Previous Page Next Page 
వెలుగు వెన్నెల గోదారీ పేజి 8

 

    ఆడు మాటాడలేదు.
    రోజులు దొల్లిపోతున్నాయి. అప్పన్నించి దానోంటో నసి లేదు. కనిపించిన సరకల్లా బేరం సేసీది. మోజులూ, మనసులూ ఎక్కువ అయినాయి. ఒకోప్పుడు సేతిలో ఉన్నయే సర్రుని యిసిరేత్తాది. ఏవంటే మాటాడదు. ఉత్తి పున్నాన్ని నవ్వుతాది. సిటికి లో ఎడుత్తాది. అలాటిదాన్ని ఏవనగలడు రాజియ్య?
    వోడపిల్లి తీరతానికి రాజియ్య తో 'సెప్పకుండానే ఎల్లింది. పిల్లల్నీ తీసుకు ఎల్లింది.
    ఇంటి కొచ్చాక అడిగాడు -- "సిట్టీ ఏదే?' "ఏవో!"
    ఆడు గుండి బాదుకున్నాడు. ఎంటనే ఎల్లి వోడపిల్లి అంతా కలీ సూశాడు.
    "సిట్టీకి మాకూ సేల్లుబడి అయిపోయిం'దనుకున్నాడు.
    ఇంకా రోజులు నడిసినాయి. రాజియ్య కొత్తపేట నించి మకా ఎత్తేశాడు.
    అయిదేల్లయ్యాక --
    జగ్గన్న వూల్లో కొచ్చాడు. పేనాలు పోవలసినోడు కాలిరాగ్గోట్టుకొని బయటపడ్డాడు. మిలిట్రీ అసపటాల్లో చాలా కాల వున్నాడు. కర్ర కాలేట్టించుగున్నాడు. సేతిలో సిల్లు పయిస లేకుండా దేసం మీద పడ్డాడు.
    కర్రకాలూ, సంక లో కర్రలూ, మాసిన గేడ్డవూ! ఊల్లో ఎవరూ అనవాలే కట్టలేదు.
    అప్పటికీ ఇప్పటికీ వూరు సాలా మారి పోయింది.
    ఎనక తనుండీ యీది కెల్లి కోవటి యీర్రాజు దుకానం కాడ నిలుసున్నాడు. ఓ అరిగిన కానీ యీడి సేతిలో ఎశాడా కోవటి!
    కోవటోడింటికి పక్క యిల్లే తనది!
    "ఈ యింట్లో ఎవరుంటున్నారు బాబూ?"
    "ఇస్కూలు మాస్టారు!"
    "సొంతవేనాండి?"
    "అద్దె కిచ్చారు. జగ్గన్న గాడనీ వో వస్తాదు దుండీ వోడులే! అసలు అడిదీ యీ యిల్లు. ఆడు యుద్దంలో కెల్లి పోయా క్కూడా ఆడి తమ్ముడూ, పెళ్లావూ , యిద్దరు పిల్లలూ ఉండీ వోరు. పాపం ఆయమ్మ ఎంతో కాలం మొగుడి కోసం పడిగాపులడి కూకుంది. సిగురికి ఆడు సచ్చిపోయాడని తెలిసింది. రాజియ్యగాడూ, సూరమ్మా, కొడుకూ ఈ వూరి నుంచి ఎల్లి పోయారు."
    "ఇద్దరు పిల్లలన్నావు కదా బాబూ?"
    "ఇద్దరే! దాని కూతురు వోడపిల్లి తిరతం లో మారిపోయింది. మల్లా దొరకలేదు!
    జగ్గన్న బిక్క సచ్చిపోయాడు. మొకం వోనికి పోయినాది. నరాలు జివజివలాడినాయి. కాళ్ళు దడదల్లాడాయి. గుండి గోల్లుని ఏడిసింది.
    కోవటోడు అలా చూస్తూనే ఉన్నాడు.జగ్గన్న గుండి నిబ్బరించుగున్నాడు.
    "అయితే ఏ వూరేల్లారో?"
    "అద్దర్నీ ఓ వొడ్డీ యాపారగాడి కాడ జీతానికున్నాడు. ఆళ్ల కిప్పుడు మళ్ళీ ముగ్గురు పిల్లలు!"
    సర్రున దూసుకొచ్చి పడ్డ పిడుగులా యినబడ్డాది-- మల్లీ ముగ్గురు పిల్లలు!
    మొకం సిట్లించుకుని సంక లో కర్ర టకటకలాడించుకుంటూ ఎల్లిపోయాడు.
    సూరీడు నట్టనడాన నిలవడి నెత్తి మొత్తుతున్నాడు. ఒంటి కాలితో సేరాసేరా యీదుతా యిసక తిప్పకి అద్దబడి వోత్తా ఉన్నాడు జగ్గన్న. గోదారి పాయి పాట్రేవు దాటి ముంత నిండా మంచి నీళ్ళు నింపుకున్నాడు. దరినున్న పుచ్చ పాదులు తడివి ఎర్రటి పండు నోటి కోసుకుని మూట గట్టుకున్నాడు.
    నడిసి నడిసి అలవూరు లంకలోకి సొచ్చుగోచ్చాడు.
    ఇసక మాడిపోతా ఉన్నాది. సూరీడు కాలి పోతా ఉన్నాడు.
    ఆడి గుండిలూ మండుతున్నాయి. రగతం సలసలమంటున్నది.
    "సూరమ్మ-- తన పెళ్ళాం -- ఆడి కోసం-- తన తమ్ముడి కోసం -- పిల్లల్ని కన్నాది! రంకులాడి!'
    అడ్నీ , దాన్నీ కసిక్కుని పోడిసేయ్యాలి! ఆడి రగతం తాగాలి!
    దాని వొళ్ళు ముక్కలు సేసి కాకులకీ, గెద్దలకి ఎయ్యాలి. అది కన్న పిల్లల పీకిలు నులివెయ్యాలి! అప్పుడు కాని ఆడి కోపం సల్లారదు. ఆడి వుసురు వూరుకోదు. పెనం కుదుటబడదు.
    అణ్ణి పొడిసేయ్యాలి. దాన్ని ముక్కలు సేయ్యాలి, ఆళ్ళా పిల్లల్ని సంపెయ్యాలి!
    మొల్లో కత్తికి పదును పెట్టాలి, జగ్గన్న మగతనం నిలబెట్టుకోవాలి!
    ఇంకా నడుత్తన్నాడు. ఇటూ అటూ అకాసేనంతా యిసక సర్ర పరుసుకున్నాది.
    ఆడి కళ్ళు సీకట్లు కమ్మినాయి. ఒంట్లో బలం తగ్గినాది. కాళ్ళు దడదల్లాడినాయి. మూట కిందేసుకుని ఉసూరువంటా ఆ యిసక లోనే కూసున్నాడు.
    సుట్టూ మనుసుల అలికిడి లేదు. కళ్ళు సేతుల్తో కప్పుకున్నాడు.
    అక్కడే ఆ ఎండకి మాడి -- ఆళ్ళ మీద కసి తీరుసుకోకుండానే సచ్చి పోతానేవో అని బయం పడ్డాడు.
    కళ్ళు మెరిసినాయి. పగ తీరకుండా ఆడు సావడు. సవడానికి యీల్లేదు! మల్లా అడుగులో అడుగేసుకుంటా నడిశాడు.
    ఎదర ఎవురో ఒత్తన్నారు. ఏమో మాట లిని పిత్తా ఉన్నాయి. పిల్లలు కూడా ఉన్నారు. కాళ్ళు కాలిపోతన్నట్టున్నాయి. నెత్తులు మాడతన్నట్టున్నాయి. దరి కొచ్చారు. పిల్లలు దాగవంటన్నారు. ఆళ్ళ నాలికలు పిడసగట్టుకు పోయాయి.
    ఆళ్ళని సూత్తే జగ్గన్న కీ దాగవయినాది. ముంత తీసుకున్నాడు. ఆళ్ళీంకా దరికోచ్చారు. ముంతెత్తి నోట్టో పోసుకోబోతున్నాడు.
    ఆళ్ళ బాబు యీడి దగ్గిరి కొచ్చాడు. "సంటోళ్ళు దాగవని ఎడుత్తన్నారు. రొండు సుక్కలు ఆళ్ళ నోల్లల్లో కూడా పోసి పున్నెం కట్టుకో అయ్యా!" బతివాలాడు.
    ఎగా దిగా సూసి -- నోటి కాడి ముంత , ఆడి సేతిలో పెట్టాడు జగ్గన్న.
    ముగ్గురూ పిల్లలూ గడగడా తాగేసి, ముంత కాలీ సేశారు. ఆల్లల్లో పెద్దోడికి నీళ్ళు మిగల్లేదు!
    ఎండక్కయిలి పోయిన నీటోంకాయిలా నిలుసున్నదా అడ మనిషి.
    కాలీ ముంత జగ్గన్న తీసుకున్నాడు.
    'కొత్త పేట వూల్లో కి యింకా ఎంత దూరవుంటాది అన్నా?"
    ఆ గొంతుకలో ఏదో పాత జీర లేకపోలేదు.
    "కోసుడు పైగా ఉన్నాది."
    అప్పుడు దాని మొగుడన్నాడు: "యింకా సానా దూర వెల్లాలి గందా, బుల్లోన్ని నే తీసుకోనా సూరీ?"
    ---"సూరీ?'
    ఆ మాట రొండు మొనలున్న బల్లెంలా గుచ్చుకుంది జగ్గన్న కి.
    అది సూరి -- తను కట్టుకున్న పెళ్ళాం!
    ఆడు రాజియ్య -- తన తోడబుట్టినోడు!
    ఎవరి కోసం తను డబ్బు గడించాడు? ఎవరి కోసం యుద్దాల నొల్లకాట్తో తిరిగాడు? కాలిరగ్గొట్టుకున్నా ఎవర్ని సూసుకొని బతుకుదారని యిప్పుడింటి కొచ్చాడు?
    ఈల్లె! యీల్లె! తన కంచంలో వోన్నం తిని తన పొట్ట మీదే కొట్టిన పుండాకో రేదవ యీడు!
    మొగుడు దేసాలు పడి తిరుగుతా వుంటే మరిదొడితో కులుకుతున్న రాచ్చసి యిదే!
    ఆళ్ళ పాపానికి పండిన పళ్ళు, యీ పిల్లలు!
    సూరమ్మ, రాజియ్య పిల్లల్ని తీసుకుని నడిసి పోతా ఉన్నారు.
    ఆడి గుండికి అదుటక్కు వయినాది.
    ఆళ్ళని పొడిసేయ్యాలి! ఆళ్ళ రగతం !-- రగతం కళ్ళ సూడాలి!
    "ఏయ్!" గట్టిగా అరిశాడు జగ్గన్న.
    గొంతుకు నరాలు ఉబ్బుకోచ్చేట్టు అరిశాడు.
    ఆళ్ళు ఎనక్కి తిరిగారు.
    మొల్లో కత్తి సర్రుని ఎలపలికి లాగాడు. ఆ కత్తికి ఎండ తలతలా మెరిసి సేదిరి పదినాది.
    ఆళ్ళు తెల్లబోయి సూశారు.
    కత్తి ఇటూ అటూ తిప్పాడు జగ్గన్న.
    రాజియ్య బుర్ర పనిసేయ్య లేదు. సూరమ్మ రాయిలా నిలబడి పోయినాది. కత్తి మెరుపుతో కళ్ళు కదిలిత్తా, ఆ పిల్లలు కాళ్ళు కాలుతా వున్నా మాటే మరిసి పోయారు.
    జగ్గన్న ఆళ్ళ దరి కెల్లాడు.
    కళ్ళు నిడీసేసీ యీటెల్తో పొడుస్తా వున్నట్టు సూశాడు.
    ఆళ్ళు గజగజ లాడిపోయారు.
    సూరమ్మా, రాజియ్యా!
    తన పెళ్ళావూ, తమ్ముడూ!
    కాదు కాదు -- తను సచ్చే పోయాడు!
    ఇప్పుడున్నోళ్ళు రాజీయ్య, ఆడి పెళ్లావూ!
    జగ్గన్న తల తిరిగిపోయినాది. సెయ్యి పట్టు పడల్లేదు.    
    ఎత్తిన కత్తి, దింప కండా -- కసిక్కుని పొడిశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS