Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 8


    అనుకున్నట్లుగానే దశరధరాంని ట్రాన్స్ ఫర్ చేశారు అత్తగారి ఊరికి. అతడు వెళ్ళి బి.డి.ఓ.ని కలిశాడు. ట్రాన్స్ ఫర్ ఆర్డరు చూపించాడు. ఆయన నవ్వి "నేను సైన్ చేసినదే కదా!" అన్నాడు.

    "మీరు సైన్ చేసినదే! మీరు వుటప్ చేయించినదే కాదనను. కానీ, ఇప్పుడర్దాంతరంగా నన్ను ట్రాన్స్ ఫర్ చేయటానికి కారణం ఏమిటి" అనడిగాడు.

    "నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా చెపుతున్నాను విను. మీ మామయ్య నా ఫ్రెండ్, క్లాస్ మేట్. సాటి ప్రభుత్వోద్యోగి. అతను, భార్య వచ్చి అడిగారు. భార్యాభర్తలు ఒకచోట వుండాలి కదా! ఆమెకి ఇక్కడ వుద్యోగం దొరకదు. అక్కడేదో దొరికింది."

    "చూడు దశరధ రామయ్య! అన్ని విషయాలు ఒక ఎత్తు. ఇది ఒక ఎత్తు. బి.యి.డి. చదువుకుని ఉద్యోగం చేయకుండా వుండాలంటే వూరుకోలేం. అంచేత మీరిద్దరూ ఒకచోట వుండాలనే ట్రాన్స్ ఫర్ చేశాను."

    ఒక్కక్షణం మాట్లాడలేదతను. తన మామ, భార్యా బి.డి.వో. కలసి ఎంత నాటకం ఆడారో అర్ధమైంది. "తల్లి పుట్టిల్లు మేనమామకి తెలియదా?" అంటారు. తన మేనమామ సంగతి తెలీదా? దెబ్బకి దెబ్బ! ప్రతీకారం చెయ్యాలి అనుకున్నాడు.

    తనూ లౌక్యం ప్రదర్శించాలనుకున్నాడు.

    "సార్! మీరు చెప్పింది బాగానే వుంది. కాదనను కానీ ఇక్కడ మా తల్లిదండ్రుల్ని విడిచి వెళ్ళాలంటే ఎంతో కష్టం అది చూడండి మీరు."

    "ఏమిటయ్యా ఏడుగురు కొడుకులున్నారు. నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోతున్నావా? వారం వారం రావచ్చు. ఎంత దూరం? ఇదే సమితి. సమితి ఆ చివర ఆ వూరు. చివర ఈ వూరు. దేశం కాని దేశం వెళ్ళినట్లు బాధపడతావేం?" అసలు సమస్య అర్ధంకాని ఆ అధికారి తేలిగ్గా అనేశాడు.

    "ఏమోసార్! నాకు వెళ్ళాలనిలేదు" ఖచ్చితంగా అన్నాడు దాశరధి.

    ఆ మాట వినగానే సీరియస్సయి పోయాడు బి.డి.వో.

    "అంటే నీ ఉద్దేశం ఏమిటి"

    "ఏముందిసార్ క్రిష్టల్ క్లియర్ గా చెబుతున్నాను. నేనావూరు వెళ్ళను."

    "ఇక్కడ రిలీవ్ కావా?"

    "మీరు వద్దంటే ఆగుతాను."

    "ఆ ఆర్డర్స్ లో యిమ్మీడియేట్ గా రిలీజ్ చెయ్యమన్నానా లేదా?"

    "చేస్తారు సార్! రిలీవ్ చేస్తారు. మీకేం? మీ చేతిలో అధికారం వుందని మీ ఇష్టం వచ్చినట్లు ట్రాన్సఫర్ చేస్తారు అడిగే వాళ్ళెవరున్నారు?"

    బి.డి.వో. సీరియస్ గా చూస్తుండిపోయాడు.

    "అధికారం వుందని ఇష్టం వచ్చినట్లు చెయ్యకూడదు సార్. ఈనాడు మీరు పై ఉద్యోగి, అత్తా ఒకింటికోడలే. ఒకనాడు మీరు క్లర్క్ గా పనిచేశారు. ఆ బాధ మీకూ తెలుసు. తెలిసి ఇలా చేస్తున్నారంటే__ అది మీ తప్పు కాదు. మా సీట్ తప్పు" ఆవేశంగా అన్నాడు.

    "దిసీజ్ టూమచ్! ఫస్టు గెటవుట్!"

    "సార్! కాస్త నోరు సంబాళించుకోండి. నేను మీ క్రింద వుద్యోగిని కాను. ట్రాన్స్ ఫర్ ఆర్డర్స్ చూపించగానే హెడ్మాస్టరుకి నా రిజిగ్నిషన్ రాసిచ్చి వచ్చాను. ఇదిగో మీకూ మరో లెటరిస్తున్నాను గుడ్ బై!"

    నిర్ఘాంతపోయాడు బి.డి.వో. ఆ యువకుడి ఆత్మాభిమానం ఎంతటిదో అర్ధమైపోయింది.

    "దాశరధీ తొందర పడుతున్నావ్. ఉద్యోగం రావటం ఎంత కష్టమో నీకు తెలీందికాదు. మీ నాన్నగారిని చూసి ఉద్యోగం యిచ్చాం. పెద్ద కుటుంబమనీ, సత్పురుషులనీ ఆయనమాట చెల్లించారు సుమతి ప్రెసిడెంట్ గారు ఈ వుద్యోగం పోతే ఎలా? ఎలా నెగ్గుకొస్తావ్?"

    పేలవంగా నవ్వాడు దాశరధి.

    "థాంక్స్ సార్! మీకు మాపై మా కుటుంబంపై వున్న అభిమానానికి వెరీ మెనీ థాంక్స్. కానీ నేనో నిర్ణయానికి వచ్చాక దాన్ని మార్చుకోను. ఉద్యోగం దొరక్కపోతే... కష్టమే కాదనను. కాని నేను భయపడటం లేదిప్పుడు__"

    "ఏం చేస్తావ్?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడాయన.

    "నేనే స్వయంగా ట్యూటోరియల్ కాలేజీనో కిండర్ గార్డన్ స్కూలో ప్రారంభిస్తాను. సద్విద్యా వ్యాప్తికి పాటు పడతాను. నేనింత తింటాను. నలుగురికింత పెడతాను. ఈ ధర్డ్ క్లాస్ తెలుగు ఎమ్మేకి వుద్యోగం రాదని నాకు తెలుసు."

    "తెలిసీ, ఎందుకీ పిచ్చిపని?"

    "పిచ్చిపని కాదు. మనసుకి నచ్చినపని. ఏదో ఎప్పుడో ఎల్ టిసీ ఎసిస్పెంటునయినా కావచ్చునని ఈ సెకండు గ్రేడ్ పోస్టులో చేరాను. కానీ ఇదీ అచ్చిరాలేదు. నా జాతకం ఎలా వుందో! నా కాళ్ళపై నేను బ్రతకాలి సార్!" ఆవేశంగా అన్నాడు.

    బి.డి.వో. అతని మాటలు వింటూ వుండిపోయాడు. కొంత సమయం నిశ్శబ్దంలో కలిసిపోయింది. కాలం కత్తిలాగా తెగిపోతుంది.

    "దాశరధీ ప్రభుత్వ అధికారిగా కొన్ని నేను చెప్పకూడదు. అయినా మనసు విప్పి చెపుతున్నాను. ఈరోజు విద్య అంటే అందరికి క్రేజ్ వుంది. ఈ సమితి బళ్ళల్లో చదువు రావటం లేదని అందరూ కాన్వెంట్ స్కూల్స్ కి ఎయిడెడ్ సూళ్ళకీ ఎగబడుతున్నారు. నాలుగు డబ్బులు ఖర్చయినా మంచి చదువు వస్తే చాలనుకుంటున్నారు."

    "ఈటీచర్ స్టూడెంట్ రేషియో మారితేగాని ఈ బళ్ళల్లో చదువురాదు. క్లాసుకి పదిహేను ఇరవైకి మించితే చదువు చెప్పటం కష్టం. నువ్వు కిండర్ గార్టన్ స్కూలు ప్రారంభించు. గుడ్ ఐడియా. బాగా డెవలప్ చేస్తే బాగుపడతావు. ఈ నూటయాభై రూపాయలతో ఎన్నాళ్ళుద్యోగం చేస్తావు" సానుభూతిగా అన్నాడు.

    "థాంక్స్ సార్!" అని రిజిగ్నెషన్ లెటర్ యిచ్చి వచ్చేశాడతను.

    అతను బి.డి.వో. తో మాట్లాడి ఇంటికి వచ్చేసరికి బాలకాండ పూర్తిచేసి, తృప్తిగా నిట్టూర్చి "ఈ రోజుకి చాలిద్దామమ్మా. రేపు అయోధ్యకాండ మొదలు పెడదాం. ఆ సంస్కృతం పుస్తకం అందుకో! ఒకసారి చదవనీ" అంటున్నారు పరబ్రహ్మశాస్త్రిగారు.

    బాలకాండ ప్రతిని భద్రంగా తీసికెళ్ళి దేవుడి మండపం వద్ద వుంచి వాల్మీకి రామాయణం పట్టుకొచ్చింది స్వాతి_ మామగారి చేతికి ఆ కావ్యం యిచ్చేసి వెళ్ళి కాంపొజిషన్ బుక్సు ముందేసుక్కూర్చుంది.

    "ఏమయింది?" ఇంట్లోకి వస్తున్న దాశరధిని చూసి అడిగారు.

    "ఏమవుతుంది? రిజైన్ చేశాను" తండ్రి ముఖంలోకి సూటిగా చూడలేక ముఖం తిప్పుకుని అన్నాడు_

    "రిజైన్ చేశావా?" ఆశ్చర్యంతో బాధతో అడిగారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS