క్షణం తర్వాత ఎంతో ప్రేమగా "కిష్ణుడూ" అని పిలిచేడు.
తండ్రి పిలుపుకోసం తలుపు పక్కన నిలబడ్డ కృష్ణమూర్తి ఎంతో వినయంగా చేతులు కట్టుకుని వచ్చేడు.
సత్యం ఫోటోని దాచేసి చాలా తెలివిగా అడుగుతున్నట్టు బాణం వేసేడు.
"ఫోటోలు ఎన్నిరకాలు?"
"ఫోటోలేమిటి! రకాలేమిటి?"
"అనవసరం! అడిగిందానికి సమాధానం చెప్పంతే! అసలు ఫోటోలు ఎందుకు దిగుతారు?"
నీళ్ళు నములుతూ అన్నాడు కృష్ణమూర్తి---
"తమ ఆత్మీయత పదికాలాలపాటు రికార్డుచేసి పెట్టుకోడానికి---"
"ఆత్మీయత లెన్నిరకాలు?"
"మళ్ళా రకాలేమిటి నాన్నా! ఆత్మీయత అనేపదం ఏకవచనం. ఒకటే వుంటుంది."
"కిష్ణుడూ-చమత్కారంగా మాట్లాడకు. నేను ఏ ఫోటో గురించి అడుగుతున్నానో, ఎల్లాంటి ఆత్మీయతను ప్రశ్నిస్తున్నానో నీకు బాగా తెలుసు. ఇట్సాల్ రైట్ ఇప్పుడు చెప్పు...ఈ ఫోటోకి అర్ధం ఏమిటి?" అని దాచిన ఫోటో కృష్ణమూర్తి కళ్ళముందు పెట్టేడు.
కృష్ణమూర్తి సిగ్గుని అభినయించేడు. ఆ ప్రయత్నం అతను కొంచెం ఎక్కువ పాళ్ళల్లో చేయడంవల్ల సత్యం మెత్తగా విసుక్కున్నాడు-
ఫోటోని చూసి అర్ధం చెప్పమంటే మెలికలు తిరుగుతావే?"
"దాన్నే సిగ్గుపడటం అంటారు!"
"ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది?"
"ఆ అమ్మాయీ నేనూ ప్రేమించుకున్నాం నాన్నా!"
"అందుకు సిగ్గు పడాలా?"
"సిగ్గు బెటరనిపించింది!"
"కిస్టుడూ! సీరియస్ గా చెబుతున్నా... ప్రేమించి సిగ్గుపడటం నాకు నచ్చదు. ఆ పిల్లను పెళ్ళాడి సుఖపడటమే నీ కథకి పరిష్కారం ఓకే?"
"నాన్నా"- అంటూ కృష్ణమూర్తి తండ్రిని ఆనందంగా వాటేసుకున్నాడు.
-కళ్ళు విప్పి చూస్తే క్లాసు జరుగుతోంది.
నల్లబోర్డుముందు ప్రొఫెసరున్నాడు. బోర్డుమీద ఏవో కొన్ని ఈక్వేషనులున్నాయి. క్లాసులో పిల్లలంతా లేచి నించున్నారు. వాళ్ళు కృష్ణమూర్తిని గుచ్చి గుచ్చి చూస్తున్నారు- ప్రొఫెసరుతో సహా...
"ఆర్యూ ఆల్ రైట్?" అని అడిగేడు ప్రొఫెసర్.
అప్పటికి తనకేమీ పట్టనట్టు క్లాసు మొత్తంమీద తానొక్కడూ కూచుని వున్నందుకు సిగ్గుపడ్డాడు. వెంటనే లేచి నిలబడ్డాడు.
"వాటీజ్ రాంగ్ విత్ యూ?" అని మళ్ళీ అడిగేడు ప్రొఫెసర్.
కృష్ణమూర్తి గొంతు తడిచేసుకుంటూ అన్నాడు---
"ఎక్స్ క్యూజ్మి సర్! ఫోటో గొడవలోపడి క్లాసులో వున్నమాటే మరిచేను."
ఫోటో ఏమిటో అర్ధంగాని ఆ జనాభా ఒకరి మొహాలొకరు చూసుకుంటూంటే కృష్ణమూర్తి సిగ్గుతో తలవంచుకున్నాడు.
* * *
అప్పలకొండ వళ్ళు గేస్ స్టవ్ మంటలాగా మండిపోతోంది.
చేస్తున్న వంటలో కారం ఉప్పు దంచేస్తున్నాడు కసిగా.
ఆ కసిలోనే కృష్ణమూర్తి ఇచ్చిన ఫోటోని మంటకి అంటించేసాడు.
అప్పుడొచ్చింది అతని భార్య మంగమ్మ.
వంట చేయడంలో తన భర్త భీముడూ నలుడని తెలుసుగానీ- ఆ వంటకి ఫోటోలు తగలెట్టాలనే కొత్త థియరీ కేవలం భర్తకి మాత్రమే తెలిసినందుకు సంతోషిస్తూ అడిగింది---
"అవునూ-ఫోటో తగలెడితే వంటకి రుచి పెరుగుతుందా?"
"నువ్వు నోర్మూయ్!" అన్నాడు అప్పలకొండ.
మంగమ్మ మరింక మాట్లాడలేదు. కూరలు తరిగే కార్యక్రమంలో మునిగిపోయింది.
"తగలెట్టిన ఫోటో ఎవరిదో ఏంటో తెలుసా!" అని అడిగేడు అప్పలకొండ సెగలు కక్కుతూ.
"తెలవదు!"
"తెలవకపోతే అడిగి తెలుసుకోవాలి!"
"నోరు మూసుకోమన్నావుగా!"
"అన్నానా! అయితే సరి! జరిగిన సమస్తమైన కతా నేనే చెపుతా."
-అంటూ అతను వంటపని వదిలేసి మంగమ్మ ముందు కూచున్నాడు.
* * *
పద్మతో నడుస్తున్నాడు కృష్ణమూర్తి.
అతను చాలా ఉత్సాహంగా వున్నాడు.
అంచేత దారిలో కనిపించిన రాళ్ళతో ఫుట్ బాల్ ఆడుతున్నాడు.
అన్ని రాళ్లూ మెత్తగా వుండవు గనక ఒకరాయి ఎదురుతిరిగింది. దాంతో అతని కాలు పచ్చడయింది.
"అయ్యయ్యో" అన్నది పద్మ.
"ఫర్లేదులే" అన్నాడు కృష్ణమూర్తి.
"అయినా రాళ్ళని తన్నడమేమిటి బొత్తిగా?"
"నాకు ఉత్సాహం ఎక్కువైతే ఆ పనే చేస్తాను?"
"అంత ఉత్సాహానికి కారణం ఏమిటో?"
కృష్ణమూర్తి షోగ్గా కాలు జాడించి చెప్పేడు.
"ఏముందీ-మనపెళ్ళి!"
"మన పెళ్ళా? ఎప్పుడూ?"
"డేటూ వగైరాలూ ఈ సాయంత్రమే నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే "నాయనా కిస్టుడూ, నీ పెళ్ళి నీయిష్టం. శుభలేఖలు అచ్చు వేయించుకో. వచ్చి దీవిస్తాను" అని నాన్న అంటాడు.
"అంత గ్యారంటీగా ఎట్లా చెప్పగలవ్?"
"తావీజ్మహిమ!"
"అంటే---"
"మనం దిగిన ఫోటో---"
"అవునూ-ఆ ఫోటో ఏం చేసేవ్?"
"నేనేం చేసినా దానికో బేగ్రౌండు వుంటుంది?"
"అదేమిటో నాకు చెప్పచ్చుగా!"
"చెప్పకపోవడమే బెటరు! అంచేత మన పెళ్ళిగురించి బెంగపడటం మానేసి పరీక్షలు బాగా రాయి. దట్సాల్!" అన్నాడు కృష్ణమూర్తి.
అతని తిక్కపనులకు తల బాదుకోవడం పద్మకి అలవాటే గనక అప్పుడుకూడా అదే పని చేసింది-ఖర్మ ఖర్మ అనుకుంటూ.
వద్దొద్దొద్దొద్దంటూ అడ్డం పడ్డాడు కృష్ణమూర్తి.
* * *
అప్పలకొండ చెప్పిందంతా విన్న మంగమ్మ ఎంతో నొచ్చుకుంటూ అన్నది-
"అబ్బాయిగారు అంత యిదిగా ప్రేమించి ఆ పిల్లనే పెళ్ళి చేసుకోవాలనుకుంటే ఆ ఫోటోని తగలెట్టడానికి నీ చేతులెట్టా వచ్చేయి?"
అప్పలకొండ హీటెక్కిపోయి అరిచేడు-
