Previous Page Next Page 
మౌనవిపంచి పేజి 10

 

    అన్ని లక్షణాలూ ఉన్నాయి.
    
    ప్రతి సంవత్సరం తప్పే వాడే కానీ బ్రహ్మానందరెడ్డి గారి ధర్మమా అని పాసవుతూ వచ్చాడు.
    
    టెన్త్ లో కూర్చున్నాడు ఇప్పుడు.
    
    వాడి కళ్ళకు నంద కదలాడే బొమ్మ-
    
    అదీ షోకేస్ బొమ్మలా వుంది.
    
    ఆ చలాకీతనం, ఆ అందం వాడికి కళ్ళు కుట్టాయి.
    
    దాంతో బాల్ ఎప్పుడూ ఆమె కేసే డైరెక్ట్ చేసేవాడు.
    
    షాట్స్ కొట్టేవాడు.
    
    ఆమె చాకచక్యంగా కొడితే వెర్రి కేకలు వేసేవాడు.
    
    వెకిలిగా నవ్వేవాడు.
    
    రవికి ముందు గుర్తింపు కాకున్నా నాలుగు సర్వీసు లయ్యేసరికి వాడూ వాడి ధోరణి అర్ధమైంది.
    
    రవి సిల్క్ గేం ప్రారంభించాడు.
    
    దాంతో ఆ అబ్బాయికి, కంటికి, చెవులకి, పెదాలకి డైరెక్షనవుతూ వెళ్ళసాగింది బాల్.
    
    రవి షాట్ కొట్టటమంటే ఏముంది?
    
    పెదాలు చిట్లటమే.
    
    కన్ను వాచిపోవటమే!
    
    చెవి రింగ్ మని సైరన్ మ్రోగేది.
    
    "మిస్టర్ ఏమిటది?" గద్దించాడు వాడు ఉక్రోషంగా.
    
    "గేమ్" తాపీగా బాల్ సర్వీస్ కి రెడీ అవుతూ అన్నాడు రవి.
    
    "ఇదేం గేం?"
    
    "తెలియదా బ్యాడ్ మింటన్!"    

 

    "అన్ని బాల్సూ నువ్వే రిసీవ్ చేస్తావేం?"
    
    నవ్వేడు రవి. రెఫరీ కేకవేసి సర్దేశాడు.
    
    రవి గేమ్ గెలిచాడు. ఆట పూర్తయ్యేసరికి ఆ అబ్బాయికి ముఖం నిండా వాపులే! పళ్ళు కొరికాడు.
    
    "నన్ను ఇలా రెచ్చగొట్టి నీట గా తిరిగి వెళ్ళినవాడు ఈ జిల్లాలో లేడు. నేనంటే ఏమనుకున్నావ్? దాన్ని వెనుకేసుకుని వచ్చి నన్ను టీజ్ చేస్తావా?"
    
    "మర్యాదగా మాట్లాడు అదీ, ఇదీ అన్నావంటే పళ్ళు రాల్తాయి!!" కోపంగా అన్నాడు రవి.
    
    "అబ్బో! లవ్ ని అంటే ఎంత రోషం!!
    
    ఫెడీలు మని కొట్టేడు. పెదాలు చిట్లి రక్తం వచ్చింది "జాగ్రత్త! నోరు కట్టేసుకో." రవి ముఖంలో చండ్రనిప్పులు కదుల్తున్నాయి.
    
    అది చూసిన నందకి భయం వేసింది. "ఒరే అన్నయ్య్ ఎందుకు మనకీ గొడవ హెచ్. ఎం.కి రిపోర్ట్ చేద్దాం రా!"
    
    "ఆర్ని! ఇది వీడి చెల్లెలా? అంత బాధలోనూ ఆశ్చర్యంగా అనుకున్నాడు వాడు. వెంటనే సారీ చెప్పాడు.
    
    అయినా వాడి మనస్సులో రవిపై కోపం, నందపై వ్యామోహం పోలేదు. రాజుకుంటూ వుంది.
    
    అది ఆ రాత్రి బయట పడింది.
    
    అందరికీ స్కూల్లోనే బస ఏర్పాటు చేసినా రవికి, నందకి ఇబ్బందిగా వుంటుందని నందని హెడ్మాష్టరు గారింటి ముందు గదిలో విడిది చేయించారు.
    
    ఆ రాత్రి అయిదుగురు కుర్రాళ్ళు ఆ గదిపై దాడి చేశారు.
    
    అయితే వాళ్ళు రవిని చాలా తక్కువగా అంచనా వేశారు. తమ బలాన్ని హెచ్చించుకున్నారు. వాళ్ళు అయిదు గురు- అతనొక్కడూ అనుకున్నారు. తుక్కుతుక్కుగా తన్నొచ్చనుకున్నారు. కానీ అర్దరాత్రివేళ వాళ్ళు తమగదిపై దాడిచేసే సరికి రవికి ఆగ్రహం ముంచుకొచ్చింది.
    
    అంతే విజ్రుంభించాడు! పులిలా రేగిపోయాడు.
    
    దానికితోడు నందకూడా ఏ మాత్రం భయపడకుండా తనపై దౌర్జన్యం చేయడానికి వచ్చిన ఆ అన్నాయిని రవి నేర్పించిన ఫైటింగ్స్ తో చితకబాదేసింది.
    
    మొత్తానికి రవికే దెబ్బలు తగిలినా ఆ నలుగురు అతన్నేం చేయలేకపోయారు. అవమానం పొంది వెళ్ళారు.
    
    ఇంతలో గొడవవిని, ఎవరో ఏమిటో తెలియక హెచ్. ఎం. పోలీసులకి రింగ్ చేశాడు.
    
    ఇంటి వాళ్ళంతా గది వద్దకి వచ్చారు. భయంతో, ఆందోళనతో కోపంతో అగ్గిరాముడై వచ్చాడు హెచ్.ఎం.ని చూస్తే తన స్టూడెంట్ మిగతా నలుగురు ఎవరో పరీక్ష తప్పిన వెధవాయిలు!
    
    ఆయనకీ చిర్రెత్తుకొచ్చి చెడామడా తిట్టేసి, పోలీసులకి పట్టించేశాడు.  

 

    "ఒరేయ్! ఈ అరస్టెంత! ఇంకో గంటలో మా నాన్నకి ఫోన్ చేస్తే నన్ను విడిచేస్తారు. నేనంటే ఎవరనుకుంటున్నారు! నా సంగతి మీకు తెలీదు. నన్నూ నా శక్తినీ మీరంచనా వేయలేరు. కానీ నేను మీ వూరువచ్చి అయినా నీపై పగ తీర్చుకుంటాను! మేష్టారూ! ఈ ఫలితం మీరూ అనుభవిస్తారు! అని రంకె వేశాడు ఆ అబ్బాయి.
    
    మొత్తానికి దెబ్బలు తిన్నా విజయంతో వూరు తిరిగి వచ్చారు రవీ, నంద.
    
    అయితే ఇంట్లో ఆ విషయం విన్న అందరూ భయపడ్డారు.
    
    "ఇంకెప్పుడూ దాన్ని పొరుగూరికి తీసికెళ్ళకు!" కఠినంగా అన్నారు నారాయణ.
    
    రవి మాటాళ్ళేదు. "తనేం తప్పుచేశాడు." అతడికి తెలీలేదు.
    
    సుందరమ్మ చాలా భయపడిపోయింది. ఏ దెటుపోయినా దెబ్బతినేది తమ జీవితాలే! అందుకే నందకి వేయి జాగ్రత్తలు చెప్పింది.
    
    నంద నవ్వేసింది. ఆ మాటలు విని పకపకా నవ్వేసింది.
    
    "అమ్మా! మనం భయపడకూడదు. భయపడితే లోకువ అవుతాం. తిరగబడాలి ఎక్కడికక్కడే!"
    
    "నువ్వు నోర్ముయ్! ఆడపిల్లకి ఇంత తెగింపు పనికిరాదు!!"
    
    "అలాగేలే!" తల్లితో వాదించలేదు నంద.
    
    తరువాత నారాయణ ఆ ఎం.ఎల్.ఎ. గారికి క్షమాపణ చెప్పుకున్నాడు ఏదో సందర్భంలో! కొడుక్కోసం తండ్రి తల వంచాడు.
    
    అయినా ఆ పగ అంతటితో ఆరిపోలేదు. రగిలి రగిలి భగ్గున మండినట్టుగా అయి తరువాత చాలా గట్టి దెబ్బే తీసింది.
    
                                         7
    

    టంగ్ టంగ్ మని ఏడుగంటలు కొట్టింది.
    
    ఆలోచనల నుంచి బయటపడింది నంద!
    
    ఇంజక్షన్స్ మత్తు కలిగిస్తాయంటారు. కానీ ఆలోచనలు ఎంత మత్తో ఎవరికీ తెలీదు అనుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS