Previous Page Next Page 
సురేఖా పరిణయం పేజి 7

                     

                                    4
    వింటున్న కొలది ఆ సంబంధం పట్ల ఆవ్యక్తుల పట్ల అదివరకు కలిగిన సద్భావం కరిగిపోసాగింది అక్కడున్న అందరికీ -- అయినా తప్పదు  మరి - రెండేళ్ళు పైగా కలికి బలపాలు కట్టుకుని తిరిగితే ఈ సంబంధం కుదిరింది - ప్రపంచంలో అనేక రకాల మనుష్యులు అనేక రీతుల వారు వుంటారు-- ప్రతి దానికి అర్ధాలు పెడర్ధాలు తియ్యటం అందునా ఇలాంటి సమయంలో మాట పట్టింపులు పెంచుకోటం వాళ్ళేవరికీ ఇష్టం లేకపోయింది. అయితే సురేఖ అలా ఊరుకోలేదు. రెండడుగులు ముందుకు వేసి గుమ్మం ఇవతలకి వచ్చి...
    "అయితే ఏమిటీ ఆ నీరసం ఏ జబ్బు లక్షణమో అని భయపడి అది తెలుసుకోటానికి డాక్టర్ని పంపించారా -- ఇంకా నయం స్టేత స్కోప్ తో పరీక్ష చెయ్యమన్నారు కాదు -' అంటుంటే .
    'అబ్బెబ్బే అదేం కాదు' అంటూ హడావిడిగా సర్దేయ బోయాడాయన.
    లేకపోతె వాళ్ళు మళ్ళీ డాక్టర్ని పంపించి చూడమనటం లో అర్ధం ఏమిటి? ఇవాళ మొగ పెళ్ళి వారి హోదాలో వున్నారు కనక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటానికి వాళ్ళకేం అధికారం లేదు-'
    "ఏదో నలుగురు చూసి మెచ్చితే బాగుంటుందనుకున్నారేమో' వాతావరణం వున్నట్లుండి అలా ఉక్కిరిబిక్కిరి గా మారిపోయే సరికి రమణమూర్తి గారు మెల్లిగా అన్నాడు. కాని తన మాటలు తనకే నచ్చినట్లు అనిపించలేదు.
    'ఆ అదే-- ఆ మధ్య ఇలాగే ఓ సంబంధం -- ఆ పిల్లకి మెల్ల కన్ను . దీపాల వేళ పెళ్ళి చూపులు ఏర్పాటు చేసి హడావుడి పడిపోయి తాంబూలాలు ఇప్పించేశారు. మనమ్మాయి కి లోపం ఏమీ లేదు -- కొంతమంది తీరే అంత. అలా సన్నంగా వుంటారు అని తమ్ముడు చెప్పాడుట-- అమ్మాయి మోహంలో లక్ష్మీ కళ తాండవీస్తోంది- ఆ పిల్ల నట్టింట అడుగు పెట్టిన దగ్గర నుంచీ మనింట్లో సిరి ఎత్తు కుంటుంది. అబ్బాయికి పెద్ద వుద్యోగం వస్తుంది అని బావగారు చెప్పారుట --'
    'ఇంక అవేమీ నాకు చెప్పకండి -- మన దేశంలో ఆడపిల్లల బ్రతుకులు ఈనాటికి ఇంత అధ్వాన్నంగా వుండటం -- ప్చ్-- ఏమిటో? ఆడపిల్లలకి కూడా బియ్యేలు ఎమ్మెలు చెప్పిస్తున్నారే కాని వాళ్ళని మొగపిల్లల్లా ఉద్యోగాలు చెయ్య నివ్వటానికి తల్లితండ్రులు ఒప్పుకోరు ఎలాగో అలా ఓ అయ్యా చేతిలో పెట్తిం దాకా వాళ్లకి నిద్ర పట్టదు -- పెళ్ళి చెయ్యటం అనేది ఒక బాధ్యతే , కాదనను. కాని అది తీర్చేసుకునే తొందర లో అమ్మాయికి చదువూ తెలీవీ వుందని దాంతో పాటు ఆత్మాభిమానం కూడా ఉంటాయనీ మరిచి పోతారు-- ఆ వచ్చిన పెళ్ళి వారు ఈ అమ్మాయి మనస్సు నోచ్చేలా అడ్డమయిన ప్రశ్నలు వేస్తుంటే అది అన్యాయం అని అనకపోగా సమాధానాలు చెప్పి తీరాలి అన్నట్లు వీళ్ళనే నిర్భందిస్తారు-- మానసికంగా ఓ స్థితికి ఎదిగి , ఓ వ్యక్తీత్వం అంటూ ఏర్పరచుకున్న అమ్మాయికి అవి ఎంత బాధగా ఉంటాయో వాళ్ళు ఆలోచించరు- ఎనిమిదేళ్ళ పిల్లకి పెళ్ళి చేసిన రోజుల్లో పరిస్థితులు ఎలా వున్నాయో ఇరవై ఏళ్ళ పిల్లకి పెళ్ళి చేస్తున్నప్పుడు కూడా అలాగే వుంటున్నాయి -- ఈనాటికి డాక్టర్ల ని జ్యోతిష్కులనీ కూడా తీసుకొచ్చి చూపించే స్థితికి వచ్చారంటే -- ఉండండి. నన్ను చెప్పనివ్వండి -- సన్నంగా వున్న అమ్మాయి వాళ్ళ కళ్ళకి జబ్బు మనిషి లా అనిపించిందా -- నేనూ అంటాను పెళ్ళి కొడుక్కి గుండె జబ్బని. వాళ్ళమ్మ కి ఇంకో రోగం అని. నాన్నని మరో జబ్బు అని...' ఉన్మాది లా అంతకంతకు గొంతు పెంచి అలా ఆగకుండా చెప్పుకు పోతున్న సురేఖ ని చూస్తె ఆ క్షణంలో అందరికీ ఏమిటో భయంగా వున్నట్లే అనిపించింది.
    'అయినా అ అబ్బాయి మాత్రం ఏం బాగున్నాడని -- తను మాత్రం వస్తాదులా వున్నాడా -- పీలగా భూమికి జానెడు ఎత్తున వున్న తను ఇవాళ పెళ్ళి కొడుకు హోదా వచ్చింది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడతాడా' ఒళ్ళు తెలియని కోపం లో ఉద్రేకం లో అంతసేపు మాట్లాడి చివరికి దోసిట్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రక్క గదిలోకి వెళ్ళిపోయింది.
    అక్కడున్న వాళ్ళంతా చలనం లేని బొమ్మలాగానే కూర్చుండి పోయారు. ఇంతసేపూ. సురేఖ వెళ్ళిపోయిం తరువాత ఏదో గాలివాన వేలిసినట్టూ, ఇంతసేపూ తమని కట్టి పడేసిన మంత్రశక్తి విడిపోయినట్లు అందరిలో ఒక్కసారి చలనం వచ్చి అది దీర్ఘమైన నిట్టూర్పులు విడవటం లో వెల్లడయింది.
    'అమ్మాయి ఇంత బాధ పడుతుందని నేననుకోలేదు-- యధాలాపంగా చెప్పానంతే' అంత మనిషి గుప్పేడయిపోయాడు మధ్యవర్తి. 'అయినా అదంతా గతం -- ఇప్పుడంతా మనస్పూర్తి గానే ఒప్పుకున్నారు-- అబ్బాయినీ ఒప్పించారు.....'
    'రెండు మూడు రోజులు పోనివ్వండి -- ఈలోగా మా బావగారి దగ్గరి నుంచి ఉత్తరం వస్తుంది- అప్పుడు మళ్ళీ మాట్లాడు కుందాం.' అని ఆయన్ని పంపించేశాడు రమణమూర్తిగారు.
    అవాల్తికి ఇంక ఎవరూ ఆ సంబంధం ప్రసక్తి తీసుకురాలేదు-- కాని రెండు రోజులు పోయాక పాపారావు గారికి వుత్తరం వ్రాయాలను కుంటున్నప్పుడు మాత్రం సురేఖ తన నిశ్చయాన్ని స్థిరంగా చెప్పేసింది -- 'నేను అందంగా లేను. నాకు తెలుసు -- అయినా  నన్ను నన్నుగా అభిమానించే వ్యక్తీ దొరికితేనే నేను పెళ్ళి చేసుకుంటాను . కాని ఇలాంటి కక్కుర్తి బ్రతుకు నాక్కర్లేదు -- నాకోసం ఉమ పెళ్ళి ఆపుచేయవద్దు-- నేను ఉద్యోగంలో చేరతాను-- ' అంది.
    ఇంక ఆ అమ్మాయిని ఒప్పించటం ఎవరి తరం కాలేదు -- ఆ ముహూర్తానికి ఉమ పెళ్ళి జరగలేదు-- పెద్ద పిల్లని వదిలి పెట్టి చిన్నమ్మాయి కి చెయ్యటం ఏమిటని వాయిదా వేశారు-- కాని సురేఖ ఉద్యోగంలో చేరటానికి వాళ్ళు అంగీకరించలేదు. - సరిగ్గా అలాంటప్పుడే జరిగింది ఓ సంఘటన -- వాళ్ళ వూరి ఎమ్మెల్యే సుందరమ్మ గారు ఆ కుటుంబానికి బాగా తెలుసు -- ఆవిడ దగ్గర నుంచి ఐ సర్టిఫికేటు సంపాదించి అప్లికేషన్ల తో పాటు పంపించటమే కాకుండా హైదరాబాదు లో తనకేదైనా వుద్యోగం చూసి పెట్టమని మరీం మరీ అడిగింది సురేఖ -- ఆవిడ చెప్పటం వల్ల నయితే నేం సురేఖ పంపిన అప్లికేషను వల్ల నయితే నేం  ఆ ఆడపిల్లల కాలేజీ లో పార్టు టైము లెక్చరర్ గా వుద్యోగం దొరికింది -- కాని ఆ ఉద్యోగానికి హైదరాబాదు దాకా పంపించటానికి ఇంట్లో వాళ్ళు సుతరాము ఒప్పుకోలేదు-- అందరి తోటి పోట్లాడినంత పని చేయాల్సి వచ్చింది. ఏడ్చి పంతం పట్టి , ఓ రోజంతా అన్నం మానేసి చివరి కేలాగో ఒప్పించింది -- కాని ' నా కింక సంబంధాలు చూడక్కర్లేదు ' అని ఆ అమ్మాయి చెప్పిన దానికి మాత్రం వాలు అంగీకరించలేదు - సురేఖ శలవల్లో వచ్చేసరికి ఏదో చూపించటం అది కాకపోవటం కూడా జర్గింది ఒకటి రెండు సార్లు-- పార్టు టైము జాము ఫుల్ టైము జాబుగా మారటం , ఓ సంవత్సరం పైనే గడిచి పోవటం కూడా జరిగిపోయింది.
    సురేఖ తన అనుభవాలనే కాక స్నేహితు రాళ్ళు చెప్పినవి కూడా మధ్య మధ్య గుర్తు తెచ్చుకుంటుంటుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS