Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 9

    "అవును"

    "తొందరపడ్డావేమో?"

    "తొందరకాదు నాన్నా! సరయిన నిర్ణయమే తీసుకున్నాననుకుంటున్నాను_ ఇన్నాళ్ళు ఒకవిధమయిన భ్రమలో వున్నాను_ ఈ ఉద్యోగం ఎన్నాళ్ళు చేసినా గొర్రె తోక బెత్తెడే అన్నట్లు యింతే! వ్యాపారంతోనే బాగుపడతాం"

    "మనమేం వ్యాపారాలు చేయగలం నాయనా"

    "చదువూ ఒక వ్యాపారమయిపోయిన యీ రోజులలో స్వంతంగా స్కూల్ ని ప్రారంభించటం మంచిది. వీధి వీధికొక బడి పెట్టినా జరుగుతుంది"

    "నీ యిష్టం" అంతకన్నా మరేం అనలేకపోయారు.

    "స్టేట్ బ్యాంకు మేనేజరుతో మాట్లాడాను_ రెండువేలు పర్శనల్ లోన్ యిస్తామన్నారు. దానితో బల్లలు, కుర్చీలు, బోర్డులు కొంటాను. వారం పదిరోజులలో స్కూలు ప్రారంభిస్తా. నలుగురు ఎసిస్టెంట్స్ ని కూడా చూశాను. నెలకి వంద యిస్తానన్నాను_సరేనన్నారు _ ఎడ్మిషన్సుకి రేపటి నుంచే తిరగాలి"

    ఒక్కనిమిషం కళ్ళు మూసుకున్నారాయన. 

    "కోడల్ని రమ్మని వుంటే ఆమెకూడా ఎసిస్టు చేసేదేమో!"

    తండ్రి అమాయకత్వానికి లోలోపలే బాధపడ్డాడతను _ బదులు పలకలేదు.

    "క్వాలిఫైడ్ టీచర్స్ వుండడం మంచిది_ పైగా ఆమె అయితే జీతం డబ్బులూ కలిసొస్తాయి.

    "అత్తమామలతో కలసి వుండటం యిష్టంలేక పుట్టింట్లో దిగబడిపోయి నావిడ ఈ స్కూలు కోసం పరుగెత్తుకొస్తుందా" మనసులోనే బాధగా అనుకున్నాడు.

    "నాన్నా"

    "ఏమిటి?"

    "నేనో పనిచేశాను"

    "నేను లాయర్ నోటీసు ఇప్పించాను. నోటీసు ముట్టిన తరువాత వారం రోజులకి తను కాపురానికి రాకపోతే డైవర్సుకి కోర్టుకి వెళతానన్నాను'.

    "దాశరధి" బాధగా పిలిచారాయన_ ఆయనకి గుండెల్లో మంట లేచింది.

    "అవునాన్నా! ఆ దాశరధి పేరు పెట్టినందుకు నాకు భార్యా వియోగం కలుగుతోంది_ ఆ జానకి ఆయన వదిలేస్తే ఈనాటి ఈ జానకి నన్ను వదిలేస్తోంది"

    "ఏం మాటలురా అవి? ఏదో తాత్కాలికంగా ఉద్రేకంలో అలా ప్రవర్తించినా నిలకడ మీద నిజం తెలుసుకుంటుంది"

    "ఏం తెలుసుకుంటుందో? తల్లి కడుపులో పడగానే నా పేరు పెట్టి పుట్టాక పేర్లు సరిపోయేట్లుగా జానకి ఆ పేరు పెట్టుకుని యిచ్చి చేసినందుకు తగినట్లుగానే ప్రవర్తిస్తోంది. ఈ నోటీసుకి సమాధానం రాకపోతే విడాకులు తప్పవు_ తను కాపరానికి రాననీ, నన్నే రమ్మనీ నేను వెళ్ళకపోతే తీసుకురాననీ రాసిన జాబులన్నీ వున్నాయి_ విడాకులు సులభంగా వచ్చేస్తాయి" బాధగా అన్నాడు దాశరధి. అతని గొంతు బొంగురుపోయింది.

    శాస్త్రిగారికి కొడుక్కెలా నచ్చచెప్పాలో అర్ధం కాలేదు. తెగేదాకా లాగటం ఎవరికీ మంచిదికాదు_ ఇద్దరూ పంతాలతో కూర్చుంటే ఎలా? ఎవరో ఒకరు రాజీకి రావాలిగాని అనుకున్నారాయన.

    ఇంతలో ఇంట్లోనుంచి పార్వతి వచ్చింది_ కొడుకు చెపుతున్న విషయం వింది_ ఆమె మనసు అల్లకళ్ళోలమయింది. దెబ్బతిన్న లేడిలా అల్లల్లాడి పోయింది_ అటు చూడబోతే అన్నకూతురు_ ఇటు కన్నకొడుకు. ఎవరికి నచ్చచెప్పాలో, ఎవర్ని ఒప్పించాలి? ఇద్దరూ అభిమానవంతులే.

    "ఏం రోజులు వచ్చాయిరా నాయనా, మేం బ్రతికుండగానే ఎలాంటి మాటలు వింటున్నాంరా_ భార్యని వదిలేస్తావుగా! వదిలెయ్ వదిలెయ్! వదిలేసి సుఖపడుదువుగాని. ఒరేయ్ నువ్వు వదిలేసినా అది నీ భార్యే అవుతుందిరా"

    "ఆ... అవుతుంది... అవుతుంది. భర్తమాట మీద ప్రేమ గౌరవం లేని ఆడది భార్యెలా అవుతుందమ్మా. మేనగోడలిని సమర్ధించకు. నా గుండె మండిపోతోంది" కొడుకు మాటలకి తీక్షణంగా చూసిందామె.

    "జానకి ఎవర్రా అంటే పార్వతి కోడలు, శాస్త్రిగారి కోడలు ,దాశరధి భార్య అంటారే తప్ప పేరుమాసిపోదురా! తాళికట్టిన తరవాత తలకొరివి పెట్టేవరకూ ఆడదాని పరువు ప్రతిష్టలకి బాధ్యుడు మగవాడేరా"

    "మగవాడు ఎంతవరకూ బాధ్యుడమ్మా? అది కొరకరాని కొయ్యలా తయారయితే నన్నేం చేయమంటావ్? చదువుకుంది ఆ మాత్రం బుద్ధుండక్కర్లా తల్లి ఎలా చెపితే అలా తల వూపటమేనా"

    "కాపరానికి రానంటే విడిచేస్తావా? అదికాదురా ప్రజ్ఞ నయాన్నో, భయాన్నో కాపరానికి తెచ్చుకోవాలిరా. ఆదిరా పురుషలక్షణం. దీన్ని వదిలేస్తావ్ ఇంకోదాన్ని కట్టుకుంటావ్ _ అది మాత్రం నీతో సక్రమంగా కాపరం చేస్తుందని నమ్మకమేమిట్రా" ఆవేశంగా అంది.

    దాశరధి తల్లి ముఖంలోకి చూస్తూ "నీ మేనకోడలని అభిమాన పడుతున్నావే అందులో ఆవగింజంత అభిమానం లేదమ్మా ఆవిడగారికి. ఆమెకి స్వాతంత్ర్యం స్వేచ్చా భావాలు బాగా ముదిరిపోయాయి_ ఇక్కడ ఉమ్మడి కుటుంబంలో ఉండలేదు_ అందుకే నన్నకడికే రప్పించుకోవాలని చూసింది"

    "మావయ్య వచ్చి బి.డి.వో. ని వత్తిడి చేసి ట్రాన్స్ ఫర్ చేయించారు..." అన్నాడు.

    "అంతగా అయితే వేరు కాపురం పెట్టుకోవాల్సిందిరా! మేం వద్దన్నామా? ఎక్కడయినా సుఖంగా వుంటే చాలు. అంతేగాని మాకు ఎదురుగా వుండి సేవలు చేయాలని లేదురా__"

    "అయితే వృద్ధాప్యంలో మీకు చేదోడూ వాదోడుగా వుండక్కర్లేదామ్మా!" బాధగా తల్లి ముఖంలో చూశాడు.

    "మీరు సుఖంగా వుంటేచాలు నాయనా! మాకేమీ చెయ్యక్కరలేదు, నా కాళ్ళు చేతులు బావున్నన్నాళ్లు ఎవరు చేసేదేముందిరా! నేనే అందరికీ చేసి ఛస్తున్నాను.

    దాశరధి మాట్లాడలేదు. తల్లి పైకి అలా అంటుందేగానీ_ ఆవిడ అంతరంగంలోని ఆవేదన అతనికి అర్ధమౌతూ వుంది. భార్యా భర్తల్ని కలపాలని ఆవిడ తాపత్రయం. కొడుకు సంసారం నలుగురి నోళ్ళల్లో పడరాదని ఆరాటం.

    "వెళ్ళిదాన్ని తీసుకునిరా! లేకపోతే నువ్వు దాని దగ్గరకే వెళ్ళు. అంతేగాని దాన్ని విడిచేసి ఇక్కడ వుండటానికి వీల్లేదు" కఠినంగా అందామె.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS