Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -6 పేజి 8


    ఒక అనాథ సమూహం తమను అదృష్టానికి అప్పగించి వాలిపోతున్న తలల్తో, నగ్నపాదాల్తో పడమరకు నడిచిపోతూంది. కాలూ కాస్త వెనుకపడ్డాడు. ఎగంగా నడిచి వారిని దాటివేయాలనుకున్నాడు. వారు బాగా వెనకపడేదాకా నడకవేగం తగ్గించలేదు.
    అబ్బ! వాళ్ళను దాటేశాడు. అప్పుడుగాని ఊపిరిపీల్చి నుదుటి చెమటతుడుచుకోలేదు. వారినిచూచి తనకెందుకు అంతభయమైంది? ఈ దుష్టసమూహంనుంచి తనూ, తన లేఖ దూరంగా ఉన్నట్లు అతడు భావించాడు. 'ఊఁ త్వరగా నడువు. సమయంలేదు" అతని శరీరమంతా ఒక్కటై అరచినట్లు అనిపించింది.
    తొందరేమిటి? రాత్రిదాకా మళ్ళీ ట్రైనులేదు. ఇంకో ఆరుమైళ్ళలో ఉన్న మరుసటి స్టేషను చేరుకుంటాడు. అక్కడకూడా అతనికి అవకాశం లభింపకుంటే? కలకత్తాకు నడవడం అంటే వారం, పదిరోజులు పట్టవచ్చు. ఈలోగా చెట్లనుంచి తెంపుకునే కాయలు, భూమిలోంచి తవ్వుకునే గడ్డలు తప్ప అతనికి ఆహారంలేదు. ఈరకంగా రోజూ కొన్నిగంటలు వృధా అవుతాయి. అతనిశక్తి వెలిగేలాంతరులోని నూనెలా ఖర్చు అయిపోతుంది. అంతేకాదు. ఆ నగరానికి చేరడానికి మూడువారాలు, ఒకనెల, అంతకంటే దీర్ఘకాలంకూడా పట్టవచ్చు. అక్కడికి చేరింతరువాత పనిచేయడానికి శక్తిలేకుండా క్షీణించిపోవచ్చు. ఆకలితో అలమటించే జనప్రవాహంలో అతడూ ఒక్కడైపోవాల్సి వస్తుంది. తానూ వారిలా డొక్కవేళ్ళాడేసుకొని, నిరాశాదృక్కుల్తో తిరగాల్సి వస్తుంది.
    మరి లేఖ. ఆమె ఏమౌతుంది?
    పరుగెత్తాలి. టైంలేదు. తొందరపడు!
    మరుసటి స్టేషను చేరింతర్వాత ఆ అభాగ్యులగుంపు ఏం చేస్తుందో అని చూస్తూనుంచుండిపోయాడు. ఒక అర్ధగంటలో వారుకూడా చేర్తారు. వారు గుంపులుగావస్తే అంతటిలోనే పోలీసులు వారిని తరిమేస్తారు. అలా అయితే సాగిపోవడమే మంచిది.
    ఆ గుంపు స్టేషను చేరింది. ఆ నిముషంలో అనిర్భాగ్యుల్నుచూచి అతడు అసహ్యించుకున్నాడు. అతని అదృష్టమూ, జీవనమూ, అన్నీ వారి ఇష్టంమీద ఆధారపడి ఉన్నాయి. వాళ్ళు సాగిపోతే!
    వారు ఆగారు. అతడు ఒక దీర్ఘవిశ్వాసం వదిలాడు. సాగిపోవడంకంటే గత్యంతరంలేదు.
    ఊహించంది జరిగింది. వారు ఒక నిముషం మాత్రమే ఆగారు. వారిలోవారు ఏదో మాట్లాడుకున్నారు. ఒకనిర్ణయానికి వచ్చి అంతాకదిలారు. తనకళ్ళను తానేనమ్మలేక వారిని అలాగేచూస్తూ ఉండిపోయాడు. స్త్రీలూ, పురుషులూ, మూటల్నూ బిడ్డల్నూ ఎత్తుకొని పడమరగా సాగిపోయారు. ఒక మామిళ్ళగుంపు వారిని మింగేసింది.
    ఏదో విముక్తికలిగినట్లుగా 'భగవంతుడా' అని స్మరించాడు కాలూ. "అవును బిడ్డా! మనకింకా ఆశవుంది" అన్నాడు లేఖ తన ఎదురుగా ఉండి తన మాటలు వింటున్నట్లుగానే భావించి.
    జాగ్రత్తగా ప్లాను సిద్దంచేసుకున్నాడు. తాను ఫ్లాటుఫారంమీద కనుపించరాదు. టికెట్ కలెక్టర్ తనమీద ప్రశ్నలవర్షం కురిపిస్తాడు. అప్పుడే సూర్యుడు పశ్చిమాద్రిచేరాడు. రైలురావటానికి ఇంకొంత టైముంది. కొంతదూరం నడిచాడు. కనుచూపుమేరలో ఊరు కనిపించలేదు. ఒకటి రెండుమైళ్ళలో ఉండవచ్చు. కాని అక్కడికివెళ్తేమాత్రం క్షుత్పీడితులుతప్ప  ఏంకనిపిస్తుంది. లేక అప్పటికే ఆ ఊరంతా కాళీ అయిందేమో? అందుకే రైలు ఎక్కేవారెవరూ స్టేషన్లో లేనట్లున్నారు. రైలు రోడ్డుకు దగ్గరగా ఉండడం మంచిది. రైలురోడ్డు పక్కనే వున్న గడ్డిలో మేనువాల్చాడు. తరువాత ఫ్లాటుఫారం మీదకు వెళ్ళవచ్చు.
    సమయం దొర్లింది. మిణుకు మిణుకుమనే నక్షత్రఛాయలో అతనికి కన్నుమలిగింది. అతనికాళ్ళూ వళ్ళూ, మనసూ అన్నీ అలసటకు బరువెక్కిపోయాయి. అతడు నిద్రకు లొంగలేదు. లేచాడు. విసుగ్గా స్టేషనుగేటుద్వారా బైల్దేరాడు.
    ఒక పోర్టరు తన ప్రక్కనే ఎరుపులాంతరు పెట్టుకొని బెంచీమీద కూర్చొనివున్నాడు.
    "కలకత్తావైపు వెళ్ళేబండిలేదా?" కాలూ మాటవరుసగా అడిగాడు.
    "ఇంకోగంటలో వస్తుంది. 9 అప్ ఇవ్వాళ లేటు. లైను లైనంతా ఊ కరవుజనంతో నిండిపోయింది. అబ్బ! ఏం గుంపులు వేలు!"
    "అవును తమ్ముడూ, వాళ్ళతో పెద్దబాధ" అంటూ అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
    చీకటి మూలలో నిరీక్షిస్తూ వుండిపోయాడు. నిముషాలు మెల్లగా గడిచాయి. అతడు ఫుట్ బోర్డుకోసం సిద్దం అయ్యేసమయం రానే వచ్చింది. ఈతడవ అతడొక్కడే. పోలీసులు దయారహితులై అప్రమత్తులుగా ఉన్నారు.
    హేండిల్ బార్ కు చేయితగిలించాడు. రైలువేగానికి వీచుతున్న గాలి అతనిచెవులో గుఁయ్యిఁమని మ్రోగింది. అతనికాళ్ళక్రింద ఉక్కుచక్రాలు కిర్రుమన్నాయి. ఆ మంట, పొగ, ధ్వని అన్నీ ఏదో భూతం తననులాగేయడానికి ప్రయత్నిస్తున్నదా? అన్నట్లుంది. అతడు తన జీవితంకోసం వ్రేలాడుతున్నాడు. ప్రతి అర్ధగంటకూ రైలు ఆగుతూంది. ఆగ్గానే ఫ్లాటుఫారంమీదికి జారుతున్నాడు. బండికదిలేప్పుడు మళ్ళీ ఫుట్ బోర్డు మీద దూకుతున్నాడు.
    "పాన్, బీడీ సిగరెట్"
    ఆ కేక అతన్ని చకితుణ్ణిచేసింది. ఆ రాత్రంతా అతనికి త్రాగేనీళ్ళు అనే కేకతప్ప ఏ ధ్వనీ వినిపించలేదు. ఆ రాత్రికి ఇదే మొదటిసారి అతడు అలాంటికేకలు వినడం.
    "రొట్టె మాంసపు ఉండలూ"
    "కోవా, మిఠాయీ"
    "వేపిన రొట్టెముక్కలూ"
    తమలపాకులూ, పొగాకూతప్ప అతనికి కొనతగింది ఏదీ కనిపించలేదు.
    అతన్ని వంగదేశపు అంధకారం నెట్టుకుపోతూంది. రైలు వేగానికి రేగిన దుమ్మంతా అతని నోటినిండా పడింది. అతని చేతులు మొద్దువారేయి. అప్పుడప్పుడు ఫుట్ బోర్డు మార్చుకునేవాడు. రెండుమూడు గంటల తర్వాత పక్క పెట్టెకు ఒక ఛాయలాంటి పదార్ధం వ్రేలాడుతూ కనిపించింది.
    తోటిబాటసారి! అతడెప్పుడు రైలెక్కాడు? పోయిన స్టేషన్ లోనా అంతకు ముందేనా?  ఆ వ్యక్తి ముఖం చూడ్డానికి కండ్లు చీల్చుకున్నాడు. అతడు యువకుడా? తల్లినో? బిడ్దనో? కొడుకునో? భార్యనో? కాలూకు ఆ వ్యక్తితో ఏదో బంధుత్వం ఉన్నట్లు అనిపించింది. తనచేయి ఆ వ్యక్తి భుజంమీదవేసి అతని ఊరూ, పేరూ అడుగుదామనుకున్నాడు.
    మనసులో ఉదయించిన నూతన ప్రేమ అతన్ని ఓదార్చింది. ఫుట్ బోర్డు ప్రయాణపు బడలిక తగ్గినట్లయింది. ముఖానిక్కొడుతున్న గాలి దుమ్ములవల్ల అతడు ఆ వ్యక్తి వైపునుంచి ముఖం త్రిప్పుకోవాల్సి వచ్చింది. అయినా అప్పుడప్పుడూ అతన్ని చూస్తూ ఏదో ఆత్మీయత అనుభవిస్తూ బలం తెచ్చుకుంటున్నాడు. సున్ని ఉండలు పోయినబాధ మనసుకు భారం అయింది. అవే ఉంటే? అందులో కొన్ని ఆ కొత్త మిత్రునికి ఇచ్చి ఉండేవాడు. అతడు ఆకలితో ఉండవచ్చు.
    ఆకలి? తన పొట్టలోనే పేగులు అరుస్తున్నాయి. అది భరించేట్లు లేదు. అతని జీవితంలో ఇంత ఆకలి ఎన్నడూ కాలేదు. ఏదో మగత, తలలో పొగమంచులా మాంద్యం అతన్ని ఆవహించాయి. అతని అవయవాలన్నీ అలసిపోయాయి. మోకాళ్ళమీద తల ఆన్చి కూర్చోవాలనుకున్నాడు. కాని సప్రయత్నంగా, మానసిక శక్తితో మాత్రమే నిలిచి ఉండగలిగాడు. అతడు పడిపోదల్చుకోలేదు మరి!
    రాత్రి ఎగిరిపోయింది. రైలు ఒక వంతెనమీదినుంచి పాకిపోతూంది. అతడు పెట్టెదగ్గరగా వత్తుకున్నాడు. బ్రిడ్జి గర్డర్లు అతనివైపు వంగాయి. వెంట్రుకవాసిలో తప్పుకున్నాడు. రైలు ధ్వని అతని నరాల్ను పిండేస్తూంది. అతని గూబలు పగలడానికి సిద్దం అయినాయి.
    గండం గడచింది. తన మిత్రునివైపు తలత్రిప్పి 'ఎలా ఉంది భాయ్' అని అడిగాడు. అతని కాలు జారింది. ఛాయ నుంచున్నచోట ఏమీలేదు.
    క్షణంసేపు అతనికి ఏమీ అర్ధంకాలేదు. అతడు వణికిపోయాడు ఉక్కుగర్డర్లు మిత్రుని బలిగొన్నాయి. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. 'భాయ్, నీవు నిలువలేకపోయావు. నీకు విముక్తి గలిగింది. నేను ఎలాగో బాధపడాలి. నాకో కూతురుంది. వేరుమార్గంలేదు.'
    ప్రథమారుణ కిరణంతో అతనికి ప్రాణంవచ్చింది. అతడు తన గమ్యానికి దగ్గరికి వచ్చేశాడు. తాను నుంచున్న పెట్టె పసుపురంగుది. మిగతావి ఎరుపు రంగుతో ఉన్నాయి. ఆకలిబాధ లేకుంటే తననుచూసి తాను నవ్వుకునేవాడు. తాను ప్రయాణం చేస్తున్నది ఫస్ట్ క్లాస్! తనకు కొద్దిగా ముందుగానే వక తెరచిన కిటికీ ఉంది. అందులోకి తొంగిచూడ్డానికి కాస్త ముందుకు నడిచాడు.
    ఒకేమనిషి ఆ పెట్టెలో పడుకొని ఉన్నాడు. నిద్రామగ్నుడై. ఈ గడ్డు దినాల్లో సహితం అజాగ్రత్తగా కిటికీ తలుపు తెరిచి ఉంచాడు. ఎంత నిర్లక్ష్యం! ఆ క్షణంలోనే అతనికి టేబుల్ మీద ఉన్న బంగారంలాంటి అరటిపళ్ళ గుత్తి కనిపించింది.
    పళ్ళనుచూసి అతని కళ్ళు కుట్టాయి. ఒక భరింపరాని బాధ ప్రారంభమైంది. అతడు తనచూపు మళ్ళించుకోలేకపోయాడు. ఆకలి నూరురెట్లు పెరిగినట్లనిపించింది. ఫుట్ బోర్డు మీద నుంచోడం అతనికి సాధ్యపడలేదు. కూర్చోవాలి. వళ్ళు వాల్చాలి, మేను వాల్చడమే? అతనిదృష్టి మాత్రం అరటిపళ్ళమీదనే ఉంది. అది అతన్ని వేధించసాగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS