Previous Page Next Page 
వెలుగు వెన్నెల గోదారీ పేజి 7

 

                                   4
    జగ్గన్నా సూరీ మేనత్త మేనమామ బిడ్డలు. సూరమ్మ పుట్టిననాడే ఆల్లిద్దరికీ పెళ్ళి కాయమయి పోయినాది.
    రాజియ్య జగ్గన్న సొంత తమ్ముడు. సిన్నప్పన్నించి అల వూళ్ళో మేనమాం దగ్గరే పెరిగాడు. ఏడాది కూపాలి పెద్ద పండక్కని గోదారి దాటి అమ్మనీ, అన్ననీ సూడ్డానికి కొత్త పేటెల్లీవోడు. ఇంటి కేల్లడవంటే ఆడికి సుట్టం  సూపు కిందే లెక్క! అలవూరే ఆడికి సొంతూరయిపోయింది.
    సిన్నతనపు నించీ సూరమ్మ ఆడి జట్టే ! ఇద్దరూ కలిసి వూరంతా కలీ తిరిగేవోళ్ళు. దివానం లో కెల్లి దొంగతనంగా మాయిడి కాయలు కోసుకు తినీవొళ్లు. గరువు సెరువు కెల్లి కడుపు నిండా నీళ్లు తాగీవోళ్ళు. అడికియిరేసినా లెల్లి పెనం మీద కొత్తే , అది రావులమ్మోరి గుడి కెల్లి దణ్ణాలేట్టేది. మల్లా నయమయి పోగానే ఇద్దరూ కలిసి నాగులు సెరువు కాడి కెల్లి నిదర గన్నేరు సెట్టేక్కి కూకునీవోరు. సుబ్బరమన్నుడి గుళ్లో గంట యినిపిత్తే సాలు, సేంగు మంటా లగేత్తుకేల్లి పెసాదం తెచ్చుకు పంచుకునీవోరు. అది సెర్లో కలగ పువు కోసం మనుసు పడితే, ఆడు ములుగీత నెల్లి తెచ్చీవోడు. కాడలు సిన్నగా సిదిపి దండ కట్టి దాని మెల్లో ఏసీవోడు. పావులోళ్ళా ఆడు నాగస్సరం పాడితే, అది పడగిప్పిన తాసులా అడిపోయీది.
    రాజియ్యా , సూరమ్మా పెనం పెనం కలిసి పోయి, నిదరగన్నేరు సెట్ల నీడల్లో నిదరోయ్యేవోరు!
    సూరమ్మ కి పెదబావతో పెళ్లయినాది. దాంతో కలిసి రాజియ్య కూడా కొత్త పెటోచ్చీశాడు.
    అన్నయ్య మాటంటే గురే ఆడికి. మొగుడంటే అడులే దానికి!
    ఎనకటి సూరిని మరిసేపోయేడాడు. రాజియ్య యిప్పుడు మరిదయ్యాడు దానికి.
    దివానం లో మాయిడికాయిలూ , గరువు సెర్లో తియ్యటి నీళ్ళూ, నాగుల సెరువు కాడ సుబ్బరమన్నేసుడి గుడీ, మూల పొలం కాడ గడ్డి మేట్లూ, వూరవతల కాలవా -- అయ్యన్నీ యిడి సేసి యిద్దరి కిద్దరూ కొత్త లోకంలో అడుగెట్టారు.
    సూరమ్మ కిప్పుడు యిద్దరు పిల్లలు. ఆళ్ళని తెగ ముద్దు సేసీవోడు రాజియ్య. ఆళ్ళకి అడికాడే సనువేక్కువ.
    జగ్గన్నది మా బారీ వొళ్లు! కత్తిసావూ కర్ర సావూ సేసి కొత్త పేట మొత్తానికే గుండిలు తీసిన బంటని పించుగున్నాడు.
    దేసేవులో యుద్ధం బయవెక్కువయినాది . బలవయివొళ్ళందరినీ మిలిట్రీ లోకి తీసుగుంటా వున్నారు.
    జగ్గన్నకి దయిర్నేం పనులు సేయ్యడవంటే మా సెడ్డ సరదా! ఆడూ ఎల్లి పెరేయించుగున్నాడు. నేల్లాల్లు తిరక్కుండానే సేరి పొమ్మన్నారు.
    పెరిసియా, యీజిట్టూ, జపాను --- సవుద్రం మీదా శానా దేశాలు తిప్పారీడ్ని! సదుగంటే తక్కువే గాని, బుర్రలో సురుక్కి లోటు లేదు. బాసంటే కట్టవు కాని, పనికి లోపం లేదు. తెల్లోళ్ళు సూసి యీణ్ణి మా మెచ్చుకునీవోరు.
    యుద్ధం వుసారు లో ఆడు సూరమ్మనీ, యింటినీ, పిల్లల్నీ, కొత్త పేటనీ -- అన్నీ మరిసి పోయాడు.
    ఎన్నెల్లకీ ఆడి వూసు సేవిని పడాపోడం తో సూరమ్మ గుండిల్లో గుండు రాళ్ళు పడినాయి.
    ఆడు ఏనాటి కెనా తిరిగోత్తాడా?
    తన పసుపూ, కుంకం నిలబడతాయా?
    సిట్టీ, సీనయ్యా తండి లేనోళ్ళు కారుగందా!
    ఏనాటి కానాడే ఉత్తరం ముక్క వోత్తాదేవోనని కళ్ళు కాయిలు కాసేట్టు సూడ్డవూ, సీర సేంగుతో కల్లోత్తుగుంటా కూకోడవూ!
    ఎదవ బతుకు!
    ఎల్లకెల్లు దొర్లి పోతావున్నాయి.
    పిల్లలు పెద్దోళ్ళయి, నాయినేడని అడిగితె?
    తన పాడు నోటంట ఏం సెప్పాలి సోత్తాదో?
    పెనం వూసూరువనిపించింది సూరమ్మ కి.
    ఒదిన వోలకం సూత్తే రాజియ్య మనసు సివుక్కు మన్నాది.
    ఉన్నాడో సచ్చాడో ఉత్తరమ్ముక్కైనా రాయి డెవో? పెళ్ళావూ పిల్లలు బతికున్నన్నాళ్ళూ ఆడి ఎదాన పడి ఎడవ్వలిసిందేనా?
    అలాంటోడు పెళ్ళి సేసుకు నెందుకు సావాలో?
    ఓనాడు యీ దరుగు కొసాని కూసుని సుట్ట కాల్సుగుంటా వుంటే, సత్తేయగా డోచ్చి అన్నాడు గందా--
    "యుద్దవులో బాంబులు పడి సానా మంది సచ్చి పోతన్నారంట కదో? పాపం జగ్గన్న ఎల్లా వున్నాడో?"
    దాంతో ఆడికి పట్టలేని కోపవొచ్చినాది.
    "ఫో! ఎదవా సావు కవుర్లు సెప్పడం తప్ప నీకేం పనిలేదో? మల్లా మా అన్న వూసేత్తావంటే యీపు సీట్ల గోడతా!"
    అప్పటికి సత్తెయ్య గాడి వొళ్ళు దగ్గిరి కొచ్చి నాది, ఎంటనే ఎనక్కి మల్లి ఎల్లి పోయాడు.
    సుట్ట అరిపోయిందని అగ్గిపెట్టె కోసరం లోపలి కేడతా వుంటే మూల గదిలోంచి వోదిని ఏడుపు యినిపించినాది.
    దరి కేల్లాడు.
    "రాజియ్యా! రాజియ్యా!! ఆ డెప్పుడోత్తాడో సేప్పవా రాజియ్యా? నా పిల్లలికి అయ్య ఎప్పుడు కనిపిత్తాడు ? యీదులో వొళ్ళ మాటలు నేను యిన్లె పోతున్నా. యింట్లో బాదలు మోయిలే పోతున్నా! నాలాటి సేనిగొట్టు దానికి సావు తప్ప ఏరే దారి లేదు. రాజియ్యా! నేనేల్లాగా సచ్చి పోతా! ఈళ్ళు నీ పిల్లలే అనుకుని సూసుగుంటావా? నీ వోదిని కోరిక సెల్లిత్తావా? సెప్పు రాజియ్యా! సెప్పు"
    రాజియ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    పెదాల వెనక్కి నొక్కి పట్టినా బాద నిలవలేదు.
    "నా సిగురి కొరికి తీరసవా రాజియ్యా? ఇద్దరం సిన్నప్పన్నించి కలిసి తిరిగివొళ్ళం మనం. ఒకరి మాట వోకరం యింటూ వుండీనోళ్లం! ఇప్పుడు కూడా అల్లాగే యింటావా రాజియ్యా? నే సచ్చిపోయాక నా బిడ్డల కింత గెంజిపోత్తావా? సేప్పవూ?"
    ఆడి నోటంట మాటే రాలేదు.
    "ఇట్టవులేదా? సెప్పు రాజియ్యా! బలవోంతంగా యీళ్ళని నీ నెత్తి మీద పెట్టడం నేనూ వొప్పు కొను. అందర్నీ కాపాడీ తల్లి ఆ గోదారమ్మే వున్నాది రాజియ్యా! ఆళ్ల నాయమ్మ కప్పసెప్పి నేనూ సచ్చిపోతా. ఈ బూమ్మీద నూక ల్లెనోళ్ళందరికీ ఆతల్లె దిక్కు!"
    ఆ ఏడికి కవిలి పోయి నేల,మీదే వొరిగినాది సూరమ్మ. పిల్లా, బుల్లోడూ గొల్లుమన్నారు. అమ్మని సుట్టేసుకుని ఎక్కెక్కి ఎడిశారు.
    ఎంటనే సనీళ్ళు తెచ్చి మొకం మీద సల్లి గుడ్డ ముక్కోటి తడిపి నుదురు మీదేశాడు రాజియ్య.
    కొంచెం సేపటికి సూరమ్మ కళ్ళు యిడినాయి. ఇడినట్టే తడిసినాయి.
    "నన్నెందుకు బతిగించావు రాజియ్యా? నాకు సావడానిక్కూడా యీల్లేదా? ఈ బాధలన్నీ మోత్తా నన్నిల్లా ఎంతకాలం బతకమంటావు రాజియ్యా?    
    ఎక్కెక్కి ఎడిసినాది.
    "నేనుండగా నీకేం బయం లేదు సూరీ! ఏడవకు. నువ్వు సచ్చిపోడానికిల్లిదు. నీ పిల్లల కోసవే బతకాలి! యుద్ద వింకా కడతేర లేదు. ఆడు మట్టుక్కు ఎలా రాగల్దో సెప్పు! ఇన్నేల్లు వోపిక పట్టావు. ఇంకొంత కాలం వుండలేవూ? నామాటినవా సూరీ! లేసి మొకం కడుక్కోవూ?"
    అడెంతో బతివలాడగా సిగురికి సూరమ్మ కు కుదటబడ్డాది. గుండి సిక్కబట్టుకుని లేసి నిలబడినాది.
    మల్లా కొన్నేల్లు గడిసినాయి. యుద్ధం మంటలు సల్లారి పోయినాయి. మన దేసేలనించి ఎల్లినోళ్ళంతా ఎనక్కి తిరిగిచ్చేశారు.
    జగ్గన్న అయిపూ , మచ్చా లేడు!
    రాజియ్య కి ఏదో అనునానం కలిగినాది.
    సూరమ్మ కి బయం ముంచెత్తినాది. ఆ డింక తిరిగి రాడా? తన కల్ల కింక కనిపించడా? ఆడు కూడా యుద్దంలో మాడి పోయాడా?
    ఓనాడు సందేల సూరమ్మ రాజియ్య ని పిలిసినాది.
    "ఉత్తరమ్ముక్కే రాలేదా?"
    "ఒత్తే దాసు కుంటావా?" కొంచెం ఇసురు గానే అన్నాడు.
    దాని గుండి సివుక్కు మన్నాది.
    ఇన్నాల్ల నించి కనిపెట్టి కూసున్న పెళ్ళాన్నీ పిల్లల్నీ మరిసిపోయి, వూరూ, వోడా యిడిసేసి మనసు పడి వల్లకాడికి పోయిన వొడి కోసం ఎంతకాల నేడి త్తే మట్టుక్కి తిరిగోత్తాడూ? దాన్నెంత వుసూరు పెట్టాడు? ఆడ్ని ఏం సేత్తే పాపవున్నాదంట?
    "సూరీ! యిప్పుడే సేబుతున్నాను. అడింక తిరిగి రాడు. ఇంక నీ ఆ సొదులుకో! సచ్చి నోళ్ళ లో జవసుకో, ఆడికి పెద్ద దినం సేసేవనుకో?
    ఇన లేకపోయిందది . ఏడుపు గట్లు దాటి పోయింది. పౌరుషం ఉబుక్కొచ్చినాది. సరసరా నడిసి లోన కెల్లి పోయింది.
    మసక సీకటి పాకుతా వుంటే --
    అ సీకట్లో దిమ్మునుంటా ఏదో సప్పుడయితే దొడ్లో కర్రిఆవు దూడ 'అంబా' అంటా అరిసినాది.
    సేంగునిలగెత్తి రాజియ్య విచ్చీ తలికి నూతులోంచి బుడబుడా సప్పుడనిపించినాది. గుండి తపతప లాడిపోయినాది.
    రావయ్యా, పేరయ్యా దీపాల్తో లెగిసోచ్చారు.
    సూరమ్మ కడుపులో నిలిసిన నీళ్ళు ఎల్లగక్కి ఊపిరిచ్చారు. సుక్కమ్మ వచ్చి సీర మారిసినాది. దాన్ని తీసికెళ్ళి వసారా లో మంచం మీద పడుకో బెట్టారు.
    ఒక్కొక్కరే సల్లగా జారుకున్నారు.
    సూరమ్మ కల్లిప్పి సూసినాది.
    సుట్టుతా కలీ సూసింది. అదంతా దానికో కొత్త లోకంలా కనిపించినాది.
    రెప్పలోల్చకుండా రాజియ్య సూత్తానె ఉన్నాడు. పిల్లలిద్దరూ రాల్లయి పోయారు.
    "ఎవరు నువ్వు?"
    "రాజియ్య బిక్క సచ్చిపోయాడు. "రాజియ్యనే!"
    "ఈల్లెవరూ?"
    "నీ పిల్లలే సూరీ!"
    అల్లని దగ్గిరికి తీసుకుంది. ముద్దు లాడింది.
    ఆడినట్టే ఆడి మల్లా మొకం తిప్పుకున్నాది.
    ఏడుపొచ్చినంత పనయినాది రాజియ్యకి.
    ఆడ్ని దగ్గిరికి రమ్మన్నాది. ఎల్లాడు. ఇంకా రమ్మన్నాది . ఎల్లాడు.
    "నువ్వు చాలా మంచోడివి రాజియ్యా!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS