బోజనాలు , ఆరుబైట కూర్చునేసరికి జయ వచ్చింది. తిరునల్వేలి వెళతానన్న మనిషి అంత త్వరగా ఎలా వచ్చేసిందా అని ఆశ్చర్య పోయాను.
"రండి పిన్నీ" అంటూ సుశీల ఎదురు వెళ్లి జయ చేతిలో పెట్టి అందుకుంది.
నేను నిట్టుర్చాను. నాలో మార్పు జయ గమనించి, మౌనంగా లోపలకు వెళ్ళిపోయింది. నేను ఆలోచనలో పడ్డాను. జయ ఎలాగయినా తనను సుశీల అమ్మా అని పిలిస్తే గాని వదలదు. అంటే సుశీల కి విషయమంతా చెప్పాలి.
నా హృదయం పగిలిపోయినట్టయింది.
ఇన్నాళ్ళూ పెంచి, యీనాడు సుశీల నా కూతురు కాదని చెప్పాలా! నన్ను పరాయి వాడిగా చూసి, "నన్ను పెంచి, పెద్ద చేసి, మా అమ్మ కప్పగించి నందుకు కృతజ్ఞురాలిని" అని సుశీల అంటే నేను బ్రతక గలనా?
సుశీలకి తండ్రిని నేనే అయి పెంచాను. తల్లిని నేనే అయి పెంచాను. కాళ్ళ మీద పడుకోబెట్టుకుని పాలు పట్టాను. భుజం మీద పడుకో బెట్టుకుని జోల పాటాలు పాడాను. అలాటి సుశీల ను యీనాడు నేను వదులుకోగలనా...లేను..లేనా....ఆ ప్రశ్నకు సమాధానం రాలేదు.
ఏది ఏమైనా, నాస్వార్ధం కోసం జయను అణచడం పిశాచి లక్షణం అనిపించింది. ఎలాగూ ఇంత వరకు వచ్చింది. ఇక జయ తన తల్లి అని సుశీలతో చెప్పి తీరాలి. అని నిశ్చయించు కున్నాను.
"బాబాయి గారూ! ఏమిటలా కూర్చున్నారు" అంది సుశీల. ఉలిక్కిపడ్డాను.
"ఏం లేదమ్మా!' అన్నాను.
ముగ్గురం కూర్చుని ఏవేవో లోకాభిరామాయణం కబుర్లు చెప్పుకున్నాము. జయకి మేడమీద మా గది పక్కగదిలో పక్క వేసింది.
నేను మడత కుర్చీలో కూర్చున్నాను. సుశీల ఏదో నవల చదువు కుంటోంది. నేను గొంతు సవరించు కుని, "తల్లీ! నీకు ఒక గాధ చెప్తాను. ఇలారా" అన్నాను. సుశీల వచ్చి , నా పక్క మీద కూర్చుంది.
జయకు కధ అంతా చెప్పి, "ఆవిడను తన కన్నకూతురు క్షమించలేదు. పరాయి వాడితో లేచిపోయిన వ్యక్తీ నా తల్లేమిటి పొమ్మంది. తల్లిని చూడడానికి, తన ముఖం తల్లికి చూపడానికి నిరాకరించింది."
నేను సంతృప్తిగా నిట్టుర్చాను.
"ఇది అలా జరిగిందమ్మా. ఆసంఘటన గుర్తుకు వచ్చింది. అందుకని చెప్పాను" అన్నాను. సుశీల కన్నీరు తుడుచుకుంది. "పడుకోమ్మా ఇక! అంటూ నేను లేచాను. సుశీల తన మంచం మీదికి వెళ్ళింది. నేను నామంచం మీద పడుకుని దుప్పటి ముసుగు పెట్టేశాను.
అరగంట గడచింది.
ముసుగు తీసి లేచాను. సుశీల కేసి చూశాను. మంచి నిద్ర పోతున్నట్టుంది. చప్పుడు చెయ్యకుండా తలుపు తీసుకుని, బయటకు వచ్చాను. జయ గదిలో లైటు వేసి ఉంది.
ఇక జయతో చెప్పి యీ విషయం సుశీలకి చెప్పవచ్చని అని నిర్ణయించు కుని తలుపు తోశాను. తీసున్న తలుపు తెరుచుకుంది.
జయ నన్ను చూసి, కన్నీరు గమ్మున తుడుచుకుంది. నేను కుర్చీలో కూర్చోడం తోనే "తిరునల్వేలి వెళ్దామని బయల్దేరిన దాన్ని-- కాళ్లు అటు వెళ్ళలేదు. కంచి వెళ్లి వచ్చేశాను. సుశీల ముఖం చూడాలని పించింది. తెల్లవారుతూనే పోతాను. బ్రతికి ఉంటె మళ్ళీ రావాలనిపిస్తుంది. చచ్చిపోతాను. దానికి శాశ్వతంగా దూరమయి పోతాను. నావల్ల దానికి కళంకం రానీను" అంది వెక్కి వెక్కి ఏడుస్తూ.
"ఆవేశపడకు జయా! సుశీలతో కొంతవరకు చెప్పాను. నిండు మనస్సుతో నిన్ను "అమ్మా' అని పిలిచేలా ఉంది. అసలు దాని వూహ ఎలా ఉంటుందో అని కధగా చెప్పాను" అంటూ చెప్పిన విషయం చెప్పాను.
"ఒద్దు! దాని మనసులో గాయం చేయడం మనకి మంచిది కాదు. నా అపవిత్రత , కళంకం దానికి అంటగట్టను" అంది కన్నీళ్లు తుడుచుకుని, మళ్ళీ కారుస్తూ.
"మన చేతుల్లో ఏమీ లేదు. అంతా భగవంతుడి లీల. నిన్నిలా కలుసుకుంటానని అనుకున్నానా?" అంటూ రమ సంగతి, రమ కొడుకుని సుశీల ప్రేమించిన సంగతి అన్నీ చెప్పి, "నా జీవితం వ్యర్ధమని ఆ రోజుల్లో నేను ఏడ్చే వాడిని. నువ్వు గనుక ఆనాడు సుశీల ని నా చేతుల్లో పెట్టక పొతే నేను ఏ ఆత్మహత్యో చేసుకొనే వాడిని" అన్నాను.
ఆ తరువాత సుశీల గుణగుణాలు కాస్సేపు చెప్పాను. "తెల్లవారితే అన్నీ సవ్యంగా జరుగుతాయి. కాస్త నిగ్రహం ఉంచుకో జయా!' అన్నాను. జయ, వెళ్టానిక. మళ్ళీ సుశీల లేస్తే నాకోసం వెతుకుతుంది." అన్నాను.
"నేను తెల్లవారుతూనే వెళ్ళిపోతాను. దాని ముఖం చూడడానికి నాకు ధైర్యం చాలదు. అది అమ్మా అని పిలిస్తే నా గుండె పగిలి పోతుంది. తన తండ్రి ఆత్మహత్య కు కారణం అయిన తల్లిని ఏ కూతురు క్షమించడు. నువ్వనవసరమయన ప్రయత్నాలు చెయ్యక. నా జీవితం నేను నిర్ణయించు కున్నాను అంది.
నేను బుర్ర గోక్కున్నాను.
"జయా! జరిగేది జరగక మానదు. తెగించి యీ రాత్రి ఏ అఘాయిత్యం చెయ్యక. తెల్లవారనీ --- అన్నీ శుభంగా జరుగుతాయనుకుందాం " అన్నాను.
జయ నిస్పృహగా నవ్వింది.
"ఆత్మహత్య చేసుకునేంత అదృష్టం నాలాటి పాపికి లేదు. మీరు అలాటి భయం పెట్టుకోకండి. పాపి చిరాయువు అన్న పదం నాకోసమే పుట్టింది.' అంది.
నేను తలుపు తీశాను.
ఉలిక్కిపడ్డాను.
ఎదురుగా సుశీల.
కన్నీటితో శోకమూర్తి లా నిలబడి ఉంది. జయ గమ్మున కన్నీరు తుడుచుకుని, మంచం మీంచి లేచింది. సుశీల వెక్కి వెక్కి ఏడుస్తూ "అమ్మా" అంటూ జయను కౌగిలించుకుంది.
నా శరీరం పులకరించింది.
"అమ్మా! ఇంతకాలం నాకు దూరమయి , ఇంకా దూర మవుదామనుకున్నావా? తల్లిని తల్లి కాదనే అంత పాపినా నేను" అంది వెక్కి వెక్కి ఏడుస్తూ.
నా కంటి నుంచి నీరు రాలింది.
ఎదురుగా గోడ మీద వెంకట రమణుని పటం -- ఆనాటి పటమే!!
చేతులెత్తి నమస్కరించాను.
ఆరోజుల్లో నా జీవితం వ్యర్ధమని, నిస్సారమని ఏడ్చాను. దైవనింద చేశాను.
కానీ, భాగావంతుడు ఏ పనీ కారణం లేనిదే చేయదు. అది మానవులకు అర్ధం గాకపోవచ్చు.
అవును. నా విషయం లో అదే నిజం అయ్యింది.
నా జీవితం ధన్యమయింది.
నా కర్తవ్యాన్ని జయప్రదంగా నెరవేర్చాను.
నేను ధన్యజీవిని.
అవును, నేను ధన్య జీవిని.
(అయిపొయింది)
