"నోర్ముయ్! నేను పెద్దయ్యగారి మడిసినే అమ్మా నాన్నా లేనోడ్ని, ఇంతప్పుడు నన్ను చేరదీసి తిండి పెట్టి పెంచుకున్నారు, పెద్ద చేసేరు. నిన్నిచ్చి పెళ్ళి చేసేరు. అల్లాంటి దేవుడ్ని ఎవరు మాయ చేయాలనుకున్నా ఊరుకోను. అబ్బాయిగారి పెళ్ళి పెద్దయ్యగారిష్ట ప్రకారమే జరగాలి. పెద్దయ్యగారు తెచ్చిన సంబంధమే అబ్బాయిగారు చేసుకోవాలి. దీనికి తిరుగులేదంతే!"
అప్పులకొండ స్వామి భక్తికి మంగమ్మ అబ్బురపడింది.
11
ఇంటిదగ్గర కృష్ణమూర్తి స్కూటరు దిగుతూనే తోటమాలిని అడిగేడు.
"నాన్నగారెక్కడ?"
తోటమాలి వినయంగా సమాధానం చెప్పేడు-
"మేడమీద గాలి పటాలెగరేస్తున్నారండి!"
అంటే మూడ్ బావుందన్న మాట.
సరదాగా వున్నప్పుడు వయస్సు మాట మరిచిపోయి గాలి పటాలెగరేయడాలూ, గోళీలాడటాలు చేస్తుంటాడు.
సరదాగా ఉండటానికి ఏమిటి కారణం?
తాను తెచ్చిన ఫోటో ఖచ్చితంగా చూసేవుంటాడు. ఆయనకు పద్మ బ్రహ్మాండంగా నచ్చే వుంటుంది.
అందుకే గాలిపటం పట్టుకున్నాడు.
'నాన్నా పెళ్ళి అంటే' అలాగే నాయనా అని దీవించే తరుణమిది. ఈ చాన్సు పోగొట్టుకోకూడదు.
కృష్ణమూర్తి గొప్ప స్టయిల్ గా ఈలవేసుకుంటూ మేడ ఎక్కుతున్నాడు.
సత్యంగారి ఇంటి పరిసరాల్లో కొన్ని మేడలున్నాయి. ఖరీదులోగాని, కళాకాంతుల్లోగాని అవి సత్యంగారింటితో పోటీ పడకపోయినా మేడ అనే శబ్దానికి అక్కడున్న ఏ మేడ కూడా అపఖ్యాతి తీసుకురాదు.
ఆ మేడలమీద కూడా ఎగురుతున్నాయి గాలిపటాలు.
అవతలెవడి రాజ్యంనుంచో ఒక గాలిపటం తమ ప్రాంతాల్లో వెర్రిగా ఎగిరెగిరిపడటం సత్యానికి నచ్చలేదు. దాని దుంప తెంచితేనేగాని సత్యం సుఖంగా నిద్రపోయేట్టులేడు.
అందుకోసం అతను తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు.
ఆ ప్రయత్నంలో అప్పటికే తనవి రెండు గాలిపటాలు బలయిపోయాయి. అయినాసరే పట్టువీడని విక్రమార్కుడి లాగా తన ప్రయత్నాన్ని విరమించడం లేదు.
ఇప్పుడు ఎగురుతున్నది ముచ్చటగా మూడో గాలిపటం.
మేడమీద తన పక్కనే మరో తొమ్మిదో పదో గాలిపటాలు సిద్ధంగా ఉన్నాయి, ఈ పోటీకి మొత్తం డజను గాలిపటాలు తెప్పించుకున్నాడు కాబోలు!
సత్యంగారి గాలిపటాలు రెంటిని పడగొట్టి చెక్కుచెదరకుండా ఎగురుతున్న తమ వీర గాలిపటం విజయానికి పొరుగురాజ్యం వీరులు ఈలలూ కేకలూ వేస్తున్నారు.
వాళ్ళంతా కుర్రాళ్ళు!
వాళ్ళ ధాటికి తాను తట్టుకోలేక పోతున్నందుకు మిడిసిపడుతున్నారో లేక ముసిలివాడా నీ కెందుకీ పోటి అని యాగీచేస్తున్నారో సత్యానికి అంతు పట్టడంలేదు.
వాళ్ళ ఉత్సాహంలో ఈ రెండు పాయింట్లు ఉన్నాయని గ్రహించినప్పుడు సత్యానికి పిచ్చికోపం వచ్చింది.
ఒకపక్క రెండు పటాలు కూలిపోయినందుకు వర్రీ అవుతూనే మరోపక్క తనని హేళనచేస్తూ కనిపిస్తున్న కుర్రాళ్ళమీద వళ్ళుమంట పెంచుకున్నాడు సత్యం.
ఆ దిక్కుమాలిన గాలిపటాన్ని చిత్రవధ చేస్తేనేగాని తన ప్రయోజకత్వ మేమిటో కుర్ర వెధవలకి తెలిసిరాదనుకున్నాడు. ఆ లక్ష్య సాధనకు తనవి వంద పటాలు సర్వనాశనమయినా సరే... ఆ పొగరుబోతు పటాన్ని తెంచవలిసిందేనని నిర్ణయానికి వచ్చేడు.
సత్యం పక్కనే అప్పలకొండ నిలబడి ఉన్నాడు.
అయ్యగారి అపజయాన్ని కళ్ళారా చూస్తూ అతను కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఆ పోటీలో తనకు తెలిసిన మెలకువలన్నీ శక్తివంచన లేకుండా చెబుతూనే వున్నాడు.
పిట్టగోడ ఎక్కమంటున్నాడు. సత్యం ఎక్కుతున్నాడు. బోర్లా పడుకోమంటున్నాడు. సత్యం ఆ విధంగా కూడా చేశాడు.కూచోమంటున్నాడు, కూచున్నాడు. నించోమంటున్నాడు, నించున్నాడు.
వెనక్కి నడవమంటే నడుస్తున్నాడు. ముందుకి పొమ్మంటే పోతున్నాడు ఎగరమంటే ఎగురుతున్నాడు. ఎగిరి కూచోమంటే ఆ విధంగానే చేస్తున్నాడు.
సలహా యిచ్చేది పనిమనిషని సత్యం పట్టించుకోవడం లేదు. గుంజీలు తీయిస్తున్నది అయ్యగారినని అప్పలకొండ అనుకోవటం లేదు.
వాళ్ళిద్దరి ధ్యేయం ఒకటే...
ముక్కు పచ్చడయినా, పళ్ళు రాలిపోయినా తామే గెలవాలి. అంతిమ విజయం తమదే కావాలి!
అప్పుడొచ్చాడు కృష్ణమూర్తి.
అక్కడి బీభత్సం చూడగానే అతని గుండెల్లో రాయిపడింది. అంత బిజీగావున్న తండ్రితో తన పెళ్ళివిషయం ఎట్లా కదిపేది?
ఎందుకైనా మంచిదని అప్పలకొండని 'హల్లో' అని పలకరించేడు.
అప్పలకొండ పట్టించుకోలేదు. పైగా తనకి అడ్డం వచ్చినందుకు మోచేతితో కృష్ణమూర్తి పొట్టలో పొడిచేడు.
(వీడ్ని తగలెయ్య, ఎంత గర్వం?)
సత్యాన్ని పలకరించడమే బెటరనుకుని తండ్రివేపు కదిలేడు అతను.
అప్పటికి తండ్రిగారు కొండముచ్చు ఫోజులో పిట్టగోడెక్కి వున్నారు. నాన్నా అని పలకరించేవాడేగాని సరిగ్గా అప్పుడే తండ్రిగారు పిట్టగోడ మీంచి మేడమీదికి కొబ్బరిబోండమల్లె దూకడం వలన అక్కడున్న కృష్ణమూర్తి వారి కాళ్ళకిందపడి అప్పడమయిపోయాడు.
తండ్రిగారు అదేమీ గమనించలేదు. ఎంతకీ వారి పట్టుదల వారిదే!
కింద కూచుని దారాన్ని ఒడుపుగా లాగుతున్నారు.
ఎట్లాగయినా సరే మాట కలుపుకోవాలనే సదుద్దేశంతో కృష్ణమూర్తి కూడా తండ్రిపక్కనే కూచున్నాడు.
తగిలిన దెబ్బను గాలికొదిలేసి తండ్రి గెలిచేందుకు కొన్ని చిట్కాలు చెబుతూ ఫోటో విషయం అడగాలనుకున్నాడు.
ఆ ప్రకారంగా...
"రైటుకి గుంజి లెఫ్టుకిలాగు" అని ఒక చిట్కా చెప్పేడు తండ్రితో.
సలహా ఎవరిస్తున్నారో కూడా పట్టించుకోలేదు తండ్రి. వినిపించిన చిట్కాను అమలుపరిచాడు.
ఆ చిట్కాతో పొరుగురాజ్యం పటం కొంచెం అల్లల్లాడింది.
"కోటుజేబు చూసుకున్నావా?" అడిగాడు కృష్ణమూర్తి.
"ఎందుకు?" అనడిగేడు తండ్రి దారం లాగుతూ.
ఎందుకయినా మంచిదని మాట మార్చాడు అతడు.
"లెఫ్టుకి గుంజి రైటుకి లాగు" ఇంకో చిట్కా చెప్పేడు.
ఆ ప్రకారంగానే తన గాలిపటాన్ని నడిపించేడు తండ్రి. ఆ దెబ్బతో పొరుగురాజ్యంలో కలకలం పుట్టింది. వారి పటం అల్లకల్లోలంలో పడింది.
సత్యం చాలా హుషారుగా ఉన్నాడు.
"కోటుజేబు వెతుక్కున్నావా?" మళ్ళా అడిగేడు కృష్ణమూర్తి.
"ఎందుకు?" అని మళ్ళా అడిగేడు తండ్రి.
"ఏదయినా ఫోటోలాంటిది కనిపించవచ్చు గదా?"
