5
పుచ్చకాయిలోంచి ఎర్రంగా రగతం! కారతన్నాది.'
అయి అక్కడే యిసిరేసి గిరుక్కున ఎనక్కి తిరిగాడు.
* * * *
ఆడి కళ్ళ కొలకుల్లో నీళ్ళ కొలన్లె నిండినాయి!
"మరి సిట్టి కనిపించలేదా తాతా?" అంటా అడిగింది సీతమ్మ.
తాత నవ్వాడు. అది అడిగిందానికి మారు సెప్పనే లేదు. పై పెచ్చు ఎదర తిరిగి అడిగాడు .
"ఎవురికీ?"
* * * *

మల్లీ పాలీ పట్న వెల్లినప్పుడు "సీతాలచ్చ్వీ వొటేలు ' కేల్లాడు ఎంకన్న. బద్రయ్య కనిపిచ్చ లేదు. వొటేలు పక్కనున్న గుడిసి కాడి కెల్లాడు. గుమ్మం లో కూసుని, మోకాళ్ళ మీద సేతులేట్టుకొని, సేతులి మీద గెడ్డ వానిపి నేల మీదికి సూత్తా కూకున్న సీతమ్మ కనిపించినాది.
"మీవోడున్నాడా బుల్లెమ్మా?"
"ఎగాదిగా సూసిందది.
"ఆడు లేడూ?"
"ఎవరాడూ?"
"బద్రయ్య లేడో?"
"ఆడేవుడో నాకేం తెల్దు. పోయిక్కన్నించి!"
అడికిడ్డూరవయినాది. కుసింత కోపవూ వచ్చినాది.
"నీ మొగుడున్నాడా లేడా అంటే, అల్లా మాటాడతావెం?"
"పొమ్మంటే నీక్కాదు సేబుతావుంట? మల్లీ వొచ్చావంటే కాల్లిరగ్గోట్టిత్తా!"
ఆడి కళ్ళు సింత నిప్పు లయినాయి. ఒళ్ళు మండు కొచ్చినాది. 'స్సీ! అంటా యిసిరి గొట్టి ఎనక్కి తిరిగాడు. తిరిగీ తిరగడం తో బద్రయ్య ఎదట కనిపించాడు.
"ఎప్పుడొచ్చావు తమ్ముడా?' బుజం ,మీద సేయ్యేశాడు. జేబ్బట్టుకొని వోటేల్లోకి తీసి కేల్లాడు.
పై మీద గుడ్డ సర్రుని తీసి ఎనక్కి సూసి ముందలికి సెరసేరా నడిశాడు ఎంకన్న. ఇద్దరూ కూసున్నారు. గుమ్మం కాడ గల్లా బల్ల కాడ బద్రయ్య సతికిల పడ్డాడు. రొండు గళాసుల్తో కాఫీ తెప్పించాడు.
"ఏవన్నా దేంటి?" బద్రయ్య నవ్వుతా అడిగాడు.
ఆడు కోపంతో మాటాల్లేదు.
"తిట్టిందా?"
"అల్లాంటిదాంతో ఎల్లా కాపరం సెత్తన్నావు బద్రయ్యా?"
బద్రయ్య యిరగబడి నవ్వాడు. నవ్వుతూనే గళాసు కాలీ సేశాడు.
ఎంకన్న కదంతా అయోమయంగా ఉన్నాది.
"ఇంకా తాళి కట్టలేదు తమ్ముడా! దాని క్కూడా టయివు రావొద్దో?' మల్లా నవ్వాడు. "పిల్ల ఎల్లాగుందంటావు?"
అడల్లా అడుగుతా డనుకోలేదు. ఎంకన్న సోద్డెం గా ఆడి ముకం లోకే సూడ్డంతో బద్రయ్య మాట మారిశాడు.
"మల్లా అంటిగెల్లెసుకొచ్చావా?"
అప్పటికి కొత్తవూపిరోచ్చినాది ఎంకన్న కి. "మరి? వూరికే సేతులాండింగుంటా వోత్తాననుకున్నావా బద్రయ్యా? ఈ పాలి సరాసరి పెద్ద బజరుకే ఎల్లినా. అల్లంత దూరాన్నుండగానే నన్ను గురుతుపట్టి , యీరాస్సాని లగేత్తుకోచ్చేశాడు " 'ఇజయకోటయీరుళ్ళా' అన్నాడు.
బద్రయ్య నవ్వాడు. ఆనవ్వులో వొంకరున్నాది. టీవిగా ఎనక్కి వొలి, "సెబాస్, తమ్ముడా!" అన్నాడు.
ఎంకన్న కి కొత్త బలవొచ్చినాది.
వోటేల్లో వొచ్చీ పోయీ వొళ్ళ రద్దీ ఎక్కువయినాది. ఆళ్ళల్లో సానామంది సుట్టుపక్కలున్న పడవలో'ల్లె! పలారం అందిచ్చీ కుర్రోళ్ళు పెసరాట్, కాపీ, యిడ్డీ అంటా అరుస్తున్నారు. తినేసి ఎల్లిపోయీ వొళ్ళల్లో కొంతమంది ఎంటనే డబ్బు లిచ్చేత్తా వున్నారు. ఇంకొంతమంది పద్దు రాయించుగుంటన్నారు. కొందర్ని గాజుంతాడు బద్రయ్య. కొందర్ని మరియాదగా అడుగుతాడు. కొంతమందిని బతివాల్తాన్నాడు. ఇంకా కొంతమందిని గొప్పగా జాలి తలత్తన్నాడు.
ఇంత గొప్పోడే బద్రయ్య?
పొద్దు గూకబోతన్నాది . ఒచ్చినోళ్ళల్లో తీరిగ్గా కూసున్నోళ్ళూ , ఎటకారాలాడతా ఉన్నోళ్ళూ , పేకాటేసుగున్నోళ్ళూ , సిణేవా పాట్లు పాడతా వున్నోళ్ళూ రకరకాల మంది ఉన్నారు. ఈళ్ళంతా బద్రయ్య సుట్టూ తిరగవోలిసిందే!
పేకాట మాజోరుగా సాగుతున్నాది. గుప్పిడి డబ్బులు సేతుల్లోకి తీసుకుని బద్రయ్య కూడా ఆళ్ళకాడి కేల్లాడు. ఆ సిత్ర వేంటో సూదారని ఎంకన్నా ఎల్లాడు. కొంతమంది డబ్బులు పడేత్తన్నారు. కొంతమంది ఏరుకుంటున్నారు. మెరిసీ కళ్ళూ, ఏడిసీ కళ్ళూ!
అట్లోకి దిగీ దిగడం తోటే బద్రయ్య గుప్పిడూ రొండు గుప్పిల్లయినాయి. ఎంకన్న కి మాంచి మోజు కలిగింది ఆట మీద. కళ్ళింత సేసి సూత్తా నిలుసున్నాడు.
అది కనిపెట్టాడు బద్రయ్య.
"నువు కూడా ఆడతావా ఎంకన్నా?"
"నాకు రాదు బద్రయ్యన్నా!"
"ఆడు నవ్వాడు. "ఎంత ఎర్రోడివు తమ్ముడా! ఇదేవన్నా బెమ్మాండమనుకున్నావా? ఆటన్నది యీ ఏల రాపోతే రేపోత్తాది. పట్టుమని నేరుసు గుంటే నువ్వు మట్టుక్కి యీళ్ళని మించలేవో? అంటి గెల యాపారం గొప్పదో, పేకాట గొప్పదో నీకప్పుడే తెలుత్తాది!"
"నిజవే?"
"మల్లా నవ్వాడాడు. "సూత్తావుగా! యీ యాల్టికి నీ తరుపుని నే నాడతాలే ! పేరు నీది, అట నాది. లాబ'వొత్తే యిద్దరికీ సెరిసగం! నట్టవొత్తే నేనే పెట్టుగుంటా! ఏం?"
సయ్యన్నాడు ఎంకన్న. అట మీద అట కలపడం తో రొండు గుప్పిల్లల్లా నాలుగయినాయి. లాబం లో సగం ఎంకన్న కిచ్చేసి , పక్కకి తిరిగి అల్లెంపు అదో రాకపుగా నవ్వాడు. డబ్బు పోగొట్టుకున్నా కూడా ఆళ్ళు ఏడాకండా నవ్వుతానే ఉన్నారు. తన్ని సూత్తే ఆళ్ళకి కల్లెందుకు కుట్టవో? సరి గందా , తన్ని మా మెచ్చుకున్నారు.
"నీదే అదురుట్టం బెదరో!"
ఎంకన్న గొప్పగా నవ్వాడు.
అలా నవ్వుతా ఉన్నప్పుడే , అల్లెం పుకి తిరిగి, యీడి మంచితనం సాలా గొప్పగా సెవుల్లో సేప్పాడు బద్రయ్య.
'బద్రయ్య యింతటోడని తెలీనే లేదుసువా!' అనుకున్నా డెంకన్న. తెలీనందుకు లోన సాలా నొచ్చుకున్నాడు. ఏదో పెద్ద తప్పుడు పని సేసినోడి;లా యిదయ్యాడు.
ఇల్లా వుండగానే ఎక్కన్నించో వూడి పడ్డాడు సెరబయ్య. "ఎప్పుడొచ్చావు బెదరో?"
సేప్పాడు. "వొచ్చినోడి వొచ్చినట్టే ఎదతావు కాని, ఎప్పుడూ రెండ్రోజులేనా వుండవెం బెదరో! మాలాగ వుసారుగా తిరగడం సాత కాదా?"
సిగ్గు పడ్డాడు ఎంకన్న.
"ఇంటి కాడ బారియామని గారు బెంగెట్టుకేగుంటాదేవోరా!"ఎటకారవాడాడు బద్రయ్య.
పెళ్ళాం వూసోచ్చీసరికి ఆడికి ఉక్కురోసవొచ్చినాది. యాపారం కోసవని ఆడు పట్నం లో వుంటే ఆదేవుత్తీ అడగటానికి? మొగోడు, రోండ్రోజులు కాదు, పది రోజు లుంటాడు . పన్ని బట్టి ఉండాలి సోత్తాది. పెళ్ళాం వొద్దంటే మట్టుక్కి అడెం మానేరకనా?
పట్నం గొప్పతనం ఆడికి తెలియక్కాదు. కాని, వూరు కొత్త మరి! ఈ కొస నించి ఆ కొసాకి సూత్తా ఎల్లడానికి, ఆడికి ఆ యీదులన్నీ ఒక్కలాగే కనిపిత్తాయాయిరి! అలాటప్పుడు ఎక్కడని తిరుగుతాడు? ఏవని సూత్తాడు? అల్లాగని మల్లా ఏయీ తెలీనోడు కాడు. రాయి మండీ టేసేనూ, బస్సు టాండు , వోరదారాపు వొటేలు , యింకా పొతే కోపాకి గోదారి టేసేనూ అంతే.

పట్నావులో ,మోసగాల్లుంటారని ఎవురో సెప్పారాడికి. అంత పెద్ద రొక్కం, నోట్లకి నోట్లు జేబీ లో పెట్టుకొని తిరుగుతావుంటే ఎవురన్నా మాయం సేత్తే? అల్లాటియి ఆడు సాలా యిన్నాడు.
పట్నం లో సెడ్డ సావాసాలు సులువుగా అవుతా యంట!
"ఈసాలో రోజుంటాలే బద్రయ్యా!" అన్నాడు ఎంకన్న.
సెరబయ్య నవ్వాడు. ఆ నవ్వులో ముచ్చటున్నాది.
"రాయిటో!" అంటా అరిశాడు బద్రయ్య.
సెరబయ్యని బల్ల కాడ కూకుండ బెట్టి , గల్లా పెట్టి అప్పసేప్పి , ఎంకన్న ని తీసుకుని బయలెల్లాడు బద్రయ్య. ఇద్దరూ సెయ్యీ, సెయ్యీ కలుపుకొని నడిశారు. బద్రయ్య తోడు ఎంకన్న!
సందులూ, గొందులూ కలిపి సాలా యీదులే తిప్పాడు బద్రయ్య. ఎత్తయిన ఓ మెడ ముందల నిలుసుని లోనకి సూత్తావుంటే, ఎంకన్న అడిగాడు -- "ఏంటి బద్రయ్యా?"
"మేడ తమ్ముడా!"
"కనిపిత్తానే ఉందిగా!"
"అది కాదు ఎంకన్నా! కనిపించే వోటిలో కనిపించకుండా దాగున్నాది కనిపించాల! ఏవంటా?"
"అంటే?"
"ఈ మేడేవుడిదో తెలుసా?"
"తెల్దు"
"పోనీ ఎల్లా కట్టాడో తెలుసా?"
"సిమ్మెంటు సున్నవుతో."
ఇరగవడి నవ్వాడు బద్రయ్య. "దానికి డబ్బు ఎల్లా గోచ్చిందో సేప్పగలవా?"
"గొప్పోడు గనుక!"
"గొప్పోడేల్లా గవుతాడు?"
"అదురట్టవు కలిసోత్తే!"
మల్లా నవ్వాడు. "అదురుట్టం కాదు తమ్ముడో! సురుకుతనం!"
"అంటే!"
"ఇప్పుడు యీ యింటి కావందున్నాడే ఆడు ఎనక అంటే అయిదేల్లా కెనక, ఓ జవీందారు డింటో వొంట సేసీవోడు!"
"ఏంటీ? వొంట సేసే యింత డబ్బు గడించాడా?"
"మరేం టనుకున్నావ్! సేప్పెదంతా యిను."
"ఆడికి జీతవెంతో?"
"రొండుపూట్లా వోన్నం వెట్టి నెలకి పది రూపాయలు!"
"అంతే?"
"యిను మరి. ఆడి గొప్పతనవెంటంటే , ఆడేన్ని దినాలు పని ఎగ్గొట్టినా , సేసినప్పుడు మట్టుక్కి మా మోతగా సేసీవోడంటలే! అందుకే ఆడ్ని సత్తే వోదిలీ వోరు కారు. జవీందారు గారి పెళ్ళాం గారు మా మెచ్చుకునీదంట! ఇంటి కొచ్చి వొల్లందరితో ఆళ్ళవొంటోడి గొప్ప సెప్పుకోడవే!
"ఆడి పేరు రావయగాడు. బలమైన వోడేలే! ఆ డొల్లు సూత్తే ముసిలి జవీందారుడికి ఎనకటి రోజులు గురుతోచ్చీయాంట! అమ్మగారు వొళ్ళు మరిసేపోయీదంట. అప్పు డాయమ్మ మాంచి పొంకం లో ఉన్నదంటలే! నా సావిరంగా యింక సూసుకో! ఆడా యింటో అడుగెట్టిన ఏడాది తిరక్కుండానే ఆడి మకాం వొంటింటింఛి 'అమ్మగారి' గదిలోకి మారిపోయిందంట! అది సూసి కడవా నవుకరోళ్ళంతా ముక్కు మీద ఎల్లేసుగునీ వోరంట. కొంతమంది అమ్మగార్ని సీదరించుకునీ వోరంట కూడా!
"ముసలోడు సికిలి కల్లల్లోంచి కొంచెం కొంచెం కనిపెడతా వుండీవోడంట. గట్టిగా సేప్పీ దయిర్నేం సాలక నోరు మూసుకునీ వోడు. ఏమన్నా అంటే ఆళ్ళీద్దరూ కూడబలుక్కుని లెగిసి పోతరేవోని బయం! యీదిని బడి తిరిగి దాని కంటే, తెర సాటు యవ్వారం కూతంత మేలేగందా!
