Previous Page Next Page 
అపశ్రుతులు పేజి 10

 

    సంధ్య చీకట్లు చెదరి సన్నని వెన్నెల కురుస్తూంది. పసుపుపచ్చని నేతఃచీర నిండుగా కట్టుకుని తలనిండా చంద్రకాంతపూలు తురుముకొని, తడబడే అడుగులతో నెమ్మదిగా శ్రీనివాసరావు కదిలో కొచ్చింది శాంత. మీరు.....మీరు పిల్చారట! అంటూ.
    "రా, అలా కూచో" అన్నాడతను కుర్చీ చూపిస్తూ చిరునవ్వుతో రెండు క్షణాలిద్ధరి మధ్యా మౌనం రాజ్యం చేసింది.
    "నా కిప్పట్లో మళ్ళీ ఇంత తొందర్లో పెళ్ళి చేసుకోవాలనిలేదు. కాని అమ్మా, నాన్నా.......నీతో పెళ్ళి నిశ్చయం చేసినట్టు చెప్పారు" అంటూ ఆమెవైపు చూశాడు.
    సిగ్గుగా తలవాల్చింది శాంత.
    "నీతో ముందు మాట్లాడతానని కోరలేదు కాని నాన్నకేదోభయం. నీతో పెళ్ళికి ముందేమైనా మాట్లాడవలసి ఉంటే మాట్లాడమని నాతో చెప్పారు. నేను అక్కర్లే దన్నాను.....నీతో చెప్పారు కాబోలు నేను పిలుస్తున్నానని."
    "అవును" నెమ్మదిగా అంది శాంత.
    పేలవంగా నవ్వి, "ఆకలికి రుచీ, నిద్రకు సుఖం ఏం తెలుస్తాయి.....ఏదో నాకు ఆదరంగా అన్నంపెట్టి. నా కోర్కెలు మన్నించగలిగే భార్యయితే చాలు......అంతే .... నా మనస్సేం బాగులేదు శాంతా.....ఈ పరిసరాల్లో మళ్ళీ, పెళ్ళి కొడుకుగా నిల్చోలేను. తిరుపతిలో పెళ్ళి చేసుకొని ఆర్నెల్ల పాటు అలఅలా తిరిగి వద్దాం అన్నాడు. చప్పున అతనికేదో గతంలోని సంఘటన గుర్తొచ్చి వదనం వివర్ణమయింది ఒకనెల లీవ్ శాంక్షను చేయించుకు వస్తాను దక్షిణాపథమంతా తిరిగేద్దాం" రనుకోరిన కోరిక. తాను తీర్చాడా?.....లేదు. తాను పౌరుషంగా తిరిగిచ్చిన డబ్బు. నాన్న తెచ్చుకున్నాడు. వెంటనే - మా మధ్య నాటక మాడారు నాన్న. ఇంకా ఏవో గతంలోని వాగ్యుద్ధాలు గుర్తొచ్చిన శ్రీనివాసరావు మొహం రోషంగా కందింది మళ్ళీ.
    కొన్ని క్షణాల మౌనం తర్వాత లేచి నిల్చుంటూ. "మరివస్తాను. మీ ఇష్టప్రకారమే జరగనివ్వండి ..... నేను..... నేను ఎప్పుడూ మీ ఇష్టప్రకారం నడుచుకుంటాను," అని నెమ్మదిగా వెళ్ళిపోయింది శాంత.
    ఆమె తనను ఆకర్షించలేకపోయినా, హృదయంలో తియ్యని పులకింతలు లేకున్నా.....తన ఇష్ట ప్రకారం నడుచుకుంటానని చెప్తూంది తనకు భార్య కాబోయే శాంత ఎందుకో తేలిగ్గా నిట్టూర్చాడు శ్రీనివాసరావు.
    
                                         *    *    *

    తాను వివాహం చేసుకుంటున్నాననీ తప్పక రమ్మనీ వ్రాశాడు శ్రీధర్. బిడ్డను ఆయాకు అప్పగించి వెళ్ళబోయే రమ వెక్కివెక్కి ఏడ్చింది. పెళ్లికిముందు తానేన్నో కలలుకంది. తానూ భర్తా ఉద్యోగాలుచేస్తూ, డబ్బు సంపాదిస్తూ ఉంటే అత్తమామలు తమ పిల్లల సంరక్షణ చేస్తూంటే, ముద్దుగా మురిపెంగా తానూ, తన భర్తా మధ్యా ఒకరిద్దరు పిల్లలు. ఆ పాపను హృదయానికి మృదువుగా హత్తుకుంటూ. పాపను ఆయాకి అప్పజెప్పి వెళ్ళిపోతూన్న అమ్మ మీద కోపం వస్తూంది కదూ! మీ అమ్మ మొండిది- ఇంకా రాక్షసి..... నువ్వు ఆడదానివి కాకుండా మగవాడి వయ్యుంటే, ఈ దేశంలో మన సంఘంలో గర్వంగా. ఎన్ని తప్పులు చేసినా తలెత్తుకు తిరిగేదానవు. కాని.....అడవిపిల్లవు....నాలాటి ఆడదానివి.... మగవాడు వదిలిన ఆడ దానికీ సంఘంలో గౌరవస్థానం లేదమ్మా! మీ అమ్మకు రవంతైనా ధైర్యం లేదిప్పుడు తన చుట్టూ సంఘాన్ని చూసి జడుసుకుంటూంది. మీ నాన్న  గారన్నట్టు. అందరూ నన్ను ఆశగా చూస్తున్నారు. రోజులు యుగాల్లా గడుస్తున్నాయ్. నిన్నెలా పెంచి పెద్దచేస్తానో... నీ భవిష్య త్తెలా తీర్చిదిద్దగలనో నీకు నాన్నా, బామ్మా తాతా అత్తయ్యా అందరూ ఉన్నారు అన్నట్టు అందమైన బావకూడా ఉన్నాడు. వారందరి దగ్గరా నీనుంచి నన్నెత్తుకు పోతే భగవంతుడు నేను ఎంత సంతోషించే దాన్ని. మీ నాన్నగారు నిన్నెంత గారంచేసే వారు! నువ్వెంత దర్జాగా బ్రతికేదానవు? నేను పోయి వారందరూ నీకుంటే ఎంతబాగుండేది" మీ నాన్న పనిమనిషి కూతుర్ని ఎత్తుకు ముద్దాడే వారు తెల్సా? ఓ రోజు నేను అసహ్యించుకుంటే ఏమన్నారనుకున్నావ్ అలా నన్ను కసరకపోతే ఓ పిల్లను నాకు కనివ్వరాదూ? అన్నారు. ఇపుడు నేను కన్నపాప.... నిన్ను.... నీ నాన్న విసిరికొట్టారు. నేనా? నువ్వా దురదృష్టవంతులం? పిచ్చిగా నెమ్మదిగా అంటూ పాపబుగ్గకి తన చెంప ఆన్చి హృదయం పగిలేలా శూన్యంగా రోదించింది రమ.

 

                          
    ఇప్పుడామెకు అలంకరణ మీద శ్రద్దలేదు. నలుగురు మాట్లాడితే ఏదోచిరాకు. శ్రీధర్ కు తన శుభాకాంక్షలు తెలియజేస్తూ జాబు వ్రాసింది.

                                     *    *    *

    తిరుపతిలో శాంతకూ, శ్రీనివాసరావుకు శాస్త్రోక్తంగా పెళ్ళి జరిపించారు రంగనాధం.
    అందరి వదనాల్ల్లో ఏదో దైన్యం. పాపభీతి ద్యోతకమయ్యాయి. శ్రీనివాసరావు ఎదలో ఏవో ఆలోచనలు పాపనెత్తుకు ముద్దాడే రోజులు కాదని మళ్ళీ మరొక భార్యా, మరొక రకమైన జీవితం మలచుకున్నాడు తను. అయినా రమ కెంత పొగరు! టక్కున విదాకులు వ్రాసి ఇచ్చింది, కాని మరొకసారి వచ్చి బ్రతిమిలాడిందా? తన కాళ్ళకు చుట్టుకు ఏడుస్తుందనుకున్నాడు. ఇంకా క్షమించమని ప్రార్ధిస్తూ, ఉద్యోగం చెయ్యాలని భయపడతాడు కాని విడాకులిచ్చి తేలిగ్గా తొలగిపోయింది. తేలిగ్గా నిట్టూర్చాడతను.
    
                                    *    *    *

    కొన్నివేలు ఖర్చుచేసి ఆ ఊరు ప్రెసిడెంటయ్యాడు శ్రీనివాసరావు. నోములూ వ్రతాలూ అంటూ శాంతకూడా ఖర్చుచేస్తూంది ఆదాయాన్నిబట్టి ఖర్చులుండాలి అతగాడి లాగా ఈమె ఇలాగే ఖర్చు చేస్తూంటే ఎన్నాళ్ళో గుట్టుగా రోజులు వెళ్ళవు అంటూ సణిగేవారు రంగనాధం,
    "మీకు తిండీ బట్టా లోటొచ్చిన్నాడు అనండా మాట" పౌరుషంగా అనేవాడు శ్రీనివాసరావు. కాని శాంత పట్టే నోములు అతనికీ ఇష్టం కాదు. ఓ సారి అన్నాడు నవ్వుతాలుగా. "నీ కన్నా రమే నయం. ప్రతినెలా కొంత సంపాదించేది. సంపాదించేది లేదు సరికదా పండు తాంబూలం పుష్ప తాంబూలం పదహారు ఫలాలూ అంటూ డబ్బు తగలేస్తున్నావ్" అని "మీకలా చురుగ్గా మనిషి మనస్సు నొచ్చుకునేలా మాట్లాడ్డం అలవాటు. డబ్బు తెచ్చినామెకి పూలరథం పట్టారేమిటి మీరు? ఆడవాళ్ళన్నాక ఏదో నోమూ వ్రతమూ ఉండవూ" అనేది. నాలుగు రోజుల తర్వాత కాని ఆ విషయమై చర్చమానేది కాదు శాంత. రోజులు దొర్లిపోతున్నాయ్.

                                    *    *    *

    ప్రెసిడెంటు భార్యనన్న అహం. ఆడంబరం కూడా క్రమంగా ఎక్కువయ్యాయి శాంతలో. "నువ్వూ రమలాగే తయారవుతున్నావ్?" విసుక్కున్నాడు శ్రీనివాసరావు "అబ్బ ఆరు సంవత్సరాలై ఆమెను వదిలి బ్రతుకు మరొక తోవన నడుస్తున్నా ఆమె గుర్తుండిపోయింది మీకు" అంది శాంత చిరుకోపం ప్రదర్శిస్తూ.
    అవును. ఆరేళ్ళుకాదు ఆరు యుగాలైనా ఆమెను మరచిపోలేదేమో తను. ఆమె వ్యక్తిత్వంలో ప్రత్యేకత ఉంది. తనకు తోచినది చేయడం తన అభిరుచులు ఇతరులు మన్నించని నిరసించనీ తనను పొగడనీ, దూషించనీ, నిర్లక్ష్యంగా నవ్వేసి హుందాగా ఠీవిగా బ్రతికింది రమ. ఏ స్త్రీ చేయలేని సాహసం కనీసం తనను బాధించాలనే సామాన్యమైన కసి. మోసంచేసిన భర్తపై భార్యకుండే సహజమైన కోపం ఏమీ లేకుండా విడాకులు వ్రాసి ఇచ్చింది. ఎందుకామెపై అలా పగ పెంచుకున్నాడు? ఆమె బలవంతాన తన జీవితంలో అడుగు పెట్టిందా? కురూపిగా ఉండే స్త్రీని తనకు కట్టబెట్టారనా? ఆమె రూపం చూస్తే అసహ్యమా? అయితే శాంత అందం ఆమె ముందు ఏపాటిది? మెరుపు తీగలాటి రమెక్కడ?.....గాలి బుంగలా లావెక్కి అసహ్యంగా కండలుదేరిన శాంత ఎక్కడ. ఆమె అలంకరణా. స్వేచ్చా తాను సహించలేక పోయేవాడు. ఇప్పుడు శాంత రెపరెపలాడే పల్చని టెరిలిన్ చీరలుకట్ట్టి, మీటింగులకీ, ఫంక్షన్లకీ హాజరవుతూంది తనతోపాటు, రమ కన్నా స్వేచ్చగా హాస్యంగా చమత్కారంగా ఆడా మగా అందరితో మాట్లాడి నవ్వుతూంది. మరిప్పుడు తన మనస్సెందుకు అప్పటిలా బాధ పడడం లేదు? రమ చదువుకుంది తనతో సమానంగా సంపాదించేది, ఆమె ఇష్టాలు తనపై ఎపుడూ రుద్ధలేదు. అలా ఉండాలి. ఇలా మాట్లాడాలి అని శాసించలేదు. తన ఇష్టప్రకారం ఆమె ఇష్టాలు మానుకోలేకపోయింది. అదే బాధపడి పగ పెంచుకున్నాడు? రమ ప్రమోషను మీద ఏ ఊరో ట్రాన్స్ఫరయి వెళ్ళిపోయిందని విన్నాడు. కాని ఏం పిల్లను ప్రసవించిందో ఆడో! మగో!..... అప్పుడప్పుడు పైనా, ఇంట్లో నిత్యకృత్యాలు నెరవేర్చి ఎప్పుడైనా కొన్ని క్షణాలు మానసికంగా విశ్రాంతి లభిస్తే. అతని హృదయంలో మరుగునపడిపోయిన రమ. ఆమె ఆలోచనలూ పైకివచ్చి. అతని హృదయం తీవ్రంగా స్పందించేది. మనస్సు ఉద్రిక్తతతో కదలి చలించిపోయేది. అతని వదనంలో నీలి నీడలు తారట్లాడేవి. దీర్ఘంగా నిట్టూర్చి ఆ ఆలోచన చెదిరిపోవాలనే ఉద్దేశంతో, అమ్మా, శాంతా అని ఎవర్నో పిలిచి ఏదో అర్ధం లేకుండా అన్యమనస్కంగా మాట్లాడేవాడు.
    "ఇదేం పాపమో! ఆరేళ్ళయి కాపురాని కొచ్చింది. బిడ్డాలేదు, పాపాలేదు. రోజు రోజూ లావెక్కి పోతూంది, అబ్బాయ్ ఓసారి పట్నంలో చూపించరాదూ" అని అడిగేది జానకమ్మ కోడుకుని. "ఛ ఛ, దీనికి పిల్లలెలా పుడ్తారమ్మా అర్ధం లేకుండా బలిసిపోతూంటేనూ.....నా తల నింతే రాసి ఉంది మోడుగా బ్రతకమని" విసుగ్గా, విషాదంగా అనేవాడు శ్రీనివాసరావు.
    "పోనీ ఎవరిపిల్లనన్నా దగ్గర పెట్టుకుంటే?" అడిగిందో రోజు మనవలు కావాలనే వాంఛ అరి కట్టలేని జానకమ్మ.
    "ఎవరి పిల్లల్ని దగ్గర పెట్టుకుంటాం? ఒకరి పిలల్లు మన పిల్లలెలా అవుతారు. పో నీ అక్కయ్య దగ్గరన్నా నలుగురు పిల్లలుంటే ఓ పిల్లను తీసుకొచ్చే వారం. అదీ మన అదృష్టమే మొట్టికాయ పెట్టినట్టు ఒక్క కొడుకు. వాన్నే ఓ సారి వచ్చి వెళ్తూండమని వ్రాశాను సెలవులు వచ్చినప్పుడు మా యింటికి కూడా ఓ సారి పంపమని బావకి వ్రాశాను. వాడిష్టం నాకేం అభ్యంతరం లేదని బావ. తీరికైతే అలాగేలే అంటూ వాడూ వ్రాశారు. నాలుగేళ్ళయి ప్రతి సెలవులకీ వ్రాస్తున్నారు. ఒక్క సారన్నా వచ్చాడా అమ్మ! అక్కయ్య వచ్సినప్పుడల్లా అందరం వాన్నో సారి పంపించు అని ఎంత ఆశగా దేవిరిస్తున్నాం? పిల్లలకోసం వాచిపోయే కదా? అలాగే అంటుంది. వాడు వచ్చిన నాలుగు రోజులూ వాళ్ళకీ వదలాలని ఉండదు. "మన ఖర్మ..... మనకు తెలుసున్న వారందరి పిల్లలూ నన్ను మామయ్య గారూ, బాబయ్యగారూ వరసలు పెట్టి పిలుస్తారు. బిస్కెట్లు, చాకట్లూ తీసుకు కబుర్లు చెప్పి వెళ్ళిపోతారు. నా పిల్లలు నాకిచ్చే సంతోషాన్ని ఎవ్వరూ ఇవ్వలేరమ్మా తెచ్చి పెంచుకు నాన్నా అని పిలిపించుకోవడం ఆత్మవంచన ఏ జన్మ ఖర్మో ఏం చేస్తాం?" బాధగా నిట్టూర్చి అక్కడ నుంచి గదిలోకో వీధిలోకోవెళ్ళ బోయి. చిరాగ్గా జుట్టుపీక్కొని బాత్ రూంలో కెళ్ళి చెమ్మగిల్లిన కళ్ళూ, మొహం కడిగి ఇవతలికొచ్చే వాడు. రమా రమ ఏ పిల్లను ప్రసవించిందో ఆరు సంవత్సరాల బిడ్డ ఎలా చిలిపిపనులు చేస్తూందో. రమ పిల్లను ఎవరికి అప్పగిస్తూందో తాను కాదన్న తన బిడ్డ తలపు అతన్ని తీవ్రంగా కదిలించేది. మూగ వేదన అనుభవించేవాడు కొన్ని క్షణాలు శ్రీనివాసరావు.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS