బండి ఆగింది. కాలికి నేల హాయిగా తాకింది. మహానగరం ఇంకా 50 మైళ్ళు మాత్రమే ఉంది. ఆ కంపార్టుమెంటులోని వ్యక్తి తన కాళ్ళను ఎంబ్రాయిడరీగల వెల్వెట్ చెప్పుల్లోకి దూర్చి ఫ్లాటు ఫారం మీద అడుగుపెట్టి, వేళ్ళతో కళ్ళు నలుపుకుంటూ, కొత్త స్టాలువైపు బైల్దేరాడు.
కాలూ తల తిరిగిపోయినట్లౌతూంది. పసుపురంగు తలుపు సగం మూసి ఉంది. రైలు నడక అతని మెదడులో ఇంకా ధ్వనిస్తూనే ఉంది. అతడు నడిచాడు. మూడడుగులు ముందుకు వేసి పెట్టెలో ప్రవేశించాడు. క్షణంలో మూడు పండిన అరటిపళ్ళతో బైటపడ్డాడు. పళ్ళనుచూచి అతని కళ్ళు మెరిసిపోయాయి. పొట్టు తీయపోతూండగనే ఒక బలమైన హస్తం అతన్ని పట్టుకుంది. అతడు మామూలు దుస్తుల్లో ఉన్న పోలీసు.
"తమ్ముడూ, ఒక కన్ను నీ మీదనే ఉంచానోయ్. చూపునుబట్టి మనిషిని కనిపెట్టేస్తా ఏమనుకున్నావ్?"
కాలూ పళ్ళు దొంగిలించాడు. అంతే కాని అదీ దొంగతనమే. అన్ని దొంగతనాల్లాంటిదే క్షుత్పీడితులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్న ఈ రోజుల్లో అప్రమత్తులు కారాదు. అవకాశం దొరుకుతే విలువైన వస్తువుకూడా దొంగలించేవాడే. అతన్ని ఇప్పుడే శిక్షించపోయినట్లైతే అతని ధైర్యం పెరిగి పెద్దదౌతుంది. అలా అని పోలీసు స్టేషన్ లో పోలీసులు అతనికి చెప్పారు.
'లేఖా' అని హృదయ విదారకంగా అరచాడు. అతని మెదడులో ఇంకా రైళ్ళు పరిగెత్తుతూనే ఉన్నాయి.
ఆదుర్దాతో కాలూ అడిగిన ప్రశ్నకు సమాధానంగా "మామూలు నేరం నెలో పదిహేను రోజులో" అని జవాబు చెప్పాడు. కాపలా పోలీసు, సానుభూతిగా.
నెలో, పదిహేను రోజులో పడే శిక్షంటే కాలూకు పెద్ద భయమేమిలేదు. అయితే సమయం అతనిది కాందే! అంది లేఖది. చిత్త చాంచల్యం లేఖను బాధపెడ్తుంది.
అగాధమైన అతని ఆలోచనల్లో, పేదవారికి సహితం న్యాయాన్ని కలిగించే శాసనం మీద అతనికి విశ్వాసం కలిగింది. కనకు కావలసింది న్యాయమే ననుకున్నాడు. అతని కేసు సుస్పష్టం. అతను తెలియపర్చాల్సిందల్లా కొన్ని వాస్తవ విషయాలు. అంతే న్యాయస్థానం వారికి అర్ధమైపోతుంది. తాను అలవాటు ప్రకారం దొంగతనాలుచేసే వాడేంకాదు. ఝార్నా పట్టణపు పనితనం గల పనివాడు. తానంటే తెలియందెవరికి సాక్షాత్తు మేజిస్ట్రేటే కారుకొనేవరకూ గత సంవత్సరం వరకూ - తన గుర్రానికి తనతోనేకదా నాడాలు వేయించుకున్నది. సీతారాం వీధి దగ్గర రెవిన్యూ కలెక్టరు రెండు అంతస్తుల మేడ కట్టినప్పుడు ఇనుప పని కాంట్రాక్టు మొత్తం తనకే కదా ఇచ్చింది. పట్టణపు పెద్దకులపువారితో సహా తన బిడ్డ పది సంవత్సరాలు స్కూలుకు వెళ్ళింది. దొంగతనం తన అభ్యాసమే కాదు. అన్నానికిగ్గాను. ఎండుడొక్కతో ఉన్న ఊరువిడిచి పని వెతుక్కోవడానికి తాను నగరం వెళ్తున్నాడు. ఫుట్ బోర్డ్ మీద ప్రయాణం చేయడం అంటేనే సగం చచ్చినట్టుంటే ఇక దొంగతనం సంగతి ఏమిటి?
కాలూకు కాస్త ధైర్యం కలిగింది. అబ్బ అతన్ని భయం ఎంతగా పీడించింది! సత్యాన్వేషణే న్యాయ చక్షువు పని అయినప్పుడు ఇంత భయపడాల్సిన అవసరం ఏమిటి?
అయిదు రోజుల్తర్వాత, చేతికి బేడీలు, నడుముకు ఒక గట్టి త్రాడుతో క్రిమినల్ కోర్టుకు కాలూ వచ్చాడు. తన పేరు వయసు వృత్తి చెప్పాడు. నేరాన్ని ఒప్పుకున్నతర్వాత మేజిస్ట్రేటు అతన్ని కర్కశప్రశ్నలు వేశాడు.
"నువ్వు ఆ పని ఎందుకు చేశావ్?"
"ఆకలి దహిస్తూ ఉంటే. నన్నోవెర్రితనం ఆవహించింది. నేనేవైనా తినాలి. లేకుంటే చావాల్సిందే అనే ఊహ నన్ను పిచ్చివాణ్ణి చేసింది. నేను బ్రతకాలికదా!"
అక్కడే టేబుల్ మీద ప్రదర్శనకు పెట్టిన అరటిపళ్ళు కుళ్ళిపాడైపోతున్నాయి.
ఇంగ్లీషు దుస్తులు ధరించిన న్యాయమూర్తి 'ఏం? నువ్వెందుకు బ్రతకాలి?' అనే ప్రశ్నవేశాడు.
అతని ధ్వనిలో వెక్కిరించలేదు. అతని గుండ్రని మెత్తని ముఖం ప్రశాంతంగానూ ఉద్రేకరహితంగానూ ఉంది.
మేజిస్ట్రేటు జీవితమంటే ప్రేమిస్తూ మృత్యువంటే భయపడతాడనేది తెలుసుకోవడానికి తత్త్వశాస్త్రం చదువుకోవాల్సిన పనిలేదు. అయితే మరి కూలి ప్రాణం....అది వేరు.
కాలూకు ఏమీ అర్ధం కాలేదు. 'నేను.....నేను.....'కాలూ గొణిగాడు.
"నువ్వెందుకు బ్రతకాలి? మేజిస్ట్రేటు మళ్ళీ అడిగాడు. అతని ప్రశ్నలో కరకుదనంగానీ, క్రూరత్వంగానీలేవు. అతడు ప్రశాంతంగా టేబుల్ మీదికి వంగుతూ ప్రశ్నించాడు. అతనిచేతిలో ఉన్న బంగారు క్యాప్ పెన్నును తూకం వేస్తున్నట్లో లేక అతను ఇవ్వబోయే తీర్పును చూస్తూనో ఉన్నట్లు అతను తన దృష్టిని మొత్తం బంగారు క్యాప్ మీదనే కేంద్రీకరించాడు.
"న్యాయమూర్తీ! నేనొక పురుగును. చచ్చినా బ్రతికినా ఒకటే. కాని నాకో బిడ్డ ఉంది. ఆమెకు తల్లిలేదు. ఆమెకెవరూలేరు. నేనుతప్ప. నా కూతురు - చంద్రలేఖ - బ్రతకాలి."
తన బిడ్డ సెంట్ జోసెఫ్ కాన్వెంటులో చదువుకుందని, ఆమెకు అశోకా మెడల్ వచ్చిందనీ కోర్టువారికి చెప్పేవాడే. కాని మేజిస్ట్రేట్ అప్పుడే తన మనసులో తీర్పు సిద్దంచేసి పెట్టుకున్నాడు. అరాచకం సర్వత్రా ప్రబలినప్పుడు ఇంకొకరి బుద్ధి వచ్చేట్టు గట్టిశిక్షే వేయాలనుకున్నాడు.
"ఎందుకు?" అసంబద్దమైన ధ్వనితో ఇంకో ప్రశ్న పారేశాడు.
"ఎందుకు?" చంద్రునిలాంటి న్యాయాధికారిముఖంలోకి మూర్ఖునిలా చూచాడు కాలూ. అతని నాలుక అంగిటికి అతుక్కుపోయింది. గొంతు రుద్దమై చేపముల్లు ఇరుక్కున్నట్లు మాట పెగల్లేదు.
నున్నగా గొరిగిన మీసాలు గల న్యాయమూర్తి నోటినుంచి "మూడు నెలల కఠినశిక్ష" అనే మాటలు వెలువడ్డాయి.
తన పాదాలక్రింద భూమి ఊగిపోతూందనుకున్నాడు. అతని కళ్ళు అంధకారాన్ని చూచాయి.
ఒక పోలీసు పక్కల్లో పొడిచి 'చలో'. అన్నాడు. సంకెళ్ళు నడుముకు దొంగలత్రాడు వ్రేలాడుతూ ఉండగా నడిచిపోయాడు.
మాసినగడ్డం, బాధాపరిదష్ట నయనములు, గుట్టలాంటి శరీరం గల వ్యక్తి బోనునుండి బైటపడ్డాడు. కాని అతని జీవితభాగం కొంత అక్కడే నిలిచిపోయింది. అది మళ్ళీరాదు. కాలూలోంచి ఏదో పదార్ధం యిగిరిపోయింది. అతడు మళ్ళీ సంపూర్ణమైన ఝార్నా కమ్మరి కాలూ - కాలేడు - కాబోడు.
4
సాధారణమైన ఈ జిల్లా కేంద్రపుజేలు. బజారులో మామూలుగా దొరకని స్వచ్చపు ఆవాల నూనెకు ప్రసిద్ది. ఇది అధికారులకూ, కొందరు ప్రత్యేక వ్యక్తులకు తక్కువ ధరకు అమ్మబడుతుంది. గానుగను ఖైదీలే తిప్పుతారు. ఖైదీలు కాటిని పట్టుకొని ఎద్దుల్లాగా నిర్విరామంగా తిరుగుతూనే ఉంటారు. కాబట్టి ఇక్కడి ఖైదీలు వారి తిండికి సంపాదించుకోవడమేకాక, గార్డులకూ, వార్డర్లకూ వేతనాలు కూడా వారే సంపాదించి పెడ్తారు.
కాలూ - ప్రస్తుతపు p-14 - చాలీచాలని జేలు చొక్కా తొడుక్కొని గానుగ గ్యాంగితో పనిచేస్తున్నాడు. అతడు పూర్తిగా అణగిపోయాడు. అతని సహచరులుగాను త్రిప్పుతూ ఒక్కొక్కసారి ముఖపు చెమటలుతుడుచుకోవడమూ, రొమ్ము తుడుచుకోవడమూ చేస్తూండేవారు. ఇంకో చేత్తో కాడిపట్టుకొని మాత్రమే వారాపని చేసేవారు. నూనె పడే సమయానికి వారు అదృశ్యులై ఉన్న వాడకపు దారులను సంబోధిస్తూ, ఒక కర్మకాండ నడిపేవారు.
"త్రాగండి త్రాగండి. మా ఎముకల నూనె త్రాగండి. చేపలు కాల్చా, కూరలు పెల్చావాడండీ. రుద్డండీ ఇది రుద్డండీ. మీవంటికి సహితం రుద్డండీ. త్రాగండీ మా ఎముకల నూనె త్రాగండీ."
కాలూ మాత్రం నోటికి తాళం వేసుకున్నాడు. అతడు కఠినంగా శ్రమించేవాడు. ఎప్పుడూ పల్లెత్తుమాట అనేవాడు కాదు. అతడు ఆదర్శఖైదీ అయిపోయాడు. వార్డర్ల కారుకూతల్నూ, మూడవ తరగతి ఖైదీల రోజువారీ కష్టాల్నూ శాంతంగా సహించేవాడు. తనను చెంపదెబ్బకొట్టి, అనరానిమాట అన్న గార్డును చితక్కొట్టగలిగేవాడు. అలాంటి అసాధ్యమైన కోపాన్ని సైతం అదుపులో పెట్టుకున్నాడు.
అతని మేధస్సులో ఒక ఊహా దృశ్యం మెరిసింది. గార్డు గొడ్డుమూతిని చూచి కోపంతో అతని నరాలు పగిలిపోతున్నాయి. గుద్దడానికి పిడికిలి లేపాడు. తనను చంపేస్తున్నంత భయంగా గార్డు గావుకేకపెట్టాడు. తక్షణమే గేటు ప్రక్కనున్న వాచ్ టవర్ మీది గంట గణగణా మ్రోగింది. జైల్లో పితూరి. వార్డర్లు, గార్డులు, బెత్తం, ఇనుపచువ్వ, లాఠీ, చేతి కందిన ఆయుధమల్లా అందుకుని రణరంగంలో దూకుతున్నారు. ఇంకో పదినిముషాల్లో ఖాకీదుస్తుల సిపాయీలు ట్రక్కులో దిగారు. వారి భుజాల మీద తళతళా మెరిసే బాయినెట్లూ వారు సిద్దంగా ఉన్నారు.
