Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -6 పేజి 7


    "నా ఒక్క పొట్ట నింపుకోలేనా? మీకిక్కడ డబ్బు అవసరం ఉంటుంది. నా దగ్గర రెండు రూపాయీల చిల్లరపైసలు ఉన్నాయి."
    ప్రయాణం సురక్షితంగా జరగడానికిగాను ఆ వృద్ధురాలు దుర్గను పూజించింది.
    భుజాన ఒక మూటా, చేతికి ఇంకొకటి పట్టుకొని రోడ్డెక్కిన కాలూ ఒకటి, రెండు, మూడుసార్లు, మళ్ళీ చివరిసారి మెట్టుమీద నుంచొని చూస్తున్న లేఖను తిరిగి చూస్తూ కదిలాడు. తరువాత పరిగెత్తుతున్నంత వేగంగా నడిచాడు. చూస్తూ చూస్తూనే వీధిమలుపు తిరిగాడు.
    
                                      3
    
    ఆరురోజులు గడిచాయి. కాలం దొర్లిపోతూ ఉంది. ఒక రాక్షస గడియ అతన్ని జీవితకాల దుఃఖంలో పడదోసింది.
    కాలూ ఝార్నా స్టేషన్ చేరేవరకు స్టేషన్ జనంతో కిటకిటలాడిపోతూంది. దక్షిణంనుంచి రైలుబండి వచ్చి ఆగిందోలేదో ఎర్రటోపీలు, ఫుట్ బోర్డులు పట్టుకొని వ్రేలాడే గుంపులకొద్ది స్త్రీ పురుషుల్ను లాగివేశారు. ఆర్తనాదాలు మిన్నంటాయి.
    'మేం ఆకలితో చస్తాం. పిడికెడు గింజలు దయచేయించండి. మహానగరం చేరనివ్వండి. అక్కడ కుక్కలకూ, పిల్లులక్కూడా తిండి దొరుకుతూందట. చస్తున్నవాళ్ళమీద దయచూపండిబాబూ! మమ్మల్ని పోనివ్వండి" అంటూ ఆర్తనాదాలు వినిపించాయి.
    "చూడ్డంలేదూ? ఫుట్ హోల్డ్ జారి పడిపోతారు" అన్నాడు. ఒక తెల్లని డ్రెస్ కు ఇత్తడి గుండీలూ, నెత్తికొక పీక్ కాపూ ఉన్న రైల్వే ఉద్యోగి కరుణ వెళ్ళకక్కుతూ.
    "మేం పడ్డా చస్తాం. ఉన్నా చస్తాం. ఓ దయామయా! దేవుడు మేలుచేస్తాడు. మమ్మల్నిపోనీ."
    "ఆ దేవుడు మీకెందుకు సహకరించడు?" అని అడిగాడు ఓపికచచ్చిన రైల్వేమనిషి.
    అన్నార్తులు దానికి జవాబు చెప్పలేకపోయారు. ప్రతి గుళ్ళో ఉన్న దేవున్నీ, స్వర్గంలో ఉన్న దేవతలందరినీ నెలల తరబడి ప్రార్దించారు. దేవతలు వారి ఆర్తనాదం వినలేదు. కనీసం మెల్లమెల్లగా చచ్చేవారిని పిడుగు పడేసి అమాంతంగా చంపలేదు. చస్తే అన్ని బెడదలో చస్తాయి. కాని చావడం పాపం. ఒకరిప్రాణం తీయకూడదు. నీ ప్రాణంకూడా తీసుకోకూడదు!
    ఇంజన్ విజిల్ ఇచ్చి హూష్, హూష్ అని బైల్దేరగానే కొందరు దౌర్భాగ్యులు పరిగెత్తి బోర్డులమీద దూకారు. ఇద్దరు జారి కెవ్వున కేకలు వేస్తూ పడిపోయారు. రైలు కదిలిపోతూంటే కానిస్టేబుల్ పెద్దగా అరుస్తూ తిట్టాడు.
    'ఆఁ రైలు ఇలా ఎక్కాలి', అనుకున్నాడు కాలూ. మరొక రైలు అయిదు గంటల తరువాతగాని రాదు. ఈలోగా ఇంటికెళ్ళి రావచ్చు. యుగాల్నుంచి లేఖను చూడనట్లు అతని హృదయం తపించింది. అకస్మాత్తుగా ఇంటికివెళ్తే ఏమవుతుందో ఊహించకున్నాడు.
    వీధి గుమ్మంనుంచే తాను 'చంద్రలేఖా!' అని కేకవేస్తాడు.
    ఆమె తన పుస్తకంమీది దృష్టిని అమాంతంగా తనవైపు తిప్పుతుంది.
    "చంద్రలేఖా"
    ధ్వనిని నమ్మలేక ఆమె వణికిపోతుంది. మెల్లగా అరుగుదిగి వచ్చి కిర్రుమని తలుపు తెరుస్తుంది. తనను చూచేవరకు ఆమె కళ్ళు పెద్దవై, సంతోషంతో నిండిపోయి నోటినుంచి మాట పెకలదు.
    కాలూ దృశ్యం కరిగిపోయింది. అతడు ఫ్లాటుఫారంనుంచి గబగబా బైటికి నడిచాడు. రెండు బాటలమధ్య ఒక నిర్ణయానికి రాలేక నుంచున్నాడు. దక్షిణంగా వెళ్ళే ఒక బాట ఇంటికి వెళ్తుంది. పడమరగా వెళ్ళే రోడ్డుపక్క స్టేషను 'బోధూగ్రాం' అనే ఊరికి వెళ్తుంది. అక్కడ ఇక్కడిలా పోలీసు బెడద ఉండకపోవచ్చు. రైలెక్కడానికి అక్కడ ఎక్కువ అవకాశం లభించవచ్చు.
    అతడు ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. ఇంటికి వెళ్తే ఇలా పదిసార్లు ఊపిరి పీల్చకముందే మళ్ళీ ఎడబాటు బాధ. ఆనందించిన కొద్దికాలపు మూల్యం బాధతో చెల్లించడానికి అతడు సంసిద్దుడే. అయితే లేఖ? ఆమె గాయం మళ్ళీ ఎర్రనౌతుంది.
    'వెళ్ళొద్దు' అనుకున్నాడు. పడమటిదోవపట్టాడు. అతని అడుగులు కదలడంలేదు. ఒక్కసారి దక్షిణపు బాటవైపు తిరిగి చూచాడు. గిరుక్కున తిరిగి, మళ్ళీ ఇంటి ధ్యాస పడకుండా ఉండాలనే ఉద్దేశంతో, చకచకా నడిచిపోయాడు.
    అతని కళ్ళలోంచి నీళ్ళు దుమికాయి. ఏమిటీ దుఃఖం? తాను కోరిందల్లా లేఖకూ తనకూ పిడికెడు బియ్యం. అందుకు బదులుగా వ్యవసాయపుటెద్దులా ఉదయంనుంచి రాత్రిదాకా చమటోడ్చి పని చేయడమే కాక హార్దికంగా వారిమేలు కోరడానిక్కూడా సిద్దపడ్డాడు. ఇంతకూ అతడు కోరిందేమిటి? లేఖ - తన బిడ్డను తననుంచి వేరుచెయ్యొద్దనే!
    అతడు నడుస్తున్నాడు. అతని చూపు మాత్రమే ముందుంది. అతని మనసు లేఖతో సుఖంగా జీవితం గడిపిన ఇంటివైపు ప్రయాణం సాగిస్తూంది. ఆ మంచిరోజులుపోయి ఎంతోకాలం కాలేదు. కొలిమి భగభగా మండినప్పుడు నిముషమైనా తీరిక ఉండేదికాదు. ఎక్కువ కారంవేసిన వేడివేడి గండుచేపలంటే లేఖకు ఎక్కువ ఇష్టం. అందుకే సాయంకాల భోజనానిగ్గాను గండుచేపలు వండమనేవాడు పింతల్లితో. కూర బాగా నూనెకారుతూ కారంగా ఉండాలి. (ఇంకా మధ్యాహ్నమైనా కాకముందే వేగపు నడకవల్ల కాలూకు ఆకలి మొదలైంది.) ఆ రోజుల్లో తన ఆహారపుష్టి ఒక గర్వకారణంగా ఉండేది. భోజనానికి పిలచినవాళ్ళల్లా అతని విషయంలో చాలా జాగ్రత్త పడేవారు. అతడు తింటూంటే అనేక కండ్లు చూస్తూండేవి. "కాలూ పదకొండు చేపముక్కలు అన్నంతో సహా తినేసి, 6 సార్లు మేకమాంసం వడ్డించుకున్నాడ"నే మాట ఇట్టే జనంలో ప్రాకిపోయేది.
    "ఇవ్వాళ కాలూకు పెరుగూ, మామిడిపళ్ళు తప్ప వేరేవాటిమీద ధ్యాసలేదు. మీగడతో సహా ఒక గిన్నెడు పెరుగు త్రాగేసి అప్పుడే 15వ మామిడిపండు దాటిపోయాడు. అప్పుడే ముగించేట్టెక్కడా కనిపించడంలేదు"
    కులంవాళ్ళ ఇళ్ళల్లో చావైనా పెళ్ళైనా లేఖకు విచారం తగిలేది. భోజనాల్లో కాలూ అందరినీ మించి తర్వాత జబ్బున పడేవాడు. లేఖది పిట్టమేత. ఆమెతో ఒక ముద్ద ఎక్కువ తినిపించడానికి కాలూ ప్రతిరోజూ ప్రయత్నిస్తూనే ఉండేవాడు.
    అతని ఆలోచనలు గుండె జలదరింపజేశాయి. తనకు తొందర్లో పని దొరక్కుంటే ఆమెక్కావలసిన పిడికెడు బియ్యంకూడా దొరకవు. ఆమె పశువులమేత మేయాల్సివస్తుంది.
    బోధూగ్రాం చేరాడు. ఎర్రపెంకుల కప్పుకల చిన్న రైల్వేస్టేషను మధ్యాహ్నం ఎండకు మండిపోతూంది. కాని పచ్చని తీగల వరండా ముందరి తడకకు పాకించడం మూలాన ఒక పచ్చని తెరగా తయారై అదిమాత్రం చల్లగా ఉంది. నిర్మానుష్యమైన ఫ్లాటుఫారంమీద ఒక మూలాన బెంచీమీద కూర్చొని తన మూటల్ను క్రిందపెట్టాడు.
    బియ్యపుసున్ని ఉండలు తినాలనుకున్నాడు. అతనిచేయి తెలియకుండానే మూటదగ్గరకి పోయింది. కాని వద్దనుకున్నాడు. నగరం చేరడానికి రైల్లో గంటల కొద్దీ ఉండాల్సి వస్తుంది. ఉన్నవే అవి. వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి. సాయంకాలానికి ఉంచుకోవాలి అనుకున్నాడు. ఎండు డొక్కతోనే ఉండిపోయాడు.
    సమయానికి రైలువచ్చింది. కాలూ ఫుట్ బోర్డు మీద కాలుపెట్టి నుంచున్నాడు. అతనేకాదు. గుంపులకొద్ది అలా నుంచొని ఉన్నారు. వీళ్ళను లాగివేయకపోవడం ఆశ్చర్యమే! ఎర్రటోపీలు వీరిమీద దయచూపాయా? తానూ ఝార్నాలోనే ఎక్క కలిగేవాడే! ఝార్నానుంచి బోధూగ్రాంకు ఆరుమైళ్ళదారి. అయిందేదో అయింది. తాను నగరానికి ఒక అడుగు దగ్గరికే వచ్చాడు. రైలు కదిలింది. ఒకేఒకడు గంటకొడుతూ రైలును సాగనంపాడు.
    కాలూకు కాస్త విశ్రాంతి లభించినట్లైంది. ఆ ఫుట్ బోర్డు మీద తడు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. ఇది వేగంగా పోయే బండేనా? గంటలూ నిమిషాలూ ఇప్పుడు అతనివికావు. అవి చంద్రలేఖవి. ఎంత తొందరగా తన బిడ్డను ఆ మహానగరానికి తీసుకొనిరావచ్చు. డ్రైవర్ త్వరగా నడవనీ. ఇంజన్లో కాస్తబొగ్గు ఎక్కువ వెయ్యి. ఊఁ తొందరపడు.
    బండికి ఏమైంది? బండి ఫ్లాటుఫారం దాటిందోలేదో దానివేగం తగ్గింది. ఎర్రటోపీలగుంపుదిగి ఫుట్ బోర్డుమీద ఉన్న దౌర్భాగ్యులందర్నీ దింపేస్తూంది. వీపులమీదా, బుజాలమీదా బెత్తపు దెబ్బలు పడుతున్నాయి. ఒకదెబ్బ కాలూ సున్ని ఉండల మూటమీద పడింది. గుడ్డచినిగి ఉండలన్నీ పడి మట్లోకలిసిపోయాయి. ఆకలిగొన్న ఆడా, మగా కేరింతలు కొడుతూ వాటిమీద పడ్డారు. నిముషంలో రవ్వ మిగలకుండ అయిపోయింది.
    కాలూ ప్రతిమలా నిల్చి ఉండగా ఎర్రటోపీలు ఉరిమిచూశాయి. గద్దిస్తూ దాటిపోయాయి. వారు రైలెక్కగానే ఒక నిముషంలో దిక్కులేని జనాన్ని 'కుహూ' అని వెక్కిరిస్తూ రైలు సాగిపోయింది.
    అతడెన్నడూ ఎరుగని కోపోద్రేకం ప్రవాహంగా అతని గుండెను తాకింది. అతడు పిడికిలి బిగించి చేయి ఎత్తి నడిచే రైలును చూపుతూ "గాడిదకొడుకులు! రాక్షసులు! పశువులు!" అని తిట్టాడు.
    నరాల్లో రక్తం పొంగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS