Previous Page Next Page 
వారుణి పేజి 8


    భార్యని చూసిన సారధికీ ఆమె తనకీ తండ్రికీ జరిగిన సంభాషణ విందేమోననిపించింది.
    ఒక్క క్షణంపాటు తమ సంభాషణలో అసంగతాలు, అసభ్యాలు అనౌచిత్యాలు దొర్లాయా అని ఆలోచించుకోబోయాడు. కానీ చప్పున అతనికి అవేవీ గుర్తుకి రాలేదు.
    "వారుణీ! నాన్నగారు!" అన్నాడు.
    "నమస్కారం మామయ్యా!" అంది వారుణి. ఆపై కంఠం చాలా మృదువుగా శరత్ పౌర్ణమినాడు ఆకాశవీధి నుండి ఒక్క పరుగున తుంగభద్రా తరంగాలపై దూకిన వెన్నెల సవ్వడిలాగా, వీణా తంత్రుల్ని శృతిపేయంగా ఒక మృదు అంగుళి మీటితే సంగీత సుధాస్రవంతి ఒక్కసారిగా శ్రోతృపేయంగా కురిసినట్టు ధ్వనించింది.
    "నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో జీవించండి!" అని ఆశీర్వదించాడు.
    నారాయణ మనస్ఫూర్తిగానే ఆశీర్వదించాడు. ఆయన తొలిచూపులోనే వారుణిపై అభిమానం ఆత్మీయత ఏర్పడ్డాయి.
    "మన గది చూస్తావా ?"
    రమ్మన్నట్టుగా పిలిచాడు సారధి.
    మామగారివైపు ఓసారి చూసింది ఆమె.
    కానీ కోడలి చూపుల్ని ఎదుర్కోలేనట్టుగా ఎటో చూస్తున్నాడు నారాయణ.
    ఆ సమయంలో అతని మనస్సు అత్తాకోడళ్ళ మధ్య సయోధ్య ఏర్పడేలా చూసే విషయం ఆలోచిస్తోంది.
    వారుణి నిశ్శబ్దంగా సారధిననుసరించింది.


                                                        4


    సుబ్బరత్నమ్మ వంటింట్లోకి వెళ్ళేసరికి అక్కడెవ్వరూ లేరు. ఆమెకి చాలా ఉక్రోషంగా వుంది. తను కొత్త కోడల్ని అలా హీనంగా, చాలా తక్కువగా, తేలిగ్గా అంచనా వేసి అవమానపరిచింది. తనకి తోడుగా భర్తకూడా నాలుగు మాటలు అనేస్తాడేమోనని ఆశించింది. కానీ యిన్నేళ్ళ కాపురంలో ఆయన తనని బాగా సమర్ధించింది ఏనాడూ లేదు.
    అలా అని వ్యతిరేకించిందీ లేదు.
    ఆర్థికంగా తనకి సంపూర్ణ స్వాతంత్ర్యం యిచ్చారు. ఇంట్లో పెత్తనమంతా తనదే.
    కొడుకులు తన మాటమీరి పోలేదు. వాళ్ళ చదువులు ఉద్యోగాల విషయం వచ్చేసరికి ఆ తండ్రీ కొడుకులు ఒక్కటయ్యేవారు. ఏదో చెప్పేవారు మరేదో చేసేవారు. కన్నుకప్పినట్టు తను కాదన్నదేదో అదే చేసేవారు. అయితే అదంతా తన అంగీకారంతోటే చేసినట్టుగా నటించేవారు. నటించేవారా? ఏమో!
    ఈ పెళ్ళి విషయంలోనూ అలాగే జరిగింది. చిన్నబ్బాయి చిన్నబ్బాయి అంటూ తను సారధిని ఎంతో ముద్దుగా పెంచుకుంది. అందరూ ఒకటి అంటారు. కానీ తల్లితండ్రులకి ఎవరిపైనో ఒకరిపై ఒకింత అభిమానం ఎక్కువే వుంటుంది.
    సామాన్యంగా తండ్రికి పెద్దకొడుకుపై ఎక్కువ ప్రేమ వుంటుందిట! త్వరగా ఎదిగి వస్తాడనో-తనకి చేదోడు వాదోడుగా వుంటాడనో- ఆర్థికంగా ఉపకరిస్తాడనో- ఎన్ని కారణాలో!
    తల్లికి కడగొట్టు సంతానంపై ఎక్కువ ప్రేమ వుంటుందట. ఆ మక్కువకి కారణం ఏముంటుంది? బహుశా ఆ తర్వాత యింకెవరూ లేకపోవటంతో చిన్నతనంతో వాళ్ళు చేసే చిలిపి చేష్టలు ఎక్కువై మక్కువకి కారణం అవుతుందేమో!
    వంటింట్లో పెద్దకోడలు సావిత్రి కనిపించక పోవడం ఆఖరికి కూతురు పద్మ అక్కడ లేకపోవటం, సాయంకాలం కాఫీ టైం కావటంతో తనే కాఫీ కలుపుతూ కూర్చుంది ఆమె.
    మసలుతోన్న నీళ్ళలో చక్కర వేసి దించి బ్రూ పొడి కలిపింది. మధ్యాహ్నం యింట్లో ఆడవాళ్ళు మామూలు కాఫీ తాగెస్తారు. సాయంకాలం నారాయణ ఆఫీసు నుంచి వచ్చేక, సారధి కాలేజి నుంచి వచ్చేక అంతా కలిసి మళ్ళీ యీ బ్రూ కాఫీ తాగుతారు.
    ఆలోచనలో వుందేమో కోడలు సావిత్రి రావటం కానీ, పద్మ వచ్చి దగ్గరగా కూర్చోవటం కానీ ఆమె గమనించలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS