Previous Page
క్షమార్పణ పేజి 12


    వెనక్కు తిరిగి ఉన్న ఆవిడను తనివి తీరేలా చూసే అవకాశం కనిపించక వెర్రి కేక పెట్టేశాడు.
    "అమ్మా?......"
    ఆవిడ వెంటనే లేచింది అపరిచితురాలు కూడా నిలబడింది పుస్తకం క్రింద ఉంచి.
    ఇద్దరి నీడలూ దీప కాంతిలో వింతగా కదిలాయి.
    "ఎవరూ?---"
    "నేనమ్మా?........"
    "ఎవరు నాయనా?-----"
    "నేనమ్మా నీ కమలాన్ని " లోపలికి అడుగు పెట్టాడు.
    "ఏమిటి --" ఆవిడ దిగ్రుమించిపోతూ "నా కమలమా? నా కమలాకరుడా?-- అంది నమ్మలేనట్టు ఆత్రుతగా.
    "ఔనమ్మా ! నన్ను నమ్ము' అన్నాడు తల వంచి.
    కంఠన్ని గుర్తుపట్టి విచాలితురాలై పోయింది. "నా తండ్రీ -- నా కమలం --" ఇంచుమించు అరుపులతో ముందుకు చేతులు చాచింది.
    "తల్లి పాదాల ముందు  కూర్చుండి పోయాడు కమలాకరం. అతనికీ శారదమ్మ కి అది అపస్మారక స్థితి.    
    రెండుచేతులా లేవదీస్తూ "అమ్మాయ్ -- ఆ లాంతరు తీసుకు రావే ఇలా. ఆహా ఒద్దులే. నా దీపం వచ్చేశాడు .. నా దీపం వచ్చేశాడు వేరే దీప మెందుకు నాకు --" అంటున్న తల్లి కంఠం లోని విషాదనంద సంభ్రమాలు వింటూ కమలాకరం కన్నీళ్ళు నిగ్రహించు కోలేపోయాడు.
    ఆవిడ భుజాల మీదకు ఒరిగి పోయాడు అనిరశధారలైన కన్నీటి తో. "నన్ను క్షమించమ్మా -- నన్ను క్షమించు."
    "అలా అనకూరా నాన్నా" అంది శారదమ్మ.
    "మనిషి తనకు తాను ఎప్పటికి చిన్నవాడు. తరువాత తల్లి దగ్గర చిన్నవాడే.
    ఇద్దరి దుఃఖ భారమూ తీరి తల లెత్తి కళ్ళు విప్పినప్పటి కి, లాంతరు దగ్గరగా వెలుగులు చిమ్ముతుంది.
    తల్లీ కొడుకులు ఒకరిలో మార్పు ఒకరు నిశ్చలంగా నిశ్శబ్దంగా చూసుకున్నారు.
    "నా కన్న బాబూ ఎందుకలా విడిచి వెళ్ళిపోయావు నన్ను చేద్దదానివి చేసి?-- నీ కోసం రాత్రీ పగలూ ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు చేసుకున్నాము రా పంకజమూ, నేనూ" అంది శారదమ్మ గడ్గాగికంగా.
    చివ్వున తలెత్తాడు కమలాకరం . "పంకజమా?" రహస్యంగా వుండి పోయింది ప్రశ్న. కళ్ళు చికిలించి అటు వైపు చూశాడు. పెరట్లో చిన్న దీపం చేత పట్టుకుని పని చేస్తున్న స్త్రీని చూస్తూనే పోలిక పట్టాడు. ముప్పయ్ ఎనిమిదేళ్ళ వయసుని ప్రకటించ లేక పోతుంది ముఖ బింబం. అప్పుడు పలుచగా వుండేది ? పంకజం అంగ సౌష్టవం ఇప్పుడు మారింది కొంత.
    ఒక్క నిమిషంలో అంతా బేరీజు వేసి _--"అమ్మా?--" అన్నాడు తల్లి చేతులు రెండు చేతులా కొని.
    "అవునురా! నువ్వెళ్ళి పోయిన వారం రోజులకే అది తిరిగి వచ్చింది. అప్పటి నుంచి నీకోసం ఎదురు తెన్నులే .....ఎటొచ్చి నాకున్న ఆశ డానికి లేదు ఇప్పటి వరకు."
    పంకజం గదిలోకి వచ్చింది.
    "పంకజం ....." అనబోయాడు గొంతుక పైకి రాలేదు.
    "ఏమండీ స్నానం చేస్తారు.....లేవండి నీళ్ళు ఉంచాను " అంది పంకజం నెమ్మదిగా తల దించుకుంటూ.
    "ఎందుకు...బట్టలు అక్కడ ఉండి పోయాయి " నసిగాడు.
    "పెట్టె లోని పంచలు న్నాయి రా భద్రంగా " అంది శారదమ్మ.
    పంకజం పక్క గదిలోకి వెళ్లి కొద్ది సేపటికి తిరిగి వచ్చింది.
    "పంచెలు రెండు పెట్టె అడుగున వుంటే తీశాను ." అంది.
    ఆమె యిచ్చిన సరి కొత్త పంచె సువాసన విచిత్రంగా మత్తు గోలిపింది కమలాకరాన్ని. పరిమళ భరితమైన గత స్మృతి లా కనిపించింది ఆ పంచె.
    పారవశ్యం లోంచి తెప్పరిల్లి ముందుకు నడిచాడు.
    స్నానం చేసి కమలాకరం గదిలోకి వెళ్ళిన వెంటనే చల్లని పానీయాన్ని పట్టుకుని అతన్ని అనుసరించి వచ్చింది పంకజం.
    కొవ్వొత్తి వెలుతురూ రేపరేపల్లా ఆమె ఆగమనం ప్రశాంత మనోజ్ఞతను చాపింది నిశ్శబ్దంగా.
    గ్లాసు అందుకుని పక్కన పెట్టేశాడు త్రాగకుండా.
    ఆశ్చర్య పడినట్టుగా తల ఎత్తింది పంకజం.
    ఆమె రెండు భుజాలూ పట్టుకుని కళ్ళలోకి చూశాడు కమలాకరం.
    "పంకజం ?...... ఆ గొంతుక లో చెప్పలేనంత ఆర్ద్రత క్షమించమనే అర్దింపు.
    పంకజానికి అర్ధం కాని దేముంది , క్షమించే అర్హతనాకుందా?" అనుకుందేమో-- అతని చెంపలను తుడుస్తూ మాట్లాడలేదు.
    ఇరవయ్యేళ్ళ వియోగ కాలంలో ఇంత నిశ్శబ్దంగా ఇంత అజ్ఞాతంగా ఇంత మార్పు తమలో ఏ క్షణాన వచ్చిందో ఊహిస్తున్నట్టు పరవశంగా పరధ్యానంగా నిలుచున్నారు.
    వారిని అలా చూసి వెనక్కి తిరిగింది శారదమ్మ. శ్రీరామ చంద్రుని పటం మీద నుంచి భర్త ఫోటో మీదకు చూపుల్ని మరిల్చింది.
    చీకటి లో బాంధవ్యాల్ని చూపించడానికి. ఎదలో వేదాంతాన్ని నింపడానికి ఇంట్లో లైట్లు ఒక్కొక్కప్పుడు వెలగవు. ఇప్పుడూ అంతే -- కానీ గబుక్కున వెలిగాయి వీధి దీపాలు !

                                       ***


 Previous Page

WRITERS
PUBLICATIONS