Previous Page Next Page 
సురేఖా పరిణయం పేజి 9

 

                                    5
    వీధి గుమ్మం లో రిక్షా దిగి చిన్న సూట్ కేసు చేత్తో పట్టుకుని లోపలికి నడిచింది సురేఖ.
    రోడ్డు మీద వీధి వాకిట్లో నూ విశాలమైన పందిరి వేశారు. స్తంభాలకి పచ్చి కొబ్బరి మట్టలు చుట్ట బెట్టి పందిరికి నలుగు మూలలా మామిడాకుతోరాణాలు కట్టారు.
    'అక్కడ, సుబ్బమ్మ గారింటికి ముందు కూడా పందిరి వుంది -- ఆ ఇల్లు విడిది ఇచ్చారేమో' అనుకుంటూ తల వంచుకుని నడుస్తున్న సురేఖని,
    'పిన్ని వచ్చింది, అక్కయ్య వచ్చింది' అంటూ చుట్టేశారు పందిట్లో ఆడుతూ గెంతులేస్తున్న పిల్లలంతా.
    'వచ్చావా -- వస్తావని వ్రాశావే గాని కాని నిన్నటి దాకా రాకపోయేసరికి అమ్మ మళ్ళీ టెలిగ్రాం ఇప్పించింది-- ఏమ్మా . పెళ్ళి వారితో సమంగా దిగాలనుకున్నావా-- పోనీలే ఇవాళయినా వచ్చావు' అంటూ అక్కయ్యా వాళ్ళూ పలకరించారు.
    'టెలిగ్రాం ఇచ్చారా -- నేను బయలుదేరాక అందిందేమో' అంది సురేఖ ఓరోజు ముందుగా నయినా వచ్చాను కాను అనుకుంటూ.
    కాస్సేపటిలో పెళ్లి వారు వస్తారుట. రమణమూర్తి గారూ కొడుకులూ ఇంకా కొందరు పెద్దలూ స్టేషను కి వెళ్ళారు-- పట్టుచీర కట్టుకుని హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు వర్ధనమ్మ గారూ. 'వచ్చావా అమ్మా' అంటూ ఆప్యాయంగా పలకరించబోయింది కాని ఆవిడ మొహం మాత్రం ఏదో తప్పు చేసినట్లు వెలవెల బోతూనేవుంది.
    పెళ్ళికి వచ్చిన బంధువులతో ఇల్లంతా ఒకటే సందడి-- ఒకరి మాట ఇంకొకరి కి వినపడకుండా అంతా ఒక్కసారే గడిబిడగా మాట్లాడేస్తున్నారు.
    పెరట్లో కి వెళ్ళి కాళ్ళూ మొహం కడుక్కు వచ్చి తల్లి చేతిలో కాఫీ గ్లాసు అందుకుంది సురేఖ.
    'నీళ్ళు పోసుకుని తలా అదీ దువ్వుకో. ఆ విడిది లో ఏర్పాట్లనీ చూసి వస్తాను.' అని వెళ్ళి పోయిందావిడ-- మనవరాలు వచ్చిన కబురు విని వంట పందిట్లో నుంఛి వస్తూ 'వెంకమ్మా -- కాసిని వేన్నీళ్ళు తొలిపి గదిలో పెట్టు-- అమ్మాయి స్నానం చేస్తుంది' అంది కామాక్షమ్మ గారు -- ఓపిక లేకపోయినా ఆవిడా వూరికే కూర్చోకుండా అన్ని పనుల మీద అజమాయిషీ చేస్తూ అటూ ఇటూ తిరుగుతోంది.
    "అక్కా ఇలా రా' అంటూ ఊర్మిళ సురేఖ చెయ్యి పట్టుకుని ఉమ దగ్గరికి తీసుకు వెళ్ళింది.
    ఆ ఉదయమే పెళ్ళి కూతుర్ని చేశారు. నుదుట కల్యాణం బొట్టు, బుగ్గని చుక్క కాళ్ళకి పారాణి-- తలంటి స్నానం చేసిన పొడి జుట్టు వదులుగా జడ అల్లుకుంది. జడలో పట్టెడు ఎర్ర గులాబీల చెండు. చెల్లెలి వంక చూస్తూ ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది సురేఖ. 'ఉమ వంటి మీద ఆ పట్టు చీరకే మరింత అందం వస్తుంది- ఆ చీరలో ఉమ మరింత అందంగా మెరిసిపోతోంది' అనుకుంది తను తెచ్చిన చీర తలుచుకుని. ఉమ ని పలకరించాలంటే మాత్రం నాలుక సమ్మె చేసినట్లు నోరు పెగలనట్లు అయిపొయింది- ఉమ కూడా సిగ్గుపడుతూమాట్లాడలేదేమో అనుకుంది కాని తనే ముందుకు వచ్చి అక్కగారి చెయ్యి అందుకుంటూ 'నేను రాసినవి తెచ్చావా ?" అని అడిగింది.
    'తెచ్చాను నీకు నచ్చుతాయో నచ్చవో కాని.' అంటూ పెట్టి తెరిచి అన్నీ బయట పెట్టింది.
    గద్వాల్ జాకెట్టు గుడ్డలు బాగున్నాయని ఉమా మెచ్చుకుంది. ఎవరెవరికి ఏ జత ఇస్తే బాగుంటుందో ఎన్నిక చేస్తూ గాజులన్నీ ఒళ్ళో పెట్టుకుంది ఊర్మిళ.
    'ఇది నీకు నా ప్రెజెంటేషన్ .' చీర ప్యాకెట్టు ఉమ చేతిలో పెట్టింది సురేఖ.
    పరపర పై కవరు చింపి చీర పైకి తీసింది ఉమ - ఆ పిల్ల కళ్ళు తళుక్కున మెరిశాయి.
    'మెనీ మెనీ థాంక్స్ క్కా -- నాన్నగారూ ఓ పట్టుచీర కొన్నారనుకో -- జరీ మరీ గోరంత వుంది. రేపిదే కట్టుకుంటాను -- బ్లౌజు పీసు కూడా చాలా బాగుంది -- ' అంటూ మురిసిపోతూ చీర మడతని భుజం మీద వేసుకుని  వేసుకుని అద్దంలో చూసుకుంది. నిలువునా పెట్టుకుని చూసుకుని కట్టుకుంటే ఎలా వుంటుందో అని వూహించుకోసాగింది.
    సురేఖ స్నానం అయినా చెయ్యకుండా కబుర్ల లో మునిగిపోయింది -- అవతల పెళ్ళి వారు వచ్చి విడిది లో దిగారంటూ వార్త పట్టుకొచ్చారు సుందరం, సూర్యం.
    'ఇంకా అలాగే వున్నావా -- కాఫీ ఫలహారాలు పట్టించుకుని వెళ్ళాలి-- కామాక్షి ఊర్మిళా మీరు రండి.' అంటూ వర్ధనమ్మ గారు వాళ్ళను తీసుకుని వెళ్ళిపోయింది-- కోడలు భారతి పసిపిల్ల తల్లి-- పైగా ఆ పిల్లకి కొత్తగా వేయించిన టీకాలు పొక్కి బాధ పెడుతున్నాయి- అందుచేత ఆ పిల్ల తోటే సరిపోతోందావిడకి.
    ఏదో పని మీద వచ్చి మళ్ళీ హడావుడి గా విడిదికి వెళ్ళబోతున్న రమణమూర్తి గారు సురేఖ వచ్చిన వార్త విని పలకరించారు ఓసారి గంబీరంగా వుండటానికి ప్రయత్నిస్తూ.
    మర్నాడు ఉదయం పది గంటలకి లగ్నం -- తెల్లవార కుండానే మొదలయిన సందడి నిముషాలు గడుస్తున్న కొలది మరీ గడిబిడగా హడావిడిగా తయారయింది-- ఎవరికి వారే లోడలోడ ఏదో చెప్పేసే వాళ్ళూ-- ఆ పెళ్ళి బాధ్యతంతా తమ భుజ స్కంధాల మీదే మోసి భరిస్తున్నట్లూ తను క్షణం విశ్రాంతి గా నిలబడి పొతే ఎక్కడి పనులక్కడే ఆగిపోతాయేమో అన్న హడావిడితో అటూ ఇటూ తిరిగే వాళ్ళూ గా వుంది ఇల్లంతా -- నుదుట నయా పైసా అంత బొట్టు పెట్టుకుని కాళ్ళకి పసుపు రాసుకుని, ఒంటేడు నగల బరువూ ఓ ప్రక్క నుంచి దిగలాగుతున్నా అవి తను హోదా చిహ్నాలుగా తలచి సంతోషం గానూ గర్వం గానూ భరిస్తున్న ముత్తయిదువులతోనూ , కట్టుకున్న చీరకీ తొడుక్కున్న జాకెట్టు కీ మేచ్ అయిందో లేదో చూసుకుంటూ చీర కుచ్చేళ్ళు చెదిరి పోకుండా వుండి వుండి సర్దుకుంటూ ఆ సందడి కంతటికి ఒక అలంకారంగా మెల్లిగా తిరుగులాడే అమ్మాయిలతోనూ ఒకటే కోలాహలంగా వుంది.
    కామాక్షి ఆరోగ్యం ఇంకా పూర్తిగా బాగుపడలేదు -- అందుకే తను మరీ హైరాన పడకుండా ఓ దగ్గర విశ్రాంతి గా కూర్చుంటోంది --
    గదిలో ఓ మూల పెట్టి మీద కూర్చుని పుస్తకం చదువుకుంటున్న సురేఖ వర్ధనమ్మ గారి కంట పడింది-- ఏదో పని మీద వచ్చినావిడ అది అలాగే మరిచిపోయి 'పట్టుచీర కట్టుకో -- వాళ్ళంతా వచ్చే వేళయింది' అంది-- 'ఫరవాలేదు లెద్దూ -- ఈ చీర బాగానే వుంది.' అంది సురేఖ లేత గులాబీ పువ్వుల వాయిలు చీర వంక చూసుకుంటూ.
    వర్ధనమ్మ గారు మరేమీ చెప్పలేక పోయింది. ఉన్నట్టుండి ఆవిడ కళ్ళు రెండూ చెమ్మగిల్లి గొంతులో చెప్పలేని బాధ సుళ్ళు తిరుగుతుంటే తనలోని బలహీనత ఎవరి కంటా పడరాదన్నట్టు ఓ ప్రక్కకి వెళ్ళి గబగబ కళ్ళు తుడిచేసుకుంది.
    'ఏవమ్మా-- రవికల గుడ్డలు తెస్తానని ఇక్కడే వుండి పోయావు .' అంటూ మరో ముత్తేదువ లోపలికి రావటంతో మాట్లాడకుండా పెట్టి తెరిచి రవికలు గుడ్డలు తీసుకుని మళ్ళీ తాళం వేసేసింది. ఈవిడ పరిస్థితిని అర్ధం చేసుకోగలిగిన ఆవిడ ఓ నిట్టుర్పు విడిచి బయటకు వెళ్ళిపోయింది.
    తను అలా అంటీ ముట్టనట్లు ముభావంగా వుండి పోవటం తల్లికి బాధ అనిపించటమే కాక నులుగురి విమర్శ కి కూడా గురి అవుతాననే భయంతో తల్లి వెనకే సురేఖ కూడా నడిచింది.

           
    ముహూర్తం అయిపొయింది. వచ్చిన వాళ్ళందరి కీ ఊర్మిళా, కామాక్షి బొట్టు పెట్టి గంధం పూసి తాంబూలాలు ఇస్తున్నారు. కామాక్షి కూతురు ఆరేళ్ళ పిల్ల పన్నీరు బుడ్డి తీసుకుని అదేపనిగా జల్లెస్తోంది. 'ఇంక చాలమ్మా చాలు' అని అవతలి వాళ్ళు చేతులు అడ్డం పెట్టుకుని బ్రతిమాలుతున్నా వినకుండా 'పన్నీరు చాలు కాని అందరికీ బొట్టు పెట్టు ' అంటూ కుంకం భరిణ దాని చేతికిచ్చి తాంబూలం పళ్ళెం పుచ్చుకుంది ఊర్మిళ -- వచ్చిన వాళ్ళు చాలామంది ఉండటం చేత అక్కగారి ఒక్కతి వల్లా కావడం లేదని -- ఆ పిల్ల ఎటు నుంచి మొదలు పెట్టుకు రావాలా అన్నట్లు ఒక్క క్షణం నాలుగు వేపులా చక్రాల్లా కళ్ళు తిప్పి చూసింది -- చివరికి, దోసెడు వెడల్పు జరీ అంచు పట్టు చీర కట్టుకుని, మెడలో అరువరసల పలకసర్లు , ఓ చేతికి పది బంగారు గాజులు మరో చేతికి స్క్వేర్ వాచీ పెట్టుకుని, రింగు పెట్టి సిగ చుట్టుకుని తనకి దగ్గరగా వున్నావిడ మొహాన్నా మెత్తేసింది రెండు వేళ్ళతోనూ తీసిన పట్టెడు కుంకాన్ని. తదేకంగా పెళ్ళి తంతు చూస్తూ కూర్చున్న ఆ పూర్వ సువాసిని అమాంతం వులిక్కిపడి కెవ్వుమన బోయి మళ్ళీ తమాయించుకుంది. కాని చుట్టూ వున్న నలుగురు ఆ పిల్లని  చీవాట్లు పెట్టి , ఆభమూ, శుభమూ తెలియని పసిదాని చేతిలో కుంకుం భరిణ పెట్టిన పెద్ద వాళ్లకి కూడా నాలుగు అక్షింతలు వేశారు.
    ఏమీ పట్టించుకోకుండా తను అలా కూర్చుండి పొతే బాగుండదని సురేఖ లేచి వచ్చింది. ఆ ఆమ్మాయి చేతిలోంచి తాంబూలం అందుకుంటున్న ప్రతి ముత్తయిదువూ, 'అయ్యో , పాపం , నువ్వా!' అన్నట్లు కళ్ళల్లో గంపెడు సానుభూతి నింపుకుని చూడటం తను రెండడుగులు అటు వెళ్ళగానే,
    'పెద్ద కూతురికి చెయ్యకుండా చిన్నదానికి చెయ్యటం వర్ధనమ్మ గారికీ బాధగానే ఉంది -- ఇందాకా ఆవిడ కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటుంటే చూశాను. అని ఒకరు --
    'రుక్మిణమ్మ అయినా కాస్త మంచీ చెడ్డా ఆలోచించాల్సింది -- ఈ పిల్లనే చేసుకుంటే ఎంత లక్షణంగా వుండేది ' అని మరొకరూ ఇలా గుసగుసలూ పోవటం స్పష్టంగా సురేఖ చెవుల్లో పడటం తో ఆ అమ్మాయి వంటి నిండా తేళ్ళూ జేర్రులూ పాకినట్లయింది. అక్కడ ఒక్క క్షణం కూడా నిలవబుద్ది కాలేదు.
    'ప్రపంచంలో అంతా అప్సరసలె వుండరు. నేను కురుపిని కుంటి దాన్ని కాదు- నాలో ఎలాంటి లోపం లేదు --ఇంక నేనెందుకు సిగ్గుపడాలి.' అని అదివరకు ఎన్నోసార్లు తనని సమాధాన పరుచుకుని 'నాకేం తక్కువ' అనే ఆత్మ గౌరవంతో నిటారుగా నిలబడాలని నిశ్చయించుకుంది.
    కాని, ఇవాళ వాళ్ళ మాటల వల్ల గాయపడిన హృదయం 'భగవంతుడా, నన్నేందుకు ఓ సౌందర్య రాశిలా సృష్టించలేదు- నీకు నేనేం అపకారం చేశాను- నలుగురి లో నన్ను ఇలా అవమానాలు పాలు చేసి నువ్వు వినోదం చూస్తూ కూర్చుంటావా ' అంటూ కనిపించకుండా దాక్కున్న దేవుడ్ని వెతికి పట్టుకుని కసితీరా నిలదీసి అడగాలనిపించింది.
    'ఛ నేనసలు ఈ పెళ్ళికి రాకుండా వుండాల్సింది -- వాళ్ళు ఏమనుకున్నా నా చెవుల బడేవి కావు ' అనుకుంటూ గదిలోకి వెళ్ళి పోయి అక్కడ పసిపిల్లని భుజం మీద వేసుకుని నిద్ర పుచ్చుతున్న వదిన గారితో .... నువ్వెళ్ళి అక్కడ పనేదో చూడు- నేను పాపని నిద్ర పుచ్చుతాను' అని తీసుకుంది.
    కాస్సేపటి తరువాత వివాహపు తంతు అంతా ముగిసింది - భోజనాలు హడావుడి కూడా అయిపొయింది.
    సాయంకాలం రిసెప్షన్ సమయంలో ఉమామహేశ్వరం గారి తమ్ముడి కూతురు మద్రాసు లో కొన్నాళ్ళు భరతనాట్యం నేర్చుకుందిట, ఆ పిల్ల ప్రోగ్రాం ఏర్పాటు చేశారు.
    బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి జడ వేసుకుంది ఉమ - స్నానానికి వెళ్ళబోతుంటే అప్పుడే పుల్ సూటు లో ముస్తాబయి వచ్చిన రామకృష్ణ.
    'నేను హైదరాబాదు నుంచి తెచ్చిన చీర కట్టుకో' అన్నాడు ప్రత్యేకం ఆ విషయం చెప్పటానికే వచ్చినట్లు.
    అతను కోరిన విధంగానే ముస్తాబయిన ఉమ బయటికి రావటానికి సిగ్గు పడుతున్న దానిలా గదిలోనే కూర్చుండి పోయింది -- ఇంట్లో అంతా ఫలహారాలు చేసే వాళ్ళూ కాఫీలు తాగేవాళ్ళూ గా ఎవరి గొడవలో వాళ్ళున్నారు.
    అటూ ఇటూ చూసి ఎక్కడా కనిపించక తలుపు కొద్దిగా తెరిచి చూసి 'అమ్మ దొంగ ఇక్కడున్నావా' అంటూ లోపలికి వచ్చాడు- ఉమ బెదురూ చూపులు చూస్తూ ఏదో అనబోతుంటే ఆమెని మాట్లాడనివ్వ కుండానే కొంగు పట్టి గబుక్కున దగ్గరికి లాక్కుని చటుక్కున పెదవుల మీద ముద్దు పెట్టేసుకున్నాడు-- ఆ కౌగిలి లో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న ఉమ 'అక్కయ్య' అంది ఇబ్బందిగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS