Next Page 
డాళింగ్ పేజి 1


                                                డాళింగ్

                                                                    సూర్య దేవర రామ్మోహనరావు

                              

 

    అనంత ఆకాశాల సాక్షిగా , దిగంత హరిత వనాల సాక్షిగా మృదు స్పర్శల మోహన దివ్యవేణువుల సాక్షిగా , మధురజ్ఞాపకాల కళల అలల సముద్రాల సాక్షిగా, చీకటి కనురెప్పల మీద తీసి ముద్రల సాక్షిగా , సుతిమెత్తని హృదయ స్పందనల వెల్లువల సాక్షిగా.
    తటిల్లతల ఆశల చూపులతో నా హృదయ గహ్వరంలోకి నిన్ను -----
    ఆహ్వానిస్తున్నాను.
    క్షణాలుగా, దినాలుగా యుగాలుగా నీ మృదు స్పర్శ కోసం నిరీక్షిస్తున్నాను.
    డాళింగ్.......డాళింగ్........
    నువ్వు రాకపోయినా పర్వాలేదు........నువ్వు వస్తాననే ఆశను మాత్రం దూరం చేయకు..
    అది నా అభ్యర్ధన.......
    ఊటీ..సమీపంలోని కోటగిరి చల్లని ఉదయం వేళ ఏకాంతంగా ఉంది. పచ్చని పచ్చిక బయళ్ళు...స్వచ్చమైన గాలి కొండ లోయల్లో చక్కర్లు కొడుతోంది. పరిసరాలన్నీ నిశ్శబ్దంగా , కొండ ఎగువన మాత్రం కోలాహలంగా ఉంది.
    కారణం -
    అక్కడ "ముగ్ధ" సినిమా షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హీరో, హీరోయిన్లు ఏకాంతంగా మాట్లాడుకునే సన్నివేశం అది.  లేత ఎండలో రిఫ్లేక్టర్లు, వెండి అడ్డాల్లా మెరుస్తున్నాయి.
    దూరంగా చెట్టు కింద నిర్మాత, తన మిత్రులతో కులాసాగా కబుర్లు చెప్తున్నాడు.
    దర్శకుడు హడావుడిగా తిరుగుతున్నాడు. కెమెరామెన్ లైటింగ్ అరేంజ్ మెంట్స్ చూసుకుంటున్నాడు.
    అక్కడికి పది అడుగుల దూరంలో పోకచెట్టు కింద కుర్చీలో కూర్చున్నాడు యాంగ్ హీరో విమల్.
    విమల్ చక్కగా పొడవుగా ఉంటాడు. ఫీల్డులో కొచ్చి, రెండేళ్ళే అయినా, ఆరు హీట్ సినిమాలివ్వడం వల్ల , యూత్ లో మంచి ఫాలియింగ్ ఏర్పడింది. ముఖ్యంగా అమ్మాయిలు అతనంటే పడిచస్తారు.
    అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తున్న డైలాగ్స్ శ్రద్దగా వింటున్నాడు విమల్. వారికి కొంచెం దూరంలో హీరోయిన్ మధురి కుర్చుని వుంది. చిన్న చేతి అద్దంలో ముఖానికి "ఫైనల్ టచప్స్' చేసుకుంటుంది. ఆమె కూడా ఫీల్డులో కొచ్చి రెండేళ్ళే అయినా, వచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో బాగా తెల్సు కాబట్టి అన్ని అవకాశాల్ని ఉపయోగించుకుంది. బాయ్స్ అండ్ గాళ్స్ హీరోయిన్ గా స్థిరపడింది. ముఖ్యంగా కాలేజ్ గోయింగ్ ఆమె ఫాన్స్. మధురి చాలా అందంగా ఉంటుంది. ఆమె పొడవైన జుత్తు కారు మేఘాల్లా ఆమె వీపంతా పరుచుకుని ఉంటుంది.అంతరంగంలో ఎన్ని తెలివితేటలున్నాయో మొహమంతా అమాయకంగా ఉంటుంది. కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసంతో పాటు, పట్టుదల, పైకి వెళ్ళాలనే దీక్ష తొంగి చూస్తుంటాయి. ఎక్స్ పోజింగ్ అండ్ ఎక్సో టిక్ బ్రెస్ట్, సన్నటి నడుముతో మరిచిపోలేని మధుర స్వప్నంలా ఉంటుంది.
    డైరెక్టర్ కేక వినబడ్డంతో లేచి నిలబడింది మధురి.
    అసోసియేట్ డైరెక్టర్ గబగబా పరుగు పరుగున హీరో దగ్గర కెళ్ళి మరొక్కసారి , డైలాగ్స్ ని గబగబా చెప్పేశాడు. తను చెప్పవలసిన డైలాగ్స్ మననం చేసుకుంటూ స్పాట్ కొచ్చింది మధురి.
     అప్పటికే అక్కడ కొచ్చాడు విమల్.
    డైరెక్టర్ నడుంకి కట్టుకున్న టర్కీ టవల్ ని మరింత బిగించుకుంటూ , సీన్ చెప్పడం ప్రారంభించాడు.
    "ఇది ఎ సినిమా! చాలా ఇంపార్టెంట్ సీను. మత్తుమందులకి అలవాటుపడి ఇంట్లో వాళ్ళకు దూరమైపోయి, పతనమైపోయిన హీరో , మొట్టమొదటి సారి, తన గురించి బాధపడుతున్న, తను కావాలని కోరుకుంటున్న హీరియిన్ తో తన మూగ బాధను చెప్పుకునే సీన్ సీన్ చివర హీరోయిన్ ని హీరో గట్టిగా కౌగలించుకుంటాడు. కళ్ళమీద  ముద్దు పెట్టుకుంటాడు. అంతే........అర్ధమైందా!"
    గాభరాగా చూసి ఇద్దరి వేపూ చూసాడు డైరెక్టర్.
    డైరెక్టర్ వేపు చూసి విమల్ నవ్వాడు.
    "అది కాద్సార్ , మీ ప్రతి సినిమాలో హీరో , హీరోయిన్ ని కళ్ళ మీద ముద్దు పెట్టె సీన్ తప్పనిసరిగా ఉంటుంది ......ఎందుకని!"
    ఆ మాటకు హీరోయిన్ మధురి కూడా మెల్లగా నవ్వింది ఒకింత సిగ్గుపడుతూ.
    "అది నా సెంటు మెంటయ్యా. ఫస్ట్ సినిమాలో ఫస్ట్ సీన్ అదే. ఆ సినిమా గోల్డెన్ జూబ్లీ చేసుకుంది. అప్పట్నుంచి అవసరమున్నా లేకపోయినా కళ్ళమీద కిస్ షాట్ ఉండాల్సిందే..........అండర్ స్టాండ్.......కమాన్ .....క్విక్....." గబగబా ముందు కెళ్ళిపోయాడు డైరెక్టర్.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS