బోర్డ్ రూమ్ లో వాద ప్రతివాదనలు వేగం పుంజుకున్నాయి.
అయినా భూపతిరావు నోరు మెదపలేదు. భూపతిరావు పారిశ్రామిక సామ్రాజ్యంలో టెక్స్ టైల్ మిల్స్, కెమికల్ ఫ్యాక్టరీలు, ఆటో మొబైల్ యూనిట్స్, మందుల కంపెనీ, పేపర్ మిల్స్ , సిమెంట్ కంపెనీ, టొబాకో కంపెనీ, ఫెర్టిలైజర్ యూనిట్, ఎక్స్ ఫ్లోజివ్ యూనిట్ లాంటివి ఎన్నో వున్నాయి.
ఒక రంగంనుంచి ఒక రంగానికి అంచెలంచెలుగా అకుంఠిత దీక్షతో విస్తరించుకుపోయాడు భూపతిరావు.
ఇండియన్ ఇండస్ట్రియల్ ఫీల్డ్ లైమ్ లైట్ లో వున్న ప్రముఖ వ్యక్తి భూపతిరావు.
ప్రపంచంలో ఏ పరిశ్రమ ఎప్పుడు ప్రారంభమైంది? ఎంత అభివృద్ధి సాధించింది? వాటి ఉత్పాదక శక్తి ఎంత? లాభాలెంత? ఆయాకంపెనీళ సిబ్బంది జీవన ప్రమాణం, ఆయా దేశాల ఇండస్ట్రియల్ పోలసీస్, ఫెనాన్షియాల్ పోలసీస్ గురించి అర్థరాత్రి లేపి అడిగిన అలవోకగా చెప్పేయగల సమర్థుడు.
ఏ సమస్య ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడ విశ్వరూపం దాల్చుతుంది? ఎప్పటికి వినాశనానికి దాగారవుతుంది. లాంటివి కరక్టుగా అంచనా వేయగలడు గనుకే ఏ సమస్యా అతన్ని సవాల్ చేయలేక పోయింది.
ఎలాంటి సమస్యనైనా చిటికలో పరిష్కరించగల భూపతిరావు అంటే ఇటు వ్యాపారవర్గాల్లో, అటు ప్రభుత్వవర్గాల్లో గౌరవంతోపాటు భయంకూడా వుంది.
రాజకీయంగా కేంద్రంలో, ఇండస్ట్రీస్, ఫెనాన్షియాల్ పోర్ట్ ఫోలి యోస్ లోకి ఏ ఎం.పి. రాబోతున్నాడో-వారి ప్రవర్తన -వారు తీసుకు రాబోయే పోలసీ ఛేంజెస్__రానున్న బడ్జెట్ లో జరిగే మార్పులు-వాటి వలన ఏ వస్తువు ధర ఎంతవరకు పెరుగుతుంది? ఏ పరిశ్రమ లాభపడుతుంది? ఏ పరిశ్రమ నష్టపోతుంది? ఏ ప్రోడక్ట్ మార్కెట్ పడిపోతుంది. లాంటివి నిర్థుష్టంగా అంచనా వేయగలడుగనుకే ఇండియన్ కార్పోరేట్ జెయింట్ అని పిలుస్తుంటారు ఆయన పరోక్షంలో.
అలాంటిభూపతిరావు తొలసారిగా ఒకింత ఆందోళనకు గురయ్యాడు.
కరక్టుగా నెలరోజుళ క్రితం ఓ అర్థరాత్రి భూపతిరావు ఆఫీసు రూమ్ కి ఓ వ్యక్తి వచ్చాడు. సన్నగా, పీలగా వున్నాడు కాని ఆ వ్యక్తిని చూసిన తొలి చూపులోనే చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా గుర్తించాడు. భూపతిరావు.
మామూలు సమయాల్లో అయితే ఓ అవుట్ సైడర్ కి భూపతిరావుతో ఎపాయింట్ మెంట్ దొరకటం సాధ్యంకాని పని.
అది తెలుసుకొనే ఆ సమయంలో వచ్చి వుండవచ్చు ననిపించింది భూపతిరావుకి. మరొక నిర్ణయం కూడా తీసుకున్నాడు అప్పుడే___ ఆ అపరిచితుడు సరాసరి తన రూమ్లోకి రాగలిగాడంటే మెయిన్ గేట్ ముందున్న సెక్యూరిటీ గార్డ్ ఆ టైమ్ కి అక్కడ లేకుండానన్నా ఉండాలి వుండివుంటే అమ్ముడన్నాపోయి వుండాలి-సో, అలాంటి వాడ్ని వెంటనే ఆ పోస్టులోంచి తొలగించాలనే నిర్ణయం అప్పటికప్పుడు మనసులోనే తీసుకొంటూనే......ఆ అపరిచితుడివేపు ప్రశ్నార్ధకంగా చూసాడు భూపతిరావు.
భూపతిరావు టేబుల్ కి ఎదురుగా వున్న కుర్చీలో, ఒక సోఫాలో కూర్చునే ప్రయత్నంలో వుండగా భూపతిరావు లేచి నిలబడ్డాడు.
తనకు కుర్చునే అవకాశం ఇవ్వగూడదనే అలా లేచాడని ఆ అగంతకుడు కనిపెట్టుగలిగాడు.
"మీకు సత్యరాజ్ తెలుసనుకుంటాను?" సూటిగా ప్రశ్నించాడా వ్యక్తి.
సత్యరాజ్ గురించి పూర్తిగా తెలిసిన భూపతిరావు అదేమీ వ్యక్త పర్చకుండా "తెలవాల్సిన అవసరంలేదు" అన్నాడు చికాగ్గా
"అవసరం లేకపోవచ్చు అదిప్పుడే రాకపోవచ్చు. భవిష్యత్ లో రావచ్చు. ఆ భవిష్యత్ గురించి మాట్లాడతానికే వచ్చాను....." భూపతిరావు ముందు మాట్లాడటానికి అంతకు ముందు అతను కూడ గట్టుకున్న ధైర్యం దిగజారిపోతోంది క్రమేపీ-
"విషయమేమిటో సూటిగా చెప్పు" సహనంగా అన్నాడు భూపతిరావు.
"కావచ్చు అయితే.....!"
"అయినప్పుడు నేనెందుకువచ్చానోకూడా గ్రహించి ఉండవచ్చు."
"లేదు."
"అయితే వినండి- బేరం కోసం వచ్చాను."
"బేరమా? నీతోనీ? నీకు కరక్టుగా మరో ముప్పై సెకండ్లుటైమిస్తున్నాను. ఆ లోపు నువ్వు బయట కెళ్ళాలి....." కఠినంగా హెచ్చరించాడు భూపతిరావు.
"లేదంటే?" కాస్త పరిహాసంగానే అన్నాడా అగంతకుడు.
భూపతిరావు చేయి మెరుపు వేగంతో టేబుల్ సొరుగులోకి వెళ్ళటం ఆ వెంటనే బయటకు రావటం, చేతిలో పిస్టల్ పొజిషన్ లోకి వస్తూ కనిపించదం అంతా క్షణాల్లో చూసిన ఆ అగంతకుడు భయంతో ఉలిక్కిపడ్డా, వెంటనే సర్దుకొని "ఏం కావాలన్నది మాసాబ్ చెబుతాడు- త్వరలో మరో రకంగా దాన్ని తిరత్కరిస్తే మీ ఎంపైర్ సుడిగుండాల్లో పడుతుంది. అని హెచ్చరించి రమ్మన్నారు మాసాబ్. వస్తాను" అంటూ పరుగులాంటి నడకతో బయటపడ్డాడు.
