ఆమె వెళ్ళిపోగానే "బావుంది యిది! అత్తగారు కొత్త కోడలికి సపర్యలు" అంది.
వంటిల్లు చాటబోతోన్న సుబ్బరత్నమ్మగారు యీ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు.
అత్తగారు సమాధానం యివ్వకుండా వెళ్ళటం ఆమెకి వింతగా అనిపించింది.
దాంతో కేటిల్ లోని కాఫీ రెండు కప్పుల్లోకి వంచి ఒకటి పద్మకిచ్చి మరోటి తను తీసుకుని "పద్మా నువ్వు మీ చిన్న వదిన్ని పలుకరించావా?" అని అడిగింది.
"ఊహూఁ అమ్మ నాన్న నుంచున్నారు. అంతలో చిన్నన్నయ్య వచ్చాడు. నాన్నా అన్నయ్య మాట్లాడుకున్నారు. బాత్రూంలోకి వెళ్ళిన వదిన వచ్చిందంతలో. తర్వాత ఇద్దరూ వాళ్ళ గదికి వెళ్ళిపోయారు. చిన్నన్నయ్య ఇంట్రడ్యూస్ చేస్తాడనుకున్నాను" నిరాశగా జవాబిచ్చి కాఫీ తాగటంలో నిమగ్నమైంది.
కాఫీ తాగేదాకా సావిత్రి ఏమీ అన్లేదు.
"బాగా చదువుకున్నానని గర్వం కదూ!"
"ఎవరికి?" తెల్లబోయింది పద్మ.
"అదే! చిన్నావిడికి-"
"ఛ!ఛ! అలాంటిదేం వుండదు."
"నీకేం తెలుసులే! ఎంతయినా లెక్చరర్ కదా! ఆ టిక్కు ఆ ఠీవి ఎక్కడికి పోతాయి."
"వదినా లెక్చరర్సయితే టిక్కు ఠీవి వుంటాయి అంటావా? ఊహు! అది మనస్తత్వంలో వుంటుంది. మన పనిమనిషి చూళ్ళేదూ! లక్ష్మికి ఉన్న గర్వం, అహంకారం ఎవరికున్నాయి."
"అబ్బో! దాని మాట చెప్పకు! లోకంలో వున్న డాబు దర్పం అంతా దానివద్దే వున్నాయి."
"మరి చదువుకి వాటికి సంబంధం ఏమిటి ?"
"అది కాదు." మార్గం మార్చింది సావిత్రి. "కొత్త కోడలు యింట్లోకి రాగానే అత్తమామలకి దండం పెట్టి, పెద్ద కోడల్ని నాకు నమస్కారం చేసి, ఆడబడుచువి నీకు సారె యిచ్చి పలుకరించాలి, అవునా!"
"ఆమె సారె తేలేదు వదినా! ఒట్టి పళ్ళు మాత్రం బుట్టతో తెచ్చింది."
"తేవటానికి ఎక్కడిదిలే! ఈ పెళ్ళంటే ఆమె అమ్మా నాన్నలకి బొత్తిగా యిష్టం లేదట. తెగతెంపులు చేసుకున్నట్టుగా పంపించేశారేమో!"
పద్మ ఆ మాటలకి జవాబివ్వలేదు. అది తన స్థాయికి, వయస్సుకి ఎక్కువ అని భావించింది. పద్మ మౌనం వహించటంతో ఆమె రెట్టించలేదు. పనిలో నిమగ్నమైంది. పద్మ కూడా ఏదో ఆలోచిస్తూ అలాగే వంటింటి గోడకి ఆనుకుని కూర్చుండిపోయింది. ఆమె ఆలోచనలు అన్నీ వారుణి గురించే!
5
హాల్లో కూర్చున్నాడు నారాయణ.
ఆయన మనస్సులో యింకా ఆ ఆలోచనలే వున్నాయి. సుబ్బరత్నమ్మ దుడుకు వాఖ్యానము, సారధి నిర్భయత్వం, స్వయం నిర్ణయాధికారం, తొలిచూపులోనే తన వ్యక్తిత్వ లక్షణాలతో ఆకర్షించిన వారుణి ఆయన మనస్సులో మెదలుతున్నారు.
అప్పుడప్పుడూ సారధి వారుణి గురించి చెప్పిన విషయాలు, ఆమె నిర్భయత్వం, యీ యింటి పరిస్థితులు ఇక్కడ సుబ్బరత్నమ్మ, సావిత్రి వీళ్ళ మనస్తత్వాలు ఆలోచిస్తే వారుణి వీళ్ళతో సర్దుకుని పోగలదా అనిపించిందాయనకి.
ఏమో కాలమే నిర్ణయించాలి ఏదయినా ?
కానీ ఎలాగయినా వారుణి-సారధి దాంపత్యం సవ్యంగా సాగాలి. తమదేముంది. అన్ని సుఖాలు సౌఖ్యాలు అనుభవించారు. కష్ట నిష్టూరాలు చూశారు. తమకి అనుభవం నేర్పిన పాఠాలతో వాళ్ళ జీవితాల్లో తాము పొందిన చేదు అనుభవాలు రాకుండా చూడాలి.
"కాఫీ తీసుకోండి"
ట్రేలోంచి కప్పు తీసి ఆయన ముందుంచింది సుబ్బరత్నమ్మ.
ఆయన ఊహలు చెదిరిపోయాయి.
కప్పు అందుకున్నారు.
