Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 10

    'అమ్మా!' ఆర్తిగా పిలిచాడతను.

    "అమ్మా లేదు బొమ్మా లేదు! అమ్మమీద ఏ కాస్త గౌరవమున్నా__ వెళ్ళి దాన్ని పిలుచుకురా..."

    "పార్వతీ!" శాస్త్రిగారు గాభరాగా పిలిచారు.

    ఆమె సమాధానం యివ్వలేదు.

    "కానీ... నాన్నగారూ! అమ్మ యిష్టప్రకారమే కానీండి. నేను ఎలాగూ జానకితో రాజీకి రాలేను. ఆత్మాభిమానాన్ని చంపుకోలేను..."

    "భార్యాభర్తలమధ్య అభిమానాలు మాటపట్టింపులు ఎందుకురా?" కొడుకుని అనునయించబోయారాయన.

    దాశరధి తన ధోరణి మానలేదు.

    "ఆమె ఇక్కడికి రాలేదు. నేనే వెళ్ళిపోతాను. నా జీవితం ఆ స్కూలుకే అంకితం చేస్తాను. ఒకవేళ జానకి తిరిగి వచ్చినా ఆ పాఠశాల నిలదొక్కుకునే వరకూ నేను యిక్కడికి రాలేను" తలవంచుకుని విసవిసా లోపలికి వెళ్ళిపోయాడు దాసరధి.

    శాస్త్రిగారు నిర్విణులై చూస్తూండిపోయారు.

    పార్వతి నిశ్చేష్టురాలైపోయింది.

    మరో పదిహేను నిమిషాలకి తన సర్టిఫికెట్లు, బట్టలు తీసుకుని బయటికి వచ్చాడు దాశరధి_తల్లి దండ్రి పాదాలకి నమస్కరించాడు. "అమ్మా! నాన్నా! నన్ను ఆశీర్వదించండి. నా కృషి ఫలించాలని దీవించండి. జీవితంలో ఒక సత్కార్యాన్ని సాధించాననే తృప్తి మిగలనివ్వండి. తిరిగివస్తే జీవితాన్ని జయించుకుని వస్తాను" అని చకచకా వెళ్ళిపోయాడు.

    వెళుతున్న కొడుకుని చూసి ఏమీ అనలేకపోయారు శాస్త్రిగారు. నోట్లో చెంగు కుక్కుకుని దుఃఖించ సాగింది పార్వతి.


                               *    *    *


    "శాస్త్రిగారూ! మన స్కూలులో క్లర్క్ పోస్ట్ కి ఖాళీ వచ్చింది. మీ అబ్బాయి అయోధ్యారాం బి.ఏ పాసయ్యాడుగా_ టైప్ షార్టుహాండ్ రెండూ హయ్యర్ లో పాసయ్యాడు_ ట్రై చెయ్యకూడదా?"

    టీచింగ్ నోట్స్ వ్రాసుకుంటున్న శాస్త్రిగారిని హెచ్చరించాడు మాధ్స్ ఎసిస్టెంట్ రాయుడు. అతనికి శాస్త్రిగారన్నా అతని కుటుంబమన్నా చాలా అభిమానం.

    టీచింగ్ నోట్స్ ప్రక్కకిపెట్టి "రాయుడూ! మావాడికి ఈ క్లర్క్ పోస్ట్ ఎందుకండీ" హాయిగా పిగ్మీ కలెక్టరుగా కావలసినంత సంపాదించుకుంటున్నాడు. ఈ ఉద్యోగం అవసరమేముంది? పోనీ ప్రయత్నం చేద్దామనుకున్నా ఎంత పోటీ ఉన్నదో మీకు తెలీదు."

    "ప్రయత్నం చేయటంలో తప్పేముంది?" రాయుడు వదిలిపెట్టలేదు.

    "హెడ్మాష్టరు గారి మరదలి కొడుకొకడున్నాడు. అసలు పరంజ్యోతి కొడుకే వున్నాడు. కమిటీ చెయిర్మన్ బంధువుల కుర్రాడూ వున్నాడట! యిందర్ని కాదని మావాడికి యిస్తారా? అయినా చెప్పాను గదా! వాడికి ఈ క్లర్కు ఉద్యోగం చేయాల్సిన పనేం లేదు."

    "శాస్త్రిగారూ! మీ అబ్బాయి పిగ్మీ కలెక్టరే! అదేదో కలెక్టరయినట్లు చెపుతున్నారే! మా ఇంగ్లీషు లెక్చరర్ ఒకాయన అనేవాడు_కలెక్టర్ కాకపోయినా బిల్ కలెక్టరయినా అవుతాడని_ అలావుంది మీ ధోరణి" తమాషాగా అన్నాడు హిందీ పండిట్.

    "వాడికేం సార్! తాలూకాలో సగం వూళ్ళు కవర్ చేస్తున్నాడు. అన్నట్లు మీకు చెప్పనేలేదు కదూ! నిన్ననే వాడికి బ్యాంకి వాళ్ళు మోటార్ సైకిల్ ఇచ్చారు అప్పుగా. ఈ రోజు ఉదయమే తిరుపతి వెళ్ళాడు బైక్ మీద. అవన్నీ అలా వుంచి ఎప్పటికయినా బ్యాంకిలో ఇరుక్కోగలనని వాడి ఆశ. అదండి వాడు యింతగా కష్టపడటానికి కారణం"

    "చాలా సంతోషం సార్!" అన్నాడు హిందీ పండిట్.

    "ఒక్క పిగ్మీ యేవిటి? మీ అబ్బాయి అదేదో కంపెనీలో పార్టు టైం టైపిస్టుగా కూడా పనిచేస్తున్నాడు కదా!" అడిగాడు రాయుడు.   

    "అవును! సెవెన్ హిల్స్ సిండికేట్ లో పని చేస్తున్నాడు."

    "పర్వాలేదండీ మీరు! అందరికీ మంచి ఉద్యోగాలు దొరికినా దొరక్కున్నా హాయిగా బ్రతికేంత చదువు చెప్పించారు. మీ పిల్లలంతా బాగా చదువుకున్నారు. అమ్మాయి కూడా ఎప్పుడూ ఫస్టు వస్తుండేది క్లాసులో. ఈ రోజుల్లో అయితే యింతమంది పిల్లల్ని కని ఒక్క పూట కూడు కూడా పెట్టలేకపోయేవాళ్ళం."

    శాస్త్రిగారు గర్వంగా చూశారు_ "ఇదిగో రాయుడూ నేను నా తల్లిదండ్రుల ఆస్తి దమ్మిడీ కూడా వాడుకోలేదు. ఆ యిల్లు ఒక్కటే నాకు దక్కిన పిత్రార్జితం. స్వార్జితం. పైనే యిందర్ని పెంచి పెద్దచేశాను. ఒక్క సెంటు పొలం కొనలేదు. అందరికీ చదువులు చెప్పించాను_ పెళ్ళిళ్ళు చేశాను. ఇల్లు కట్టించుకోలేకపోయాననుకో. అయినా నాకేం అసంతృప్తి లేదు" అన్నారు.

    "శాస్త్రిగారూ! రామాయణం వ్రాస్తున్నారటగా" అన్నాడు అప్పుడే వచ్చిన డ్రిల్లు మాస్టారు.

    "నీకెవరు చెప్పారయ్యా?" ఆశ్చర్యంగా అడిగాడు శాస్త్రిగారు.

    "నా భార్యతో అన్నదట మీ కోడలు. ఎంతమంది పని చేస్తున్నారండీ రాముడి దయ సంపూర్ణంగా లభిస్తుంది." మెరుస్తున్న కళ్ళతో అన్నాడతను.

    "శాస్త్రిగారి కళ్ళు చెమ్మగిల్లాయి. కాని "నాదేముంది? అంతా శ్రీరామచంద్రమూర్తి దయ" అన్నాడు.

    "శాస్త్రిగారూ, రామాయణం పూర్తయ్యాక మీరు భద్రాచలం వెళ్ళి రండి. ఆ భద్రాద్రి వాసుడి పాదాలకి అర్పిస్తే ఎంతో పుణ్యం"

    "చూద్దాం. తీరద్దూ! పైగా ఆ ప్రాప్తి వుండద్దూ!"

    అంతలో బెల్ అయింది.

    సోషల్ స్టడీస్ ఎసిస్టెంటు నాయుడు వచ్చాడు సిగరెట్ వెలిగించుకుంటూ. అతనికి శాస్త్రిగారంటే అదో విధమైన జలసీ. అయితే బయటపడడు.

    అవకాశం వస్తే మాత్రం ఎత్తి పొడవటం విడవడు.

    "శాస్త్రిగారూ! ఈ మధ్య మీరు మరీ చాందసులై పోతున్నారు. పార్టీలనేవే మరిచిపోతున్నారు. కొడుకు పెళ్ళి చేసి కూడా పార్టీ ఇవ్వలేదు మీరు. ఇన్ని టీ నీళ్ళు మా ముఖాన పోయిస్తే సంతోషిస్తాం కదా" అన్నాడు.

    శాస్త్రిగారు ఆశ్చర్యపోయారు. జరగని పెళ్ళికి ఇవ్వని పార్టీ గురించి అతను ప్రస్తావిస్తుంటే నిజంగా విస్తుపోయారు.

    "ఏంటయ్యా నువ్వంటున్నది. నా కొడుక్కి పెళ్ళా? జానకిరాం పెళ్ళయి రెండేళ్ళయింది. ఇప్పుడేం పార్టీ?"

    "జానకిరాం పెళ్ళి కాదండీ మీ అయోధ్యరాం పెళ్ళి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS