అప్పుడు అతని దృష్టిని గది నాలుగు మూలలా ప్రసరింప చేశాడు-- ఓ ప్రక్కగా వున్న మంచం మీద అడ్డదిడ్డంగా పడేసిన పరుపు చుట్టల మధ్యఎలాగోకాస్త చోటు చేసుకుని ముడిచి పెట్టుకుని పడుకుని పుస్తకం చదువుకుంటున్న సురేఖ ని ముందుగా చూడనందుకు సిగ్గు పడిపోతూ గబుక్కున అవతలకి వెళ్ళిపోయాడు-
సురేఖా, ఉమా ఎవరికి వారే తప్పు చేశాం అన్న భావంతో ముడుచుకుపో యి ఆ పూటకి ఒకరి నొకరు పలకరించుకోటానికి కూడా ధైర్యం లేనట్లు తప్పించుకు తిరిగారు.
మర్నాడు ఎంతమంది చెప్పినా వినకుండా 'శలవు లేదు' అని వెళ్ళిపోవాలి ' అంటూ ప్రయాణం అయింది సురేఖ.
అత్తయ్యా, బావా మరో మూడు రోజులుండి అప్పుడు ఏకంగా పెళ్ళి కూతుర్ని గృహ ప్రవేశానికి తీసుకు వెళ్తారుట-- ఆ మూడు రోజులైనా సరదాగా వుండమని అందరూ చెప్పారు.
'నాకేం సరదా, ఇక్కడుంటే నిప్పుల మీద వున్నట్లే వుంటుంది నా మనస్సుకి అని వీళ్ళకి తట్టదా-- అయినా ఈ కాంప్లెక్సు నాలో పెరగనివ్వ కూడదు -- ఏ పనీ లేకపోతె ఆలోచనలు మరీ ఉక్కిరిబిక్కిరి చేస్తాయి -- వాటి నుంచి పారి పోవటాని కయినా క్షణం తీరిక లేని పని కల్పించుకోవాలి.' అనుకున్న సురేఖ శలవ కాన్సిలు చేసుకుని మర్నాడే కాలేజీ కి వెళ్లి పోవాలనే మరో నిర్ణయానికి కూడా వచ్చింది.
* * * *
ఆదివారం నాడు తీరుబడి గా తలంటి నీళ్ళు పోసుకుని, మధ్యాహ్నం కాస్త ఆలస్యంగా భోజనం చేసి భుక్తాయాసం తో మంచాల మీద వాలి కబుర్లు చెప్పుకుంటూనే నిద్రలో పడపోయారు సురేఖా, శ్యామలా.
తలుపు మీద మెల్లిగా తట్టుతున్న శబ్దానికి ముందుగా సురేఖ కే మెళుకువ వచ్చింది. కళ్ళు నులుముకుంటూ టేబిలు మీద టైం పీసు కేసి చూసింది -- నాలుగవుతోంది --
'వస్తున్నా.' అంటూ లేచి, జుట్టు వెనక్కు తీసుకుని గట్టిగా ముడి వేసుకుంటూ వెళ్ళి తలుపు తెరిచింది -- నరసమ్మ ప్రక్కన మరోకావిడ నిలబడి వుంది.
"మీ కోసమేనమ్మా .' అని ఆ వ్యక్తిని చూపించి తన పని అయిపొయింది అన్నట్లు వెళ్ళిపోయింది నరసమ్మ.
ఆవిడెవరో సురేఖ కి గుర్తు రావటం లేదు-- అయినా తన కోసం వచ్చిన మనిషిని అలా బయటే నిలబెట్టి పేరూ ఊరూ అడగటం భావ్యం కాదనిపించి ' రండి.' అంటూ తలుపులు బార్లా తెరిచింది.
'నన్ను గుర్తు పట్టలేదు కదూ-- మర్చిపోయావా మీ రంగమ్మత్తని' ఇంతేనా నీ అభిమానం అన్నట్లు సురేఖ కళ్ళలోకి చూసింది కుర్చీలో కూలబడుతూ.
'ఆ ఆ ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది -- చాలా రోజులయి పోయింది కదూ చూసి -- ఈ వూళ్ళో వుంటున్నారా?' అంది సురేఖ.
'ఆ -- ఎనిమిది నెల్లయింది అబ్బాయికి ఇక్కడికి ట్రాన్స్ఫారయి -- మీ మామయ్యా పోయి అయిదేళ్ళయింది-- అప్పటికే అబ్బాయికి బొంబాయి లో వుద్యోగం -- నేను అక్కడే వుండిపోయాను-- చాలా రోజులాయి మనవేపులేకే వెళ్ళలేదు-- మొన్న తప్పనిసరిగా మా వూరు వెళ్ళాల్సి వచ్చింది-- అ పల్లెటూరి లో ఆ ఇల్లు బాగులూ దిబ్బా లేక పూర్తిగా కూలిపోయేలా వుంది. ఏముంది . అయినా వాళ్ళు దగ్గరుండి చూసుకోకపోతే అలాగే వుంటాయి -- ఆ పొలం మీదయినా రైతులు సరిగ్గా ఇచ్చి చావటం లేదు -- ఏకంగా అవన్నీ అమ్మి పారేసి ఇక్కడే ఇల్లెదయినా కొనుక్కుంటే బాగుండుననిపించింది. ఆ విషయాలన్నీ చూసుకోటానికే వెళ్ళాను-- అంతదూరం ఎలాగూ వెళ్ళాను కదా అని మన వూరు కూడా వెళ్ళి నాలుగు రోజులున్నాను - రుక్మిణి కొడుక్కి ఉమని చేసుకుందిటగా-- ఏమిటో ఎవరికెవరు రాసిపెట్టి వున్నారో తెలియదు -- ఆ అప్పుడే తెలిసింది నువ్విక్కడున్నట్లు. 'పాఠం అప్ప చెప్తున్నట్లు ఆవిడ మాట్లాడేస్తుంటే మౌనంగా వింటూ కూర్చోటం తప్ప ఆవిడ ధోరణి కి అడ్డుపడే ప్రయత్నం చెయ్యలేదు సురేఖ. ఆవిడ చెప్పటం అయిపోయాక కూడా ఏం మాట్లాడాలో తెలియలేదు ఆ అమ్మా యికి-- ఇంతలో శ్యామల లేవటం తో,
'మా ఫాదర్సు కజిన్ ' అని ఆ అమ్మాయికీ
'ఈవిడ శ్యామల -- సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంటులో పని చేస్తోంది .' అని ఆవిడ కీ చెప్పింది.
'మన వాళ్ళేనా -- ' అని గబుక్కున అడిగేయ బోయి మళ్ళీ బాగుండదనిపించి వూరుకుని -- ఏదో అడగబోయి మానేసి నట్లుండకుండా ' మీరిద్దరూ అన్నమాట ఈ గదిలో - హాస్టల్ సౌకర్యం గానే వున్నట్లుందిలే .' అంది రంగమ్మ - ఉంది అన్నట్లు తల వూగించి , 'అక్కడ నరసమ్మ ఉందేమో -- అందరికీ కాఫీ లు చెప్పెద్దూ' అంది సురేఖ.
"అలాగే " అని టవలూ సోపు బాక్సు తీసుకుని గదిలోంచి వెళ్ళిపోయింది శ్యామల.
"రేపు శలవేనా మీకు' అంది రంగమ్మ.
'శలవే'
'ఇప్పుడు నాతొ వచ్చేసేయి- రేపు సాయంకాలమో, ఎల్లుండి ప్రొద్దుటో మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దువు గాని. రెండు రోజులుండాలంటే ముందుగా చెప్పాలేమో చెప్పు'- 'అబ్బే-- ఎందుకు ఎడ్రస్ చెప్పండి --ఈ సారెప్పుడయినా వస్తాను' మొహమ్మాట పడింది సురేఖ.
'ఒక్కరోజు వుండటానికి అంత బిడియ పడి పోతున్నావేమిటే -- నేనేం పరాయి దాన్నా-- మీ రుక్మిణత్తయ్య ఎలాంటిదో నేనూ అలాంటి దాన్నే -- అప్పటికి మీ కింకా చిన్నతనం- బాగా గుర్తు లేదేమో -- ప్రతి ఏడూ పుట్టింటికి వచ్చినట్లు మీ ఇంటికి వచ్చి పది రోజులైనా పిన్ని బాబాయి దగ్గర వుండి వెళ్తే కాని తోచేది కాదు-- నాకు అదీ పుట్టిల్లె అనిపించేది-- ఓ వేలుకి ఓ వేలు ఎడం అన్నమాట ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం కాని, ఆరోజుల్లో అంతా ఒక్క తల్లి కడుపున పుట్టిన వాళ్ళల్లాగే వుండేవాళ్ళం -- అదిగో మీ మామయ్యకి వుద్యోగం వచ్చి డిల్లీ భోపాలు అంటూ వెళ్ళిపోయి బంధువులందరికీ దూరం అయి పోయాం-- నీ చిన్నప్పుడే అనుకున్నాను సంబంధం కలుపుకోవాలని-- సరేలే అన్నీ అలా జరగవలసి ఉన్నాయి...' మొహం నిండా విచారం పులుముకుని దీర్ఘంగా నిట్టూర్చింది -- కొంచెం సేపటి తరువాత ఇంకేదో చెప్పబోయి బయట ఎవరో వస్తున్నా అలికిడి అయి వూరుకుంది.
తడిమొహం తుడుచుకుంటూ శ్యామల ఆ వెనకే కాఫీ ట్రే తో నరసమ్మా లోపలికి వచ్చారు-- ఆవిడ మాట్లాడుతుంటే వినటానికే భయంగా వున్నట్టు బితుకు బితుకు మంటూ కూర్చున్న సురేఖ కి ప్రాణం లేచి వచ్చినట్లయింది.
కాఫీ తాగ్గానే మరోసారి హెచ్చరించింది. రంగమ్మ సురేఖ ని త్వరగా తయారవమని.
'ఈ గండం ఎలాగో తప్పించు బాబూ, నీకు పుణ్యం వుంటుంది .' అన్నట్లు చూసింది సురేఖ శ్యామల వంక.
'ఇప్పుడు తీసుకేడతానంటారా-- మేం సరదాగా సినిమాకి వెళ్దాం అనుకున్నామే' అంది శ్యామల అద్దంలో చూసుకుని పాపిడి తీసుకుంటూ.
'ఆ -- సినిమాలకెం భాగ్యం -- ఎప్పుడంటే అప్పుడే చూడొచ్చు-- నేను వూరి నుంచి వచ్చి రెండు రోజులయింది. అప్పట్నించి ఎప్పుడెప్పుడు వద్దామా అని వూ ఇదయిపోయాను. అనుకోకుండా రెండు రోజులు శలవలు కూడా కలిసి వచ్చాయి-- అసలు నిన్న సాయంకాలమే వచ్చి తీసుకెళ్ళవలసినది'.' అందావిడ.
'నీ మొహం --నీకూ ఆ చచ్చు సినీమా వంక తప్పితే మరేమీ దొరకలేదా -- నా ఖర్మ ' అన్నట్లు శ్యామల వంక చూసిందే కాని అంతకన్న బలమైన కారణం ఏం చెప్దామా అని తనే తికమక పడిపోతోంది సురేఖ.
'ఛ -- అబద్దాలాడటం కూడా చేతకాదు.' అని విసుక్కున్నది కూడా లోలోపలే.
చివరి కేలాగో , 'సరే -- ఈ రాత్రి భోజనం చేసి వచ్చేస్తాను-- మీరేం అనుకోకండి -- రేపు కొంతమంది స్టూడెంట్స్ వస్తామన్నారు పాఠాలు చెప్పించుకోటానికి....' అని ఆవిడ్ని అంగీకరింపజేసింది.
