ఆమె మనస్సు నిండా ఆలోచనలు తుట్టె వదలని కందిరీగల్లా రేగాయి. పైగా అవి కుడుతున్నాయి.
"కొత్త కోడలు వచ్చిందట కదండీ !"
మొదటిసారిగా వారుణి ఆ యింట్లో ప్రవేశించటం గమనించింది సావిత్రి. ఇంటి పెద్ద కోడలిగా తను వెళ్ళి ఆమెని సాదరంగా ఆహ్వానించటం ఆమె కనీస ధర్మం. తనూ ఆమెలాగా మరో యింటి నుంచే వచ్చింది. ఈ అత్తగారూ అంతే!
అయితే కొన్నేళ్ళు మాత్రమే ముందొచ్చిన ఈ అత్తగారూ, పెద్ద కోడళ్ళూ తామూ ఒకనాటి కొత్త కోడళ్ళమే ననే విషయం పూర్తిగా మర్చిపోయి- ఆ యిల్లు తమ స్వంతంలాగా- ఆ సామ్రాజ్యం తమ పట్టంలాగా భావిస్తారు. అలాగా అనుకుని కొత్త కోడళ్ళని సాధిస్తారు. వాళ్ళపై పెత్తనం సాగిస్తారు.
ఏం లోకం ఇది !
అదే ఆలోచనలో వున్న సుబ్బరత్నమ్మ చెవుల్లో కోడలి ప్రశ్న దూరలేదు. ఆమె జవాబు చెప్పలేదు.
అత్తగారికి దగ్గరగా వస్తూ "సారధి భార్యతో కలసి వచ్చాడట కదండీ!" అంది.
సావిత్రి ప్రశ్నకి ఉలికిపడ్డట్లయింది ఆమె.
చప్పున కోడలి వేపు చూసింది. ఆమె ముఖంలో ఏదో వ్యంగ్యం కనిపించినట్లయింది. చప్పున ముఖం తిప్పుకుని ఆ ప్రశ్నకి సమాధానం యివ్వకుండా కాఫీలో పాలు కలపసాగింది.
"సారె తీసుకుని వచ్చిందా?" మళ్ళీ అడిగింది సావిత్రి. ఆమెకి అత్తగారి వీక్ పాయింట్ ఎక్కడుందో బాగా తెలుసు. ఆయువుపట్టు కనుక్కుని అక్కడ నొక్కేసే శత్రు సైనికుడిలాగా సావిత్రి సుబ్బరత్నమ్మగారి బలహీనతపై బాగా దెబ్బ కొట్టింది. అది తగలవలసిన చోట తగిలి కలిగించవలసినంత బాధని బాగా కలిగించింది. అయినా ఆమె నోరు విప్పలేదు.
సావిత్రి ప్రశ్నకి సుబ్బరత్నమ్మ సమాధానం యివ్వక పోయినా పద్మ జవాబిచ్చింది. "నీలాగా వీధి వీధంతా పంచేంత సారె సామాగ్రి తేలేదు వదినా! కానీ చిన్న వదిన చాలా బావుంటుంది. అంతా అంటారే బాపూ గీసిన బొమ్మ అనీ, దేవులపల్లి గీతిక అనీ, రవివర్మ గీసిన చిత్రం అనీ అలా వుంటుంది వదినా! ఎంత అందంగా వుంటుందో. అందుకే చిన్నన్నయ్య ఆమెని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు!" ఆమె మాటల్లో వారుణిపై ఎంతో ఆరాధనా భావం కన్పించింది.
ఆమె నారాయణ ఆఖరి కూతురు. ఆ వూళ్ళోనే డిగ్రీ కాలేజీలో బియ్యే మొదటి సంవత్సరం చదువుతోంది. ఒట్టి చదువుల వల్ల బుద్ధి వికసించదు. మంచి సాహిత్యం చదువు. తెలుగు-ఇంగ్లీషు లిటరేచర్ బాగా చదువు అన్న సారధి మాటలు ఆమెపై బాగా పనిచేశాయి.
ఎక్కువగా చదువుతుందేమో ఆ భావుకత బాగా వంటపట్టింది. స్వేచ్చ వలన తన మనస్సులోని మాటలు నిర్భయంగా చెప్పగలుగుతోంది.
"ఒట్టి అందాన్నేం చేసుకుంటాం?" తోటికోడలిని అంతగా పొగిడేసరికి సావిత్రికి చిర్రెత్తి నట్లయింది. చప్పున మనస్సులో పొంగిన ఈర్ష్యని అణుచుకోలేకపోయింది.
ఫక్కున నవ్వింది "అదేంటి వదినా? డబ్బునేం చేసుకుంటాం అని అడుగుతారా? ఇదీ అంతే!"
"బావుంది! అందానికీ-ఐశ్వర్యానికీ పోలికా?"
"ఇదీ ఐశ్వర్యమే వదినా! సౌందర్య లక్ష్మి"
"బావుంది" మూతి తిప్పింది సావిత్రి.
"నేనన్నదీ అదేమాట!"
పద్మ మాటలకి జవాబివ్వలేదు సావిత్రి. ఆమెకి పద్మ చమత్కారం బొత్తిగా అర్థం కాలేదు.
ట్రేలో కప్పులు సర్దుతోంది సుబ్బరత్నమ్మ.
ఒక వైపున ఆ యిద్దరి సంభాషణా చెవుల్లో పడుతోన్నా ఆమె పట్టించుకోవటం లేదు.
"అమ్మా! నాకూ కాఫీ!" లేచి పోబోతోన్న తల్లిని అడిగింది పద్మ! ఆమె యింకా గారాల కూచీ!
"కెటిల్లో వుంది వంచుకుని తాగెయ్. తర్వాత రెండు కప్పులు ప్లాస్కులో తీసుంచు" కూతురి వైపు అదోలా చూసి కప్పులు మూడూ ట్రేలో పెట్టుకుని వెళ్ళింది ఆమె.
ఒక్క క్షణం పాటు నివ్వెరపోయింది సావిత్రి. ఆమె యీ ధోరణి సావిత్రికి కొత్త. సేవలందుటే కాని సేవించు టెరుగరు అన్నట్లుగా ప్రవర్తించే అత్తగారు యిలా యీరోజు ప్రవర్తించటం వింతల్లో కెల్లా వింత అనుకుంది.
