Previous Page Next Page 
వెలుగు వెన్నెల గోదారీ పేజి 10

 

    "దాంతో ఆళ్ళకీ మరీ లోకువయినాది. ఓ మంచి రోజు సూసి, యిద్దరూ కలిసి ఆదికి యిసవెట్టారు.
    "అయ్య బాబో!" అన్నాడు ఎంకన్న.
    "ఇంకా యిను ఎంకన్నా! అయ్యగార్ని మోసేసిన కాడి నించీ రావయగాడే అమ్మగారి పసుపూ కుంకం నిలబెట్టాడు. కొన్నాల్లు పోయాక జవీందారీ అంతా యీడి పేర నవోదయినాది. అప్పన్నించీ ఆడు రామారావుగారయి పోయాడు. ఈ మేడ ఆడిది!
    "అమ్మగారు యీదిని బడినాది. ఇప్పటికీ యిన్నీసు పేట బస్సుటాండు కాడ ఓ పిచ్చిది అడుక్కుంటా వుంటాది . ఎప్పుడూ సూల్లేదో?"
    "పాపం!" అన్నాడు ఎంకన్న.
    "మరి రావయగాడో?"
    "అదురుట్టవున్నాడన్నావుగా!" కొట్టోచ్చినట్టు సూశాడు బద్రయ్య.
    ఆ మేడ మీద వో అమ్మాయీ, మరో బుల్లోడూ సిణీవా పాటేదో పాడుకుంటా గంతు లెత్తన్నారు. కింద నౌకరోడు కారు కడుగుతా వున్నాడు. అయ్యగారి దరిసేనం కోసం తేల్లటోపీలోళ్ళూ , సిలుకు సూట్లోళ్ళూ సోపాల్లో కూసున్నారు. "అయ్యగారు పూజలో ఉన్నారు!" అని సేప్పాడు కుర్రోడు.
    "గొప్ప దైవ భక్తుడు."
    "సంఘ సేవకుడు!"
    "నిస్వార్ధ ప్రజానాయకుడు!"
    "సాహిత్య ప్రియుడు."
    "కళా తపస్వి."
    "బుధజన విధేయుడు, సర్వజన వంద్యుడు!"
    అక్కడ కూసున్నోళ్ళంతా తలో పాటా పాడతన్నారు. ఆళ్ళంటన్న మాటలెంటో ఎంకన్న కి తెలీలేదు. బద్రయ్య కి మటుక్కి కొంత తెలిసి నాది.
    ఇద్దరూ ముందరి కెల్లిపోయారు. ఓ యింటి అరుగు మీద లావు పాడోడు , పడక్కురిసీలో కూకుని పేపరు సదూకుంటన్నాడు.
    "ఆ డేవురో తెలుసా ఎంకన్నా?"
    "ఉహు!"
    "ఎనక యీవూల్లో యీడికి పెద్ద కల్లు పాక ఉండేది. సాయిబిసనోచ్చాక సరకారాళ్లు నిగా సెయడం తో లచ్చివ్వోరప్పేటలో రొండు మేడలూ, కడిపి లంకలో యిరవయ్యోకరాల బూవీ కొన్నాక, కల్లు తాక్కూడదని జనానికి సేబుతా ఉపన్నెసా లీడవేపనిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు మునిసి పాల్టీ కవున్సిలరు!"
    తెలిసినట్టు బుర్ర వూగించాడు ఎంకన్న.
    ఇంకో యింటి ముందర అగారాళ్ళు. తాలాలూ, మద్దిల్లూ, సప్పుళ్ళూ , సన్నాయి పాటా , గజ్జిల మోతా యినిపిత్తా వున్నాయి.
    "ఈ యిల్లు అరుముగం అయ్యరు గాడిది. అరవ్వోడులే! ఈడి కిద్దరు పెల్లాలు.తూతూకూడి రాజిరత్తమ్మ అనీ సిన్నదాన్ని అదే సెంనించి లేగేత్తుకొచ్చి యిక్కడే ఉండిపోయాడు. ఏలం ఎర్రి కుర్ర గుంటలకి తెయితక్కలాడ్డం నేరుపుతాడు. కొత్త సిణీవా వొచ్చినాదంటే, మన్నాడు ఏసం కట్టించాడన్నమాటే! ఆడీ వూరోచ్చాక బోగవోళ్ళ గిరాకీ పడిపోయినాది. అడిలా బరత నట్టెం వొచ్చినోడు మన దేసెం లోనే లేడంట! ఆడు ఈ వూల్లో ఉండి పోడం రాయిసంద్రానికే పెద్ద గొప్పంట!"
    నోరెల్ల బెట్టుకొని యింటావున్నాడు ఎంకన్న.
    ఇద్దరూ అల్లా నడుత్తా వుంటే ,ఓ సిలుకు సోక్కా వోడు -- మెల్లో బంగారం గొలుసున్న వోడూ కనిపించాడు.
    "ఆడి పేరు గంగయ్య. వూల్లో బోగావోళ్ళు ఆడికి తెలీకండా మేలానికి బేర వొప్పుకోరు! మొన్న వోరదలికి గోదాల్లో కొట్టుకొచ్చిన శివలింగానికి గుడి కట్టిత్తానంటే,ఎయ్యి నూట పదార్లు వురోసుకుసచ్చిన తన పెళ్లాం పేరు మీద యిచ్చాడంట! ఆడి అన్నయ్యోడున్నాడు.సచ్చినోళ్ల పీనుగులు మోయ్యడవే ఆడి పని. దానాదీనా మూడిళ్లు కొన్నాడు. ముప్పయి యేలు వొడ్డీ లికి తిప్పుతా వుంటాయంట!"
    "ఈ వూల్లో యింత గొప్పోళ్ళున్నారా?"అనుకున్నాడు ఎంకన్న.
    "ఈ వూరికి ఎనకో మనిసిపల్లు సేరిమే నుండీ వోడులే!-- ఆడికి ఆ కురిసీ దొరికాక లచ్చ రూపాయలు బెంకులో ఏసినట్టు ఎవురికీ తెలీదంట!"
    ఇన్ని గొప్ప సంగతులు లోన కెల్లడానికి ఎంకన్న బుర్రలో సోటు నిండుకున్నాది.
    "ఇన్ని యిసయాలు యీడి కెల్లా తెలిశాయో?" అనుకున్నాడు.
    జేవులోంచి రొండు సిగరోట్టులు తీసి ఎంకన్న క్కూడా వోటిచ్చాడు బద్రయ్య. ఇద్దరూ అగ్గి అంటించుకున్నారు.
    "ఈళ్ళీంత గోప్పోల్లెల్లాగయ్యారు బద్రయ్యా?"
    "అదురుట్టవు!" అని పగలబడి నవ్వాడు. "అందరూ అల్లాగే అనుకుంటారు తమ్ముడో! అదురుట్టవె! అంటే ఏంటో తెలుసా నీకు?"
    ఎంకన్న నోరెల్లబెట్టాడు.
    "తెలీదా?"
    "కల్లకి కనిపించకుండా వచ్చీ లాబాన్ని అదురుట్టవంటారు. అని బాలయ్యగారనేవోరు."
    "కరకట్టు! సరిగా సేప్పావు తమ్ముడా! నిజం సేప్పోద్దో? ఇది నీక్కూడా తెలుత్తాదనుకోలేదు!"
    "అయితే బద్రయ్య! రెండో కంటోడికి తెలీకుండా సాటుగా డబ్బు గడిత్తే అదురుట్టవంటున్నాం గందా మరి దొంగతనవో?"
    దొంగతనం అదురుట్టం లోకి రాదని ఆడికో గట్టి నమ్మకం ఉన్నాది.
    "అదీనూ!"
    అది ఎంకన్న కి నచ్చలేదు.
    "అసలు సంగతి నీకు తెలీలేదు ఎంకన్నా! ఎంతకాలం నించి దొంగతనం సెత్తన్నవొన్నయినా, ఆడు పట్టుబడ్డప్పుడు కాని మనం దొంగ అనం, కనక ఏంటంటే ఆడు పట్టుబడకుండా ఉన్నన్నాళ్ళూ పెద్ద మనిసి లోనే లెక్కన్న మాట!"
    "అదురుట్టవంటే అది కాదు బద్రయ్యన్నా!" సేప్పబోతావుండగానే ---
    "నాకు తెలుసు ఎంకన్నా! నువ్వనుకునీయి పాతారుగాయి పచ్చళ్ళు! ఇప్పుడెంటంటే నువ్వు దొంగతనం సెయ్యి , కూనీ సెయ్యి, ఇంకో తనవేదన్న సెయ్యి, మోసవూసేయ్యి , ఎన్ని సేసినా సాటుగా ఎవురికీ దొరక్కుండా సెయ్యి. ఈ బూమ్మీద రెండో కంటోడ్నీ నమ్మేవో, నిన్ను ముంచేడన్నమాటే! నాలుగు రాళ్ళు ఎనకేసుకున్నావంటే, నువ్వాడింది అట, పాడింది పాట! ఏనుగేక్కించి నిన్ను వూరేగిత్తారు. నీపుటోవు దండల్తో కూడా పేపర్లో ఎయిత్తారు. అప్పుడు నువ్వు కూడా గోప్పోడివే అయిపోతావు!"
    ఇన్ని సెప్పినా ఎంకన్న కి నచ్చలేదు.
    "మోసవంటే బయట పడకూడదు తమ్ముడో! నువ్వూ నేనూ మడిగట్టుక్కూకుంటే పెపంచమంతా మనకోసం మారతాదా?అసలు మోసం లేని సోటు ఎక్కడేనా ఉన్నదా సెప్పు! ఒకడు రెండోవోడికి సేత్తే లావుక్కే మంటారు. పెళ్లానికి సేత్తే సరసాలవోడంటారు. అన్న దంముడికి సేత్తే పెవేజికుడంటారు. పది మందికీ సేత్తే యాపారవంటారు. దేసానికి సేత్తే రాసకీయవంటారు! మరి గంటె, అంత మందీ యిల్లా ఉన్నప్పుడు మనం దూరంగా ఉండిపోతే , యీ రోజుల్లో బతగ్గలవా? ఇపుడు గొప్పోళ్ళు అనిపించుగునీ వొళ్లంతా నాయంగా బతుకుతున్నవొల్లెనా? నీ మంచితనవంతా మాటల్లో సూబిచ్చాలి. నువు చేసే పని మట్టుక్కి నువు మానకూడదు. సచ్చీదాకా నీ కిటుకు పక్కలో పెళ్ళానికి కూడా సేప్పకోడదు! తెలిసిందా? ఎంత పెవాదమయిన పన్లు సేత్తే అంత తొందరగా గోప్పొడివయిపోతావు -- ఏవంటా?"
    "ఇల్లా గడించి తినీది కూడా వొన్న,మే?"
    "మరి నీసుకంకోసం కాదో ? నీ మజా కోసం కాదో? కడుపు నిండా తిండీ, సిలుకు సోక్కాలూ, ఎట్టయినా మేడా , దొరసాని లాంటి సొగసుకత్తీ, సేతిలో వో బుడ్డి -- ఉన్నాయంటే నాసవిరంగా యిందర లోకం సూడవో?"
    ఎంకన్న వోప్పుకోనట్టు సూశాడు , బద్రయ్య మాట మారిశాడు.

                    

                                      6
    "అన్నట్టూ నీకు ఆకలేత్తావుందేవో! యీ వోటేల్లో కూతంత కాఫీ తాగి సేంద్రకాంత వింటి కెల్దారి ! వోత్తావా?"
    "అదెవరూ?"
    "నువ్వే సూత్తావుగా!" బద్రయ్య నవ్వాడు.
    "రాను రాను ఆడికీ తనమీద మోజు తగ్గిందేవా?' అనుకున్నది రావులమ్మ. నవుకిరీ మానేసి పట్నం పోయి ఆడు గోప్పోడవుతున్నాడు గందా , తను మాటాడితేనే యిసుక్కుంటాడెం? తోలెడు వోచిన లాబం తో మెల్లో పట్టిడి సేయిత్తానని అన్నోడు కాడో? తను నిజవే అనుకున్నాది. సిణేవాలికీ, సరకసులికీ కరుస్సేత్తాడు కానీ తన పట్టిడ మాట గురుతుంటాదా? ఏవన్నా అంటే బిగినీసు, బిగినీసు అంటాడు.మరయితే వొచ్చిన లాబాలు వోక్కరోజూ సూబిచ్చడెం ? ఇప్పుడు గురుతులేదులే కానీ ఆడు పట్న వెల్తానన్నప్పుడే దానికి కుడికన్ను అదిరుండాలి!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS