసం ఒక్కరోజు సరదాగా గడపడానికి పెద్ద అభ్యంతరమేం వుంది ?-- ఈ ఊరు నువ్వు ఎరిగినదే అనుకుంటాను --"
ఇంచుమించు మ్రాన్పడి పోయాడు అతను. ఇంకేం మాట్లాడతాడు?--
అది మౌనంగానూ అర్ధాంగీ కారం గానూ తీసుకున్న రామం చొరవగా సామానులన్నీ దింపి వేశాడు.
తర్వాత నవ్వుతూ "మీరు దిగడానికి ఒప్పుకోకపోతే మా పెదనాన్న గార్ని దింపడం నా సాధ్యమయ్యేదా?-- " అన్నాడు.
కమలాకరం కి ఇబ్బంది జరుగకూడదనే ఒక్కరోజుకి మాత్రం మాట తీసుకున్నానయ్యా-- ' అన్నాడు అనంతరామయ్య.
"అయితే నేను ఆయన్ని మరొక్క రోజుకి ఒప్పించగలను" అన్నాడు రామం . మెల్లగా నవ్వుకున్నాడు.
సముద్రానికి మళ్ళీ దగ్గరౌతున్నాడు తను -- ఎందుకో?
ఎండలో చల్లదనాన్ని తొలిసారిగా చవి చూస్తున్నాడు .. బరువులో సుఖాన్ని ప్రప్రధమంగా అనుభవిస్తున్నాడు కాలికింద నేల. పైపైన ఆకసం ఆప్యాయంగా పలుకరిస్తున్నాయి.
ఉండి ఉండి గుండె లో ఏదో గుబులు . తనువులో మెరుపులా మెలికలు తిరుగుతున్న జలదరింపు అతన్ని అనిశ్చలుడ్ని చేస్తున్నాయి. నిట్టూర్పులు బిగ పట్టు కుంటున్నాడు. తన అంతస్సు ఇతరులు పసిగట్టకుండా.
28
ప్రపంచ చిత్రకారుడు పశ్చిమాకశమనే ఫలకం మీద సంధ్యా కృతి ని చిత్రిస్తున్నాడు.
అనంతరామయ్య గారూ, రజినీ, రామం బీచి వైపుగా బయల్దేరి వెళ్ళిపోయారు.
తలనొప్పి వంక చెప్పి పడక మీంచి లేవకుండా ఆగిపో గలిగాడే కాని, అట్టే సేపు ఇలా గడవడం సాధ్యం కాలేదు కమలాకరం కి.
ఆ గది కొంచెం లోపలగా వుంది. అవతలి రూముల్లో ఎవరెవరో పెద్దలు తిరుగుతున్నారు. అంతా అపరిచితులు.
కుర్చీ కిటికీ దగ్గరికి జరుపుకుని రోడ్డు మీద సందడి చూస్తూ కూర్చున్నాడు. ఈ ఊళ్ళో ని అంతమందీ తనవాళ్ళే. తనొక్కడూ ఈ గదిలో ఎలా నిలవగలిగాడు ?-- తనవరైన వారితో ఒక్క రోజైనా సందడిగా తిరిగే భాగ్యం ఇన్నాళ్ళ కు వస్తే.........
కుర్చీలోంచి లేచి వెళ్లి వాటర్ కేటిల్ లోంచి మంచినీళ్ళు వంపుకుని త్రాగాడు.
తలుపులు దగ్గరి కేసి అతను అవతల అడుగు పెట్టడం ఆ యింటి వాళ్ళు అంతగా పట్టించుకో లేదు.
ప్రహరీ దాటి తాపీగా నడిచి పోతున్నాయి అతని పాదాలు అప్రయత్నం గానో, యాంత్రికంగా నో ?

ప్రపంచ చిత్రకారుడు సంధ్యా చిత్రాన్ని పూర్తీ చేసి ఆకాశ ఫలకం మీద ఉల్లి పోరలాంటి మసక "తెర" వేశాడు. చిత్రం తాలూకు అందం. ఆ అందానికి చెందిన వెలుగు ప్రపంచం వైపుకు ప్రసరిస్తూనే వుంది.
ఆ గోధూళి వేళ మోటార్ల ధూళిలో పడి, తన మనసు లాగ వెలుగు చీకట్లు సమానంగా క్రమ్ముకుని వున్న ఆకాశాని కి చూపులు బిగిడిస్తూ ఒకప్పటి తన సంఘర్షణ లాగ రంగుగా, మబ్బు రంగుగా కనిపించే ప్రపంచాన్ని పరికిస్తూ రెండు రోడ్లు తిరిగాడు. ఏమైనా గానీ అతను -- ఎదలో అనిర్వచనీయ మైన అనుభవాన్ని పొందుతున్నాడు.
మనసంతా ఒక్క వైపుకి కేంద్రీ కృత మై వుంది. ఎక్కడెక్కడ పరిచిత స్థలాలు తిరిగినా -- ఇంకా అసంతృప్తి మిగిలిపోతూ వుంటే ఏం చేయడానికి అశక్తు డయ్యాడు క్షణం పాటు. అనాలోచిత మనస్కుడయాడు మరి కాసేపు.
కమలాకరం మనః స్థితి వర్ణనా తీతం.
అతని విషయంలో అది ఊపిరి స్తంభించి పోయిన క్షణమో మెదడు పనిచేయని క్షణమో అజ్ఞాత కాంక్ష చేయి పట్టి లాక్కుపోతున్న క్షణమో -- కమలాకరం తనకి కావలసిన వైపుకే నడవ నారంభించాడు.
నడుస్తూ నడుస్తూ కళ్ళజోడు సరిగ్గా ఉందొ లేదో చూసుకున్నాడు. క్రాపులో దిద్దుకున్న కెరటం లాంటి ఒంపు ను ఒత్తుకుని చూసిన తర్వాత గరుకు గరుకు గడ్డాన్ని అరిచేత రాసుకున్నాడు. చంద్రం పసివాడుగా జ్ఞాపకం వచ్చాడు.
నలభై నాలుగేండ్లు వచ్చిన తనకి జుత్తు ఇంకా నేరియనందుకు కించిత్తు కోపం వచ్చింది. అదీ ప్రధమంగా.
అతని ఉలికి పాటే తప్ప కమలాకరాన్ని ఎరిగిన వారైనా గుర్తు పట్టడం అంత సులభం కాదు.
ఆనాటి అతను భవిష్యత్తు వైపు మహోత్సాహంతో పరుగులైతే చలాకీ కుర్రాడు.
పని పూర్తీ చేసుకుని ప్రశాంతంగా ఇంటి ముఖం పట్టిన అందమైన గుమస్తాలా వున్నాడు ఇప్పుడు.
కాని కమలాకరం నడకలో బరువు లేదు కళ్ళల్లో ఆరాటపు చురుకు దనం వుంది.
ప్రపంచ చిత్రకారుడు నల్లటి తెర వేసేశాడు సంధ్యా చిత్రం మీద. మసక చీకటి, కను చీకటి, కాటుక చీకటిగా మారడానికి సిద్దమైంది.
సన్నని నైలాన్ పోరలాటి చీకటి ని చీల్చేటందుకు లైట్లు వెలగని కారణ మేమిటో.
ఆ కారణం అందరి కంటే కమలాకరా నికి అనువుగా వుంది. ఎవరి హడావిడి లో వారు వున్నా గాని కనీసం ఒకరిద్దరన్నా కొత్త వ్యక్తిని పసిగట్టే అవకాశం, అవసరం లేకపోయాయి.
మారిపోయిన ఇళ్ళు, మారుతున్న మేడలు, మరింతగా మారిన భవనాలు. కమలాకరాన్ని చూసి కొత్త నవ్వులు నవ్వుతున్నాయి. అతని కన్నులకి చీకటి వెలుగుల తారతమ్యం గుర్తింపు ;లేదు. చీకటి ని చీల్చుకుని చూడట మంటే అదే. అదే చేస్తున్నాడు.
కమలాకరం గుండె లయ మార్చుకుంది. పాదాలు ఏ క్షణాన ఆగిపోయాయో తెలీదు.
ఇంతసేపూ కళ్ళద్దాలు మధ్య మధ్య తీసి మళ్ళీ పెట్టుకుంటూ నడిచాడు. ఇప్పుడు పూర్తిగా తీసేసి జేబులో దూర్చేసి తన యింటిని తదేకంగా చూడ సాగాడు. ఇంకో దృష్టి లేదు.
ఎప్పటికీ మారని యిల్లు -- ఆ వీధిలో అదొక్కటే. కొత్తగా సున్నం కొట్టారేమో -- చీకట్లో కూడా తెల్లదనాన్ని తెలుపుతున్న గోడలు . తాను పాతికేళ్ళ వరకు పదే పదే ఎక్కి దిగిన మెట్లు. పెరటి వైపు దృశ్యం -- వీధిలోకి మామూలుగానే మనోజ్ఞం గానే కనిపిస్తుంది. పెరటి లో పొరుగింటి పొగడ చెట్టుతో కొన్నేళ్ళు గా కాపురం చేస్తున్న తమ ఇంటి కొబ్బరి చెట్టు రారమ్మని ఆహ్వానిస్తున్నట్టు చేతులు చాస్త్గుంది.
పారవశ్యం లోంచి తెరుకున్నట్టు గబుక్కున కళ్ళద్దాలు పెట్టుకుని ఇటూ అటూ చూశాడు. బొటన వేలితో నుదుటి మీది స్వేదాన్ని విదిలించు కున్నాడు.
ఇంతదాకా వచ్చిన తను తల్లిని చూడకుండా వెళ్ళలేడు.
నిముషాల మీద ఒక నిశ్చయానికి వచ్చేశాడు కమలాకరం.
ఎవరి కోసమో వచ్చినట్టు నటించాలి ....తనకు మతి పోతున్నదా ఆవిడ కెవరున్నారు?-- తనకి బాగా తెలుసు ఆమె ఏకాకి.
నిట్టూర్చాడు భారంగా.
మంచి ఊహ వచ్చింది మెదడు లోకి ఈసారి.
ఒక ఇంటికి వెళ్ళబోయి మరో ఇంటికి పొరపాటున వచ్చినట్టు నటించాలి. చీకటి కూడా అన్ని విధాల తనకు సహకరిస్తోంది.
నాలుగడుగులు లెక్కపెట్టినట్టు వేసి ఆగిపోయాడు. ఎదురుగా చూస్తూ.
ఒక ఊహ నిలువెల్లా ఒనికించి వేసింది. "అమ్మా!" అనుకున్నాడు అస్పష్టంగా. కళ్ళకు మసక తెరలు కమ్మి నట్టయింది. ఇంతవరకు చీకటి లో సైతం వెలుగులు క్రుమ్మరించిన ఇల్లు చీకట్లో లీనమై పోతున్నట్టు గోచరించగా కమలాకరం వివశుడయ్యాడు . ఊహించినదే ఒకవేళ కఠోర సత్యమైతే తాను దాన్ని ఎదుర్కో లేడని తెలిసి పోయిందతనికి.
ఆవిడ లేకుంటే అ యింటి ఆవరణ లోకి వెళ్ళే అర్హత కూడా తనకి ఉండకూడదు.
మనసంతా భారమైపోయింది. ఎంత భారమంటే -- తల్లి పై వూరు ఎక్కడి కన్నా వెళ్లి, ఏ కారణాల చేత యింట్లో లేకపోయినా భరించలేని భారం. ఆవేదన మబ్బులు మబ్బులుగా మానవాకాశాన్ని దిట్టంగా అలుముకుంది. ఏ నిముషాన అయినా దుఃఖ బిండువుల్నో ఆనంద బాష్పాలనో కురిపించడానికి సిద్దంగా వున్న కారు మేఘమైంది.
మళ్ళీ రోడ్డు మధ్య కు వచ్చి ప్రక్క యింటి వైపుకు అడుగులు వేశాడు కమలాకరం ఆ వేగంతో.
"ఏవండీ ......ఏవండీ .........శారదమ్మ గారి .........ఆ ..........వారియిల్లు ఎక్కడో ఎటు వైపో చెప్తారా?---
కమలాకరం ఆయాసం గమనించకుండా నే "ఈ పక్క యిల్లే బాబూ ! ఎడం వైపు " అన్నది ఒకావిడ.
"ఆవిడ.....ఆవిడ....ఊళ్ళో ఉన్నారా అండీ?-- 'ఆ మాట అడుగుతున్నప్పుడు ఇంచుమించు అతనికి ఎగఊపిరి వచ్చేసింది.
"ఊళ్ళో నే ఉన్నారు. ఆవిడ ఎక్కడికీ వెళ్ళరు నాయనా.........."
ఆనందంతో ఒక్క సెకను అలా గుమ్మం లోనే నిలిచిపోయాడు. "సాక్షాత్తు నువ్వు కనక దుర్గమ్మ వే తల్లీ ఎంత చల్లని మాట!"
మరుక్షణం లో అతనక్కడ లేదు. బాణం లా తన ఇంటి ఆవరణ లోకి వచ్చేశాడు. నడుస్తున్నట్టు , పరుగెత్తు తున్నట్టు స్పష్టంగా తెలీదు. మెట్లు మాత్రం ధ్వని కాకుండా ఎక్కి ద్వారానికి దగ్గిరగా నడిచి నిలబడి పోయాడు,. ఎగిసి పడే గుండె అదుముకుంటూ.
మొదట అతని కళ్ళు మనుషుల కోసమే వెదుక్కున్నాయి.. కరెంటు లేనందున ముందు గది చీకటిగా వుంది. ప్రక్క గదిలో నుంచి ప్రసరిస్తున్న లాంతరు వెలుగు ఆధారం చేసుకుని ఎదురుగా గోడ పైకి చూశాడు. మామూలుగా రెండు ఫోటోలు పాతలోని క్రొత్త దనాన్ని లీలగా అతనికి చూపుతున్నాయి.
ఒక ఫోటో చనిపోయిన తండ్రి సీతారామయ్య ది, మరొకటి లక్షణ హనుమత్సమేతుడైన సీతా మనోహరుడిది.
ఇంతసేపూ పారవశ్యం లోనూ, వింత అనుభూతిలోనూ కమలాకరం గమనించలేదు. ప్రక్క గదిలోంచి సన్నగా రాగ యుక్తంగా పురాణం చదువు తున్న ధ్వని వస్తుంది.
రెండుద్వార బంధాల మీదా, చేతులు వేసి ముందుకు ఒంగి చూశాడు.
ఆ రెండవ గుమ్మానికి అవతల ఇద్దరు స్త్రీలు కూచుని వున్నారు. మధ్య లాంతరు. అపరిచిత స్త్రీ, ఒడిలో పుస్తకం ఉంచుకుని చదువు తున్నది మెల్లగా. ఆమె నుదుట బొట్టు అందంగా ప్రకాశిస్తుంది.
కమలాకరం కనుబొమలు ముడి పడ్డాయి అర్ధం కాక.
రెండవ స్త్రీ మీద దృష్టి పడగానే అతడన్నీ మరచి పోయాడు. ఎన్నాళ్ళు అయినా, ఎన్నేళ్ళు అయినా తల్లిని గుర్తించ లేని కొడుకు ఉంటాడా? ఉండడు. కనుక కమలాకరం వెంటనే పోల్చుకున్నాడు.
