అది గమనించిన రంగనాధం సత్యంతో అన్నాడు-
"పరాయివాడు కాదులేరా! మా అల్లుడే! జ్యోత్స్న భర్త, పేరు కేశవ్!"
కేశవ్ "హల్లో" అన్నాడు.
సత్యం అంతవరకే వినగలిగేడు. ఆ తర్వాత చెవులకూ నోటి తాళం వేసుకున్నాడు.
రైలు జోరుగా పోతూనే వుంది!
9
కృష్ణమూర్తి తాను తెచ్చిన ఫోటోలోని ఒకటికి రెండు తడవలు చూసుకున్నాడు.
అందంగా వుంది ఆ ఫోటో. ఈడూ జోడూ బాగా కుదిరింది.
అసలే అందమయిన పద్మ ఫోటోలో మరింత అందంగా వుంది.
కృష్ణమూర్తి చిన్నగా ఈలవేసుకున్నాడు. ఆ తర్వాత అతను వంట గదివేపు గబగబా నడిచాడు.
వంటగదిలో అప్పలకొండ వంటపనిలో బిజీగా వున్నాడు. అతన్ని చూస్తూ---
"అప్పలకొండా!" అని మెల్లిగా పిలిచాడు కృష్ణమూర్తి.
అప్పలకొండ కృష్ణమూర్తిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎన్నడూ వంటగది మొహం చూడని అబ్బాయిగారు పనిగట్టుకుని అక్కడికి ఎందుకు వచ్చారో అతనికి ఒక పట్టాన అర్ధంకాలేదు.
తనవల్ల ఏదైనా పొరపాటు జరిగిందో ఏమోనన్న బెంగతో మెల్లిగా అడుగులేసుకుంటూ కృష్ణమూర్తిని చేరుకున్నాడు.
దగ్గిరకొచ్చిన అప్పలకొండ చేతిని లటుక్కున పట్టుకుని కొంచెం దూరంగా అతన్ని లాక్కుపోతున్నాడు కృష్ణమూర్తి.
దాంతో అప్పలకొండ గుండెల్లో రైళ్ళు పరుగెట్టడం ప్రారంభమయ్యాయి.
అప్పలకొండ ఆ ఇంటిలో కేవలం వంటపని మాత్రమే గాకుండా యింకా ఇతరత్రా పనులనేకం చేస్తుంటాడు. ముఖ్యంగా శ్రీమాన్ సత్యంగారికి నమ్మినబంటు.
అల్లాంటి పదవిలోవున్న అప్పలకొండ తెలిసిగానీ తెలీకగానీ పొరపాట్లు చేయకూడదు.
అల్లాంటిది అబ్బాయిగారు తన చెయ్యట్టుకు లాక్కుపోతున్నారంటే ఏదో ఉపద్రవం జరిగే వుంటుందని అప్పలకొండ దిగులుపడి పోతున్నాడు.
అప్పలకొండని ఒకచోట ఆపి కృష్ణమూర్తి అన్నాడు---
"నువ్వు నాకో సాయం చేయాలి!"
ఆమాట విన్నాకగానీ అప్పలకొండకి ఆందోళన తగ్గిందికాదు.
సాయమనే పదం వాడేడు గనక తనవల్ల అపచారం ఏదీ జరిగుండదని అర్ధం చేసుకున్నాడు అంచేత కొంచెం ధీమాగా ధైర్యంగా మాటాడగలిగేడు---
"చెప్పండి బాబూ! మీరేం చెప్పినా చేస్తాను!
కృష్ణమూర్తి తనచేతిలోవున్న ఫోటోని అప్పలకొండకిస్తూ అన్నాడు.
"చూడు."
అప్పలకొండ చూసేడు. అబ్బాయిగారు, ఎవరో అమ్మాయిగారు పెళ్ళయిం తర్వాత దిగే ఫోటోలు అట్లాగే వుంటాయి. అప్పలకొండకి ఆ పాయింటు తట్టేక ఆందోళన ఎక్కువయింది.
అల్లాంటి ఫోటోలు చూసి తట్టుకు నిలబడ్డంకంటే ఏదో ఒక తప్పు చేసి యజమానిచేత చివాట్లు తినడమే నయమనిపించింది.
అంచేత చెడ్డ బాధపడిపోతూ అడిగేడు-
"ఇదేంటిది బాబూ?"
"ఎలా వుంది ఫోటో?"
"ఫోటోకేం బాబు? బాగానే వుంది! కానీ."
"అమ్మాయి నీకు నచ్చిందా?"
"నచ్చడానికేం బాబూ! నచ్చింది కానీ---"
"నీకు నచ్చితే నాన్నక్కూడా నచ్చుతుంది!"
"నచ్చడం గోల అట్టా వుంచండి బాబూ! పెద్దయ్యగారికి తెలపకుండానే---ఏమీ చెప్పకుండానే పెళ్ళాడేసేవా?"
కృష్ణమూర్తి వెంటనే బదులు చెప్పలేదు క్షణమాగి-కొంచెం ఆలోచించి అన్నాడు---
"ఏం? చేసుకుంటే తప్పా?"
అప్పలకొండ నసుగుతూ అన్నాడు.
"తప్పా అంటే తప్పే బాబు! తమర్ని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడిగిందల్లా యిచ్చేరు. అట్టాంటి మడిసికి మాట మాత్రంగానైనా చెప్పకుండా మీ పెళ్ళి మీరే చేసేసుకుంటే తప్పుకాదా బాబూ?"
కృష్ణమూర్తి గాలి పీల్చుకుని అన్నాడు---
"అందుకే! ఇంకా తొందరపడలేదు."
ఆ మాటకి అప్పలకొండ ఆనందించేడు. వాళ్ళకి యింకా పెళ్ళి జరగనందుకు ఆనందించినా అయ్యగారికి తెలీకుండా అబ్బాయిగారు అల్లాంటి ఫోటో దిగడం బాధగానే వుంది.
అంచేత అప్పలకొండ ఏమీ మాటాడలేకపోయేడు. కృష్ణమూర్తే అన్నాడు---
"నాన్నదగ్గిర నా మర్యాద దక్కాలన్నా, నాన్న నా పెళ్ళికి సిగ్నల్ యివ్వాలన్నా నువ్వు కొంచెం చొరవచేయాలి."
అప్పలకొండ నిష్టూరంగా అన్నాడు.
"ఈ ఫోటోని నాన్న కోటు జేబులో పెట్టు."
"పెడితే?"
"నాన్న చూస్తాడు."
"చూస్తే?"
"ఎవరీ పిల్లని నన్ను అడుగుతాడు!"
"అడిగితే?"
"అప్పుడు కధంతా చెపుతాను. మా పెళ్ళి చెయ్యమని రిక్వెస్టు చేస్తాను."
అప్పలకొండకి ఆ కుట్ర ఏమిటో అర్ధంకాలేదు. అంచేత అడగదల్చు కున్నదేదో తిన్నగా అడిగేసేడు.
"ఇదేదో డొంకతిరుగుడు యవ్వారంలాగా వుండండి. ఆ చెప్పేదేదో ఫోటోలు-కోటు జేబులూ లేకుండా-తిన్నగా మీరే సమస్తం చెప్పేవచ్చుగా?"
"అది చేతగాకే అటునుంచి నరుక్కొస్తున్నాను. ఇల్లాంటి విషయాలకి కొంచెం బిల్డప్పూ, కొంత ప్రిపరేషనూ అవసరం. ఏమిటి అర్ధమవుతుందా?"
అనవసరంగా తలూపేసేడు అప్పలకొండ...
"తలూపితే కాదు. చెప్పింది చెప్పినట్టు చేస్తావా, చేయవా? అది చెప్పు!" అని విసుగ్గా అడిగేడు కృష్ణమూర్తి.
కాదంటే ఇంతకంటే దిక్కుమాలిన మార్గం మరొకటి ఎంచుకుంటా డేమోనన్న భయంతో "చేస్తాను" అన్నాడు అప్పలకొండ.
కృష్ణమూర్తి ఆనందంగా గాలి పీల్చుకున్నాడు.
అక్కడికి ఒకపని పూర్తయినట్టు రిలాక్సయ్యేడు.
10
ఆ ఉదయం సత్యం కోటు తొడుక్కుంటున్నాడు. కోటు తొడుక్కొన్నాక జేబులో చెయ్యి పెట్టాడు. ఏదో కొత్తగా చేతికి తగిలేసరికి అదేమిటో చూద్దామని బయటకు తీసేడు.
కృష్ణమూర్తి, పద్మల ఫోటో.
సత్యం ఆ ఫోటోని శ్రద్ధగా చూస్తున్నాడు. అతను అట్లా చూస్తూ తన మొహంలో ఆనందం నింపుకుంటున్నాడు.
