Previous Page Next Page 
సురేఖా పరిణయం పేజి 8

                 

    'చదువుకున్న అమ్మాయిని తప్ప నేను పెళ్ళి చేసుకోను అనటం ఫ్యాషనయి పోయింది ఈ రోజుల్లో పెళ్ళి కొడుకులకి-- ఆ క్వాలిఫికేషను కోసమే అన్నట్లుగా ఆడపిల్లల్ని చదివిస్తున్నారు-- మా ఆవిడ పి.యూ.సి ప్యాసయింది , బియ్యే ప్యాసయింది అని గొప్పగా చెప్పుకోవాలని అంత బులబాటం పడిన అబ్బాయీ ఆమె చదువునీ  వ్యక్తిత్వాన్ని గుర్తించటం  మాత్రం మరిచిపోతాడు-- ఇంటి కేవరైనా స్నేహితుడు వస్తే "నా మిసెస్" అని గర్వంగా పరిచయం చేస్తుంటే అమాంతం వంటింట్లో కి పారిపోయి దాక్కోకుండా చిరునవ్వుతో రెండు చేతులూ జోడించి నమస్తే చెప్పటానికి-- తను సరదాగా ఏ స్నేహితుడి యింటి కయినా తీసుకు వెళ్తే , ఆ స్నేహితుడి భార్యా వాళ్ళంతా లోపల ఏదో పనిలో వుండి రావటం ఒక్క నిముషం ఆలశ్యం అయితే డ్రాయింగు రూమ్ లో కూర్చుని వెర్రి మొహం వేసుకుని దిక్కులు చూడకుండా అక్కడ వున్న హిందూ పేపరో ఫిలిం ఫేరో స్టయిలిష్ గా తిరగేస్తూ కూర్చోటానికి తప్ప మరికేందుకూ పనికి రాకూడదనుకుంటాడు కాబోలు ఆ చదువు. -- అంటే ఆమె ఆలోచనలూ సంస్కారం ఒక పరిధి దాకా పెరిగి అక్కడే ఆగిపోవాలవేమో అతని ఉద్దేశం ' అనుకునేది.
    'అబ్బే -- ప్రతి విషయానికి అలా ఆలోచిస్తూ కూర్చుంటే సుఖమూ శాంతీ వుండవు మనకి' అంటుంది కో లెక్చరరు మాలతి.
    'అవును మరి -- అన్ని హంగులు అమరిన అదృష్ట వంతురాలు -- అలా అనకేం చేస్తుంది' అనుకుంటుంది సురేఖ.
    'ఎంతసేపూ మొగవాళ్ళ ని దుయ్య బట్టగానే సరికాదు-- చదువు సంధ్య రాని భార్యని కూడా ఎంతో అభిమానంగా చూసుకునే మొగవాళ్ళ ని నేను చూపించగలను-- కాని మీ ఆడవాళ్ళు మాత్రం ? సంపాదన లేని మొగుడ్ని ఎంత హీనంగా చూస్తారో ఊహించలేం ' అనేవాడు వాళ్ళన్నయ్య.
    ఆ మాటలు గుర్తు వచ్చినప్పుడల్లా సురేఖ కళ్ళల్లో సునంద మెదులుతుంది-' ఎక్సిడెంటు లో అవిటి వాడయిపోయిన భర్త, ముగ్గురు పిల్లలు, వృద్దులైన అత్త మామలు-- ఆ సంసారం అంతా సునంద సంపాదన మీదే గడుస్తోంది.
    అరవిచ్చిన బీర పువ్వులా స్వచ్చంగా నిర్మలంగా వుండే సునంద ముఖంలో కళ్ళలో నా మొగుడు అవిటి వాడు అన్న చులకన భావం కాని, ఆమె మాటల్లో మా సంసార భారాన్ని నేనే మోస్తున్నాను అనే అర్ధం కాని ఎన్నడూ వెల్లడి కావు.
    నిజమే మరి -- 'చదువు సంధ్యల తోటి , భోగ భాగ్యాల తోటి నిమిత్తం లేకుండా భార్య వ్యక్తిత్వాన్ని భర్త గుర్తించ కలిగినప్పుడు భార్య భర్తని గౌరవించ కలిగినపుడే కదా ఆ సంసారాల్లో శాంతి సౌఖ్యాలు వుంటాయి.' అనుకుంటుంది సురేఖ .

                            *    *    *    *
    కవరు లోంచి వుత్తరాలతో పాటు వచ్చిన శుభలేఖ వంక రెప్ప వాల్చకుండా చూస్తూ కూర్చుంది సురేఖ.
    'ఛి.సౌ. ఉమాదేవిని ఛి. డాక్టరు రామకృష్ణ' కు తెలిసిన పేర్లనే పదిసార్లు చదువుకుంది- ఈ వార్త కోసం తను పది రోజుల పైగా ఎదురు చూస్తున్నదే అయినా ఏమిటో ఎలాగో అయిపొయింది మనస్సు- అలా శుభలేఖ లోకి చూస్తున్న కళ్ళల్లో నీళ్ళు నిలిచి అక్షరాలూ అలుక్కు పోయినట్లు కనిపిస్తుంటే ,
    'ఛ , ఏమిటిది ఇలాంటి సమయంలోనా నా బలహీనత చూపించుకోటం ' అని చటుక్కున కొంగుతో కళ్ళు వత్తేసుకుంది- అసలు వాళ్ళకి ఈ సలహా ఇచ్చింది తనే కదా. మొన్న వచ్చిన నాన్న గారితోనూ అంతకు ముందు వచ్చిన బావతోనూ తనే కదా చెప్పింది - చేతిలో కార్డు వంక మరోసారి చూసి ఇవాళ తారీఖా అంటూ క్యాలెండరు వంక చూసింది. సరిగ్గా పది రోజులుందన్న మాట. బజారు కి వెళ్ళి ఏదైనా కొని పంపించాలి ఉమకి -- తనకి శలవు దొరకదనీ రాలేక పోయినందుకు ఏమీ అనుకోవద్దనీ ఏదో వ్రాసేయాలి వాళ్ళు బాధపడకుండా -- అనుకుంటూ కాగితాలు విప్పింది. తల్లీ , తండ్రీ ఉమా విడివిడిగా మూడు కాగితాల మీద వ్రాశారు.
    తనకీ అంతగా సమ్మతంగా లేకపోయినా అత్తయ్యా వాళ్ళూ తొందర పెట్టటం వల్ల తప్పని సరి అయిందనీ -- మళ్ళీ శూన్యమానం ఆ తరువాత మూడమీ అవీ కావటం వల్ల  అట్టే వ్యవదీ లేకుండానే ముహూర్తం పెట్టాల్సి వచ్చిందనీ వెంటనే శలవ పెట్టి రమ్మని వ్రాశారు రమణమూర్తి గారు.
    'నువ్వు ఏదో కారణం చెప్పి రావటం మానేస్తే నా మనస్సు చాలా నొచ్చుకుంటుంది- ఈ రోజుల్లో ఇందులో తప్పేమీ లేదు- నువ్వు సిగ్గు పడాల్సిందిలేదు - ఆ కళ్యాణఘడియ దానికి ముందుగా వ్రాశాడు భగవంతుడు-- సుభద్రమ్మ గారి పెద్ద కూతురికి చెయ్యకుండా రెండో  కూతురికి చెయ్యలేదా -ఆ అనసూయమ్మ గారింట్లో మాత్రం పెద్ద కొడుక్కి కాకుండా చిన్న వాడికి కాలేదా --' ఎంత సరిపెట్టుకుందామన్నా తనకే ఎలాగో వున్న బాధని వ్యక్తం చెయ్యనూలేక, కూతురికి ఓదార్పు మాటలు చెప్పనూ లేక సతమతమయ్యే తల్లి అంతర్యం వెల్లడయింది వర్ధనమ్మ గారి వుత్తరం లో.
    ఉమ సరేసరి- అద్దాల గాజులు గద్వాలు చోళీ గుడ్డలు తెచ్చి పెట్టమంటూ వ్రాసింది సంబరంగా -
    అమ్మ అంత బలవంతం చేస్తున్నట్లు వ్రాసిందెందుకు-- నేను రానేమోనని వాళ్ళ కేమయినా అనుమానంగా వుందా- అయినా అసలు నేనెందుకు వెళ్ళాలి. నేను లేని లోటు అక్కడేవరికి కనుపించదు- అనుకుంది నిర్లక్ష్యంగా -- ఇవాళో రేపో ఏదో బహుమతి కొని ఉమకి పంపిచేస్తాను అని కూడా అనుకుంది -- అలా ఆలోచిస్తూ కూర్చున్న కొద్దీ అర్ధం లేని చిరాకు. కారణం లేకుండానే అందరి మీద కోపం రాసాగాయి. శ్యామల కూడా లేదు -- ఒంటరిగా వుండటం మరీ విసుగ్గా వుంది అనుకుంటూనే మంచం మీద వాలి పడుకుంది.
    బాగా చీకటి పడ్డాక వచ్చింది శ్యామల షాపింగు ముగించుకుని. "గదిలో లైటు లేకపోతె నువ్వు లేవేమో అనుకున్నాను- తీరా చూస్తె తాళం లేదు-- చీకట్లో తపస్సు చేస్తున్నావు ఏ దేవుడి ని గురించి.' అంటూ లైటు వేసి చేతిలో ప్యాకెట్లు మంచం మీద పడేసి సురేఖ ప్రక్కన కూర్చుంది.
    'తల పడిపోతోంది -- నాకే దేవుడితోనూ పనిలేదు- దేవతవి నువ్వు ప్రత్యక్షం అయావుగా -- ఓ ఏస్ప్రోమాత్ర ఇచ్చి గ్లాసుడు కాఫీ కూడా తెప్పించి పెట్టు. మరింకేం వరం అడగను.' అంది. తను సాయంకాలం కాఫీ తాగలేదన్న సంగతి ఆ అమ్మాయికి అప్పుడే గుర్తు వచ్చింది. ఆ మాట పైకి అంటే శ్యామల లక్ష ప్రశ్నలు వేస్తుంది.
    'ఓ మూల భోజనాల వేళ అవుతుంటే కాఫీ ఏమిటి -- మాత్రవేసుకుని మజ్జిగ అన్నం తిని పడుకో.' అంటూ అలమారు లోంచి మాత్ర తీసి కూజా లోంచి నీళ్ళు గ్లాసులో పోసి ఇచ్చింది.
    అవి తీసుకుని, 'చాలా కొన్నట్లున్నావే.' అంది సురేఖ ప్యాకెట్ల వంక చూస్తూ.
    'ఎల్లుండి నా పుట్టిన రోజు కదూ -- నేనో చీర కొనుక్కున్నాను -- ఇది మామయ్య ప్రెజెంటేషను .' అంటూ రెండు ప్యాకేట్లూ విప్పి చీరెలు జాకెట్టు గుడ్డలు మంచం మీద పరిచింది , వాటి అందం చూడమన్నట్లు -- చూడగానే సురేఖ కళ్ళని ఆ కట్టేసుకుంది ఓ చీర. లేత నీలం రంగు పట్టు చీర మీద మిలమిలా మెరుస్తూ జరీ బుటా- చుట్టూ అర చేతి వెడల్పు న జరీ అంచు చీర మడతలు విప్పి సురేఖ చూస్తుంటే, 'మామయ్య డబ్బు ఖర్చుకి వెరవరు' అంది శ్యామల పొంగి పోతూ.
    'ఇలాంటి చీరే నేనూ ఒకటి తీసుకుంటాను చాలా బాగుంది.' అంది సురేఖ మళ్ళా మడత పెట్టేస్తూ.
    'కొనుక్కో -- ఎంచక్కా ఇద్దరం ఒక్క సారే కట్టుకుని వెళ్ళొచ్చు ఏ ఫంక్షను కయినా --'
    ' ఆహా నాక్కాదు-- మా చెల్లాయి కిద్డామని - తన పెళ్ళి .' అంటూ టేబిలు మీద శుభలేఖ తీసి చేతికి ఇచ్చింది సురేఖ -- అది చూడకుండానే .
    'మీ చెల్లెలా, అంటే కజినా .' సురేఖ కళ్ళలోకి అనుమానంగా చూస్తూ అడిగింది శ్యామల.
    'కాదు - స్వంత చెల్లెలే -- అతను మా అత్తయ్య కొడుకే - మొన్న నువ్వు చూశావు గా .' శుభలేఖ చూడగానే కలిగిన సంచలనం ఉద్వేగం అప్పటికి సర్దుకోటం చేత సురేఖ గొంతు సహజంగానే వుంది.
    'పెళ్ళికి నువ్వు వెళ్తావా?' సురేఖ కళ్ళలోకి కాకుండా గుండెలలో గుచ్చు కుంటున్నట్లున్నాయి శ్యామల చూపులు -- అంతేకాదు నువ్వెలా వెళ్తావు-- ఇంతకన్న అవమానకరమైన విషయం మరొకటుంటుందా , నువ్వు వెళ్ళవు నాకు తెలుసు అని సవాల్ చేస్తున్నట్లుగా వున్నాయి-- సురేఖ మనస్సు ఒక్కసారిగా ఎదురు తిరిగింది. ఏమిటి వీళ్ళు- నేను నా చెల్లెలి అదృష్టాన్ని చూచి ఓర్వలేననుకుంటున్నారా? రేపు అక్కడ నలుగురూ ఆమాటే అనుకుంటారేమో -- నా ప్రవర్తన వల్ల నాలో బలహీనత పది మందీకి వెల్లడించుకున్న దాన్నవుతాను- ఉహు నా బలహీనత వ్యక్తం కానివ్వను అనుకుంటూ.
    "ఏం ఎందుకు వెళ్ళను?' అంటూ ఎదురు ప్రశ్నించింది.
    'అబ్బే - వూరికే అడిగాలే ' అనేసింది శ్యామల.
    'కోరి కోరి ఏ తల్లీ తండ్రి తమ బిడ్డలకి అన్యాయం చెయ్యాలనుకోరు - కొంతమంది అదృష్టమూ మరికొంత మంది దురదృష్టమూ వాళ్ళనీ ఏమీ చెయ్యలేని వారిగా నిస్సహాయులుగా నిలబెట్టేస్తాయి' అని మనస్సుకి మరోసారి నచ్చ చెప్పుకుని దృడ పరుచుకుంది.
    మాత్ర మింగినా తలనొప్పి తగ్గలేదు -- శ్యామల బలవంతం మీద మజ్జిగా అన్నం తిని పడుకుంది. కాని ఎంతకీ నిద్రపట్ట లేదు.
    శ్రావణ మాసం ప్రారంభం కాగానే పెళ్ళిళ్ళసందడి అన్ని వూళ్ళల్లోనూ మొదలవుతుంది -- ఓ ప్రక్క నుంచి వినిపిస్తున్న సన్నాయి వాద్యము, మరో ప్రక్క నించి హోరెత్తించేస్తున్న రికార్డుల సంగీతమూ సురేఖమనసు ఎలాగో అయిపోయేలా చేస్తున్నాయి.
    'ఇంతసందడి నేను అక్కడ భరించగలనా.' అనుకుంది ఒక్క క్షణం 'ఇప్పుడు శలవ దొరకదు' అని వ్రాసేస్తానో" అనుకుంది ఒకసారి.
    'ఛ' బాగుండదేమో' అనే మరో ఆలోచన వచ్చింది. చివరికి ఆ అమ్మాయి ఒక నిర్ణయానికి రాకుండానే పొరుగువాళ్ళ కోడి ఇల్లెక్కి తీరుబడిగా కూయటం ప్రారంభించింది -- ఇంక ఇవాల్టికి నిద్రేమిటి అనుకుంటూ లేచి కూర్చుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS